ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ తన 95వ యేట మరణించారు. ఆయన గురించి ఏమైనా రాయమని కొందరు కోరుతున్నారు. ఆయన జీవిత విశేషాలు యిప్పటికే పేపర్లలో, ఛానెళ్లలో వచ్చేశాయి. అందువలన వ్యక్తిగత కోణంలో ఒక పాఠకుడిగా ఆయనపై ఉన్న అభిప్రాయం మాత్రం రాస్తాను.
ముందుగా చెప్పుకోవలసినది కులదీప్‌ను అందరూ గౌరవిస్తారు. ఎమర్జన్సీ కాలంలో అరెస్టయిన జర్నలిస్టుగా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కడదాకా ఆయన తన సిద్ధాంతాలకు కట్టుబడ్డాడు. కొసప్రాణం దాకా రాస్తూనే ఉన్నారు. ఆయన కాలమ్స్ దేశంలోని వివిధ పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. 14 భాషల్లో 80 పేపర్లలో వచ్చాయట. అదీ ఆయన డిమాండ్! అయితే నేను చాలాకాలంగా ఆయన రచనలు చదవడం మానేశాను. దానికి కారణం వివరిస్తాను.
మన తెలుగునాట కులదీప్ పేరు ఎక్కువమందికి తెలిసినది – ఎమర్జన్సీ అత్యాచారాలపై ఆయన రాసిన ''జడ్జిమెంటు'' రచన ద్వారానే. ఆ సబ్జక్టుపై వచ్చిన మొదటి పుస్తకం అదే. దాని సక్సెస్ గురించి చెప్పనలవి కాదు. కులదీప్ పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. ఆయన పేరులో వై ఒకటి తక్కువ కావడం చేత కొంతమంది నాయర్ అనేవారు. నాయర్ అంటే మలయాళీ, నయ్యర్ పంజాబీ. ఈయన పంజాబీనే.
నాకు యీయన పేరు ముందే పరిచయం కావడానికి కారణం నెహ్రూ మరణం తర్వాత, లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత కాంగ్రెసులో జరిగిన లుకలుకల గురించి ఆయన రాసిన వ్యాసాలను ''బ్లిట్జ్''లో చదివేవాణ్ని. సిండికేట్ పేరుతో ఏర్పడిన కామరాజ్ నాడార్, మొరార్జీ దేశాయ్, ఎస్ కె పాటిల్, అతుల్య ఘోష్, సంజీవరెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు పదవుల కోసం ఎలా వాదించుకున్నారో, ఎలా తగవు పడ్డారో అన్నీ విపులంగా, కళ్లతో చూసినట్లు రాసేవాడాయన.
దాన్నే 'కీహోల్ జర్నలిజం' అని యీసడించారు కొందరు. సేకరించిన సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా రాయడం అప్పటి జర్నలిస్టుల శైలి. దానికి భిన్నంగా నాటకీయతతో రాయడం ఆయన శైలి. ఆయన ప్రాథమికంగా ఉర్దూ రిపోర్టరు. ఉర్దూ జర్నలిజంలో అలాటి పద్ధతి ఉందేమో తెలియదు. ఏమైతేనేం దానివలన ఆయన నా బోటి పాఠకులకు ఆత్మీయుడై పోయాడు. అబ్బ, లోపల జరిగే సంగతులు ఎంత బాగా చెప్తున్నాడీయన అని అబ్బురపడుతూ చదివేవాణ్ని.
నిజానికి ఆయనకు కేంద్రంలో సోర్సెస్ బాగా ఉండి ఉంటాయి. ఆయన మావగారు భీమ్సేన్ సచార్ కాంగ్రెసు నాయకుడు. 1949లో కొన్ని నెలల పాటు, 1952 నుంచి నాలుగేళ్ల పాటు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి, పార్టీ అంతర్గత కలహాల వలన పదవి పోగొట్టుకుని గవర్నరుగా ఉన్నాడు. 1957-62లో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్నాడు. ఆయన కారణంగా కాంగ్రెసు నాయకులందరూ కులదీప్‌కు పరిచితులై ఉంటారు.
''జడ్జిమెంటు'' రచన తర్వాత ఆయనలో యీ ధోరణి పోయింది. జనతా పార్టీ ఆయనను చాలా ఆదరించడంచేతనో ఏమో కానీ, ఆ పార్టీ లుకలుకల గురించి అంత గొప్పగా రాయలేదు. అవి రాసిన జనార్దన్ ఠాకూర్, వరుణ్ సేన్‌గుప్తా, ఎంజె అక్బర్ వంటి జర్నలిస్టులు చాలా పాప్యులర్ అయిపోయారు.
1980లో కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వచ్చినా కులదీప్‌కు లోపల నుంచి సమాచారం అందడం మానేసిందేమో! ఎందుకంటే ''జడ్జిమెంటు'' పుస్తకంలో ఇందిర, సంజయ్, వారి ముఠా అందరూ విలన్లే. ఎమర్జన్సీ అత్యాచారాలపై విచారణ జరిపిన జస్టిస్ షా కమిషన్‌కు ఆ పుస్తకంలోని సమాచారం చాలా ఉపయోగపడింది. అలాటి జర్నలిస్టుకి అంతర్గత సమాచారం అందించే వాళ్లని కొరత వేయిస్తానని ఇందిర భయపెట్టిందో ఏమో, కులదీప్‌కు లోపలి సంగతులు ఏమీ తెలియడం మానేశాయి.
ఇక ఆయన అఫ్గనిస్తాన్ గురించి, ఆపరేషన్ బ్లూస్టార్ గురించి, భగత్ సింగ్ గురించి, పాకిస్తాన్ గురించి పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. తన కాలమ్‌లో పాకిస్తాన్‌తో మైత్రి, విశ్వశాంతి, సెక్యులరిజం కాపాడవలసిన అవసరం .. యిలాటి సబ్జక్టుల మీదే రాయసాగాడు.
అవన్నీ నాకు బోరు. ఖుశ్వంత్ సింగ్ గానీ, యీయన కానీ లాహోర్‌లో పుట్టారు. పాకిస్తాన్ వ్యవహారాలను నిరంతరం గమనిస్తూ భారత్-పాక్ ప్రజల మధ్య సుహృద్భావం పెరగాలని ఆశిస్తూ, దానికోసం కృషి చేస్తూ ఉంటారు. కానీ యిరుదేశాల నాయకులు తమ స్వార్థప్రయోజనాల కోసం ఆ ద్వేషాన్ని రగిలిస్తూనే ఉంటారు. అందువలన ఆ సబ్జక్టుపై చదవడం టైము వేస్టని నా అభిప్రాయం. అందులో ఆయన వ్యాసాలన్నీ ఎడిటోరియల్స్ స్టయిల్లో లోకంలో అందరికీ సుద్దులు చెప్తూ రాస్తాడు. వీళ్లు చెప్పేదాకా మన పాలకులకు నీతులు తెలియవా? ఏదో చెప్పామన్న సంతోషంతో వీళ్లు చంకలు గుద్దుకోవాలి తప్ప, వాళ్లేమీ చలించరు. అవి చదివి ప్రయోజనం ఏముందనుకున్నాను. పాఠకులకు తెలియని లోపలి సమాచారం చెప్పినంత కాలమే ఆయన రచనలు చదివాను నేను.
ఇక ఆయనకు విపరీతంగా పేరు తెచ్చిపెట్టిన ''జడ్జిమెంటు'' రచన మీద కూడా విమర్శలున్నాయి. దాన్ని ఆయన నిష్పక్షపాత బుద్ధితో రాయడానికి అవకాశం లేదు. ఎమర్జన్సీ సమయంలో ఇందిరా గాంధీ 52 ఏళ్ల కులదీప్నే కాదు, 79 ఏళ్ల ఆయన మావగారు భీమ్సేన్ సచార్‌ను కూడా జైల్లో పెట్టింది. ఎమర్జన్సీ ఎంతకాలం సాగుతుందో ఎవరికీ తెలియని రోజులవి. కులదీప్ కసితో రగిలి ఉంటాడు. బయటకు వస్తూనే పుస్తక రచనకు ఉపక్రమించాడు. 8 నెలల్లో మార్కెట్లోకి తెచ్చేశాడు.
సరైన సమాచారం దొరికే అవకాశం లేదు. ఎమర్జన్సీ టైములో సెన్సార్షిప్ ఉండడంతో సరైన వార్తలు దొరక్కుండా పోయాయి. ప్రభుత్వం కొన్ని వార్తలను అణచివేస్తే, ప్రతిఘటనోద్యమం చేస్తున్న ఆరెస్సెస్, కమ్యూనిస్టులు కరపత్రాలు రహస్యంగా పంపిణీ చేసేవారు. వాటిలో ఎన్ని పుకార్లో, ఏ మేరకు అతిశయోక్తులో ఎవరికీ తెలియదు. వాటిని దగ్గరేసుకుని, నిజానిజాలు వెరిఫై చేసుకునే సమయం లేకుండా కులదీప్ ఆ పుస్తకం పూర్తి చేయాల్సి వచ్చింది.
ఎమర్జన్సీ అత్యాచారాలు ఎన్నో ప్రాంతాల్లో జరిగాయి. అక్కడకు స్వయంగా వెళ్లి పరిశోధించే సావకాశం లేకుండా పోవడంతో అనేక కట్టుకథలు కూడా పుస్తకంలో చొరబడ్డాయి. దానికి తోడు కులదీప్ కీహోల్ జర్నలిజం స్టయిలు ఒకటి. దాంతో కులదీప్ వన్నీ 'ఫైర్‌సైడ్ స్టోరీస్' అంటూ అబూ అబ్రహాం కార్టూన్ వేశాడు. అడవిలో మంట చుట్టూ చేరిన చలికాచుకోవడానికి చేరిన చిన్నపిల్లలను భయపెట్టడానికి ముసలమ్మ దెయ్యాల కథలు చెప్పినట్లు బొమ్మ వేశాడు. తన కిష్టులైన కొంతమంది దుర్మార్గాలను రాయకుండా వదిలేశాడని కొందరు జర్నలిస్టులు ఉదాహరణలు యిచ్చారు.
ఏది ఏమైనా ఎమర్జన్సీ అనంతరం ఆయన హీరో. పాత్రికేయుడు అరుణ్ శౌరీ కూడా మరో రకం హీరో. కానీ ఆయన వెనుక రామ్‌నాథ్ గోయెంకా ఉండి సమాచారం యిచ్చాడని ప్రతీతి. అటువంటి సంస్థాగతమైన మద్దతు ఏదీ లేకుండా సొంతంగా నిలబడిన వ్యక్తి కులదీప్.
నెహ్రూ యుగానికి చెందిన మేధావులందరిలో నెహ్రూని గుడ్డిగా సమర్థించే లోపం ఉంటుంది. కులదీప్ కూడా దానికి అతీతుడు కాడు. తన వృత్తి, తన ఆదాయం మాత్రమే చూసుకోకుండా యిరుగుపొరుగు దేశాలతో మైత్రి గట్టిపడాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని, పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛ పరిఢవిల్లాలని తపించిన మంచివాడు. ఆయనకు యిదే నా నివాళి.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2018)
[email protected]