తెలుగు సినిమా రంగంలో మహిళా నిర్మాతలు, దర్శకులు తక్కువ. కానీ ఇప్పుడు అంతా మారింది. మహిళా దర్శకులు పెరుగుతున్నారు. మహిళా నిర్మాతలు కూడా పెరుగుతున్నారు. మరి కొన్నేళ్ల తరువాత టాలీవుడ్ లో మహిళా నిర్మాతల పేర్లు ఎక్కువగా వినిపించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి మెలమెల్లగా వివిధ సంస్థల నుంచి మహిళా వారసులు వస్తున్నారు. అందరికన్నా ముందుగా వైజయంతీ సంస్థ నుంచి స్వప్నదత్ వచ్చారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. మంచి సినిమాలు, మంచి స్క్రిప్ట్ లు అందిస్తున్నారు.
అన్నపూర్ణ సంస్థ నుంచి సుప్రియ యార్లగడ్డ నిర్మాణ రంగంలో వున్నారు. స్టూడియో వ్యవహారాలు చూసుకుంటూనే సినిమాలు, టీవీ సీరియళ్ల బాధ్యతలు చూస్తున్నారు. కృష్ణ కుమార్తె మంజుల గతంలోనే నిర్మాతగా మారారు. తరువాత ఎందుకో ఆగిపోయారు. రెండో కుమార్తె పద్మావతి తన కొడుకు సినిమాలు మాత్రమే నిర్మిస్తున్నారు. నాగశౌర్య తల్లి ఉష కొడుకుతో పలు సినిమాలు నిర్మించారు.
దిల్ రాజు సంస్థ నుంచి హన్సిక రెడ్డి వచ్చారు. ఇప్పటికే ఓ సినిమా అందించారు. మరి కొన్ని సినిమాలు సెట్ మీద వున్నాయి. పేరుకే అయినా త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా వున్నారు. కానీ రాను రాను ఆమె కూడా యాక్టివ్ అవుతారని అంటున్నారు. మ్యాడ్ సినిమాతో నిర్మాత చినబాబు కుమార్తె కూడా నిర్మాతగా రంగంలోకి దిగారు.
పీపుల్స్ మీడియా శర్వానంద్ తో చేస్తున్న సినిమాతో నిర్మాత విశ్వప్రసాద్ కుమార్తె కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆసియన్ సునీల్ కుమార్తె గత మూడు నాలుగు సినిమాల నుంచి బ్యాక్ ఎండ్ లో ట్రయిన్ అవుతున్నారు. ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాతో పూర్తిగా నిర్మాణ నిర్వహణ చేపట్టబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత కూడా ఇప్పటికే నిర్మాతగా మారారు. తండ్రితో భారీ సినిమా ప్రయత్నాల్లో వున్నారు. చిరంజీవి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు కుమార్తె కూడా గీతా సంస్థలో సిఈఓ గా వున్నారు. నిర్మాతగా మారారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని ప్రస్తుతం తండ్రి వెనుకే వున్నారు. త్వరలో నిర్మాతగా మారతారని టాక్ వినిపిస్తోంది.
ఇలా ఒక్కో నిర్మాత నుంచి, సంస్ధ నుంచి మహిళా వారసులు బయటకు వస్తున్నారు. కొన్నేళ్ల తరువాత తెలుగు సినిమాలకు మహిళా నిర్మాతలే ప్రముఖంగా వుండే అవకాశం కనిపిస్తోంది.