తమిళనాట పి ఎ రంజిత్ సినిమాలు అంటే ఓ ఆసక్తి వుంటుంది. సరైన సబ్జెక్ట్ ఎంచుకుని మరీ సినిమాలు చేసే దర్శకుల్లో రంజిత్ ఒకరు. అతగాడి లేటెస్ట్ సినిమా ‘తంగలాన్’. జ్ఙాన్ వేల్ రాజా నిర్మాత. ఈ సినిమా తమిళ టీజర్ విడుదలయింది. తెలుగు టీజర్ కూడా ఈ రోజే విడుదల కాబోతోంది.
టీజర్ లో డయిలాగులు లేవు కనుక తెలుగు.. తమిళ అనే తేడా వుండదు. అసలు తంగలాన్ అనే పదం అంటే అర్థం ఏమిటి అన్నదే ఇంటర్ నెట్ ను కుదిపేసింది. ఆఖరికి తెలిసింది ఏమిటంటే తంగలాన్ అంటే గ్రామ కాపలాదారు అనే దానికి పురాతన పదం అని.
సరే ఇంతకీ పా..రంజిత్ తీసున్న తంగలాన్ కథేంటీ? టీజర్ ఏం చెబుతోంది అంటే… బంగారం నిండిన కోలార్ నేపథ్యంలో అల్లుకున్న కథ. కాపలాదారుల వర్గం, దోపిడీ వర్గం, అనేకానేక నాటకీయ పరిణామాలు అన్నీ కలిపి టీజర్ లో చోటు చేసుకున్నాయి. అస్సలు సినిమాటిక్ వ్యవహారాలకు తావు లేకుండా, అలనాటి ఆంబియన్స్ ను అలా దింపేసారు టీజర్ లో. ఇలాంటి పాత్రలు పోషించడానికి విక్రమ్ ఎప్పుడూ ముందు వుంటారు. అందువల్ల టీజర్ కచ్చితంగా డిఫెరెంట్ లుక్ ను సంతరించుకుంది. కొంచెం రా అండ్ రస్టిక్ లుక్ తో వుంది.
జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. విజువల్స్ కొత్తగా వున్నాయి. మొత్తం మీద టీజర్ ఆసక్తికరంగానే వుంది.