అక్టోబరు 29న కేరళలోని కలమస్సెరి అనే చోట క్రైస్తవంలోని జెహోవాస్ విట్నెసెస్ అనే శాఖకు చెందిన ఓ చర్చిలో 2వేల మంది భక్తులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో రెండు బాంబులు పేలి యిద్దరు మహిళలు, ఒక బాలిక మరణించారు, 50 మంది గాయపడ్డారు. ఇలాటిది వినగానే ఎవరో అన్యమతస్థుల పనే యిది అనుకుంటాం. అయితే యిక్కడ ట్విస్టేమిటంటే బాంబులు పెట్టిన డొమెనిక్ మార్టిన్ అనే వ్యక్తి కూడా క్రైస్తవుడే, పైగా ఆ శాఖకు చెందినవాడే. తనంతట తానే నేరాంగీకార వీడియో సందేశం విడుదల చేస్తూ ‘‘ మా క్రైస్తవ శాఖ ఉపదేశాలు యితర విశ్వాసాల వారిని కించపరుస్తాయి. అవి సమాజానికి హానికరమని తెలిసినా ఏ రాజకీయ పార్టీ కూడా వాటిని ఖండించడానికి భయపడతాయి. అందుకని ఆ ఉపదేశాల పట్ల నిరసన తెలపడానికై నేనే యీ మార్గాన్ని ఎంచుకున్నాను.’ అన్నాడు.
ఇది చాలా వింతగా తోచింది నాకు. సాధారణంగా మనందరం మనం పుట్టిన మతం, కులం, శాఖ, ప్రాంతం, భాష గొప్పవి అనుకుంటాం. ఎందుకు? దానిలో మనం పుట్టాం కాబట్టి! మన దృష్టిలో మనం గొప్పవాళ్లం కాబట్టి, మన మతం వగైరాలన్నీ యావత్ ప్రపంచంలోనే ఉత్కృష్టమైనవి అనే భావనలో ఉంటాం, ప్రపంచంలో ఎన్ని మతాలున్నాయో, ఎన్ని భాషలున్నాయో వాటి వివరాలు కాదు కదా, సంఖ్యయినా తెలియక పోయినా! మరి యీ మార్టిన్ ఏమిటి? తన మతశాఖను అంతలా ద్వేషిస్తున్నాడు? అది అంత దుష్టమైనదా? సాధారణంగా మతాలన్నీ, ఆచరణ మాట ఎలా ఉన్నా, గొప్ప భావాలనే ప్రకటిస్తాయి కదా, మరి దీని ఫిలాసఫీ ఏమిటి? తెలుసుకుందా మనుకున్నాను. నిజానికి నాకు హిందూమతంలో ఉన్న పలు శాఖలలో కొన్నిటి గురించే తెలుసు. ఇక క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం గురించి వాటిలో ఉన్న వర్గీకరణ గురించి తెలియదు.
ఇప్పుడీ సంఘటన జరిగింది కాబట్టి, దీని సిద్ధాంతం ఏమిటి, దాని బోధనల్లో అంత అభ్యంతర కరమైనదేమిటి అని తెలుసుకోవాలనే కుతూహలంతో సమాచారం సేకరించి, నాకు అర్థమైనంత వరకు, సంక్షిప్తంగా మీతో పంచుకుంటున్నాను. తప్పులుంటే చెప్పండి. క్రైస్తవులలో చాలామంది నమ్మే హోలీ ట్రినిటీ (పవిత్ర త్రయం) సిద్ధాంతాన్ని వీళ్లు నమ్మరు. యెహోవా (జెహోవా అని కూడా అంటారు) తండ్రి, యేసు (జీసస్ అని కూడా అంటారు – య, జల మధ్య అభేదం సంస్కృతంలోనే కాదు, వాళ్ల భాషల్లో కూడా ఉన్నట్లుంది) కుమారుడు. వీళ్లిద్దరూ కాక మూడోది హోలీ స్పిరిట్ (పరిశుద్ధాత్మ). ‘ఈ మూడూ విడివిడిగా దేవుడు కాడు, మూడు కలిపితేనే దేవుడు’ అనే సిద్ధాంతం బైబిల్‌లో లేదు. దానిలో దేవుడి ప్రస్తావనే ఉంటుంది. క్రైస్తవం ఏర్పడిన తొలి రోజుల్లో చర్చ్ అనే వ్యవస్థ ఏర్పడి, ‘ఫాదర్స్ ఆఫ్ చర్చ్’ పేర దాని నిర్వాహకులు, పూజారులు ఏర్పడి వాళ్లు యీ పవిత్రత్రయం సిద్ధాంతాన్ని ఏర్పరచారు.
ఈ యెహోవా సాక్షులు యీ సిద్ధాంతాన్ని నమ్మరు. యెహోవా దేవుడు, యేసు దేవుని కుమారుడు, దట్సాల్ అంటారు. చర్చిలో పూజారి వ్యవస్థనే వాళ్లు తిరస్కరిస్తారు. ఇదంతా బైబిల్‌లో లేదంటారు. క్రైస్తవం ఏర్పడిన మొదటి శతాబ్దంలో ఉన్న స్వచ్ఛమైన సిద్ధాంతాలను మాత్రమే తాము నమ్ముతామని, తర్వాత చర్చి పూజారులు చేర్చినవాటిని తాము అంగీకరించమని అంటారు. మొదటి శతాబ్దం తర్వాతి క్రైస్తవులు బైబిల్ బోధనలను సరైన విధంగా అన్వయించటం లేదని, పూజారి వ్యవస్థ తమ చిత్తం వచ్చినట్లు మార్చేసిందని ఆరోపిస్తూ ఛార్లెస్ రస్సెల్ అనే అతను బైబిల్ స్టూడెంట్స్ అనే ఉద్యమాన్ని 1870లో ప్రారంభించాడు. దీని సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి అనుబంధంగా జియాన్ వాచ్ టవర్ ట్రాక్ట్ సొసైటీని 1881లో ప్రారంభించాడు. 1916లో అతని మరణానంతరం నాయకత్వ విషయంలో పోటీ ఏర్పడి, ఉద్యమం చీలిపోయింది. జోసెఫ్ రూథర్‌ఫర్డ్ (1869-1942) అనే అతని చేతికి వాచ్ టవర్ సొసైటీ, దాని ఆస్తులు వచ్చాయి. అతనే 1931లో యీ శాఖకు జెహోవాస్ విట్నెసెస్ అనే పేరు పెట్టాడు. రూథర్‌ఫర్డ్ తర్వాత నాథన్ నార్ అనే అతను అధ్యక్షుడయ్యాడు. అతని తర్వాత యింకో యిద్దరు వచ్చారు.
ప్రస్తుతానికి యీ శాఖకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుయాయుల సంఖ్య 85 లక్షలు. ప్రతీ ఏడూ వీరు నిర్వహించే సమావేశానికి దాదాపు 2 కోట్ల మంది దాకా హాజరవుతారట. న్యూ యార్క్‌లోని కొందరు పెద్దలు (మార్గదర్శులు అనుకుందాం) ఆదేశాల ప్రకారం యిది నడుస్తుంది. కోచిలో యీ శాఖకు 4 వేల మంది అనుయాయులున్నారట. వీళ్లు పవిత్రత్రయ సిద్ధాంతంతో పాటు, ఆత్మ చిరంజీవిత్వాన్ని, నరకాన్ని కూడా నమ్మరు. ఇవన్నీ బైబిల్‌లో లేవంటారు. వాళ్లు అనుసరించే బైబిలు అనువాదం వేరే ఉంది. క్రిస్‌మస్, ఈస్టర్ వగైరా పండుగలను జరుపుకోరు. ఇవన్నీ క్రైస్తవంలో చొరబడిన స్థానిక ఆచారాలని కొట్టి పారేస్తారు. చిన్నప్పుడు చేసే బాప్టిజాన్ని అంగీకరించరు. పెద్దయ్యాక తమ సంస్థలో సభ్యత్వం తీసుకున్నపుడే బాప్టయిజ్ అయినట్లు పరిగణిస్తారు. తమ భావాలను ప్రచారం చేయడానికి యింటింటికి వెళ్లి ‘ద వాచ్‌టవర్’, ‘ఎవేక్’ వంటి ప్రచురణలను పంచుతారు.
క్రైస్తవంలో ఆర్మగెడాన్ ప్రస్తావన ఉంది. న్యూ టెస్ట్‌మెంట్‌లోని ‘బుక్ ఆఫ్ రివీలీషన్’లో దాని గురించి రాశారు. యుగాంతంలో దేవుడి సేనలు, సైతాను సేనలు తలపడే రణక్షేత్రంగా దాన్ని వర్ణించారు. ఆ యుద్ధంలో దేవుడు అప్పటికీ పశ్చాత్తాప పడని పాపులను, క్రైస్తవేతరులను శిక్షిస్తాడని, విశ్వాసులను రక్షిస్తాడని నమ్ముతారు. వీళ్లు ఆ యుద్ధం తప్పక వస్తుందని, భూమిపై జరుగుతున్న అన్ని అన్యాయాలకు, అక్రమాలకు ఆ రోజే పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు. ప్రస్తుతానికి మానవాళి అంతా నైతికంగా పతనమైందని, సైతాను ప్రభావానికి లోనైందని, అందువలన సాధ్యమైనంత వరకు తమ శాఖ విశ్వాసాలతో ఏకీభవించని వారికి దూరంగా ఉండాలని భావిస్తారు. పవిత్రయుద్ధం వచ్చే లోగా ఏ యుద్ధాలలోను పాలు పంచుకోకూడదని వీరి సిద్ధాంతం. అందుకే వీళ్లు ఆయా దేశాల సైన్యాలలో చేరరు. ప్రాణాపాయ స్థితిలోనైనా అన్యుల నుంచి రక్తాన్ని స్వీకరించడానికి ఒప్పుకోరు.
దారి తప్పిన తమ అనుయాయులను సభ్యత్వం నుంచి తొలగిస్తారు. వారితో సంపర్కం పెట్టుకున్న వారినీ బహిష్కరిస్తారు. తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న సాహిత్యాన్ని చదివినవారూ యీ శిక్షకు గురవుతారు. పశ్చాత్తాపం వెల్లడిస్తేనే మళ్లీ చేర్చుకుంటారు. తాము దేవుని రాజ్యానికి చెందుతాం కాబట్టి ఏ యితర రాజ్యపు సార్వభౌమత్వానికి తల ఒగ్గకూడదని వీరి సిద్ధాంతం. దేశాల మధ్య యుద్ధం జరిగితే తాము తటస్థంగా ఉంటామంటారు. ప్రభుత్వంలో ఏ పదవులూ స్వీకరించరు. రాజకీయాల్లో చేరరు. జాతీయవాదాన్ని అంగీకరించరు. తాముండే దేశాల జండాలకు వందనం చేయరు, జాతీయ గీతాలు ఆలపించడానికి నిరాకరిస్తారు. కేరళలో ఈ శాఖను అనుసరించే కుటుంబాల చెందిన ముగ్గురు బడిపిల్లలు 1985లో జాతీయ గీతం ఆలపించడానికి తిరస్కరించారు. దాంతో బడిలోంచి ఆ పిల్లలను తీసివేశారు. వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్లి, కోర్టు ఆదేశం మేరకు వాళ్లను మళ్లీ స్కూల్లో చేర్చుకోవలసి వచ్చింది.
ఇలాటి వ్యవహారశైలి పట్ల జర్మన్ నియంత హిట్లర్ ఎంతగా మండిపడి ఉంటాడో ఊహించుకోవచ్చు. అతను విపరీత జాతీయవాదంతో ‘పితృదేశం జర్మనీ’ గురించి మహా ఊదరగొట్టే రోజుల్లో వీళ్లు మేము నీ రాజ్యానికి చెందము అంటే ఊరుకుంటాడా? పైగా యీ శాఖను అనేక క్రైస్తవ శాఖలు క్రైస్తవంగానే పరిగణించవు. చర్చి పూజా విధానాలను ధిక్కరించే యీ శాఖను యూదు మతానికి అనుబంధంగా పరిగణిస్తారు. క్రైస్తవులకు యూదులంటే ఎంత మంటో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా హిట్లర్ యూదుద్వేషం జగద్విదితం. అందువలన యూదులతో పాటు వీళ్లనూ హింసించాడు. తర్వాత కూడా అనేక దేశాల్లో వీళ్లు హింసకు, దౌర్జన్యానికి గురయ్యారు. వీళ్లు తమ పౌరహక్కుల కోసం న్యాయపోరాటం చేసి సాధించుకున్నారు.
ఈ మతశాఖలో వేపకాయంత వెర్రి ఉన్నట్లు మనలాటి వాళ్లకు తోస్తుంది. చర్చి పూజారుల దురహంకార ధోరణులను, ఆధిపత్యాన్ని ధిక్కరించిన క్రైస్తవ సంస్కరణ వాదులు అనేకులు ఉన్నారు. ఈ సిద్ధాంత స్థాపకుడు రస్సెల్ ధిక్కరణతో ఆగకుండా 1876లో తన వింత సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. వాటి ప్రకారం ‘శిలువపై మరణించిన క్రీస్తు మూడో నాటికి పునర్జీవితుడయ్యాడని క్రైస్తవ పూజారులు చెప్పేది తప్పు. అప్పుడు రాలేదు కానీ 1874లో అదృశ్యాత్మ స్వరూపంలో భూమికి తిరిగి వచ్చాడు. 2520 సం.ల పాపిష్టి యుగం 1914తో పూర్తయి పోయి, ఆ ఏడాది దేవుని రాజ్యం నెలకొల్పబడుతుంది.’ రస్సెల్ 1916 దాకా బతికి ఉన్నాడు కాబట్టి 1914లో తను జరుగుతుందని చెప్పిన అద్భుతం జరగలేదని అర్థమయ్యే ఉంటుంది!
వీళ్ల సిద్ధాంతం ప్రకారం నరకమనేది లేదు. మరణం తర్వాత శరీరంతో పాటు ఆత్మ కూడా నశిస్తుంది. యావన్మంది ప్రాణుల్లో 1,44,000 (ఈ లెక్క ఎలా వేశారో నాకు అర్థం కాలేదు) మంది మాత్రమే స్వర్గానికి వెళతారు. వీళ్లు జీసస్ ఆధిపత్యంలో రాజులుగా, పూజారులుగా వ్యవహరిస్తూ ప్రపంచాన్ని పరిపాలించడంలో సహాయపడతారు. ఆర్మగెడాన్ తర్వాత క్రీస్తు యొక్క వెయ్యేళ్ల పాలన ప్రారంభమౌతుంది. అప్పుడు ఆయన భూమండలాన్ని శుద్ధి చేసి, జనాభాలో తక్కిన వారిలో చాలామందిని పునర్జీవితులను చేస్తాడు. సవ్యంగా ఎలా బతకాలో వాళ్లకు నేర్పుతాడు. వెయ్యేళ్ల పాలన తర్వాత పరీక్ష పెట్టి సరిగ్గా బతికారో లేదో తేలుస్తాడు. 1942లో రూథర్‌ఫర్డ్ వారసుడిగా వచ్చిన నాథన్ నార్ క్రైస్తు వెయ్యేళ్ల పాలన 1975 దరిదాపుల నుండి ప్రారంభం కావచ్చన్నాడు. అది జరగకపోవడంతో జనాల్లో అపనమ్మకం ఏర్పడి, కొత్తగా చేరేవారి సంఖ్య బాగా తగ్గింది.
నార్ బైబిల్‌కు ‘న్యూ వ(ర)ల్డ్ ట్రాన్సలేషన్ ఆఫ్ ద హోలి స్క్రిప్చర్స్’ పేర కొత్త అనువాదం చేయించి 1961లో విడుదల చేశాడు. ఈ శాఖ వారందరూ దాన్నే అనుసరించాలన్నాడు. వారి జీవనవిధానాన్ని నిర్దేశిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు యిస్తూ పోయాడు. సంస్థను చాలా దేశాలకు విస్తరించాడు. 1977లో నార్ మరణించాక పూర్తి అధికారం అధ్యక్షుడి చేతిలో పెట్టకుండా ఒక గవర్నింగ్ బాడీకి అప్పగించారు. 1995లో ఆర్మగెడాన్ యిప్పట్లో జరగదని సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు సభ్యులతో పాటు యితరులు కూడా విరాళాలు యిస్తూ ఉంటారు. న్యూ యార్క్‌లో గల 40 అత్యంత ధనిక సంస్థల్లో యిదొకటి అని న్యూస్‌డే సంస్థ 2001లో ప్రకటించింది. అప్పటికే 950 మిలియన్ డాలర్ల ఆదాయం ఉందట.
ఇదీ క్లుప్తంగా యీ క్రైస్తవశాఖ కథ. తలస్సెరీ చర్చిలో బాంబులు పెట్టిన మార్టిన్‌కు దీనిలో అభ్యంతరకరంగా ఏం తోచిందో స్పష్టంగా తెలియదు. అన్యమతస్తులను చంపే క్రూసేడ్లు నిర్వహించటం లేదు వీళ్లు. అన్యమతస్తులతో కలిస్తే మాత్రం బహిష్కరిస్తామంటున్నారు. తమ సంస్థలో చేసే ప్రసంగాలు దేశద్రోహం కిందకు వస్తాయని, అలాటివి మానమని తను చెప్పినా వినలేదని, యీ సంఘ సభ్యులు దేశానికి ప్రమాదకరమని ఎంచి వాళ్లను చంపానని అతను చెప్పాడు. దేశసార్వభౌమత్వాన్ని అంగీకరించమని వాళ్లు చర్చిలో అంటున్నా, దేశ నియమాల ప్రకారమే నడుచుకుంటున్నారు కదా, పన్నులు కడుతున్నారు కదా, యీ సంఘటన తర్వాత పోలీసులనే పిలిచారు కదా, ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లారు కదా, అన్నిటికి మించి శత్రుదేశాలతో చేతులు కలిపి దేశంపై కుట్ర పన్నటం లేదు కదా. అయినా వారితో విభేదించే హక్కు మార్టిన్‌కు ఉంది, యిలాటిది నాకు వద్దు అంటూ బయటకు పోయే హక్కు ఉంది. కానీ యితరులను చంపే హక్కు, దానికి దేశభక్తి రంగు పులిమే హక్కు మాత్రం లేదు. (ఫోటో సంఘటన జరిగిన చోటు, ఇన్‌సెట్‌లో మార్టిన్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)