ఎన్టీయార్ ‘‘శ్రీనాథ’’ సినిమా తీయడానికి నిశ్చయించుకుని బాపు-రమణలను పిల్చారు. తన వయసు రీత్యా శ్రీనాథుడు కవిసార్వభౌముడయ్యే భాగాన్ని సినిమా తీస్తే నప్పదని, శ్రీనాథుని జీవిత ఉత్తరార్థాన్ని తీయాలని రమణగారికి చెప్పారు. అప్పుడు రమణగారు ‘‘తోటరాముడు పైకి ఎదిగి, రాకుమార్తెను పెళ్లాడాడంటే ప్రేక్షకుడికి మజా ఉంటుంది తప్ప, ఉన్నతస్థానంలో ఉన్నవాడు పతనమై పోతే చూడడానికి హుషారేముంటుంది? ఈ సినిమా వద్దండీ’’ అన్నారు. ‘‘సినిమాకు డబ్బు రాకపోయినా ఫర్వాలేదు. మీరు తీయండి.’’ అన్నారు ఎన్టీయార్. ‘‘డబ్బంటే అంత చులకనగా చూడకండి. రూపాయి అంటే మనిషన్నమాట. ఎన్ని రూపాయలు వస్తే అంతమంది జనం చూశారని అర్థం. ఏ కళాకారుడైనా సరే ఆత్మానందం కోసం పని చేస్తూనే, తన సృజన పదిమందికీ చేరాలని తపిస్తాడు. అది జరగకపోతే అతని కృషి వ్యర్థమే కదా’’ అన్నారు రమణ. ‘‘మీరన్నమాట నిజమే, కానీ యీ పాత్ర వేయాలని నాకెప్పటి నుంచో కోరిక. నాకోసం తీసిపెట్టండి.’’ అన్నారు ఎన్టీయార్. ‘‘సరే, మీ యిష్టం’’ అన్నారు బాపురమణలు.
ఈ ఉదంతం రమణగారే నాకు చెప్పారు. ధనం అంటే జనం అనే సిద్ధాంతం నాకు మనసుకు పట్టింది. స్వాతి వీక్లీకి యాడ్స్ వస్తున్నాయి, గ్రేట్ ఆంధ్రాకు యాడ్స్ వస్తున్నాయి అంటే అర్థమేమిటి? వాటిని జనాలు అమితంగా ఆదరించి, చదువుతున్నారు. వాటిలో రాస్తే అత్యధికులకు నా ఆలోచనలు, భావాలు చేరతాయి. అబ్బే, వాటిలో నాకు రుచించని అంశాలున్నాయి అనుకుంటూ నా అంతట నేనే ఒక బ్లాగో యూట్యూబు ఛానెలో పెట్టుకుని లేదా ‘‘రేపటి విద్యార్థి’’ అనే వెబ్‌సైట్‌కు రాసుకుని తంటాలు పడితే నా రచనలకు రీచ్ ఉండదు కదా! అసలలాటిది ఉందని పాఠకులకు తెలియచెప్పడానికే నానా శ్రమా పడాలి, ఎంతో ఖర్చు పెట్టాలి. ఇది అర్థం చేసుకోని కొందరు మీరిక్కడ రాయకండి అంటూ సలహాలిస్తూ ఉంటారు.
ఇటీవలి తెలుగు భారీ సినిమాల వరస చూస్తూంటే మాత్రం ధనం అంటే జనం కాదనే భావన కలుగుతోంది. ఎందుకంటే ఆ సినిమాల కలక్షన్లకు, చూసే ప్రేక్షకులకు లంగరందటం లేదు. ఆరారార్ వెయ్యికోట్లకు పైగా కలక్షన్ చేసిందంటున్నారు. దాన్ని థియేటర్ ప్రేక్షకుల ఫుట్ఫాల్స్గా తర్జుమా చేసి చూస్తే లెక్క కుదరటం లేదు. సినిమా రంగంలో తలపండిపోయిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆరారార్ గురించి చేసిన వీడియో చూశాను. ఆయన ‘ఆ సినిమాకి మొదటి రోజున రూ. 74 కోట్లు ఆదాయం వచ్చింది, ఏడో రోజున రూ. 3 కోట్లు మాత్రమే వచ్చింది.’ అన్నారు. ఆయన వెటరన్ కాబట్టి అంకెలు తప్పు చెప్పి ఉంటారని అనుకోను. ఈ ఏడు రోజుల్లో టిక్కెట్ల రేట్లు తగ్గలేదు. అవే రేట్లు ఉండగా ఆదాయం అంత తగ్గిందంటే అర్థమేమిటి? మొదటి రోజున వందమంది వస్తే ఏడో రోజున నలుగురు వచ్చారనే అర్థం వస్తోంది.
నిజమా!? ఆరారార్‌కు అనుకున్నంత ఆదరణ రాలేదని, అభిమానులూ, ఆత్రం ఉన్నవాళ్లందరూ మొదటి మూడు రోజులు విరగబడి చూసిన తర్వాత హెచ్చు రేట్లు చూసి జడిసిన ఫ్యామిలీ జనాలు పెద్దగా రాలేదని, మామూలు జనం కూడా రావడం తగ్గించారని అన్నారు. మళ్లీ వీకెండ్లోనే ఉగాది సందర్భంగా కాస్త వచ్చారనీ అన్నారు. ఎంత తగ్గినా మొదటి రోజున వచ్చినవారిలో 4శాతం మంది మాత్రమే వచ్చారని అనుకోవడం అసాధ్యం. 300 కెపాసిటీ ఉన్న థియేటరు మొదటి రోజు పూర్తిగా నిండి, ఏడో రోజు వచ్చేసరికి కేవలం 12 మంది మాత్రమే ఉన్నారంటే నమ్మగలమా? ఎక్కడో తేడా ఉంది. సినిమారంగంలో ఉన్న వ్యక్తులను అడిగి చూశాను. వాళ్లు అనేదేమిటంటే, నిర్మాతలు చూపుతున్న అంకెలన్నీ అవాస్తవాలని అనలేము. వాళ్లు చెప్పినట్లు ఐదొందలో, వెయ్యో కోట్లు వాళ్లకు వచ్చి ఉండవచ్చు అన్నారు. అయితే అంకెలు చెప్పేటప్పుడు చిన్న గమ్మత్తు చేస్తారు అన్నారు.
ఆ గమ్మత్తు మొదటి రోజు కలక్షన్ విషయంలో ఉంటుంది అన్నారు. కాస్త విపులంగా చెప్పాలంటే ఒక సినిమాను ఒక జిల్లాలో పంపిణీ చేయడానికి ఒక డిస్ట్రిబ్యూటరు పది కోట్లకు కొన్నాడనుకోండి. అంటే దాని అర్థం, ఆ సినిమా ఆ జిల్లాలో వివిధ థియేటర్లలో పది రోజులో, పదిహేను రోజులో ఆడించడానికి గాను యిచ్చిన మొత్తమది. ఆ మొత్తాన్నంతా మొదటి రోజు కలక్షన్ కింద యీ నిర్మాతలు చూపిస్తారు అని వాళ్లు నాకు వివరించారు. వాళ్లకు డబ్బు వచ్చిన మాట నిజం! డిస్ట్రిబ్యూటరుకు పెట్టుబడి తిరిగి వచ్చిందా లేదా అన్నది వాళ్లకు పట్టని విషయం. ఇదీ అంకెల మాయ!
ఈ వాదన కరెక్టా కాదా తెలుసుకోవాలంటే మొదటి రోజు కలక్షన్లను టిక్కెటు ధర పెట్టి భాగించి చూడాలి. ఒక థియేటరులో వివిధ తరగతులుంటాయి కాబట్టి సీట్ల సంఖ్యను బట్టి సరాసరి ధరను తేల్చవచ్చు. ఆ విధంగా భాగించగా వచ్చిన సంఖ్య సినిమా రిలీజైన థియేటర్లలోని సీట్ల సంఖ్యతో సరిపోవాలి. సరిపోకపోతే వీళ్లు గమ్మత్తు చేసినట్లే లెక్క! నేనీ కసరత్తు చేయలేదు. ఓపికుంటే మీరు చేసి చూడండి. ఈ గమ్మత్తే నిజమని తేలితే ధనమంటే జనం కాదని నిరూపణ జరుగుతోంది. చూసే జనం లేకపోయినా నిర్మాతకు ధనం వచ్చేస్తోంది. మరి ఎవరికి నష్టం? పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటరుకు!
సినిమా ఫెయిలయితే ఆ డిస్ట్రిబ్యూటరు ఆ డైరక్టరు లేదా హీరో తర్వాతి సినిమా తీసుకోడు కదా, మరి ఎందుకు తీసుకుంటున్నాడు? కొనడానికి ఎందుకు ఎగబడుతున్నాడు? అతను తన రిస్కును పదిమంది మీద పంచేస్తున్నాడు. జిల్లాకు కొన్నవాడు ఊళ్ల లెక్కన, ఊరికి కొన్నవాడు థియేటర్ల లెక్కన అమ్మేసుకుంటున్నాడు. అలా సినిమా పంపిణీతో బాటు రిస్కు పంపిణీ కూడా అయిపోతోంది. చివరకి వచ్చేసరికి వ్యక్తిగత నష్టం లక్షల్లో ఉంటోంది. ఇదెలాగూ జూదం లాటిదే కాబట్టి యీ సినిమాలో పోయిన పాతిక లక్షలు, కొత్త సినిమాలో పూడుతుందేమోనన్న ఆశతో ఆ సినిమా కొనడానికి సిద్ధపడుతున్నారు వీళ్లు. లాభం వస్తే ఎలాగూ క్యూలో నిలబడతారు. ఈ వ్యవస్థలో భాగస్వాములైన వారందరూ హ్యేపీయే. వాళ్లకు ఫిర్యాదు లేదు కాబట్టి యీ వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతోంది.
గతంలో సినిమాకు 40 కోట్ల పెట్టుబడి అంటే అబ్బో అనేవారు. అది 60, 80… అలా దాటిదాటి వంద కోట్ల సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో డబ్భయి శాతం హీరో రెమ్యూనిరేషన్కు, 15 శాతం డైరక్టరుకి పోగా, తక్కిన పదిహేను శాతంలో సినిమా చుట్టేస్తున్నారు. అయినా ఇదేమిటి? అని అడిగేవారు లేరు. ఎందుకంటే ప్రేక్షకులు చూసినా, చూడకపోయినా నిర్మాతకు డబ్బు వచ్చేస్తోంది. నష్టాలకు సిద్ధపడిన పంపిణీదారుల ద్వారా అతనికి ఆ డబ్బు చేరుతోంది. ఇక ప్రేక్షకులు ఏమనుకుంటే ఏం పోయింది? విమర్శకులు వాళ్ల పాటికి వాళ్లు రేటింగులు యిచ్చేస్తూనే వుంటారు, పెదవి విరిచే ప్రేక్షకులు విరుస్తూనే ఉంటారు, థియేటర్లు బావురు మంటున్నాయని ఎగ్జిబిటర్లు, క్యాంటీన్లో కొనేవాళ్లే లేరని క్యాంటీను వాళ్లూ దిగాలు పడుతూనే ఉంటారు. అయినా అదే తరహాలో మరో అరడజను సినిమాలు తయారయిపోతూనే ఉంటాయి.
గతంలో ప్రేక్షకుడి తృప్తి కేంద్రంగా సినిమాలు తీసేవారు కాబట్టి, కథ, కథనం, చిత్రీకరణ, వల్లకాడు, వశినాపురం అంటూ తంటాలు పడేవారు. ఇప్పుడు సినిమా అమ్మకం కేంద్రంగా కథ నడుస్తోంది కాబట్టి, ధనానికి, జనానికి మధ్య లింకు తెగిపోయింది కాబట్టి ఆ తంటాలు పడనవసరం లేదు. ఇది బోల్డు ఖర్చు పెట్టి, నభూతో నభవిష్యతి అనే లెవెల్లో తీసిన సినిమా అని డిస్ట్రిబ్యూటర్లను నమ్మించి అమ్మేసుకోగలిగితే చాలు. కథ లేకపోవడమేమిటి, ఫలానా భాషలో హిట్టయిన సినిమా కొనుక్కుని వచ్చాం, దానిలాగానే యిదీ హిట్టవుతుంది అని నమ్మించగలిగితే చాలు. ‘ఆ కథను చితక్కొట్టేసి, రూపుమాపి, డాన్సులు, ఫైట్లు, ఐటం సాంగ్స్‌తో రంగరించి, భారీ లెవెల్లో కొత్త పచ్చడి తయారుచేశాం. ఇవన్నీ పక్కన పెట్టండి ఆ హీరో ఫ్యాన్సే సినిమాను ఆడించేస్తారు. పబ్లిసిటీ ఊదరగొడతాం. ప్రభుత్వాలను బతిమాలి, బెల్లించి, హెచ్చు రేట్లకు అనుమతి సాధిస్తాం. మొదటి మూడు రోజుల్లో ప్రేక్షకుల జేబులు ఊడ్చేసుకుంటే చాలు, మీ పెట్టుబడి మీకు వచ్చేస్తుంది.’ అని నిర్మాత మార్కెటింగు టెక్నిక్ ప్రదర్శిస్తే చాలు, సినిమాకు బిజినెస్ అయిపోతుంది. ఈ ఆటలో ప్రేక్షకాభిప్రాయం అనేది అరటిపండు మాత్రమే! (ఫోటో – థియేటర్లు అప్పుడు, ఇన్సెట్లో యిప్పుడు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)