ఇటీవలి కాలంలో కమలవికాసం అంటే ఎన్నికల్లో బిజెపి విజయం అనే రూఢ్యర్థం స్థిరపడింది. కానీ తమిళనాడులో వికసించిన కమలం కమలహాసనం. ఎట్టకేలకు కమల్ తెగించి రంగంలోకి దిగాడు. ఇప్పటికే కిక్కిరిసిన తమిళనాడు రాజకీయరంగంలో యీయనెక్కడ యిముడుతాడు అని సందేహాలున్నాయి. వాసన లేని కాగితం పువ్వు అని డిఎంకె, ఎడిఎంకెలు ఎద్దేవా చేశాయి.
కమల్ జనాల్ని పోగేయగలుగుతాడా లేదా, పార్టీ నడిపేటంత శక్తియుక్తులు అతనికి ఉన్నాయా లేదా, పార్టీని కింద నుంచి నిర్మించగలడా? ఓటర్లను బూతులకు రప్పించగల క్యాడర్ తయారు చేసుకోగలడా? తలలు పండిన ద్రవిడ రాజకీయవేత్తలతో కమల్ తూగగలడా? అనే ప్రశ్నలకు రాబోయే రోజులే సమాధానం చెబుతాయి. ఈలోగా అతను తీసుకున్న స్టెప్‌పై ఒక పరిశీలన. మొదటగా చెప్పాల్సింది – రాజకీయశూన్యత ఉన్న విషయాన్ని అతను గ్రహించాడు. గోడ మీద పిల్లి కూడా సిగ్గు పడేట్లా దశాబ్దాలుగా తటస్థంగా ఉన్న రజనీకాంత్‌లా కాకుండా గబగబా నిర్ణయం తీసుకున్నాడు. రజనీ ఎన్నికలకు ముందు దిగుతానన్నాడు.
కమల్ గోదాలోకి దిగడంతో అతని క్యాంప్‌లో కదలిక వచ్చింది కానీ అది యింకా ఆలస్యమైనా ఆశ్చర్యపడవద్దు. అతను యిప్పుడు అనారోగ్యపీడితుడే కానీ స్వభావరీత్యా సందేహపీడితుడు. నిరంతరం లెక్కలు వేస్తూనే ఉంటాడు. కమల్ ధైర్యవంతుడు. కమ్మర్షియల్ ఇమేజికి విరుద్ధంగా అనేక సినిమాలలో నటించాడు, దర్శకత్వం వహించాడు, భిన్నధోరణి సినిమాలు తీసి నష్టపోయాడు కూడా.
తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితేమిటంటే జయలలిత మరణానంతరం ఎడిఎంకె చచ్చుపడింది. రాబోయే ఎన్నికలలో డిఎంకె నెగ్గేట్లు ఉంది. అది ఓటర్లలో కొన్ని వర్గాలకు రుచించడం లేదు. గమనిస్తే డిఎంకె వ్యతిరేక ఓటు ఎప్పుడూ ఉంది. అది కాంగ్రెసుకు వెళ్లేది. ఎడిఎంకెకు జయలలిత నాయకురాలయ్యాక డిఎంకె, ఎడిఎంకె యిద్దరూ చెరో 30-33% తెచ్చుకునేవారు.
అందువలన క్రమేపీ బలహీనపడినా 9-10% ఓట్లు సంపాదించుకుంటున్న కాంగ్రెసు ఎవర్ని సమర్థిస్తే వారు నెగ్గేవారు. తక్కిన వాటిల్లో 5-6% ఓట్లు పిఎంకెకు, 5-6% డిఎండికె వంటి చిన్న పార్టీలకు వెళ్లసాగాయి. ఇవన్నీ ఒక్కోసారి ఒక్కోరితో కలుస్తూ ఉంటాయి. డిఎంకెకు పెద్ద దిక్కు కరుణానిధి. అతనికి ఒక యిమేజి ఉంది. ప్రాణం పెట్టే క్యాడర్ ఉంది. ప్రస్తుతం జీవన్మృతుడిగా ఉన్నాడు. అతని వారసుడు స్టాలినే. సందేహం లేదు. అయితే అళగిరి కొంతమేరకు చీలుస్తాడు. ఇటు జయలలిత లేదు, కాబట్టి ఆమె వారసులు సమర్థులు కాదు కాబట్టి కొన్ని ఓట్లు శశికళ గ్రూపుకి పడినా ఎక్కువ శాతం ద్రవిడ ఓట్లు డిఎంకెకు పడి స్టాలిన్ గెలిచే ఛాన్సుంది.
ఇది ద్రవిడ రాజకీయాలంటే పడని వాళ్లకు కంటగింపుగా ఉంది. ఇటీవలి కాలంలో స్టాలిన్ సమర్థపాలకుడిగా పేరు తెచ్చుకున్నా, యవ్వనంలో అతనికి రౌడీ యిమేజి ఉండేది. మధ్యతరగతి వారు, ఆలోచనాపరులు, అగ్రవర్ణస్తులు స్టాలిన్‌కు ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటే బాగుండునని అనుకుంటారు. ఇది గ్రహించిన బిజెపి ఆ స్థానాన్ని పూరిద్దామని చూసింది. బిజెపి ఎప్పుడూ 2% ఓట్లకు మించి తెచ్చుకోలేదు. మోదీ ప్రధాని అయినా 2016లో కూడా 3% మాత్రమే తెచ్చుకుంది.
ఒక్క సీటూ గెలుచుకోలేదు. ఎడిఎంకెను తనలో కలుపుకుని ఒక్కసారిగా పెద్ద పార్టీ అవుదామని చూసింది. అది కుదరకపోవడంతో బ్యాక్‌సీటు డ్రైవింగ్ చేసింది. మోదీ చెప్పడం బట్టే తాను కాబినెట్‌లో చేరానని పన్నీరు సెల్వం బాహాటంగా చెప్పేశాడు. స్వాభావికంగా ఉత్తరాది పార్టీ ఐన బిజెపి తమ వ్యవహారాల్లో యింతలా జోక్యం చేసుకోవడం తమిళ ఓటరుకు నచ్చే విషయం కాదు. బిజెపి మద్దతుతో రంగంలోకి దిగితే ఫలితం ఉంటుందో లేదోనని రజనీకాంత్ సందేహిస్తూండవచ్చు కూడా. ఏది ఏమైనా రజనీకాంత్ జయలలితకు వ్యతిరేకి. అందువలన ఎడిఎంకె ఓట్లు రజనీకి ఎలాగూ పడవు. అవి ఎటు పోతాయో తెలియదు. వాటిని సేకరించడానికే కమల్ దిగాడనుకోవచ్చు. వాటితో బాటు కాంగ్రెసు వంటి పార్టీలకు పోతున్న ద్రవిడ వ్యతిరేక ఓటుపై కూడా కన్నేశాడనుకోవచ్చు.
పార్టీ ఏర్పరస్తూ తన కంటూ ఒక స్లాట్ ఏర్పరచుకున్నాడు. లెఫ్టూ కాదు, రైటూ కాదు, మధ్యలో ఉంటానన్నాడు. బిజెపికి వ్యతిరేకం అని చాటి చెప్పడానికే మోదీకి మంట పుట్టించే అరవింద్ కేజ్రీవాల్‌ను పిలుచుకుని వచ్చాడు. లెఫ్ట్ భావజాలం పట్ల ఆదరం ఉందని చూపుకోవడానికి పినరాయ్ విజయన్‌కు కలిశాడు. మధ్యతరగతి వారికి, మేధావి వర్గాలకు నచ్చే ఉదారవాది యిమేజి ఎలాగూ ఉంది. అయితే అప్పుడప్పుడు తిక్కవాగుడు వాగుతూ ఉంటాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాన్ని నియంత్రించుకుంటాడేమో చూడాలి.
స్కూలు చదువు లేదు కానీ యితరత్రా బాగా చదువుకున్నాడు. చాలా విషయాలపై అవగాహన ఉంది. రజనీకాంత్ కున్న స్టార్ యిమేజి లేదు కానీ అతని కంటె అనేక విషయాల్లో విషయపరిజ్ఞానం ఉంది. విజయకాంత్ కున్న హార్డ్‌కోర్ ఫాలోయింగ్ లేదు కానీ అతనిలో ఉన్న మొరటుతనం యితనిలో లేదు. పిఎంకెకు కొన్ని ప్రాంతాల్లో వన్నియార్ కులం ఫాలోయింగ్ ఉంది, కానీ వాళ్లూ మొరటువాళ్లే. 1990లలో ఉద్యమం చేపట్టినపుడు వేలాది చెట్లు కూల్చేశారు. ఇప్పటికీ కులకలహాల్లో వాళ్ల పాత్ర ఉంటూ వస్తోంది. కమల్ వాటికి అతీతంగా ఉంటూ వచ్చాడు. రజనీకాంత్‌కు ఉన్న ఫాన్స్ వీరాభిమానులు. అతని పేరు చెప్తే ఆవేశంతో ఊగిపోతారు. కమల్ మొదటి నుంచీ దురభిమానం ప్రోత్సహించలేదు.
కటౌట్లకు క్షీరాభిషేకాల వంటివి నిరుత్సాహ పరుస్తూ వచ్చాడు. వాళ్లను సంఘసేవ చేయమనేవాడు. పైగా అతని యిటీవలి సినిమాల్లో చాలా ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి ఫాన్స్‌లో యువత ఉంటుందనుకోవడానికి లేదు. మిగిలిన మధ్యవయస్కులు, వృద్ధులు. వాళ్లు తమ పాటికి తాము వచ్చి ఓట్లేయవచ్చు తప్ప తక్కిన ఓటర్లను పోలింగు బూతులకు తీసుకుని వచ్చే బాపతు కాదు. ఆ దళాలను నిర్మించుకునే శక్తి కమల్‌కు ఉందో లేదో భవిష్యత్తే చెపుతుంది.
కమల్ తన పార్టీకి పూర్తి తమిళ పేరే పెట్టాడు. 'మక్కళ్ నీతి మయ్యమ్' అని. ఇక్కడి నీతి మన తెలుగు అర్థంలో నీతి కాదు. తమిళంలో న్యాయం అనే అర్థంలో వాడతారు. జడ్జిని మనం న్యాయమూర్తి అంటే వాళ్లు నీతిపతి అంటారు. ప్రజాన్యాయ కేంద్రం అని అనుకోవచ్చు. కరుణానిధి, విజయకాంత్, రజనీకాంత్ వీళ్లందరూ తమిళేతరులే. కానీ కమల్ పచ్చతమిళుడు. (పదహారణాల తెలుగువాడు అన్నట్లు వాళ్లు పచ్చ తమిళన్ అంటారు) తన పతాకంలో ఆరు రాష్ట్రాల సహకారం మాత్రమే చూపించడంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అనే నినాదం చేపట్టడానికి వేదిక సిద్ధం చేసుకుంటున్నట్లుంది.
అంతలోనే ఉత్తరాది వారంటే ద్వేషం లేదని చూపించడానికి కాబోలు దిల్లీ ముఖ్యమంత్రిని పిలుచుకుని వచ్చాడు. ఇటీవల మోదీ సర్కారు 'జనాభా ప్రాతిపదిక' పేరు పెట్టి దక్షిణాది రాష్ట్రాల నుంచి సంపాదించిన ఆదాయం ఉత్తరాదిన ఎలా దోచిపెడుతోందో దక్షిణ రాష్ట్రాల మంత్రులు వెలుగులోకి తెచ్చారు. కేంద్రాన్ని ఎదిరించి ఆ అన్యాయాలను సరిదిద్దుతా అని పల్లవి అందుకుంటే తప్పకుండా కదలిక వస్తుంది. గతంలో ద్రవిడ కళగం 'ద్రవిడనాడు' నినాదంతోనే తమిళులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వారందరికీ పరిచితుడైన కమల్ యీ కాన్సెప్టుతో పక్క రాష్ట్రాల వారిని ఆకర్షించలేకపోయినా కనీసం తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో ఉన్న యితర భాషావర్గాల వారికి నచ్చుతాడు.
కమల్‌కు పాలనానుభవం లేదు. కనీసం ఒక పట్టణానికి మేయరుగా కూడా పనిచేయలేదు. అసెంబ్లీలో, పార్లమెంటులో ఎన్నడూ మాట్లాడి ఎరుగడు. అయినా అది ఒక మైనస్ పాయింటుగా జనాలు అనుకోక పోవచ్చు. ముఖ్యమంత్రి కావడానికి ముందు జయలలితకూ పాలనానుభవం లేదు. వక్తగా పేరుందంతే. అది కమల్‌కూ ఉంది. రాజకీయాల్లోకి వచ్చాక గొంతులో గరగర తగ్గించి, కాస్త అర్థమయ్యేట్లు మాట్లాడుతున్నాడు. మేధావితనం పాలు తగ్గించి, ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకోవాలేమో. ఇక మధురై నుంచి పార్టీ ప్రారంభించడానికి కారణాలంటూ విశ్లేషకులు ఏవేవో చెప్తున్నారు. దేవర్ కులస్తులు అక్కడ ఎక్కువ ఉన్నారని, ''దేవర్ మగన్'', ''విరుమాండి'' సినిమాల ద్వారా వారికి దగ్గరైన కమల్ దాన్ని ఉపయోగించుకుందామని చూస్తున్నాడనీ… యిలాటివి.
నాకైతే నమ్మకం లేదు. మద్రాసు డిఎంకెకు, స్టాలిన్‌కు పట్టుకొమ్మ. అక్కడ సమావేశం పెడితే జనాలు పెద్దగా రాకపోవచ్చు. మధురై అయితే అళగిరి కార్యస్థానం. జనసమీకరణకు అతను సహకరించవచ్చు. పైగా మధురై తమిళులకు రాజకీయ, సాంస్కృతిక కేంద్రం. మద్రాసుది కలగలుపు కల్చర్. అక్కడి తమిళం కూడా శుద్ధమైనది కాదు. మధురైది సెన్‌తమిళ్. అచ్చమైన తమిళుడిగా అప్పుడే చెప్పుకోకపోయినా, దాన్ని సూచించేట్లు మధురైను ఎంచుకుని ఉండవచ్చు. పైగా అతని స్వస్థలం అక్కడకు దగ్గర.
బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమాలు జరిగిన తమిళనాడులో జన్మత: బ్రాహ్మణుడైన కమల్‌ను ఆమోదిస్తారా అనే సందేహం అక్కరలేదు. జయలలిత ముఖ్యమంత్రి కావడంతోనే అలాటి అనుమానాలు పటాపంచలయ్యాయి. 3-4% ఉన్న బ్రాహ్మణ ఓట్లను కమల్ సాధించవచ్చు. తక్కిన కులాల వారిలో కూడా బ్రాహ్మణ వ్యతిరేకతకు కాలం చెల్లింది. బ్రాహ్మణులు ఏదైనా చేస్తే పద్ధతిగా చేస్తారని, తెలివైనవారని, వారిని అనుసరించి పోతే మేలు కలుగుతుందని అక్కడి సాధారణ జనం అనుకోవడం నేను గమనించాను. ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మేవారు కూడా 'ఈ వెంచర్‌లో చాలామంది బ్రాహ్మణులు తీసుకున్నారండీ' అని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు.
అలా అయితే వాళ్లు డాక్యుమెంట్లన్నీ పక్కాగా చూసే ఉంటారు అని కొనేవాళ్లు అనుకోవడం బట్టే వాళ్లు ఆ మాట చెప్తున్నారన్నమాట. ద్రవిడులు తీసుకుని వచ్చిన కుహనా నాస్తికవాదం (వాళ్లు హిందూమతాన్నే విమర్శించారు తప్ప ఇస్లాం, క్రైస్తవం జోలికి వెళ్లలేదు) కూడా మూలపడింది. అప్పుడప్పుడు కరుణానిధి కుటుంబీకులు హిందూమతానికి వ్యతిరేకంగా ఏదో కూసి, అది యింకా సజీవంగా ఉందని చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బిజెపివి మత రాజకీయాలు, రజనీకాంత్‌వి ఆధ్యాత్మిక రాజకీయాలు కాగా కమల్ తను హేతువాదినని చెప్పుకుంటాడు. ఇలాటివి తమిళులు చాలాకాలంగా వింటూనే వస్తున్నారు. అందువలన అది ఓట్లు తెచ్చే లేదే పోగొట్టే అంశం కాకపోవచ్చు. ఇక అవినీతికి వ్యతిరేక పోరాటం వగైరాలు ఎప్పుడూ వినేవే. వాటిపై మాట్లాడడం వేస్టు.
ఇప్పటికే యితర పార్టీ నాయకులుగా వున్నవారిని తన పార్టీలోకి చేర్చుకోకుండా కొత్తవారికి అవకాశమిస్తే, పొత్తులో జోలికి పోకుండా, నాలిక అదుపులో పెట్టుకుని, పొలిటికల్లీ యిన్‌కరక్ట్ స్టేటుమెంట్లు యివ్వకుండా, లౌక్యంగా మాట్లాడగలిగితే కమల్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 15% ఓట్లు పడినా నేను ఆశ్చర్యపడను. అవి ఎన్ని సీట్లుగా తర్జుమా అవుతాయన్నది పార్టీ నిర్మాణం జరిగితే తప్ప, జిల్లా నాయకులు ఎదిగితే తప్ప చెప్పలేం.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]