తిరుప‌తిలో అత‌ని వైపే ప‌వ‌న్ మొగ్గు!

టీడీపీ, జ‌న‌సేన పొత్తు కుదుర్చుకున్న నేప‌థ్యంలో సీట్ల పంప‌కాల‌పై చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో  తిరుప‌తిపై జ‌న‌సేన కన్నేసింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం బ‌లంగా వుంద‌ని జ‌న‌సేన న‌మ్మ‌డ‌మే.…

టీడీపీ, జ‌న‌సేన పొత్తు కుదుర్చుకున్న నేప‌థ్యంలో సీట్ల పంప‌కాల‌పై చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో  తిరుప‌తిపై జ‌న‌సేన కన్నేసింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం బ‌లంగా వుంద‌ని జ‌న‌సేన న‌మ్మ‌డ‌మే. గ‌తంలో పీఆర్పీ త‌ర‌పున మెగాస్టార్ చిరంజీవి కూడా ఇక్క‌డి నుంచి గెలుపొందారు. అప్ప‌ట్లో చిరంజీవి రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పాల‌కొల్లు, తిరుప‌తి నుంచి పోటీ నుంచి పోటీ చేయ‌గా, సొంత ప్రాంతం ఆయ‌న్ని అక్కున చేర్చుకోలేదు. కానీ రాయ‌ల‌సీమ ప్రాంత‌మైన తిరుప‌తి చిరంజీవి ప‌ర‌ప‌తిని నిలిపింది.

దీంతో జ‌న‌సేన కూడా తిరుప‌తిపై మ‌మ‌కారం పెంచుకుంది. పొత్తులో భాగంగా జ‌న‌సేన బ‌రిలో నిలిచే స్థానాల్లో తిరుప‌తి ముఖ్య‌మైంది. తిరుప‌తి నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ, ఆయ‌న సుముఖంగా లేర‌ని స‌మాచారం. అయితే జ‌న‌సేన మాత్రం పోటీలో వుంటుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు బ‌లంగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తిరుప‌తి బ‌రిలో ఎవ‌రుంటార‌నే చ‌ర్చకు తెర‌లేచింది.

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్‌గా కిర‌ణ్ రాయ‌ల్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కిర‌ణ్ వ్య‌వ‌హార శైలి సొంత పార్టీ నాయ‌కులెవ‌రికీ న‌చ్చ‌డం లేదు. పైగా అత‌నిపై ర‌క‌ర‌కాల అభియోగాలున్నాయి. మ‌రోవైపు పసుపులేటి హ‌రిప్ర‌సాద్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. మెగా కుటుంబంతో అత‌నికి స‌న్నిహిత సంబంధాలున్నాయి. ప్ర‌ముఖ డాక్ట‌ర్‌గా, నెమ్మ‌ద‌స్తుడిగా హ‌రిప్ర‌సాద్‌కు పేరు వుంది. మంచీమ‌ర్యాద‌లు తెలిసిన నాయ‌కుడిగా జ‌న‌సేన శ్రేణులు ఆయ‌న్ను గుర్తిస్తాయి.

ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాగ‌బాబు గుడ్ లుక్స్‌లో హ‌రిప్ర‌సాద్ ఉన్నారు. తిరుప‌తి ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ విష‌యానికి వ‌స్తే, ఇత‌ను బ‌లిజ కాక‌పోవ‌డం, నోటి శుద్ధి లేక‌పోవ‌డం మైన‌స్ పాయింట్స్‌. మీడియా ముందు రంకెలేయ‌డం త‌ప్ప‌, దాడి చేస్తారంటే వెన‌క్కి తిరిగి చూడ‌కుండా ఎంత దూర‌మైనా ప‌రుగు తీస్తాడ‌ని సొంత పార్టీ వాళ్లు చెబుతున్న మాట‌. గ‌త నెల‌లో  తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన నాగ‌బాబు… తిరుప‌తి ఇన్‌చార్జ్ వైఖ‌రిపై మండిప‌డిన‌ట్టు తెలిసింది.

కిర‌ణ్ రాయ‌ల్ హుందాగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇత‌ర పార్టీల నుంచి ఏ ఒక్క‌రూ జ‌న‌సేన‌లో చేర‌డం లేద‌ని చీవాట్లు పెట్టిన‌ట్టు తెలిసింది. తిరుప‌తి న‌గ‌రం హుందాత‌నం, విద్యావంతులు, అభివృద్ధిని కాంక్షించే వాళ్ల‌ను ఆద‌రిస్తుంది. ఈ కోవ‌లోకి ఏ ర‌కంగా చూసినా కిర‌ణ్ రాయ‌ల్ స‌రిపోడ‌ని జ‌న‌సేన అభిప్రాయం. ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ అయితే తిరుప‌తి న‌గ‌రంలో వైసీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల‌ర‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అటు వైపు వైసీపీ నుంచి భూమ‌న అభిన‌య్ బ‌రిలో ఉండ‌నున్నారు. విద్యావంతుడు, తిరుప‌తి రూపు రేఖ‌లు మార్చిన యువ నాయ‌కుడిగా అభిన‌య్‌కి క్రేజ్ వుంది. అభిన‌య్‌ని ఎదుర్కోవాలంటే డాక్ట‌ర్ అయిన ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ ఒక్క‌డే స‌రైన అభ్య‌ర్థిగా జ‌నసేన అధిష్టానం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో టీడీపీ హ‌యాంలో హ‌రిప్ర‌సాద్‌కు టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పించిన సంగ‌తి తెలిసిందే.

ఇదే హ‌రిప్ర‌సాద్ కాకుండా, కిర‌ణ్ రాయ‌ల్‌కు ఇప్పించి వుంటే… ఈ పాటికి ప‌వ‌న్‌ను, క‌లియుగ దైవాన్ని కూడా అమ్మి వుండేవాడ‌ని తిరుప‌తి జ‌న‌సేన శ్రేణులు అంటున్నాయి. కిర‌ణ్‌కు సొంత పార్టీలో ఇంత “మంచి” పేరు ఉండ‌డాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని, హ‌రిప్ర‌సాద్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలిసింది. జ‌న‌సేన అభ్య‌ర్థి హ‌రిప్ర‌సాద్ అయితేనే అభిన‌య్‌ని ఎదుర్కోగ‌ల‌రు. లేదంటే మ‌రెవ‌రైనా త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అనే చ‌ర్చ తిరుప‌తిలో జ‌రుగుతోంది.