మెగా కాంపౌండ్ లో ఓ సంప్రదాయం ఉంది. అల్లు అర్జున్ మినహా సినిమా ఫ్లాప్ అయితే ఓపెన్ గా ఒప్పుకుంటారు ఆ కాంపౌండ్ హీరోలు. అభిమానులను క్షమాపణలు కోరుతూ లేఖలు విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి ఆచార్య విషయంలో ఆ చొరవ ఎవరు తీసుకుంటారు? మరోసారి రామ్ చరణ్ లేఖ రిలీజ్ చేస్తాడా? లేక ఈసారి చిరంజీవి వంతు వస్తుందా?
కొన్నేళ్ల కిందటి సంగతి..
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా చేశాడు చరణ్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమాకు మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో చరణ్ వెంటనే రంగంలోకి దిగాడు.
ఫ్యాన్స్ కు బహిరంగ లేఖ రాశాడు. మెగాభిమానుల్ని నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరాడు. అప్పట్లో చరణ్ విడుదల చేసిన ఆ లేఖపై బోయపాటి బాగా హర్ట్ అయ్యాడు కూడా. మళ్లీ ఇప్పటివరకు ఆయన మెగా కాంపౌండ్ లో సినిమా చేయలేదు. సాయిధరమ్ తేజ్ తో మూవీ అనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
తాజాగా వరుణ్ తేజ్..
రామ్ చరణ్ టైపులోనే వరుణ్ తేజ్ కూడా స్పందించాడు. తను నటించిన గని సినిమా డిజాస్టర్ అవ్వడంతో వెంటనే లేఖ విడుదల చేశాడు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు.
ఓ ఐడియా అనుకుంటే, తెరపైకి వచ్చేసరికి అది సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదన్నాడు. తన కష్టం మాత్రం అన్ని సినిమాలకు ఒకేలా ఉంటుందని, ఇకపై మరింత కష్టపడతానని ముక్తాయింపు ఇచ్చాడు. మొత్తానికి సినిమా ఫ్లాప్ ను సక్సెస్ ఫుల్ గా దర్శకుడిపై నెట్టేశారు.
ఇప్పుడు ఆచార్య వంతు
వినయ విధేయరామ అయిపోయింది, గని ముగిసింది. ఇప్పుడు ఆచార్య వంతు వచ్చింది. వినయ విధేయ టైపులోనే విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే ఆచార్యకు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ టాక్ ఏ రేంజ్ లో వచ్చిదంటే, ఇవాళ్టి నుంచి సినిమా కోలుకోవడం కష్టం అని తేల్చేసింది ట్రేడ్. పెరిగిన టికెట్ ధరల దృష్ట్యా ఆక్యుపెన్సీ సగానికి పడిపోవచ్చని కూడా అభిప్రాయపడుతోంది.
మరి ఈ నేపథ్యంలో హీరోలిద్దరూ ఏం చేయబోతున్నారు? ఆచార్య రిజల్ట్ పై చింతిస్తూ పెద్దమనిషి హోదాలో చిరంజీవి ఏదైనా ప్రకటన చేయబోతున్నారా? వడ్డీలకే 50 కోట్లు కట్టామని చెప్పిన చిరంజీవి, రజనీకాంత్ టైపులో బయ్యర్లను ఆదుకోగలరా? లేక రామ్ చరణ్ మరోసారి రంగంలోకి దిగి మరో లేఖ విడుదల చేస్తాడా?
బాధితులుగా నిరంజన్-కొరటాల
ఇప్పటికే అభిమానులంతా కొరటాలను టార్గెట్ చేశారు. చిరంజీవి-చరణ్ లాంటి ఇద్దరు హీరోలను పెట్టుకొని పేలవమైన కథ, నీరసమైన స్క్రీన్ ప్లేతో సినిమా తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొరటాల రాసుకున్న కథ, స్క్రీన్ ప్లేలో చిరు-చరణ్ ఎన్నిసార్లు వేలు పెట్టారనే విషయాన్ని మాత్రం ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు.
మరుసటి రోజు షూట్ చేయాల్సిన సీన్ పై కూడా ముందురోజు చర్చించి మార్పుచేర్పులు చేస్తుంటే సినిమా ఎలా వస్తుంది? పోస్టుమార్టం అనవసరం. కొరటాల ఆల్రెడీ దోషిగా నిలబడ్డారు.
క్రియేటివ్ సైడ్ లో కొరటాల దొరికిపోతే, బిజినెస్ యాంగిల్ లో నిరంజన్ రెడ్డి దొరికిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొణెదల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ఉన్నప్పటికీ.. బిజినెస్ లెక్కలన్నీ నిరంజన్ రెడ్డి కేంద్రంగా జరిగాయనేది మెగా కాంపౌండ్ మాట.
ఈ విషయంలో కొరటాల, ఆయన సన్నిహితుడు సుధాకర్ కూడా ఓ చేయి వేశారని అంటున్నారు. కాబట్టి బయ్యర్లు తమపైకి రాకుండా 'కొణెదల కంపెనీ' ఇలా ముందుగానే జాగ్రత్తపడినట్టు కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే నిరంజన్ రెడ్డి వైపే వేళ్లు ఎక్కువగా చూపిస్తాయి.