రామాయణం రామపట్టాభిషేకంతో పూర్తయింది, లవకుశుల కథ ఉత్తర రామాయణంలో ఉంది. ఉత్తర అంటే 'తర్వాతి' అని అర్థం. రామాయణం అయిపోయాక జరిగిన కథ అంటూ వాల్మీకి శిష్యుడైన భరద్వాజుడు రాశాడని చెప్పబడే ఉత్తరకాండలో ఉంది. వాల్మీకి రాసినది ఆరు కాండలే వాటిలోని భాషకు, ఏడోదైన ఉత్తరకాండలో భాషకు తేడా ఉందట. నేను తెలుగు అనువాదమే చదివినా మొదటి ఆరు కాండలకు, ఉత్తర కాండలకు ఉన్న శైలీభేదం స్పష్టంగా తోచింది. త్రివేణి పబ్లిషర్స్ వారు వేసిన వాల్మీకి రామాయణంలో యుద్ధకాండం వరకు శ్రీనివాస శిరోమణి గారు అనువదించగా, ఉత్తర కాండం యామిజాల పద్మనాభస్వామిగారు అనువదించారు. మొదటి ఆరు కాండలలో వర్ణనలు అవీ చాలా ఉంటాయి. ఉత్తర కాండ మటుకు అడావుడిగా, చుట్టేసినట్లుగా, పెద్దగా ఉపమానాలు అవీ లేకుండా, ఏదో ఒక రిపోర్టు రాసినట్లు ఉంటుంది.. కావ్యలక్షణాలు కూడా కానరావు.
పైగా యీ భాగం కూడా రాసినది వాల్మీకే అని చెప్పాలనే ప్రయాస కనబడుతుంది. అంతే కాదు, సైజులో చిన్నది కూడా. నిజం చెప్పాలంటే ఉత్తర.. అని పేరు పెట్టినా దాన్ని రామాయణ పూర్వగాథతో నింపారు. అంటే రావణాసురుడి కథ చాలా ఉంటుంది. ఉత్తర రామాయణాన్ని యథాతథంగా తెలుగులోకి అనువదించిన తిక్కన గారి ''నిర్వచన ఉత్తర రామాయణం'' (మధ్యమధ్యలో వచనం లేకుండా మొత్తమంతా పద్యాల్లో చెప్పారు కాబట్టి నిర్వచన.. అన్నారు) 11 ఆశ్వాసాలుంటే దానిలో పూర్వ రామాయణం కథ 7 టిలో ఉత్తర రామాయణం కథ 4టిలో సరిపోయింది.
రామాయణంలో పురుషోత్తముడిగా వెలిగిపోయిన రాముడు ఉత్తర రామాయణానికి వచ్చేసరికి మాసిపోతాడు. రావణసంహారం తర్వాత ఆమె అగ్నిప్రవేశం చేస్తానంటే వారించనందుకే మనసు చివుక్కుమంటుంది. ‘సీత నాకు ఛాయ వంటిది. మంచి స్నేహితురాలు’ అని చెప్పినవాడు యిదేమిటి యిప్పుడిలా.. అనిపిస్తుంది. గత చరిత్ర చూసి 'తన గురించి కాదు, ప్రజల గురించి అడిగివుంటాడులే' అని సరిపెట్టుకుంటాం. కానీ ఉత్తరకాండలో ఒక సామాన్యుడి మాట విని, ఏ విచారణా జరపకుండా, ఆమెను సంజాయిషీ కూడా అడగకుండా అడవుల్లో వదిలివేయడం ఘోరాతిఘోరం అనిపిస్తుంది. ఆరు కాండల అసలు రామాయణంలో లాజికల్‌గా మాట్లాడే రాముడి కారెక్టరుకి, ఉత్తర కాందలో ఇల్లాజికల్‌గా ప్రవర్తించిన రాముడికి చాలా తేడా కనబడుతుంది.
వాలి వంటి వానరుడికి సైతం సంజాయిషీ చెప్పిన రాముడు, సీతకు కారణం కూడా చెప్పకుండా అడవుల్లో వదిలేయ మంటాడా? ఫెమినిస్టులకు, రామవిమర్శకులకు రాముడు లోకువ అయినది సీతాపరిత్యాగంతోనే! ఆ ఘట్టమే నాకు నమ్మబుద్ధి కాదు. ఎందుకు వదిలేశాడు అంటే అందరూ చెప్పే సమాధానం – ‘ప్రభువు ప్రజావాక్యానికి కట్టుపడక తప్పదు కాబట్టి రాజుగా రాముడు తనకు అప్రియమైనదైనా ఆ నిర్ణయం తీసుకున్నాడు.’ అని. మొదటగా అడగాల్సింది, అది ప్రజాభిప్రాయం ఎలా అయింది? ఎవరో కొందరు (‘‘లవకుశ’’ సినిమాలో ఒకడు అన్నట్లు చూపించినా, ఉత్తర కాండలో లోకులు అనుకుంటున్నట్లు రాశారు) ఏదో కూసినంత మాత్రాన యావన్మంది ప్రజలు అలా ఆరోపింనట్లు అర్థమా? పోనీ పోచికోలు కబుర్లు కూడా గౌరవించేటంత సంస్కారి రాముడు అనుకుంటే, ఆరోపణ చేసినవాళ్లను పిలిపించి మాట్లాడినట్లు ఎక్కడా రాయలేదే! సీతమీద వచ్చిన అపవాదుపై పంచాయితీ ఏర్పాటు చేసి, దాన్ని బట్టి శిక్ష వేసి వుంటే పోయి వుండేదిగా.
సీతను చెర విడిపించాక ‘నేను నా గౌరవాన్ని కాపాడుకోవడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి యుద్ధం చేశాను. నువ్వు రావణాసురుడి యింట్లో చాలాకాలం ఉన్నావు. నిన్ను చూస్తూ అతను ఓర్చుకుని ఉండడు. నీ మీద నాకు ఆసక్తి లేదు, నీ యిష్టం వచ్చిన చోటికి. ఎవరి దగ్గరకైనా వెళ్లు.’ అని బహిరంగంగా సైనికులందరి ముందూ చెప్పినవాడికి భార్యను పబ్లిగ్గా బోనులో నిలబెట్టి విచారణ చేయడానికి సంకోచం ఏముంటుంది? ఆ విచారణలో ఆమెది తప్పు ఉన్నట్లు తేలి దేశబహిష్కార శిక్ష వేసి వుంటే ఆమె ఎక్కడికి కావాలంటే అక్కడికే వెళ్లి ఉండేది. పుట్టింటికి వెళ్లేదేమో! భార్య పట్ల బాధ్యత వదుల్చుకున్నవాడు హక్కు కూడా వదులుకోవాలిగా, అడవుల్లోనే విడిచి రమ్మనడానికి యీయన కేమి హక్కు? తర్వాతైనా సీత అడవుల్లో ఏమయిందో వాకబు చేసినట్టు లేదు. పోనీ పెళ్లాం మీద మనసు విరిగిపోయిందనుకున్నా, గర్భిణిగా పంపాను కదా, పిల్లా జెల్లా ఎవరైనా పుట్టారేమో చూద్దామన్న కుతూహలం కూడా కనబరచలేదు.
రాముడు ఒక్కడే కాదు, తక్కిన వాళ్ల ప్రవర్తనా వింతగానే ఉంది. ‘అడవుల్లో విడిచి రమ్మంటున్నావు, రావణాసురుడి బంధుగణంలో ఎవరైనా మిగిలి వున్నవాళ్లు సీతమీద కసి తీర్చుకుంటారేమో, అడవులంటే వాల్మీకి మాత్రమే ఉండడు కదా, రాక్షసులుండే ప్రదేశం కదా.’ అని లక్ష్మణుడు భయం వ్యక్తం చేసినట్టూ రాయలేదు. ఇక హనుమంతుడు! ఆవిడ లంకలో వుండగా ‘రా తల్లీ, నా భుజాన ఎక్కించుకుని రాముడి వద్దకు చేరుస్తాను’ అంటూ ప్రాధేయపడిన అతడు సీత అడవులకు వెళ్లిపోతే ఏమీ పట్టించుకోలేదు. కనీసం అడవుల్లో ఓ రౌండు కొట్టి సీతామ్మవారు ఏమైందో చూసినట్టు కూడా రాయలేదు. (‘‘శ్రీరామరాజ్యం’’ సినిమాలో రమణ గారు హనుమంతుడు పిల్లకోతి రూపంలో వచ్చి ఆశ్రమంలో ఉంటూ వీరిని కాపాడినట్లు కల్పించారు) ఇలా రామాయణంలో ఉన్న పాత్రలన్నీ ఉత్తర కాండకు వచ్చేసరికి భిన్నంగా ప్రవర్తించాయి. శంబూకవధ కూడా నమ్మడానికి వీల్లేదని చాలా మంది విజ్ఞులు వాదిస్తారు. అందుకే నేను ఉత్తర కాండను విశ్వసించను. పురుషోత్తముడై, రామో విగ్రహవాన్ ధర్మః అనిపించుకున్న వాడు యింత అసంబద్ధంగా వ్యవహరిస్తాడంటే పొసగదు.
నా అభిప్రాయం మాట ఎలాగున్నా, తరతరాలుగా సీతాపరిత్యాగం గురించి, లవకుశుల గురించి కథలు వినబడుతూనే ఉన్నాయి. అనేక కళారూపాల ద్వారా మనకు చేరుతూనే ఉన్నాయి. కానీ వాటిల్లో తేడాలున్నాయి. ముందుగా ఉత్తర కాండ ఏం చెప్తోందో చూద్దాం. సీత గర్భవతి అయిన తర్వాత కొంతకాలం వనాలకు వెళ్లి వద్దామని ముచ్చట పడింది. రాముడు సరే అన్నాడు. ఆ రోజు సభా భవనానికి వెళ్లి హాస్యకారుల హాస్యోక్తులు వింటున్నాడు. వారిలో భద్రుణ్ని రాముడు ప్రత్యేకంగా నా గురించి ప్రజలు అనుకునే మంచీచెడ్డా రెండూ చెప్పు అని అడిగాడు.
అప్పుడు భద్రుడు ‘‘విపణి వీధుల్లో, దేవాలయాలలో, తోటలలో, పేటలలో, పల్లెల్లో, పట్టణాలలో నీ విజయగాథలు కీర్తిస్తూనే ‘రావణుడు ఎత్తుకుని పోయిన భార్యను తెచ్చుకుని, నిశ్చింతగా భోగాలను అనుభవించడం ఆశ్చర్యంగా ఉంది. రాజే సిగ్గూఎగ్గూ లేక కాపురం చేస్తున్నాడు కాబట్టి మనమూ అదే త్రోవను నడవాలన్నమాట’ అనుకుంటున్నారు.’’ అని చెప్పాడు. తిక్కన గారి అనువాదం ప్రకారం భద్రుడు హాస్యగాడు, గూఢచారి కాదు, నర్మసచివుడు. త్రాగుబోతు రజకుడు అన్నాడు అనేది ఎలా పుట్టిందో నాకు తెలియలేదు. ఈ అపవాదు విన్నాక రాముడు సీతను వదిలిపెట్టాలని నిశ్చయించుకుని ‘నా వలన ఇక్ష్వాకు వంశానికి అపకీర్తి వస్తోంది. అపవాద భయం చేత నేను ప్రాణతుల్యమైన సీతను విడవగలను. లక్ష్మణా, రేపు ఉదయం సుమంత్రుడు సారథిగా నువ్వు సీతను గంగానది ఆవలి గట్టుకి తీసుకుని పో, అక్కడ తమసానది గట్టున ఉన్న వాల్మీకి ఆశ్రమం వద్ద విడిచి పెట్టి రా!’ అన్నాడు.
ఈ ఉత్తర రామాయణం 7 వ శతాబ్దం వాడైన భవభూతి రాసిన 'ఉత్తర రామచరితం' అనే సంస్కృత నాటకం ద్వారా బాగా పాప్యులర్ అయింది. ఆయన చాలా మార్పులు చేశాడు. ఆయనకు థీమ్ ఎక్కడ దొరికిందిరా అంటే పద్మపురాణంలో జైమిని భారతంలో వుందిట. అది తీసుకుని ఈయన నాటకానికి అనువుగా అనేక డ్రమటిక్ ట్విస్టులు పెట్టేసి రాసేశాడు. వనవాసానికి వెళ్లాలని సీతకు కోరిక పుట్టడానికై కారణం ఓ చిత్రకారుడు గీసిన వనవాసం చిత్రాలు చూడడం అని ‘‘లవకుశ’’ సినిమాలో పెట్టిన ఘట్టం భవభూతి కల్పన నుంచి తీసుకున్నదే! ఆ నాటకం మొదటి అంకంలో అప్పటి దాకా జరిగిన సంఘటనలను ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పడానికి ఓ ఆర్టిస్టు వచ్చి రామాయణంలో జరిగిన కథను బొమ్మలు గీసి చూపించినట్టు దృశ్యం పెట్టేడు.
‘‘లవకుశ’’ సినిమాలో రాముడి అశ్వమేథయాగం గురించి తెలియగానే సీతాదేవికి అనుమానం వచ్చింది. భార్య లేనిదే యాగం చేయలేడు కదా, మరొకర్ని పెళ్లి చేసుకున్నాడేమోనని. మూర్ఛపోయింది. వాల్మీకి విషయం గ్రహించాడు. ఆమె మీద మంత్రజలం చల్లి ఆమె ఆత్మ అయోధ్య వెళ్లేట్లు చేశాడు. అక్కడ సీత బంగారు విగ్రహాన్ని చూసింది. ఆ విగ్రహం నుదుటన చంద్రవంక దిద్దింది. వాళ్లిద్దరికీ మాత్రమే తెలిసిన చంద్రవంక గురించి ఆ సినిమా మొదటి సీన్లలోనే ఎస్టాబ్లిష్ చేశారు. విగ్రహం నుదుట బొట్టు చూడగానే రాముడు అనుమానించాడు. 'సీతా, సీతా' అంటూ కలవరించాడు. ఉత్తర కాండలో లేని యీ ఘట్టానికి మూలం ఉత్తర రామచరితం నాటకంలో కనబడుతుంది. సీత అదృశ్య రూపంలో పంచవటిలో రాముణ్ని కలవడం, సేద దీర్చడం.. యిలాటివి నాటకకర్త కల్పించిన మెలోడ్రమటిక్ ఘట్టాలు.
రాముడు తన పిల్లలతో ఎలా కలిశాడు అనే దానిలో చాలా మార్పులు జరిగాయి. ముందుగా ఉత్తర కాండలో ఏముందో చెప్తాను. వాల్మీకి కుశలవులకు రామాయణ గాథ నేర్పించాడు. గోమతీ తీరంలో నైమిశారణ్యంలో రాముడు అశ్వమేధ యాగం జరిగే చోటుకి తనకు ఆహ్వానం వస్తే వీరిని వెంటపెట్టుకుని వెళ్లాడు. ‘ఈ ప్రాంతంలో అన్ని చోట్లకు వెళ్లి నేను నేర్పించిన రామాయణ గాథను జనంలో వ్యాప్తి చేయండి. ఒకవేళ రాముడు పిలిపించి వినిపించమంటే ఆయన ఎదుట పాడండి. మీరు ఎవరు అని అడిగితే వాల్మీకి శిష్యులం అని చెప్పండి.’ అన్నాడు. అనుకున్నట్లే రాముడు పిలిచాడు. వీళ్లు పాడారు. డబ్బివ్వబోతే పుచ్చుకోలేదు. రాముడు చాలా రోజులు వాళ్ల చేత పాడించుకుని విని, వాళ్లు సీతాపుత్రులు అని గ్రహించాడు. (వాల్మీకి ఆశ్రమం వద్ద విడిచి పెట్టమని లక్ష్మణుడికి చెప్పాడు కదా, వీళ్లు వాల్మీకి శిష్యులమని చెప్తున్నారు. వయసు కూడా సరిపోతోంది.. యీ కారణాలతో కాబోలు)
దూతలను వాల్మీకి వద్దకు పంపించి ‘‘సీత సత్ప్రవర్తన కలదైతే, ఏ విధమైన కళంకం లేనిదైతే యిక్కడకు వచ్చి ఆత్మశుద్ధిని ప్రకటించాలి. నాకు తన వలన వచ్చిన లోకాపవాదాన్ని పోగొట్టడం కోసం రేపు ఉదయం వచ్చి సభలో శపథం చేయాలి.’’ అని చెప్పించాడు. (ఈ పని సీతపై అపవాదు వినగానే చేసి ఉంటే యింత ‘రామాయణం’ జరిగేదే కాదు). వాల్మీకి సరేనన్నాడు. సీతను వెంటపెట్టుకుని మర్నాడు వచ్చాడు. ‘రామా, సీత సువ్రత. ఈ కవలలు నీ పుత్రులు. ఈమె సౌశీల్యవతి అనే నా మాట అబద్ధమైతే నా తపోఫలితం నాకు చెందకుండా పోతుంది.’ అన్నాడు. అప్పుడు రాముడు ‘సీత పునీత అని నాకు తెలుసు. కానీ ఏమి చేసేది? లోకవిశ్వాసం కోసం ఆమె తన సౌశీల్యాన్ని సభామధ్యంలో ప్రకటించాల్సిందే.’ అన్నాడు.
అప్పుడు సీత సభలోకి వచ్చి ‘మనసా, వాచా, కర్మణా రాముణ్ని తప్ప వేరొకణ్ని నేను ఎరుగను అనే మాట సత్యం అయితే భూదేవి నాకు తనలో ప్రవేశాన్ని కలిగించుగాక’ అంది. అప్పుడు సభాస్థలంలో ఒక దివ్య సింహాసనంపై కూర్చుని భూదేవి వచ్చి సీతను రెండు చేతులతో తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని సింహాసనంతో సహా రసాతలానికి వెళ్లిపోయింది. రాముడు రోదించాడు. భూదేవిపై కోపగించుకున్నాడు. తనను కూడా సీతతో పాటు తీసుకు పొమ్మనమని అర్థించాడు. ఇలా రాముడు శోక, క్రోధాలతో ఊగిపోతూండగా బ్రహ్మ వచ్చి శాంతింప చేశాడు. సీత నాగలోకానికి వెళ్లి సుఖంగా ఉంది. స్వర్గంలో నిన్ను కలుసుకుంటుంది అని చెప్పాడు. రాముడు ఊరడిల్లాడు. కొంతకాలానికి ఉత్తర కుశలవులకు పట్టాభిషేకం చేసి, తను సరయూ నదిలో మహాప్రస్థానం చేశాడు.
క్రీ.శ. 4-5 శతాబ్దాలకు చెందిన కాళిదాసు తన ‘రఘువంశం’లో 15 వ సర్గలో లవకుశుల ఉదంతం గురించి రాసినప్పుడు కూడా యిలాగే రాశాడు. అయితే క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందిన భవభూతి రాముడు కుశలవులను కలుసుకునే ఘట్టం యింత చప్పగా ఉంటే లాభం లేదనుకుని, సామాన్య ప్రజలు చూసే నాటకం రక్తి కట్టాలంటే యింకా కొన్ని సీన్లు పెట్టాలనుకుని మూలకథకు చాలా మార్పులు చేసేశాడు. ఆయన తర్వాత 600 ఏళ్ల తర్వాత వచ్చిన తిక్కన గారు ఆ మార్పులు పక్కన పెట్టి ఉత్తర రామాయణాన్ని యథాతథంగా అనువదించారు. 16వ శతాబ్దానికి చెందిన తులసీదాసు రాసిన ‘రామచరిత మానస్’లో లవకుశుల కథే లేదు. ఆయన యుద్ధకాండను ‘లంకా కాండ’ అన్నాడు. ఉత్తర కాండ అని రాశాడు కానీ దానిలో రామ పట్టాభిషేకం గురించి రాసి, తక్కినవేవో రాశాడు. సీతా పరిత్యాగం గట్రా లేవు.
భవభూతి కథనం ప్రకారం దుర్ముఖి అనే గూఢచారి వచ్చి రాముడికి లోకులు అనుకుంటున్నది చెప్పాడు. రాముడు లక్ష్మణుడితో సీతను విడిచి పెట్టి రమ్మనమని చెప్పాడు. లక్ష్మణుడు విడిచి వెళ్లిపోయాక సీత ప్రసవవేదన భరించలేక దుఃఖంతో గంగలో పడింది. గంగ, భూదేవి ఆమెను రసాతలానికి తీసుకుని వెళ్లారు. కవలలను ప్రసవించింది. స్తన్యం విడిచాక ఆ పిల్లలను గంగ వాల్మీకికి అప్పగించింది. రాముడు శంబూకవధకై పంచవటికి వెళ్లినపుడు, ఆ సంగతి తెలుసుకుని గంగ సీతను వెళ్లి గోదావరి చూసిరా అని పంచవటికి పంపించింది. నా మహిమ చేత అదృశ్యంగా ఉంటావని చెప్పింది.. పంచవటిని చూసి రాముడు గతంలో సీతతో తాను విహరించిన విషయాలు గుర్తుకు తెచ్చుకుని రాముడు విరహంతో మూర్ఛిల్లాడు. అదృశ్యంగా ఉన్న సీత రాముడి హృదయస్థానాన్ని తాకింది. ఆ స్పర్శను గుర్తించిన రాముడు సీత కోసం మరింత పరితపించాడు. విడివిడిగా ఉన్నా, సీతారాముల మధ్య ప్రేమ ఉందని భవభూతి చూపించాడు.
తర్వాతి అంకంలో జనకుడు వాల్మీకి ఆశ్రమానికి వస్తున్నాడని తెలిసి, సీతను గురించి దుఃఖంలో ఉన్న అతన్ని పరామర్శించడానికి కౌసల్య, అరుంధతి అక్కడకు వచ్చారు. ఆశ్రమ ప్రాంగణంలో జనకుడితో మాట్లాడుతూండగానే లవుడు అక్కడకు వచ్చాడు. అతనిలో సీతారాముల పోలికలు చూసి నువ్వెవరు అని అడిగితే ‘వాల్మీకి తప్ప నాకెవరూ తెలియదు’ అన్నాడతను. తన అన్న కుశుణ్ని వేరే పనిపై వాల్మీకి పంపాడని చెప్పాడు. ఇంతలో తక్కిన వటువులు వచ్చి గుఱ్ఱం వచ్చింది చూద్దాం రా అని లవుణ్ని పిల్చుకుని పోగా పెద్దవాళ్లు వాల్మీకిని చూడడానికి లోపలకి వెళ్లారు.
గుఱ్ఱాన్ని చూసి లవుడు యిది మేధీ అశ్వం అన్నాడు. పక్కనున్న సైనికులు దర్పంగా యిది రాముడిది అన్నారు. లవుడికి పౌరుషంతో గుఱ్ఱాన్ని పట్టించి లోపల పెట్టి సైనికులపై విల్లు ఎక్కుపెట్టాడు. సైన్యానికి బాసటగా వచ్చిన లక్ష్మణుడి కుమారుడు చంద్రకేతువు లవుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. లవుడు రాముడి పరాక్రమంలో దోషాలు ఎంచాడు. ఇంతలో రాముడు వచ్చాడు. లవుణ్ని చూశాడు. ఇద్దరికీ ఆత్మీయతాభావం కలిగింది. రాముడు లవుణ్ని కౌగలించుకున్నాడు. కుశుడూ వచ్చాడు. అతనిలో కూడా సీత పోలికలు చూసి రాముడు జరిగినది ఊహించుకున్నాడు. వాల్మీకి రామాయణం మీరు చదివారా? అని అడిగితే కొన్ని శ్లోకాలు చదివారు. జనకాదులు ఆశ్రమం నుంచి తిరిగి వస్తూంటే రాముడు వెళ్లి వాళ్లను పలకరించాడు.
అప్పుడు వాల్మీకి సీతా పరిత్యాగం తర్వాత ఏం జరిగిందో వివరిస్తూ తను రాసిన కావ్య నాటకరూపాన్ని ప్రదర్శింప చేశాడు. సీత గంగలో దుమకడం, భూదేవి రాముణ్ని తిట్టడం, గంగ అది రాజధర్మమని భూదేవికి నచ్చచెప్పడం, పిల్లల కోసమైనా బతకమని తల్లి సీతకు చెప్పడం, పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యాక వాల్మీకి అప్పగించడం, చివర్లో సీత భూదేవితో సహా రసాతలానికి వెళ్లిపోవడం అన్నీ నాటకంలో చూసి రాముడు విలపించి విలపించి మూర్ఛపోయాడు. అప్పుడు గంగా నది నుంచి గంగ, భూదేవి, సీత బయటకు వచ్చి సీతను అరుంధతికి అప్పగించారు. ఆమె ఆజ్ఞతో సీత రాముణ్ని తాకింది. రాముడు స్పృహ తెచ్చుకుని సిగ్గుపడ్డాడు. అరుంధతి సీత అతి పవిత్రురాలని ప్రకటించింది. ప్రజలందరూ ఆమోదించారు. సప్తర్షులు పుష్పవృష్టి కురిపించారు. వాల్మీకి కుశలవులను సీతారాములకు అప్పగించాడు. ఈ విధంగా భవభూతి నాటకాన్ని సుఖాంతం చేశాడు. సీత భూగర్భంలోకి వెళ్లిపోవడాన్ని నాటకంలో ఘట్టంగా చూపించి, అక్కణ్నుంచి కథను తిప్పేశాడు.
గమనించవలసిన దేమిటంటే వీళ్లెవరూ లవకుశులు రామసోదరులతో, రాముడితో యుద్ధం చేసినట్లు రాయలేదు. ఉత్తర కాండలో లవుడు ఒక్కడూ లక్ష్మణుడి కొడుకుతో యుద్ధానికి దిగాడని మాత్రం ఉంది. ఆ యుద్ధం కూడా పూర్తవదు. చంద్రకేతువు రథం ఎక్కి పోరాడదామంటే అడవుల్లో తిరిగే మాకు రథాయుద్ధం రాదని లవుడు బదులిచ్చాడు. ఇంతలో రాముడు వచ్చి లవుణ్ని అక్కున చేర్చుకున్నాడు. కానీ నాటక కర్తలెవరో కానీ డ్రామా పండాలంటే లవకుశులకు, రాముడికి యుద్ధం పెట్టి తీరాల్సిందే ననుకున్నారు. చిన్నపిల్లలు రాముడి సైన్యాన్ని ఓడించారంటే బలే హుషారుగా వుంటుంది కదా!
అందువల్లనే ఈ యుద్ధ ఘట్టాలు నాటకాల్లోకి, సినిమాల్లోకి వచ్చాయి. ‘‘లవకుశ’’ సినిమా ప్రకారం తక్కినవాళ్లందరూ ఓడిపోవడంతో రాముడు రంగంలోకి దిగి, చివర్లో తిరుగులేని రామబాణాన్ని ప్రయోగించే సమయానికి హనుమంతుడు సీతామ్మవారిని యుద్ధరంగానికి తీసుకు వచ్చాడు. సీతను చూడగానే రాముడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు 'జానకీ దేవీ' అంటూ సీతాదేవికి నమస్కరించాడు. లవకుశులకు తాము ఫలానా అని తెలిసింది. రాముడు మూర్ఛతేరి తండ్రిని మించిన తనయులని, తన పిల్లల్ని మెచ్చుకున్నాడు. సీతను అయోధ్యకు రమ్మనమని లక్ష్మణుడు కోరాడు. కానీ సీత నా కలాటి ఆశలేమీ లేవంటూ తల్లి భూదేవిని పిలిచింది. భూమి చీలి సీత లోపలకి వెళ్లిపోయింది. 'సీతా, సీతా' అని ఆక్రోశిస్తూ రాముడు బయటే వుండిపోయాడు.
రాముడు వంటి గొప్ప రాజు కొడుకులు వీధిగాయకులు కావడంలో గొప్ప మెలోడ్రామా ఉంది. ఏదైనా కావ్యాన్ని గానం చేస్తూ జనాల మధ్య ప్రచారం చేస్తూ తిరగడం అనేది ఓ కళ. ఆ కళాకారులను బార్డ్స్ అంటారు. ఇలియడ్ రాసిన హోమర్ కూడా అలాటి వాడేట. బెంగాల్లో ఈ కళ యిప్పటికీ నశించిపోలేదు. బావుల్ అంటారు వాళ్లని. వాల్మీకి ఆదేశంతో కుశలవులు రామాయణగాథను ప్రచారం చేసినప్పుడు తాము పాడేది తమ కుటుంబగాథేనని వాళ్లకు తెలియదు పాపం. కుశలవుల తర్వాత ఆ ప్రక్రియకు బాగా పేరు వచ్చి, యికపై అక్కణ్నుంచి అలా పాడేవాళ్లని కుశీలవులు అనసాగారట.
రాముడి తర్వాత కుశుడు దక్షిణ కోసలకు రాజయ్యాడు. కుశస్థలి అనే నగరాన్ని నిర్మించి రాజధానిగా ఏలాడు. జరాసంధుడు మధురానగరం కాల్చేసిన తర్వాత కృష్ణుడు అక్కడికి వెళ్లి ఉన్నాడు. యాదవులకు యిది కొంతకాలం ముఖ్యపట్టణంగా వుంది. కుశుడు ఓ సారి సరయూ నదిలో స్నానం చేస్తూ వుంటే అతని బాహువుకి పెట్టుకున్న ఆభరణం నదిలో పడిపోయింది. అది రాములవారు యిచ్చినది. ఎలా పోయిందాని విచారిస్తే కుముదుడనే సర్పరాజు ఎత్తుకుపోయి వుంటాడని అన్నారు. కుశుడు వెతుక్కుంటూ వెళ్లి అతన్ని చంపడానికి గరుడాస్త్రం ఎక్కు పెట్టాడు. కుముదుడు భయపడి ఆ కేయూరాన్ని తిరిగి యివ్వడమే కాదు, కుముద్వతి అనే తన చెల్లెల నిచ్చి వివాహం చేశాడు. తర్వాతి యుగంలో ఉలూచి అర్జునుణ్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు మనిద్దరి జాతులు వేరు అంటాడు. అప్పుడు ఆమె 'ఇదివరకు కుశుడు మా జాతి కన్య కుముద్వతిని చేసుకున్నాడుగా' అని పాయింటు లాగింది. లవుడు ఉత్తర కోసలకు రాజై, శ్రావస్తి అనే రాజధాని నిర్మించాడు. ఇదీ కుశలవుల కథ.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2023)