ఎమ్బీయస్‌: ఇమ్రాన్‌ రాజకీయ ప్రస్థానం

ఇప్పుడు పాక్‌కు ప్రధాని ఐన ఇమ్రాన్‌ 22 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినపుడు వరుస వైఫల్యాలు ఎదుర్కున్నాడు. క్రికెట్‌లో అతని సరసన ఉన్న విజయలక్ష్మి రాజకీయాల్లో మొహం చాటేసింది. అందరూ వెక్కిరించారు. పదేళ్ల పాటు…

ఇప్పుడు పాక్‌కు ప్రధాని ఐన ఇమ్రాన్‌ 22 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినపుడు వరుస వైఫల్యాలు ఎదుర్కున్నాడు. క్రికెట్‌లో అతని సరసన ఉన్న విజయలక్ష్మి రాజకీయాల్లో మొహం చాటేసింది. అందరూ వెక్కిరించారు. పదేళ్ల పాటు అతన్ని జోకర్‌గానే చూశారు. మీడియా అతన్ని పాక్‌ రాజకీయాల్లో ఆటల్లో అరటిపండుగానే చూసింది. కానీ పట్టుదలతో పోరాడాడు. ఆ క్రమంలో రంగులు కూడా మార్చాడు. కానీ ఒకటైతే చెప్పుకోవాలి – 15 ఏళ్ల వైఫల్యం తర్వాత ఇంగ్లండు వెళ్లి సెటిలయ్యే అవకాశం ఉన్నా వెళ్లలేదు. అతని రాజకీయ ప్రత్యర్థులు నవాజ్‌, బేనజీర్‌ సైన్యానికి భయపడి గల్ఫ్‌లో మౌనంగా గడుపుతూండగా ఇమ్రాన్‌ సొంత గడ్డపై ఉండి యువత అండతో రాజకీయ పోరాటం చేశాడు.

పాక్‌లోనే ఉంటూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ తన ఉనికిని చూపుకున్నాడు. ప్రగాఢమైన ఆత్మవిశ్వాసం కనబరచి అభిమానులను నిలుపుకున్నాడు. నేను ప్రధాని కావడం ఖాయం, ఎప్పుడు అనేదే ప్రశ్న అనేవాడు. గత పదేళ్లగా సైన్యం అతనికి సాయపడుతోంది. చివరకు అతన్ని పీఠంపై కూర్చోబెట్టింది. తల్లి పేర ఆసుపత్రి కట్టించిన రెండేళ్లకు అధికారంలో ఉన్న పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) అధినేత్రి, ఆక్స్‌ఫర్డ్‌లో తన క్లాసుమేటు బేనజీర్‌ భుట్టోకి చెక్‌ పెట్టే లక్ష్యంతో 1996లో తనే చైర్మన్‌గా పిటిఐ (పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ – న్యాయం కోసం పోరాటం అని అర్థం) పార్టీ పెట్టాడు. ప్రతిపక్షంలో ఉన్న నవాజ్‌ షరీఫ్‌ 'వేరే పార్టీ ఎందుకు, నా పార్టీలో ద్వితీయ స్థానం యిస్తానన్నాడ'ట. అయినా యితను సొంత కుంపటే పెట్టుకున్నాడు.

207 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి 1997 ఫిబ్రవరిలో జరిగిన జనరల్‌ ఎన్నికలలో ఏడు చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్లా ఓడిపోయాడు. నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని అయ్యాడు. ఇమ్రాన్‌ అతని మీదా ధ్వజమెత్తాడు. 1999లో సైనిక కుట్రతో అతన్ని గద్దె దింపి ముషారఫ్‌ అధికారంలోకి వస్తే హర్షం వెలిబుచ్చాడు. 'ముషారఫ్‌ నాకు ప్రధాని పదవి ఆఫర్‌ చేశాడు, కానీ వద్దన్నా' అని చెప్పుకున్నాడు. కొన్నేళ్లు గడిచాక, 'ముషారఫ్‌ను ఆ రోజు సమర్థించడం నా పొరపాటు' అని అంగీకరించాడు. 2002లో సొంత ఊరు నుంచి తానొక్కడే గెలిచాడు. దేశం మొత్తంమీద అతని పార్టీకి 1% ఓట్ల కంటె తక్కువ పడ్డాయి. ఆటగాడు మాటకారి కావలసిన పని లేదు. అయినా అయ్యాడు. అతను మంచి వక్త. నవాజ్‌, భుట్టో యిద్దరి అవినీతిపై పోరాటం చేశాడు.

జనంలో ఉంటూ భారీ ర్యాలీలు నిర్వహించడమే పనిగా పెట్టుకున్నాడు. విపక్షనేతగా పార్లమెంటుకి హాజరైంది తక్కువ, పరిపాలనాంశాలపై దృష్టి సారించింది లేదు. మరి యిప్పుడు పాలకుడిగా ఏం చేస్తాడో చూడాలి. 2007లో ముషారఫ్‌ ఆర్మీ చీఫ్‌ పదవి వదులుకోకుండానే అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు నిరసనగా 85 మంది పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు. వారిలో ఇమ్రాన్‌ ఒకడు. 2008 జనవరిలో జరిగే ఎన్నికలలో పాల్గొనడానికి బేనజీర్‌ భుట్టో పాక్‌ వచ్చినపుడు 2007 డిసెంబరులో ఆమె హత్య జరిగింది. అందరూ ముషారఫ్‌నే అనుమానించారు. ముషారఫ్‌ పరిపాలనను, అవినీతిని నిరసిస్తూ ఆల్‌ పార్టీ డెమోక్రాటిక్‌ మూవ్‌మెంట్‌ 2008 ఎన్నికలను బహిష్కరించాడు.

వారిలో ఇమ్రాన్‌ పార్టీ కూడా ఒకటి. అతను అప్పట్లో ముషారఫ్‌ను 'బుష్‌ డ్రీమ్‌ టీమ్‌ సభ్యుడు' అని విమర్శించేవాడు. అందువలన సైన్యానికి నచ్చేవాడు కాదు. పోనుపోను అతను అమెరికా వ్యతిరేకత తగ్గించాడు కానీ ఏ మాట కా మాట చెప్పాలంటే అమెరికా వాళ్ల ఆఫ్గన్‌ విధానం వలన పాకిస్తాన్‌ నష్టపోతోందని బహిరంగంగా విమర్శించిన నాయకుల్లో మొదటివాడు అతనే. 2008-13 మధ్య పిపిపి అధ్యక్షుడు జర్దారీ అవినీతి పాలన సాగినప్పుడు ఇమ్రాన్‌ పార్టీ పుంజుకుంది. అతని అవినీతిని వ్యతిరేకిస్తూ 2011లో ఇమ్రాన్‌ లాహోర్‌లో బహిరంగ సభ పెడితే లక్ష మంది హాజరయ్యారు. 2013 ఎన్నికలలో 'నయా పాకిస్తాన్‌' నినాదం చేపట్టాడు. పార్లమెంటులో 35 సీట్లు గెలిచాడు. దానితో బాటు ఖైబర్‌ ఫక్తూన్‌లో ఖ్వా రాష్ట్రంలో వేరే పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు.

కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న నవాజ్‌ షరీఫ్‌ పార్టీపై పోరాడింది. ఈసారీ గెలిచింది. సాధారణంగా అక్కడ రెండు సార్లు వరుసగా ఎవరూ గెలవరు. ఆ గెలుపుకి కారణం పెర్వేజ్‌ ఖట్టక్‌ అనే ఇమ్రాన్‌ సహచరుడు. వాళ్లిద్దరూ లాహోర్‌ స్కూల్లో క్లాస్‌మేట్స్‌. అక్కడ ముఖ్యమంత్రిగా చక్కని పాలన అందించాడు. 2013 ఫలితాల తర్వాత ఇమ్రాన్‌ తనకు ఎప్పటికైనా ప్రధానిగా ఛాన్సుందని గట్టిగా అనిపించినట్లుంది. దాని కోసం రకరకాల ఎత్తులు ఎత్తసాగాడు. అప్పణ్నుంచి తీవ్రవాదం పట్ల సానుభూతిగా ఉండసాగాడు. తాలిబన్లు కార్యాలయాలు తెరవడానికి అనుమతించాలని వాదించాడు. తాలిబన్‌ న్యాయస్థానాలకు మద్దతిచ్చాడట. దాంతో అతని అభిమానులు, ఉదారులు కంగు తిన్నారు. తాలిబన్‌లకు అనుకూలుడైనందుకు విమర్శల పాలయ్యాడు.

సమాధానంగా 'నేను అమెరికా డ్రోన్‌ దాడులకు వ్యతిరేకుణ్ని, అమాయకుల చావులను నిరసిస్తున్నాను' అన్నాడితను. అధికారంలో ఉన్న నవాజ్‌ షరీఫ్‌పై అస్త్రాలు ఎక్కుపెట్టాడు. అతని రాజీనామా డిమాండ్‌ చేస్తూ 2014 ఆగస్టులో లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించాడు. దీంతో ఎన్నికల అక్రమాలపై విచారణకు న్యాయ కమిషన్‌ వేయడానికి షరీఫ్‌ ఒప్పుకున్నాడు. చివరకు నవాజ్‌ జైలుపాలు కావలసి వచ్చింది. అదే ఇమ్రాన్‌ గెలుపుకు దోహదపడింది. ఇప్పుడా ఆ కేసు గతి ఏమవుతుందో వేచి చూడాలి. సుప్రీం కోర్టుకి వచ్చేసరికి సైన్యం ఒత్తిడి తెచ్చి, నవాజ్‌ను మళ్లీ జైలుకి పంపుతుందా? అలా అయితే అతనిపై సానుభూతి, ఇమ్రాన్‌పై విరక్తి పెరగవా?

ఇమ్రాన్‌కు ఆధునికుడిగా పేరుంది. అతని జీవనసరళి కూడా అలాగే ఉంటుంది. అలా అయితే సైన్యం, తద్వారా మతపెద్దల ఆమోదం పొందడం కష్టం. అందువలన తను అచ్చమైన ముస్లిమునని చూపించుకోవడానికి ప్రయత్నించాడు. ఏపాటి దైవదూషణ (పాలకుల దృష్టిలో) చేసినా కఠినంగా శిక్షించే చట్టాలకు మద్దతిచ్చాడు. కరడు గట్టిన ఇస్లామిక్‌ అతివాదులు అతని పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారం తర్వాత ప్రవక్త పాలన తెస్తానన్నాడు. సైన్యం చెప్పడం వలననో ఏమో, ఉగ్రవాదులతో కూడా ఇమ్రాన్‌ సఖ్యంగానే ఉన్నాడనుకోవాలి. హఖానీ నెట్‌వర్క్‌, లష్కరే తొయిబాల గురించి మాటాడటం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కశ్మీర్‌ అంశాన్ని భద్రతామండలి తీర్మానంతో ముడిపెట్టాడు, తర్వాత కశ్మీరులో హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడుతున్నాడు.

ఇవన్నీ మాట్లాడుతూనే జిన్నా కలలు కన్న దేశంగా మారుస్తానని అన్నాడు. జిన్నా స్వతహాగా ఉదారవాది. మతాన్ని, రాజకీయాలను కలపడానికి వ్యతిరేకి. గాంధీతో పోటీలో వెనకబడి, తర్వాత మతరాజకీయాలను వాటేసుకున్నాడు. మతం పేరు మీద దేశాన్ని చీల్చి, పాకిస్తాన్‌కు అధినేత అయ్యాడు. కానీ పాకిస్తాన్‌ ఒక సెక్యులర్‌, డెమోక్రాటిక్‌ దేశంగా ఉండాలని కలలు గన్నాడు. ఆ విషయాన్ని తొలి ఉపన్యాసంలోనే స్పష్టంగా చెప్పాడు. కానీ నాటే విత్తనం బట్టే పెరిగే చెట్టు ఉంటుంది. ద్వేషంతో లక్ష్యాన్ని సాధించి, ఆ తర్వాత అందరూ శాంతంగా, కలిసిమెలిసి ఉండండి అంటే కుదురుతుందా? చివరకు పాకిస్తాన్‌ మతరాజ్యంగా మారిపోయింది. ప్రజాస్వామ్యం దోబూచులాడుతోంది. జిన్నా ఆశయాలకు, ఇమ్రాన్‌ ఆచరణకు ఎలా పొసుగుతుంది?

ఇమ్రాన్‌ సలహాదారుల్లో ఎంగ్రో కార్పోరేషన్‌కు సిఇఓగా చేసిన అసద్‌ ఉమర్‌ ఉన్నాడు. ఇమ్రాన్‌ గెలిస్తే అతను ఆర్థికమంత్రి అవుతాడని అనుకుంటూ వచ్చారు. అయ్యాడు కూడా.  కారణాలు తెలియరాలేదు. జహంగీర్‌ ఖాన్‌ తారీన్‌ అనే అత్యంత ధనికుడు కూడా ఇమ్రాన్‌ సర్కిల్‌లో ఉన్నాడు. డబ్బు వెదజల్లడంతో బాటు మంచి కమ్యూనికేషన్‌, ఆర్గనైజేషన్‌ స్కిల్స్‌ కూడా ఉన్నవాడు. షా మెహమూద్‌ ఖురేషీ అనే అతను గతంలో విదేశాంగమంత్రిగా పని చేశాడు. ఐఎస్‌ఐకు సన్నిహితుడంటారు. ఈ సారి కూడా ఇమ్రాన్‌ అతన్ని విదేశాంగ మంత్రి చేశాడు. వీరితో బాటు షిరీన్‌ మజారీ అనే పాత్రికేయురాలు కూడా ఉంది. ఆవిడకు ఇండియా అన్నా, అమెరికా అన్నా, ప్రతిపక్షాలన్నా అస్సలు పడదు. ఆవిడ మానవహక్కుల మంత్రి అయింది.

'పరివర్తన' అనే నినాదంతో మమతా బెనర్జీ ఎన్నికలలో గెలిచినట్లు యీ ఎన్నికలలో ఇమ్రాన్‌ 'తబ్‌దీలీ' (మార్పు) అనే నినాదాన్ని 'నయా పాకిస్తాన్‌' నినాదానికి చేర్చాడు. పేదలకు ఉచితవైద్యాన్ని అందించే ఆసుపత్రులు పెట్టాడు కాబట్టి, తన పాలనలో బ్రిటన్‌ తరహా నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (ఉచిత ప్రభుత్వాసుపత్రులు) పాక్‌లో ప్రవేశపెడతానంటున్నాడు. ముషారఫ్‌ పాలనలో జరిగిన ఆర్థికాభివృద్ధి వలన పేదలు నాశనమైనా, నగరంలోని మధ్యతరగతి బలపడ్డారు. వాళ్లు ఇమ్రాన్‌ను చూసి ముచ్చటపడ్డారు. పిపిపి, పిఎంఎల్‌-ఎన్‌ రెండూ అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నాయి. పిటిఐకు ఆ తరహా గుదిబండ ఏమీ లేదు. మామూలుగా అయితే పంజాబ్‌ పిఎంఎల్‌-ఎన్‌కు, సింధ్‌ పిపిపికి పెట్టని కోటలు. కానీ రెండు చోట్లా కూడా నగర ఓటర్లున్న చోట పిటిఐకు ఓట్లు పడ్డాయి.

2013లో పంజాబ్‌లోని లాహోర్‌, రావల్పిండి నగరాలలో అనేక చోట్ల పిటిఐ ద్వితీయ స్థానంలో నిలిచింది. సింధ్‌లో కూడా అలాగే జరిగింది. ఇమ్రాన్‌ మామూలుగా నమ్రత కలవాడట కానీ  ఎన్నికల సభల్లో రెచ్చగొట్టేట్లు మాట్లాడతాడు. ఈ ఎన్నికలలో ఇమ్రాన్‌ హామీలు – ఏటా 20 లక్షల ఉద్యోగాలు. 5 ఏళ్లలో తలసరి ఆదాయం 50% పెరుగుదల, ఏటా 2 లక్షల యిళ్లు, 5 ఏళ్లలో 100% అక్షరాస్యత, పేదింటి పిల్లలకు మెట్రిక్‌ వరకు ఉచిత విద్య. ఇవి కాకుండా నవాజ్‌, అతని కుటుంబం అవినీతికి పాల్పడి దొంగిలించుకుని పోయిన 2.3 బిలియన్‌ డాలర్లను వెనక్కి తెస్తానని వాగ్దానం చేశాడు. నవాజ్‌ మోదీ మాయలో పడ్డాడని, పాక్‌ రక్షణకు ముప్పుగా మారాడని ఇమ్రాన్‌ ఆరోపించాడు. అంతేకాదు, ఇండియా ప్రయోజనాలను కాపాడుతున్నాడని కూడా నిందించాడు.

పాకిస్తాన్‌ ఓటర్లలో అధికభాగం 35 సం.ల లోపువాళ్లు. వాళ్లందరికీ ఇమ్రాన్‌పై చాలా ఆశలున్నాయి. కానీ ఇమ్రాన్‌ అంతిమంగా మిలటరీ వాళ్ల బూట్లు పాలిష్‌ చేసేందుకే మిగులుతాడని ప్రతిపక్షాల వెటకారం. ఎన్నికలలో నెగ్గడానికి సైన్యం సహాయం తీసుకోమంటూ 2006లో పిపిపి, పిఎంఎల్‌-ఎన్‌ చార్టర్‌ ఆఫ్‌ డెమోక్రసీ పేర ఒక ఒప్పందం రాసుకున్నాయి. ఇమ్రాన్‌కి అలాటి నిబంధన ఏమీ లేదు. అందుకే కాబోలు సైన్యం సహాయంతో గద్దెనెక్కాడు. స్వతంత్ర భావాలు కనబరిస్తే సైన్యం ఊరుకుంటుందా అని అందరికీ సందేహం. అతని పాలనలో ఏదైనా మంచి జరిగితే ఆ ఘనత సైన్యానికి పోతుంది. చెడు జరిగితే భుట్టో, నవాజ్‌ల సరసన ఇమ్రాన్‌ చేరతాడు.

ఎదర ఉన్నది గతుకుల బాట, ఇమ్రాన్‌ ఎక్కినది అనేక పార్టీల మద్దతుతో తయారైన అతుకుల బండి. ఆ అతుకులు కూర్చినది కూడా సైన్యమే. ఎప్పుడు కోపం వచ్చి శీలలు పీకేస్తుందో తెలియదు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2018)
[email protected]