కరోనా/లాక్ డౌన్ ఛాయలు తగ్గిన తర్వాత పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అన్నీ వరుసపెట్టి థియేటర్ల ముందు క్యూ కట్టాయి. దీంతో పెద్ద సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ లో కూడా 2 పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఒకటి ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తే, ఇంకోటి ఊహించని షాక్ ఇచ్చింది.
తాప్సి లీడ్ రోల్ లో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ఏప్రిల్ బాక్సాఫీస్ షురూ అయింది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్ మొత్తం తాప్సి చుట్టూ తిరిగింది. కట్ చేస్తే, థియేటర్లలో సినిమా మొత్తం పిల్లల చుట్టూ తిరిగింది. అదే ఈ సినిమాకు మైనస్ అయింది. తాప్సి అప్పీల్, చిరంజీవి ప్రమోషన్ కూడా ఏమాత్రం కలిసిరాలేదు. ఇక ఇదే రోజు విడుదలైన సేవాదాస్ అనే సినిమా కూడా ఆడియన్స్ ను ఏప్రిల్ ఫూల్స్ ను చేసింది.
అప్పటికే కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ హవాను తట్టుకొని నిలబడుతుందనే అంచనాల మధ్య వచ్చిన చిత్రం గని. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చింది. నిజంగా కంటెంట్ ఉంటే ఆర్ఆర్ఆర్ తో పాటు ఈ సినిమా కూడా నిలబడి ఉండేది. కానీ అదే మిస్ అయింది. ఏదో పాయింట్ అనుకొని, ఇంకేదో ప్రజెంట్ చేశారు. ఫలితంగా సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమాతో పాటు వచ్చిన కథ కంచికి మనం ఇంటికి, రెడ్డిగారింట్లో రౌడీయిజం, బరి, డస్టర్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.
ఏప్రిల్ మిడ్ లో బీస్ట్, కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమాలు వచ్చాయి. కేవలం 24 గంటల తేడాతో వచ్చిన ఈ సినిమాల్లో బీస్ట్ సినిమా తెలుగులో డిజాస్టర్ అవ్వగా, తమిళనాట విజయ్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై విమర్శలు గుప్పించడం విశేషం. స్క్రిప్ట్ సెలక్షన్ లో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ, విజయ్ పై కోలీవుడ్ లో ఉచిత సలహాలు వెల్లువెత్తాయి.
ఇక బీస్ట్ వచ్చిన 24 గంటల వ్యవథిలో కేజీఎఫ్ ఛాప్టర్-2 వచ్చింది. రిలీజైన మొదటి రోజు మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పార్ట్-1తో ఏర్పడిన అంచనాల్ని పూర్తిస్థాయిలో అందుకొని, ప్రేక్షకుడికి ఫుల్ కిక్ ఇచ్చింది ఈ సినిమా. దీని దెబ్బకు బీస్ట్ సినిమా కోలీవుడ్ లో తప్ప, మిగతా అన్ని ప్రాంతాల్లో మాయమైంది. ఏరియాస్ తో సంబంధం లేకుండా కేజీఎఫ్ ఆడుతోంది. నార్త్ బెల్ట్ లో ఆర్ఆర్ఆర్ ను కూడా ఇది క్రాస్ చేసింది. ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్, మల్లూవుడ్, టాలీవుడ్ లో ఓ మోస్తరు అంచనాలతో తెరకెక్కిన లోకల్ మూవీస్ ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలా కేజీఎఫ్-2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది.
కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ పాతుకుపోవడంతో.. ఏప్రిల్ మూడో వారంలో పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలేవీ మార్కెట్లోకి రాలేదు. అలా ఏప్రిల్ 22న వచ్చిన గ్యాప్ ను కొన్ని చిన్న సినిమాలు క్యాష్ చేసుకోవాలని చూశాయి. బొమ్మల కొలువు, ధర్మపురి, నాలో నిన్ను దాచానే లాంటి సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో ఏవీ నిలబడలేకపోయాయి. పూర్ కంటెంట్ తో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి.
ఇక ఏప్రిల్ నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. రెండు సినిమాలు రిలీజయ్యాయి. అవే కేఆర్కే, ఆచార్య. విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన కేఆర్కే సినిమా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. నయనతార, సమంత ఫాక్టర్స్ ఈ సినిమాకు బొత్తిగా కలిసిరాలేదు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను మలచాలని దర్శకుడు అనుకున్నప్పటికీ.. నయనతార, సమంతలకు నిజజీవితంలో ఉన్న వ్యక్తిగత అనుభవాలు, వ్యక్తిగత ఇమేజ్.. ఈ సినిమాకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.
ఇక ఏప్రిల్ నెలకు ముగింపు పలుకుతూ వచ్చిన ఆచార్య సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి-రామ్ చరణ్ లాంటి ఇద్దరు పెద్ద హీరోలు, కొరటాల శివ లాంటి సూపర్ హిట్ డైరక్టర్ కలిసి చేసిన సినిమాగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా, ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పాతకాలం నాటి కథ, అదే కాలానికి చెందిన నెరేషన్ తో ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని నిద్రపుచ్చింది.
ఇలా ఏప్రిల్ నెలలో మిషన్ ఇంపాజిబుల్, గని, కేజీఎఫ్-2, ఆచార్య లాంటి సినిమాలు అంచనాలతో విడుదలవ్వగా.. వీటిలో కేజీఎఫ్-2 సినిమా కిక్ ఇచ్చింది. ఆచార్య సినిమా అందరికీ షాక్ ఇచ్చింది.