లతాచే పాడించని హిందీ సంగీతదర్శకుడు లేడన్న కాలంలో ఓపి నయ్యర్ తన ప్రత్యేకత నిలుపుకుంటూ లతాచే పాడించలేదన్న విషయం అందరికీ తెలిసినదే! దానికి కారణం ఏమిటన్న దానిపై చాలా ఊహాగానకచేరీలు జరుగుతూనే ఉంటాయి. మేము ‘‘హాసం’’ నడిపే రోజుల్లో నేను హిందీ నటగాయకుడు కిశోర్ కుమార్ జీవితంపై ‘‘కిశోర్ జీవనఝరి’’ని సీరియల్‌గా రాశాను. అది బాగా నచ్చి గాయకుడు పి.బి.శ్రీనివాస్ గారు 2003 నుంచి ‘‘సప్తస్వర సుందరి లతా మంగేష్కర్’’ పేర సీరియల్ రాశారు. పాఠకుల ఆసక్తిని పెంచడానికి పత్రిక మేనేజింగ్ ఎడిటర్‌గా నేను కొన్ని విషయాలను బాక్స్ ఐటమ్స్‌గా రాసేవాణ్ని. దానిపై కొందరు పాఠకులు తమకు తెలిసిన సమాచారాన్ని పంచుకునేవారు. ఓపి నయ్యర్‌తో పేచీ గురించి నేను రాసినది, దానిపై వచ్చిన స్పందనలు మీతో పంచుకుంటున్నాను.
మొదటగా 2003 అక్టోబరు సంచికలో నేను రాసినది – లతా జీవితచరిత్రను గ్రంథస్తం చేసిన రాజూ భరతన్ వెర్షన్ ప్రకారం, “ఆస్మాన్” సినిమాతో రంగప్రవేశం చేసిన నయ్యర్‌కు రెండేళ్ల తర్వాత “ఆర్‌పార్” సినిమా హిట్ కావడంతో విపరీతంగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. కొంతమంది నిర్మాతలు తాము బుక్ చేసిన ఇతర సంగీతదర్శకులను తొలగించి నయ్యర్‌ను బుక్ చేయసాగారు. “మెహబూబా” అనే సినిమా తీస్తున్న కె. అమర్‌నాథ్ అనే నిర్మాత రోషన్‌ను తప్పించి నయ్యర్‌ను బుక్ చేశాడు. అలాగే ‘‘మంగూ’’ మ్యూజిక్ డైరక్టరుగా మహమ్మద్ షఫీ కూడా తీసివేసి నయ్యర్‌ను పెట్టారు.
ఆ సమయంలో తను, తన సంసారం తిండికి లేక మాడుతున్నామని, అందువల్ల ఈ ఆఫర్లు ఒప్పుకున్నానని నయ్యర్ వాదన. కానీ రోషన్ అంటే అమిత గౌరవాభిమానాలున్న లతా మాత్రం యీ వాదనను నమ్మలేదు, సహించలేదు. తాను రోషన్ దర్శకత్వంలో ఆ సినిమాకై అప్పటికే పాట పాడింది కాబట్టి నయ్యర్‌కు ఛస్తే పాడనని స్టేటుమెంటు ఇచ్చేసింది. అసలే స్వాభిమాన పరుడైన నయ్యర్ మండిపడ్డాడు. “అసలు నేను లతా చేత పాడిద్దామని అనుకుంటే కదా, ఆవిడ ఔననడానికి, కాదనడానికి..” అన్నాడు.
అహం దెబ్బతిన్న లతా సినీ మ్యూజిక్ డైరక్టర్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. అధ్యక్షుడు అనిల్ బిశ్వాస్, తదితర సభ్యులు నయ్యర్‌కు ఎవరూ పాడరాదని ఆదేశించారు. దాంతో నయ్యర్ షంషాద్ బేగమ్‌ను ఆశ్రయించాడు. “నీకేం ఫర్వాలేదు, ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు పాడతాను” అని హామీ ఇచ్చింది షంషాద్. పాడింది, నయ్యర్ పరువు కాపాడింది. ఇక లతాచే జన్మలో పాడించకూడదని నిశ్చయించుకున్నాడు నయ్యర్. అలాగే నెగ్గుకొచ్చాడు.
“మీకు డైరక్టుగా అవమానం జరక్కపోయినా వేరే వారి తరఫున ఇంత అడావుడి చేసి ఒక అప్పుడప్పుడే పైకి వస్తున్న కంపోజర్‌పై కత్తి కట్టడం తగునా?” అని రాజూ భరతన్ లతాను అడిగాడు. దానికి ఆమె సమాధానం “1949లో నేను ఇంకా నిలదొక్కుకోలేదు. “గర్ల్స్ స్కూల్” సినిమాకై అనిల్ బిశ్వాస్‌ను తీసేసి సి. రామచంద్రను పెట్టారు. నేను రామచంద్రకు పాడనని చెప్పాను. ఆయన షంషాద్ చేత పాడించు కున్నాడు. నేనెప్పుడూ ఒకే ప్రిన్సిపుల్‌పై నిలబడ్డాను” అంది లతా.
నయ్యర్ ఆత్మాభిమానం ఎటువంటిదంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు లతా పేర నెలకొల్పిన అవార్డు అతనికి ఇస్తానన్నప్పుడు ఆయన పుచ్చుకో ననేశాడు. అవార్డుతో బాటు లక్షరూపాయల రొక్కం ఇస్తానన్నా కరగలేదు. తనను అడగడానికి వచ్చిన ప్రతినిథితో చెప్పాడు – “కావాలంటే మీ అవార్డుని గీతా దత్ అవార్డు అనండి. నిక్షేపంగా వచ్చి తీసుకుంటాను. కానీ ఓపి నయ్యరేమిటి, లతా పేర అవార్డు తీసుకోవడమేమిటి? నథింగ్ డూయింగ్!”
ఇది ప్రచురించిన మరుసటి సంచికలో విష్ణుభొట్ల ఉదయభాస్కర్ అనే ఆయన ‘గతసంచికలో లతా-ఓపి అంశంపై శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్ రాస్తూ రాజు భరతన్‌ను ‘కోట్’ చేశారు. కానీ నయ్యర్ నాకు స్వయంగా చెప్పినది వేరుగా ఉంది. ఆ సందర్భం పూర్వాపరాలు చెప్పకపోతే విశ్వసనీయత కుదరదు కాబట్టి చెప్తాను. 1976 నుండి కొన్నేళ్లు నేను గుజరాత్లోని జామ్ నగర్లో సిండికేట్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసేవాడిని. అక్కడ పాలిట్యూన్ అనే ఒక సాంస్కృతిక సంస్థ ఆర్నెల్ల కొకసారి హిందీ పాటల ఉత్సవాలు నిర్వహించేది. బొంబాయి నుండి ప్రఖ్యాతులయిన హిందీ గీతకారులను, సంగీతకారులను రప్పించి వారి ఆధ్వర్యంలో లోకల్ కళాకారులచే హిందీ పాటలు పాడించే వారు. ఆ గాయకులలో నేనూ ఒకడిని. ఆ విధంగా అనేకమంది మహానుభావుల ముందు పాడే అవకాశం కలిగింది.
1977లో బొంబాయి వెళ్లి సంగీత దర్శకులను ఆహ్వానించే టీములో నేనూ ఉన్నాను. ఆ సందర్భంలో ఓపి నయ్యర్ గారింట్లో ఒక రోజు ఉండి ఆయనతో అనేక విషయాలు మాట్లాడే అవకాశం చిక్కింది. సహజంగానే లతా విషయం ఆయనను అడిగాను. దానికి ఆయన చెప్పినదిది – “ఆస్మాన్’ చిత్రనిర్మాణం జరుగుతున్న రోజులవి. అనిల్ బిశ్వాస్ స్వరపరచిన నాలుగు పాటలు రికార్డింగు కూడా అయిపోయాయి. ఒక పాట ట్యూన్ విషయంలో నిర్మాతకీ, ఆయనకీ మధ్య అభిప్రాయభేదం వచ్చింది. అసలే నిక్కచ్చి మనిషయిన అనిల్ బిశ్వాస్ ‘నేను పనిచేయలేనని’ తేల్చి చెప్పారు. నిర్మాత మర్నాడు నన్ను పిలిపించి మళ్లీ అన్ని పాటలూ ట్యూన్ చేసి రికార్డు చేయమన్నారు. అన్ని పాటలూ లతావే కావడంతో ఆవిడ కోసం కబురు పంపారు.
ఆవిడ వచ్చి విషయం తెలుసుకుని, అనిల్ చక్కని ట్యూన్స్ చేశారనీ, వాటిని మార్చి మళ్లీ వేరే సంగీత దర్శకుడితో చేయించాల్సిన అవసరం లేదని వాదించారు. నిర్మాత పట్టు విడవక పోవడంతో కోపం వచ్చిన లతా నా సంగీతపరిజ్ఞానాన్ని ప్రశ్నించి ఇకపై నయ్యర్ కెప్పుడూ పాడనని అన్నారు. ఆవేశంతో అన్నమాట కదా మర్చిపోతారని అంతా అనుకున్నారు కానీ అటు లతా కానీ, ఇటు నేను కానీ ఆ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. ఇద్దరమూ కలిసి పనిచేయలేదు. కానీ లతా పాటలంటే నా కిష్టం. ముఖ్యంగా ‘‘బీస్ సాల్ బాద్’’ లోని ‘కహీ దీప్ జలే కహీ దిల్, ‘‘అనుపమా’’ లోని ‘కుఛ్ దిల్ నే కహా’, ‘‘షినాషినాకి బుబ్లా బూ’’ లోని ‘తుమ్ క్యా జానో’ వంటి పాటలు నాకు నచ్చుతాయి. నా ట్యూన్ లన్నా ఆవిడ కిష్టమేనంటారు.” అని ఉదయ్ భాస్కర్ రాశారు.
మా యిద్దరివీ పత్రికలో వచ్చాక సత్తూర్ రాజగోపాల్ అనే ఆయన ఫిబ్రవరి 2004 సంచికలో యిలా రాశారు – ‘ఓ.పి.నయ్యర్ లతాచే ఎందుకు పాడించలేదన్న సంగతి ఎప్పటికీ ఆసక్తి కలిగించే విషయమే! అక్టోబరు 16-31, 2003 సంచికలో ఎమ్బీయస్ ప్రసాద్ గారు రాజు భరతన్ రిఫరెన్స్ ఇస్తూ “మెహబూబా” (1954) సినిమాకై రోషన్ బదులుగా నయ్యర్‌ను నియమించడంతో లతా కినిసి నయ్యర్‌కు పాడనని స్టేటుమెంటు ఇచ్చిందని రాశారు. నవంబరు 1-15, 2003 సంచికలో శ్రీ విష్ణుభొట్ల ఉదయ్ భాస్కర్ గారు “ఆస్మాన్” (1952) చిత్రానికై అనిల్ బిశ్వాస్‌ను తొలగించడం వల్ల తనకు, లతాకు అభిప్రాయభేదం వచ్చిందని నయ్యర్ తనతో స్వయంగా చెప్పారని రాశారు.
నాకు తెలిసిన వివరాలను పాఠకుల ముందుంచుతున్నాను. “ఆర్ పార్” (1954) చిత్రం ‘ఓపి నయ్యర్ వేవ్’ ను సృష్టించడంతో పంపిణీదారుల వత్తిడికి లొంగి నిర్మాతలు అంతవరకు కొన్ని పాటలు రికార్డు చేసిన ప్రముఖ సంగీత దర్శకులను తమ సంగీత దర్శకులను తొలగించి నయ్యర్‌ను పెట్టుకున్నారు. అలా జరిగిన చిత్రాలు, ఒరిజినల్‌గా అనుకున్న సంగీత దర్శకులు, వారు అప్పటికే రికార్డు చేసిన పాటల సంఖ్య యిలా ఉంది. 01. ‘‘మెహబూబా’’ (1954) – రోషన్ – 4, 02. ‘‘మంగూ’’ (1954) – మహమ్మద్ షఫీ – 3, 03. ‘‘బాప్‌రే బాప్’’ (1955) – సి.రామచంద్ర – 3, 04. సబ్ సే బడా రుపయ్యా(1955) – నాషాద్ (నౌషాద్ కాదు, యీయన వేరే) – 4, 05. ఢాకే కీ మల్‌మల్ (1956) – రాబిన్ చటర్జీ – 1.
ఈ ఐదు చిత్రాల్లో ఒక్క “మెహబూబా” చిత్రంలో మాత్రం లతా పాడిన నాలుగు పాటలున్నాయి. అందువల్ల గొడవ వస్తేగిస్తే “మెహబూబా” సినిమా విషయంలోనే రావాలి. అదీ ‘ఓపి నయ్యర్ వేవ్’ విషయంలో నైతే! ఇక “ఆస్మాన్” చిత్రం సంగతి చూడబోతే – అసలు ఈ చిత్రానికి ఒరిజినల్ సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ అని మొట్టమొదటిసారి వింటున్నాము! ఈ మధ్య వివిధ భారతిలో ప్రతి ఆదివారం “దాస్తానే నయ్యర్” అనే సంగీత కార్యక్రమం ప్రసారమవుతూంది. 11-1-2004 నాటి కార్యక్రమంలో ఓపి నయ్యర్ తాను అమృత్‌సర్‌లో వుండగా తన స్నేహితుడు “ఆస్మాన్” చిత్రనిర్మాత ప్రోద్బలంపై తనకు టెలిగ్రామ్ ఇవ్వగా బొంబాయి వచ్చానని అప్పుడు ఆ చిత్రానికి సంగీతం ఇవ్వడానికి ఒప్పందం జరిగిందని చెప్పాడు. ఇక్కడ నయ్యర్ నామమాత్రంగా కూడా అనిల్ బిశ్వాస్ ప్రస్తావన తీసుకు రాలేదు.
కొన్నాళ్ల క్రితం జీటీవీ టివిఎస్ సరిగమా మెగా ఫైనల్ సంగీత కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా పాల్గొన్న ఓపి నయ్యర్ తాను “ఆస్మాన్” చిత్రానికి సంగీతం సమకూర్చే కొత్తలో తనను ఆ చిత్ర గీతరచయిత ప్రేమ్ ధవన్ తన కారులో అనిల్ బిశ్వాస్ గారింటికి తీసికెళ్లి పరిచయం చేయించారనీ తెలిపాడు. ఈ కార్యక్రమానికి నయ్యర్ పాటు అనిల్ బిశ్వాస్, ప్రేమ్ ధవన్, నౌషాద్, కల్యాణ్‌జీ, ఖయ్యామ్, రాజ్‌కుమారి ఇతరులు న్యాయనిర్ణేతలుగా విచ్చేశారు. ఈ సందర్భంలో కూడా నయ్యర్ తన మొదటి చిత్రం “ఆస్మాన్” కు ఒరిజినల్ సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ అని తెలుపలేదు.
ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. “ఆస్మాన్” (1952) కంటే ముందు “కనీజ్” (1949) అనే చిత్రానికి తాను కేవలం పార్శ్వసంగీతం సమకూర్చాననీ, ఆ చిత్రానికి కొన్ని పాటలు స్వరపరిచిన గులాం హైదర్ మధ్యలో పాకిస్తాన్ వెళ్లిపోగా మిగతా పాటలను హన్స్‌రాజ్ బెహల్ స్వరపరిచాడనీ ఓపి నయ్యర్ ఓసారి తెలిపారు. మరి ఉదయ భాస్కర్‌గారిచ్చిన సమాచారం మాటేమిటి? అనుకోకుండా ఓపి నయ్యర్‌గారే పొరబడ్డారా? ఇక్కడ లతా బయోగ్రఫీ రాసిన హరీష్ బిమానీ కథనం గుర్తు చేసుకోవాలి.
‘‘ఆస్మాన్” చిత్రనిర్మాత ప్రోద్బలంపై లతా ఓపి నయ్యర్ సంగీత దర్శకత్వంలో “ఆస్మాన్” చిత్రానికి పాడడానికి అంగీకరించింది. కాని రిహార్సల్ రోజు ఆమెకు చాలా రికార్డింగ్ లున్నందున అవన్నీ పూర్తి చేసుకునేసరికి చాలా పొద్దుపోయింది. నయ్యర్ గారి రిహార్సల్‌కి వెళ్ళలేక పోయింది. మరుసటి రోజు కూడా ఇదే జరిగింది. ఇలా వరుసగా రెండు మూడు రోజులు జరగడంతో నయ్యర్ ఇది అవమానకరంగా భావించి అసలు ఏమి జరిగిందో విచారించకుండా చిత్రనిర్మాత పంచోలీ గారికి గట్టిగా ఫిర్యాదు చేశాడు. అప్పటికే ఈ విషయం గోరంత కొండంతలయింది. దాంతో తరువాత వారిద్దరు కలిసి పనిచేయడానికి వీలుపడలేదు.’ ఈ విధంగా జరిగిందని లతా తనతో చెప్పినట్లు హరీష్ బిమానీ రాశారు.
“ఆస్మాన్” చిత్రంలో ఆడగొంతుకలో మొత్తం ఐదు పాటలున్నాయి. వీటిలో నాలుగింటిని గీతా దత్ పాడగా మిగతా ఒక పాటను (‘మొహే నిందియా చురా లేగయా’) అప్పటి ప్రఖ్యాత గాయని రాజ్‌కుమారి పాడింది. ఈ పాట చాలా కష్టతరమైనదనీ, మొదట లతాను దృష్టిలో పెట్టుకొని ఈ పాటను స్వరపరచడం జరిగిందని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రాజ్‌కుమారి తనకీ విషయాన్ని చెప్పినట్లు హరీష్ బిమాని రాసారు. బిమానీ రాసిన దాంట్లో నిజముందని పిస్తుంది. సయీ పరాంజపే తీసిన “సాజ్” (1997) సినిమా ఓపీ – ఆశా- లతాల నిజజీవితాలను ఆధారం చేసుకుని తయారయిందని వార్తలు వచ్చిన సందర్భంగా లతా ఇంటర్వ్యూ కూడా ఒకటి “డక్కన్ క్రానికల్”లో కిరణ్మయి పేరిట ప్రచురితమైంది.
ఇందులో “నయ్యర్‌కి మీరెందుకు పాడలేదు?” అనే ప్రశ్నకు లతా ఇచ్చిన సమాధానం – “కుదరలేదు! ఒకసారి రికార్డింగ్ కూడా నిశ్చయమైంది. కాని వీలుపడలేదు.” మరి “లతాచే ఎందుకు పాడించలేదు?” అనే ప్రశ్నకు నయ్యర్ ఇవేమీ ప్రస్తావించడు. “లతా గొంతు సుతి మెత్తగా, సున్నితంగా వుంటుంది. నా సంగీతం సమ్మోహపరిచే విధంగా, సెడక్టివ్‌గా వుంటుంది. అందుకని ఆమె గొంతు నా సంగీతానికి సరిపడదు” అంటాడు.
సుమారు 75 చిత్రాల్లోని అయిదారు వందల ఓపి పాటల్లో ఒక్క పాటకు కూడా అతని సంగీతానికి లత కంఠం సరిపోదా!? ఒకటేమిటి, నా దృష్టిలో యాభైకి మించిన పాటల్లో సరిపోతుంది! మచ్చుకి ‘బోలో పర్దేసియా’ (‘‘మంగూ’’), ‘ఛోటాసా బాల్‌మా’ (‘‘రాగిణీ’’), ‘రాతోంకో చోరీచోరీ’ (‘‘మొహబ్బత్ జిందగీ హై’’), ‘మై సోయా అఖియా మీచే’ (‘‘ఫాగున్’’) – ‘అకేలీ హూఁ మై పియా ఆ’ (‘‘సంబంధ్’’). “ఆస్మాన్”లో రాజ్‌కుమారి పాడిన ‘మొహే నిందియా చురా లేగయా’ గురించి చెప్పనే అక్కరలేదు.
నయ్యర్ లతా చేతనే కాదు, పూర్ మాన్స్ లతా అని పిలుచుకునే సుమన్ కల్యాణ్‌పూర్ (లతా, రఫీ ఘర్షణ కొనసాగుతున్నప్పుడు ఎస్.డి. బర్మన్, శంకర్-జైకిషన్ వంటివారు రఫీతో యుగళ గీతాలకు, సోలో గీతాలకు లతాకు బదులు సుమన్ కల్యాణ్‌పూర్‌ను వాడుకున్నారు) చేత కూడా పాడించడం మానేశాడు. “ఆర్ పార్” చిత్రంలో గీతా, రఫీతో బాటు ‘మొహబ్బత్ కర్‌లో జీ భర్‌లో’ అనే పాటలో సుమన్ కల్యాణ్‌పూర్ ఒకే ఒక చరణం పాడుతుంది. ఈ చరణం సినిమాలో మాత్రమే వుంటుంది. కాని రికార్డుపై లేదు. కాని “ఆర్ పార్” తరువాత ఓపి సుమన్ కల్యాణ్‌పూర్‌తో ఎప్పుడూ – ఆశాతో విడిపోయిన తర్వాత కూడా – పాడించలేదు.
కారణాలేమైనా, వీరిద్దరు కలిసి పనిచేయకపోవడానికి కారణం ఇగో ప్రాబ్లెమ్ అనిపిస్తుంది. వీరిద్దరూ ఒకరి ప్రతిభ ఇంకొకరు గుర్తించడమే కాక ప్రశంసిస్తారు కూడా. అయినా కలిసి పని చేయలేదు. దానివల్ల వారిద్దరిలో నష్టపోయిందెవరన్న ప్రశ్న నాబోటి వారిని బాధిస్తుంది. ఒకసారి విఎకె. రంగారావు గారిని అడిగితే ఆయనన్నారు – “ఇద్దరూ కాదు. నష్టపోయిందల్లా సంగీత ప్రియులూ, శ్రోతలూ!” – అని సత్తూరు రాజగోపాల్ గారు రాశారు.
లతా వీరాభిమాని ఐన సుభాష్ కె. ఝా అనే సినీ జర్నలిస్టు ‘‘టైమ్స్‌నౌ’’లో వ్యాసం రాస్తూ ‘‘ఆస్మాన్’’ సినిమా రికార్డింగుకి లతా వెళ్లకపోవడమే కారణమని ధృవీకరించాడు. లతాయే ఆయనతో చెప్పిందట – ‘అవేళ నేను రికార్డింగుకి వెళ్లవలసినదే, ఎందుకో గానీ వెళ్లలేక పోయాను. బహుశా ఆయనకు కోపం వచ్చి ఉంటుంది, మళ్లీ పిలవలేదు. అది మంచికే జరిగింది. ఆయన మంచి మ్యూజిక్ డైరక్టరే కానీ ఆయన స్టయిల్ నాకు నప్పదు.’’ అంది. డా. మందర్ వి బిచ్చూ అనే ఆయన కిచ్చిన యింటర్వ్యూలో ఓపి ‘‘లతా, నేనూ కలిసి పని చేయకపోయినా ఆవిడ నం.1 సింగరని అనడానికి నాకు ఏ సందేహమూ లేదు. తన స్థానానికి చేరాలని ఆశా గట్టిగానే ప్రయత్నించింది, కానీ సాధించలేక పోయింది.’’ అన్నాడని సుభాష్ అదే వ్యాసంలో రాశారు.
ఇదంతా చదివాక లతా-ఓపిల పేచీ రికార్డింగుకి హాజరు కాకపోవడం వలన వచ్చింది తప్ప యితర మ్యూజిక్ డైరక్టర్ల తరఫున లతా పోరాడడం వలన వచ్చిందని అనుకోవడానికి లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2024)
Call boy jobs available 9989793850
vc available 9380537747