జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. జగన్ పై ఆరోపణలు చేసే ముందు ముందు తన వ్యక్తిత్వాన్ని చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాట మీద నిలబడలేని పవన్ కు వైసీపీని విమర్శించే హక్కు లేదన్నారు.
“పవన్ కల్యాణ్ హాబీగా పాలిటిక్స్ చేస్తారు. ఫుల్ టైమ్ చేయలేరు. పవన్ ఎప్పుడైనా మాటకు కట్టుబడ్డాడా? ఆయన మార్చినట్టు నేను మాటలు మార్చితే, ఈపాటికి అంతా కలిసి నన్ను చెప్పులతో కొట్టేవారు. జగన్ గెలుస్తారని బాబుకు మద్దతిచ్చారు. ఆ తర్వాత చంద్రబాబునే తిట్టారు. పుట్టుకతోనే కత్తి-కొడవలి పట్టానంటూ కమ్యూనిస్టులతో కలిశారు, తర్వాత వాళ్లను వదిలేశారు. గతంలో ఎక్కడ చూసినా చెగువేరా, పూలే ఫొటోలుండేవి, ఇప్పుడవన్నీ పోయాయి. బీజేపీని బండ బూతులు తిట్టారు. ప్రత్యేకహోదా పాచిపోయిన లడ్డూ అన్నారు. ఎన్నికలు ఇలా అవ్వగానే వెళ్లి బీజేపీ చంక ఎక్కేశారు.”
అలా బీజేపీ చంకలో ఎక్కిన పవన్ కల్యాణ్, అక్కడ కూడా కుదురుగా ఉండకుండా చంద్రబాబుకు కన్ను కొడుతున్నారని విమర్శించారు పేర్ని నాని. జగన్ అంటే ద్వేషం తప్ప, పవన్ మాటల్లో ఇంకేదీ కనిపించదని ఎద్దేవా చేశారు. జగన్ బాగా పలిస్తే పోయి సినిమాలు చేసుకుంటానన్న పవన్, ఇప్పుడు అదే పని చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు.
“బీజేపీ చంకలో ఉంటూ, చంద్రబాబుకు కన్నుకొడతాడు పవన్. ఓపక్క బీజేపీతో కాపురం చేస్తాడు, మరోవైపు కిటికీ తీసి చంద్రబాబుకు కన్ను కొడతాడు. ఇలాంటి రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మరు. మానసిక అత్యాచారం చేసే పేటెంట్ హక్కులు పవన్ కే సొంతం. చంద్రబాబు పల్లకీ మోయడం తప్ప పవన్ కల్యాణ్ ఇంకేమైనా చేస్తున్నారా?”
వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చనంటూ చెబుతున్న పవన్ కల్యాణ్ మాటల్ని ప్రజలు విశ్వసించరని అన్నారు పేర్ని నాని. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని, పూర్తిగా సినిమాలు చేసుకుంటే మంచిదని సూచించారు మంత్రి.పవన్ కల్యాణ్ మాట్లాడితే టీవీల్లో టీఆర్పీలు, యూట్యూబ్ లో వ్యూస్ బాగా వస్తాయని మీడిాయా అతడ్ని హైలెట్ చేస్తోంది తప్ప, అంతకుమించి పవన్ కల్యాణ్ దగ్గర విషయం లేదన్నారు.