దీని ముందు భాగం ఐసిసియు- 01లో చదవండి. ఆ మర్నాడు జాన్ ఏడమ్స్ కేసును రవికాంత్ స్టడీ చేశాడు. కార్డిలాల్ అన్నది బీటా బ్లాకర్ వర్గానికి చెందిన మందు అయివుంటుంది అనుకున్నాడు. బీటా బ్లాకర్ అంటే గుండె వేగం తగ్గించి రక్తపుపోటును అదుపు చేసే మందు. ఈ ఏడమ్స్‌కి హార్ట్ బ్లాక్ వల్ల గుండె స్లో అవుతున్నకొద్దీ యింకా స్లో చేసే ఈ బీటాబ్లాకర్ యివ్వడం అతనిలో అనుమానం రేకెత్తించింది. ఒకవేళ యిది బీటా బ్లాకర్ కాదేమోనని కాంపోజిషన్ చూడబోతే దానిమీద రాసి లేదు. పైగా అది కూడా కార్డియాక్ ఫార్మా తయారుచేసినదే! ఈ కంపెనీ కెళ్లి లిటరేచర్ చదవాలి అనుకుంటూండగానే అవేళ సాయంత్రం రంగనాథరావు కేసు చూశాడు.
ఈ రంగనాథరావు బ్యాంకులో కాషియర్. అతనికి తాగుడు అలవాటు వల్ల గుండెనొప్పి వచ్చింది. ఈ ఆసుపత్రిలో చేరాడు. అంతే మనవాడు పేస్‍మేకర్ పెట్టేశాడు. ఇక అక్కణ్నుంచి చెవిలో శబ్దాలు. మా ఆసుపత్రిలోనే వున్న సైకియాట్రిస్టు దగ్గరకి వెళ్లండి అన్నాడు. అతని కథ వినగానే రవికాంత్ యీ పేస్‍మేకర్ల కేసులన్నీ స్టడీ చేయాలని నిశ్చయించుకుని రాత్రి వెళ్లి రికార్డు రూములో కూచున్నాడు. అతని అసలు డ్యూటీ ఐసిసియులో. కానీ పేషంట్సందరూ స్టేబుల్‍గా వున్నారు. అందువల్ల రికార్డు రూములో వున్న అటెండరుకి లంచం యిచ్చి కేసులు స్టడీ చేశాడు. గత 36 నెలల్లో 1990 కేసుషీట్స్ దొరికాయి. వాటిలో గత 6 నెలల్లో మరణించినవారు 80 మంది. వారిలో 35 మంది రోగులకు పేస్‍మేకర్స్ పెట్టారు. మూడునెలల్లో అంతకుముందు కంటె ఎక్కువగా 25 మందికి పెట్టారు. వీరందరూ ఆర్-4 ఏడాది పాటు వాడినవాళ్లే. అన్నీ నారాయణరావే చేస్తున్నాడు. గత మూడునెలలుగా పేస్‍మేకర్ మాల్‍ఫంక్షన్ అనే పేరుతో ఐసిసియులో చేరిన 9 మంది రోగులూ కార్డియాక్ ఎరెస్ట్‌తో మరణించారు. కానీ పేస్‍మేకర్లు పెడుతూనే వున్నారు. అంటే కరుణాకర్‍కి లాభం వస్తూనే వుంది. ఆయనే యీ కుంభకోణానికి సూత్రధారి అనుకున్నాడు.
రవికాంత్ ఒకడికే కాదు, ఆసుపత్రి చీఫ్ కరుణాకర్‍కి, చైర్మన్ హయగ్రీవరావుకి కూడా ఈ వరస చావులు చికాకు కలిగిస్తున్నాయి. హయగ్రీవరావు శనివారంనాడు మీటింగు పెడదామన్నాడు. కరుణాకర్ సరేనంటూనే గట్టిగా ఆలోచించాడు. నారాయణరావు పేస్‍మేకర్ కేసులు సరిగ్గా హేండిల్ చేయటం లేదని తోచింది. ఈ ఆర్-4 వ్యవహారం కూడా గమ్మత్తుగా వుంది. నారాయణరావు పేషంట్స్‌లో ముఖ్యమంత్రి తేజస్వి కూడా వున్నారు. ఈ తేజస్వి కొంచెం చాదస్తుడు. డాక్టరు తెల్లవారు ఝామునే వచ్చి తనని చూడాలంటాడు. కరుణాకర్‍కి అంత పొద్దున్నే వెళ్లాంటే బద్ధకం. నారాయణరావు వెళ్లడానికి రెడీ. తేజస్వికి కూడా గుండెనొప్పి తెప్పించి ఎలాగోలా పేస్‍మేకర్ పెట్టేస్తే అతన్ని బ్రెయిన్‍వాష్ చేసేసి రాష్ట్రమంతా పాలించేయవచ్చు. తేజస్వి పార్లమెంటుకి పోటీ చేసి ప్రధాని కాబోతున్నాడన్న పుకారు ఒకటి వుంది. అదే జరిగితే దేశాన్నే ఏలేయవచ్చని నారాయణరావు ఆశ. వంగి వంగి దండాలు పెట్టడం వలన నారాయణరావు మంచివాడని, మంచి డాక్టరని తేజస్వి అభిప్రాయం.
అవేళ రాత్రి కరుణాకర్‍కి యిదంతా గుర్తు వచ్చింది. మర్నాడు ఉదయం నారాయణరావుకి బదులుగా తనే వెళ్లి తేజస్వి కేసు స్వయంగా చూద్దామనుకున్నాడు. సిఎం ఆఫీసుకి చెప్పాడు. తర్వాత ఆసుపత్రిలో డాక్టర్లు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూదామని స్వయంగా వచ్చాడు. ఐసిసియులో రవికాంత్ లేడు. రికార్డు రూములో దొరికాడు. అప్పటికే అతను తన ఫైండింగ్స్ అన్నిటినీ విపులంగా కాగితాలమీద రాసి పెట్టుకున్నాడు. ఆర్-4తో మొదలవుతున్న సీక్వెన్సును గమనించాడు. అతన్ని అక్కడ చూడగానే కరుణాకర్‍కి కోపం వచ్చింది. ‘‘మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రిసెర్చి ఫలితాలు నాకే చెందుతాయి. రేపు చైర్మన్‍గారి వద్దకు రండి. సంజాయిషీ చెప్పండి.’’ అంటూ పేపర్లు లాక్కున్నాడు. ఇక తన ఉద్యోగానికి మంగళమే అనుకున్నాడు రవికాంత్.
మర్నాడు పొద్దున్నే కరుణాకర్ ముఖ్యమంత్రి తేజస్వి వద్దకు వెళ్లాడు. నారాయణరావు యిస్తున్న ఆర్-4 వల్ల బిపి ఎక్కువవుతోందని, గుండె పరిస్థితి పాడవుతోందని గ్రహించాడు. అవన్నీ మానేయమని చెప్పి, తనే యిక వైద్యం టేకప్ చేస్తానని చెప్పి బయటకు వచ్చాడు. కారు డ్రైవ్ చేస్తూ ఆర్-4 గురించి ఆలోచిస్తూంటే అతనికి రాత్రి రవికాంత్ వద్దనుండి గుంజుకున్న పేపర్లు గుర్తుకు వచ్చాయి. కారు ఆపి చదివాడు. రవికాంత్ విశ్లేషణను మెచ్చుకుని, తను యిన్నాళ్లూ యీ విషయం గమనించనందుకు తనను తాను తిట్టుకుని, రవికాంత్‍ను క్షమాపణ అడగాలని, నారాయణరావును నిలదీయాలని అనుకుని కారు ముందుకు పోనిచ్చాడు.
అయితే నారాయణరావు యివన్నీ తన అనుచరుల ద్వారా గమనిస్తూనే వున్నాడు. రవికాంత్ రికార్డు రూములో చాలా గంటలు గడపడం అతనికి తెలిసింది. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గమనించిన కరుణాకర్‍కు అనుమానం రాక తప్పదని తెలుసు. అందుకని అప్పటికప్పుడు కరుణాకర్ కారుని ఓ లారీ చేత గుద్దించేశాడు. కరుణాకర్ స్పృహ తప్పగానే లారీ డ్రైవర్ అతని కారులో కాగితాలు తస్కరించేశాడు. కోమాలో వున్న కరుణాకర్‍ను నిమ్స్‌కి తరలించారు. ఇది రవికాంత్‍కి కలిసివచ్చింది. కరుణాకర్ వుండివుంటే తన ఉద్యోగం పీకేసేవాడేమో అనుకుంటున్న రవికాంత్ ఆయన కోమాలో వెళ్లిపోవడంతో ఎప్పటిలాగా డ్యూటీకి వచ్చేశాడు. అతను చేసిన కేస్ స్టడీ చూసిన నారాయణరావు ఓ ఆకాశరామన్న బెదిరింపు లేఖ పంపాడు. ‘నీ పని నువ్వు చూసుకో, నిప్పుతో చెలగాటమాడకు’ అని.
కానీ మన హీరో రవికాంత్ వదలలేదు. అవేళ సైకియాట్రీ సెక్షన్‍కి వెళ్లాడు. అక్కడి సైకియాట్రిస్టు నారాయణరావు కాండిడేటేగా! రంగనాథరావును ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి ఏ రోజున క్యాష్ బాలన్స్ ఎక్కువుంటుంది? తాళం చేతులు ఎవరి దగ్గర వుంటాయి? యిలా సమాచారం సేకరిస్తున్నాడు. అతనికి బ్రెయిన్‍వాష్ చేసి, అతని చేతనే బ్యాంకులోంచి క్యాష్ బయటకు తెప్పించేద్దామని వీళ్ల ప్లాను. రవికాంత్‍కి విషయం కాస్త కాస్త అర్థమయింది. తన వద్దనున్న ఆర్-4 టాబ్లెట్స్‌లో ఏముందో తెలుసుకోవాలని ఉస్మానియా ఆసుపత్రిలో ఫార్మకాలజీ ప్రొఫెసర్‍కి యిచ్చాడు.
ఆ పరిస్థితిలోనే నర్సిమ్ములు చావు వార్త తెలిసింది. ఈ నర్సిమ్ములు ఓ బ్యాంక్ దోపిడీ చేశాడు. డబ్బు తీసుకెళ్లి ఓ లాకర్‍లో పెట్టాడు. తన సహచరులతో కలిసి మందు కొడుతూంటే అతనికి ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో అతని సహచరులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళితే పోలీసులుంటారన్న భయం కొద్దీ ఈ వివేకానంద హాస్పటల్‍కి తీసుకొచ్చారు. అతనెవరో కనుక్కోమని నారాయణరావు యూనివర్శల్ డిటెక్టివ్ ఏజన్సీని పురమాయించాడు. అతని వృత్తి కాంట్రాక్టుమీద దొంగతనాలు చేయడం అని గ్రహించగానే తనకు కావలసిన వ్యక్తి అని నారాయణరావు గ్రహించేడు. అంతే, వెంటనే తన పేస్‍మేకర్ పెట్టేశాడు. అంటే అర్థమైందిగా, రేడియో రిసీవర్! అతను డిస్‍చార్జి అయిన దగ్గర్నుంచి దాచిన డబ్బు బయటకు తియ్యి అని సంకేతాలు. చివరకు డబ్బు తీసుకుని పోలీసుల కళ్లు గప్పి విమానంలో పారిపోబోతూంటే సిగ్నల్ యిచ్చి అతనికి గుండెపోటు తెప్పించారు.
అక్కడికి నారాయణరావు అనుచరుడు వెళ్లి నేను డాక్టర్ని, నన్ను చూడనివ్వండి అంటూ దగ్గరకి వెళ్లి సూట్‍కేసులు మార్చేసి డబ్బు పట్టుకుని ఉడాయించాడు. అతని శవాన్ని వివేకానంద హాస్పటల్‍కి తీసుకొస్తున్నారు. నారాయణరావు వచ్చి తన పేస్‍మేకర్ వెనక్కి తీసేసుకునే లోపున రవికాంత్ యాంబులెన్స్ వ్యాన్‍లోకి వెళ్లి శవం మెడదగ్గర కోసి ఆ పేస్‍మేకర్ జేబులో పెట్టేసుకున్నాడు. ఈ విషయంలో పింటో అనే ఓ డాక్టర్ అతనికి సహాయపడ్డాడు. ఆ పేస్‍మేకర్ ఎవరైనా ఎలక్ట్రానిక్స్ వాళ్ల చేత టెస్టు చేయించాలనుకుని పింటోకి తెలిసినాయనకు పట్టుకెళ్లి యిచ్చాడు. ఆయన మర్నాటి కల్లా యిది రేడియో రిసీవర్ సార్. అని చెప్పేశాడు.
శవంలోంచి రవికాంత్ పేస్‍మేకర్ తీసుకున్న వార్త నారాయణరావుకి చేరగానే యిక అటకట్టించే సమయం అయిందనుకున్నాడు. తనతో పని చేసిన ముగ్గురికీ వాటాలిచ్చి విదేశాలు పంపేశాడు. అతని లక్ష్యం ఇప్పుడొక్కటే! త్వరలోనే ప్రధానమంత్రి కాబోతున్న తేజస్వి! కరుణాకర్ కోమాలో వుండడం వల్ల తేజస్వి మళ్లీ నారాయణరావు పాల బడ్డాడు. ఎవరికీ తెలియకుండా తేజస్వికి తన పేస్‍మేకర్ పెట్టేయాలి. అది తన రేడియో సిగ్నల్స్ అందుకోవాలంటే తను ఢిల్లీకి మకాం మార్చేయాలి. ఇక్కడ యింట్లో నడుపుతున్న క్లినిక్ మూసేయాలి. ఈలోగా రవికాంత్‍ను న్యూట్రలైజ్ చేయాలి. ఎలా? ఇంతలో అతనికి తెలిసింది – రవికాంత్ భార్య, పిల్లవాడు విజయవాడనుండి వస్తున్నారని. వాళ్లకు మాయమాటలు చెప్పి బస్టాండ్ నుండి తన యింటికి రప్పించాడు. రవికాంత్‍ను బ్లాక్‍మెయిల్ చేసాడు. నువ్వు యిప్పటిదాకా సేకరించిన ఆధారాలతో మా యింటికి రా అని. రవికాంత్ వెళ్లాడు.
నారాయణరావు యిల్లు కమ్ క్లినిక్ పెద్ద కోటలా వుంది. హెవీ సెక్యూరిటీ. లోపలకి వెళ్లాక తన భార్య, పిల్లవాడు కనబడ్డారు. వీళ్లని మా యింటికి సేఫ్‍గా పంపించేస్తేనే నేనేం కనుక్కున్నదీ చెప్తాను అన్నాడు రవికాంత్. పంపించేశాక అప్పుడు నారాయణరావు తన కథంతా చెప్పుకొచ్చాడు. అన్యాయం చేసి సంపాదిస్తున్నది తను మానవాళికి ఉపయోగపడే పరిశోధనలకు ఉపయోగిస్తున్నానని కావాలంటే వచ్చి చూడమని తన క్లినిక్ అంతా తిప్పాడు. నిజమే, విదేశాల స్థాయిలో అక్కడ సౌకర్యాలున్నాయి. రవికాంత్ కూడా ఇంప్రెస్ అయ్యాడు కానీ మీరు చేసేది మెడికల్ ఎథిక్స్‌కి విరుద్ధం అన్నాడు. అతనితో మాటల్లోనే ఆర్-4లో గుండెమీద పనిచేసే ఆల్కలాయిడ్సే కాక బీటా బ్లాకర్ పెండోలాల్ ఎక్కువ డోస్‍లో కలపబడిందని తెలిసింది. అక్కడే నారాయణరావు అందరికీ సిగ్నల్స్ పంపే యంత్రం కూడా రవికాంత్ కంటబడింది. అతనికి చిక్కుముడులన్నీ విడిపోయాయి.
ఇతని మేధస్సు గమనించిన నారాయణరావు తన గొప్పలు చెప్పుకున్నాడు, ఒకే యంత్రంలో హార్ట్‌బీట్‌నీ, ధ్వనితరంగాలనూ కంట్రోలు చేసే టెక్నాలజీని ఎలా యిమిడ్చాడో చెప్పుకున్నాడు. తను పరిశోధన చేసి కనిపెట్టినది అదే. ఈ పేస్‍మేకర్‍లోనుంచి ఒక ఎలక్ట్రోడ్ గుండెలోని కుడి జఠరికలో అమరిస్తే మరొక అతి సూక్ష్మమైన మైక్రో ఎలక్ట్రోడ్ కరొటెడ్ ఆర్టరీ చుట్టూ వున్న నెర్వ్ గాంగ్లియన్స్‌కి అతి సున్నితంగా కలిపేట్లు అమరుస్తాడు. ఆ నరాల ద్వారా లోపలి చెవిలోని కాక్లియా దాకా ధ్వని తరంగాలు వెళ్లగలవని యితని పరిశోధనలో తేలింది. దానివల్ల వాళ్లకు యితని మాటలు అంతరాత్మ ప్రబోధంలా వినబడతాయి. ఈ పేస్‍మేకర్‍లో నరాల పని కూడా వుంటుంది కాబట్టే నారాయణరావు పేస్‍మేకర్‍ను అమర్చేటప్పుడు న్యూరో సర్జన్‍ని కూడా తనతో పెట్టుకున్నాడు. కార్డియాక్ ఆపరేషన్స్‌లో న్యూరోసర్జన్ ఎందుకన్న సందేహం కూడా తక్కిన డాక్టర్లకు రాదు.
ఇవన్నీ విన్నాక రవికాంత్‍కి భయం వేసింది. ఇంత మహా క్రూరుడు తనను మాత్రం వదులుతాడా అని. పారిపోబోయేడు. కానీ కుక్కలు వెంటాడి అతనిమీద పడ్డాయి. లోపలకి తీసుకొచ్చి అతనికి ఆర్-4 లాటి విషపదార్థం యింజక్ట్ చేయించి, గుండెలోని రక్తనాళాలు సంకోచం చెందేట్టు చేశాడు. దానితో యితనికి గుండెపోటు వచ్చింది. ఇక అప్పుడు నారాయణరావు నవ్వి, ‘‘రవీ, ఇప్పుడు నీకు హార్ట్ బ్లాక్ తెప్పిస్తాను. వివేకానంద ఆసుపత్రిలో అందరి యెదుటా నీకు నా పేస్ మేకర్, కాదు రేడియో రిసీవర్ పెడతాను. అంతా నేను నిన్ను రక్షిస్తున్నాననే అనుకుంటారు. ఆ రేడియో రిసీవర్ ద్వారా నువ్వు నాకు జీవితాంతం బానిసవయిపోతావు’’ అంటాడు. అన్నంత పనీ చేశాడు నారాయణరావు. రవికి గుండెపోటు వచ్చిందని డాక్టర్ పింటోతో సహా అందరూ నమ్మారు. వివేకానందలో నారాయణరావు రవికాంత్‍ను ఐసిసియులో ఎనిమిదో నెంబరు బెడ్‍మీద పడుక్కోబెట్టి ఛాతీలో తన పేస్ మేకర్ పెట్టేశాడు. ఎనిమిదో నెంబరు ఎందుకంటే అక్కడ మైక్రోఫోన్ పెట్టి అక్కడ జరిగే సంభాషణంతా తన క్లినిక్‍లో వుండి అతను వినగలడు.
రవికాంత్ అడ్డు తొలగింది కాబట్టి నారాయణరావు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ‘‘మీ అనారోగ్యం సంగతి బయటకు పొక్కితే మీకు రాజకీయంగా నష్టం. అందుకని సామాన్యుడిలా వచ్చి మా ఆసుపత్రిలో ఈ రాత్రి పడుక్కోండి. రేపు పొద్దున్న మీకు పేస్‍మేకర్ పెట్టేస్తాను అన్నాడు. ఆయన సరేనని చెప్పి హాస్పటల్లో ఎడ్మిటయ్యాడు. అక్కణ్నుంచి కోమానుండి కోలుకున్న కరుణాకర్ వద్దకు వెళ్లాడు. అతన్ని చూస్తునే కరుణాకర్ ‘నారాయణరావ్, నీ ఆర్-4 బాగాలేదు. నువ్వు దాన్ని వాడడం మానేయ్.’ అన్నాడు. కానీ నారాయణరావు రియాక్షన్ చూశాక అతనికి అనుమానం వచ్చింది. రవికాంత్ రిసెర్చి పేపరు చదివివున్నాడు కాబట్టి అనుమానం బలపడింది. నారాయణరావు అది గ్రహించి అతను చెప్తున్న మాట వినకుండా బయటకు వెళ్లిపోయాడు. దాంతో కరుణాకర్ చైర్మన్ హయగ్రీవరావుకి ఫోన్ చేసి రేపే మీటింగు పెట్టాలి, ఇతని వ్యవహారం నాకు అనుమానంగా వుంది అని చెప్పాడు.
ఇక్కడ రవికాంత్‍కి మెలకువ వచ్చింది. డాక్టర్ పింటో అతన్ని ఎటెండ్ అవుతున్నాడు. అప్పుడు రవికాంత్ ఓ కాగితంమీద రాశాడు – ‘పింటో, నాకు వచ్చినది హార్ట్ ఎటాక్ కాదు. ఆ పేస్‍మేకర్ తీసేయి. నేను మాట్లాడితే నారాయణరావు రికార్డు చేసుకుని వింటాడు’ అని. పింటో నమ్మడు కానీ రవి మీద నమ్మకంతో సరే తీసేస్తానన్నాడు. కానీ తక్కిన స్టాఫ్‍కి తెలియకుండా ఆపరేషన్ చేయడం ఎలా? తన బర్త్‌డే పార్టీ అంటూ స్టాఫంతటినీ పిలిచి స్వీట్లు యిచ్చి నెంబుటాల్ మాత్రలు కలిపిన టీ యిచ్చేసాడు. అందరూ నిద్రలోకి జారుకున్నాక, రవికాంత్ భార్యను నర్సు వేషం వేసి కూచోబెట్టి తనొక్కడూ ఒంటిచేత్తో ఆపరేషన్ చేసి పేస్‍మేకర్ బయటకు తీసేశాడు. రవి చెప్పినట్టే అది తీసేసినా ఏ ప్రమాదం రాలేదు. ఎందుకంటే అతనికి వచ్చిన గుండెనొప్పి ఉత్తుత్తిది కాబట్టి!
తన బెడ్‍మీదకు తిరిగి వచ్చాక రవి ‘పింటో, మనం తక్షణం హయగ్రీవరావుగారిని కలవాలి. ఈ పేస్‍మేకర్‍లో వున్న రేడియో రిసీవరే మనకు సాక్ష్యం. ఆయన ముఖ్యమంత్రిగారు నారాయణరావు ప్లానుకి బలవకుండా కాపాడతారు’ అన్నాడు. అది నారాయణరావు తన క్లినిక్‍లోనుండి విన్నాడు. అతనికి భయం పట్టుకుంది. ఆటకట్టని తెలిసింది. బతికుంటే మళ్లీ కొన్నాళ్లకు యింకోరకంగా కార్యకలాపాలు మొదలెట్టవచ్చనుకుని, తక్షణం కొంత డబ్బుని సూట్‍కేసులో పెట్టుకుని ఎవరి కంటా పడకుండా యింట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ దానికి నిప్పుపెట్టి పోయాడు.
రవి, పింటో హయగ్రీవరావు గారికి చెప్పి ఆయన్ని వెంటబెట్టుకుని వచ్చేసరికి నారాయణరావు క్లినిక్ తగలబడిపోతోంది. నారాయణరావు కూడా మంటల్లో మాడి మసై పోయుంటాడు అనుకున్నారందరూ. అలాటప్పుడు అతను యిన్నాళ్లూ చేసిన ఘోరాలను బయటపెట్టి హాస్పటల్ ప్రతిష్ట పోగొట్టుకోవడం ఎందుకు అనుకున్నాడు హయగ్రీవరావు. వెంటనే తన చేతిలో రవి యిచ్చిన పేస్‍మేకర్‍ను మంటల్లోకి విసిరేసి, సాక్ష్యాన్ని నాశనం చేసేశాడు. మర్నాడు హయగ్రీవరావు, కరుణాకర్ రవికాంత్‍కు క్షమాపణలు చెప్పుకున్నారు. తాము ఏ పాపం ఎరగమని, నారాయణరావును అతిగా నమ్మి, అసహజ మరణాలపై అధ్యయనం చేయకపోవడమే తమ తప్పిదమని అన్నారు. నారాయణరావు స్థానంలో రవికాంత్‍ను నియమించారు. ఇక్కడితో కథ ముగుస్తుంది.
ముందే చెప్పినట్టు మరీ అభూత కల్పనలా అనిపించకుండా, యిలా కూడా జరగవచ్చు అని తోచేట్లా నవల రాసిన రచయిత డాక్టర్ చిత్తర్వు మధు అభినందనీయులు. స్వయంగా డాక్టర్ కావడం చేతనే ఆయన యింత కన్విన్సింగ్‍గా రాయగలిగారు. వీలైతే పుస్తకం చదవండి. (https://kinige.com/book/ICCU ) (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)