ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. తెలుగుజాతి, తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వలన తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కూడా అంటున్నారు. అవును కావొచ్చు. చాలా మంది అలాగే అనుకుంటున్నారు. పోరాడుతా అంటున్నారు. శుభం.
కానీ.. గతంలో మరొక పెద్దాయన కూడా ఇలాగే తెలుగు వారి ఆత్మ గౌరవం గురించి మాట్లాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతా అన్నారు. అంతటితో ఊరుకోలేదు. కాపాడారు కూడా! ఆయన మరెవరో కాదు.. ఢిల్లీ సర్కారుకు వణుకు పుట్టించిన, తెలుగు వాడి తడాఖా ఏంటో చూపించిన నందమూరి తారక రామారావు.
అప్పటికీ ఇప్పటికీ కేవలం ముప్ఫయి అయిదేళ్లు గడిచాయి అంతే కదా.. అనుకోకూడదు. అప్పటికీ ఇప్పటికీ పోరాటంలో ఎంత మార్పు వచ్చింది? ‘తెలుగుజాతి ఆత్మగౌరవం’ అని ఎన్టీఆర్ అనేసరికి అది భేరీ నాదం లాగా యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబునాయుడు అంటోంటే రాజీ బేరం లాగా సెట్ చేసేలా ఉంది.
ఈ కేంద్రప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటూ వారు ఇచ్చిన కేంద్ర మంత్రి పదవులు పుచ్చుకుని, అవే మహా ప్రసాదం అని సరిపుచ్చుకున్నారు. ఆ తర్వాత.. ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కునే సరికి.. అప్పటికప్పుడు గండం గడిస్తే చాలు అన్నట్లుగా అదే కేంద్రం ముందు సాగిలపడ్డారు. అమరావతి శంకుస్థాపన కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చి, చెంబెడు నీళ్లు, గుప్పెడు మట్టీ ఇస్తే.. ధన్యోస్మి అంటూ కృతజ్ఞతలు చెప్పారు.
మాకు ఇది కావాలి.. మీరు ఎప్పుడిస్తారు? అని ఆనాడే వేదిక మీదే అడిగి ఉండి ఉంటే…. మాట తీసుకుని ఉంటే… ఇప్పుడు తలచుకుని లాభంలేదు. ప్రత్యేకహోదాను దారుణంగా తుంగలో తొక్కేసి.. వారు ఏంచెబితే అదినమ్మి.. ప్రత్యేకప్యాకేజీ అని ఎగిరెగిరి పడ్డారు. పండగ చేసుకున్నారు. సన్మానాలు చేసుకున్నారు. తీరా రూపాయి రాకపోయేసరికి.. ఇప్పుడు మళ్లీ రంకెలు వేస్తున్నారు.
తెలుగుజాతికి ‘ఆత్మగౌరవం’ అనేది ఒకటి ఉంటే.. దానికి ఇన్ని రకాలుగానూ ఉసురు తీసిన తరువాత.. ఇప్పుడు మళ్లీ ఆత్మగౌరవం పాట పాడుతున్నారు. ప్రత్యేకహోదా కూడా కావాలంటున్నారు. ఇంతకీ.. ఆత్మగౌరవమా.. నీవెక్కడ??
– కపిలముని