ఆ పార్టీ తిరుప‌తి వ్య‌తిరేకి

ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన హిందూ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుప‌తి అభివృద్ధికి టీటీడీ ఒక శాతం నిధుల్ని కేటాయిస్తూ ఇటీవ‌ల పాల‌క మండలి తీర్మానం చేసింది. దీన్ని హిందువుల ప్ర‌తినిధి రాజ‌కీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ వ్య‌తిరేకిస్తోంది.…

ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన హిందూ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుప‌తి అభివృద్ధికి టీటీడీ ఒక శాతం నిధుల్ని కేటాయిస్తూ ఇటీవ‌ల పాల‌క మండలి తీర్మానం చేసింది. దీన్ని హిందువుల ప్ర‌తినిధి రాజ‌కీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ వ్య‌తిరేకిస్తోంది. అయితే బీజేపీ అభివృద్ధి నిరోధ‌క విధానాల‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ విధానాల‌ను తిరుప‌తి సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వందవాసి నాగరాజు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. తిరుప‌తి అభివృద్ధిని కాంక్షించ‌డంతో పాటు అభివృద్ధికి అడ్డంకిగా మారిన బీజేపీ విధానాల‌ను ఆయ‌న తూర్పార ప‌ట్టారు. సీపీఎం నాగ‌రాజు త‌న పార్టీ విధానాల్ని తెలియ‌జేస్తూ రాసిన వ్యాసం ఇది.

భారతీయ జనతా పార్టీ తిరుపతి లాంటి ధార్మిక క్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తే తల్లడిల్లిపోతోంది. ఇన్నాళ్లు టీటీడీ నిధులు దేశమంతటా వెల్లువలా తరలిపోతుంటే బీజేపీ నోరు తెర‌వ‌లేదు. అలాంటి  బిజెపి, తిరుపతి నగరానికి ఒక్క శాతం నిధులు కేటాయిస్తుంటే ఎందుకంత అల్లాడిపోతున్నదో అర్థం కావడం లేదు.

తిరుపతి నగరం అభివృద్ధి కావడం అంటే టీటీడీ అభివృద్ధి చెంద‌డమే. తిరుపతి నగరం ఎంత విస్తరిస్తే టీటీడీకి అంత లాభదాయకం.

పెరటాసి మాసంలో రెండు లక్షల మంది భక్తులు కొండమీద కొస్తే నిర్వహించలేక అధికారులు, యంత్రాంగం భీతిల్లిపోయిన వాస్తవం కళ్ళ ముందే వుంది. తిరుపతి నగరంలో సాంస్కృతిక, అధ్యాత్మిక, వినోదాత్మక  కార్యక్రమాలు పెరగాల్సిన అవసరాన్ని  ఈ ఘటన సూచిస్తోంది. అభివృద్ధి, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు అవ‌సరమైన ప్రాథమిక చర్యలు చేపట్టక ముందే బిజెపి ఈ  ప్రయత్నాలను నిరోధించాలనుకోవడం సిగ్గుచేటు.

సైన్స్ సిటీకి నిధులు కేటాయిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు కనీసం పట్టించుకోక పోవడం ఏంటి? బిజెపి నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తిరుపతి అభివృద్ధికి తోడ్పడే ప‌లు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. స్మార్ట్ సిటీ నిధులు మున్సిపాలిటీలకు ఇస్తున్న రుణమే కానీ వారి దయాదాక్షిణ్యం కాద‌ని గుర్తించుకోవాలి.

స్మార్ట్ సిటీ నిధులు తిరుపతికి ప్రత్యేకంగా విడుదల చేయలేదు. దేశ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చారన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలి. తిరుపతి పై ప్ర‌త్యేక ప్రేమ ఒలకబోస్తున్న బీజేపీ నాయకులు ఆ ఆధ్మాత్మిక క్షేత్రానికి  అదనంగా ఇచ్చింది ఏమైనా ఉందా?

తిరుమల లడ్డు, ప్రసాదాలపై, టీటీడీ కాటేజీలపై  జీఎస్టీ భారం మోపుతున్న బిజెపి నేతలకు తిరుమల, తిరుపతి గురించి మాట్లాడే అర్హత లేదు. కమ్యూనిస్టులు అధికార పార్టీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని చేస్తున్న విమర్శ అర్ధరహితమైంది. తెలుగుదేశం, వైసీపీ, జనసేనలతో అపవిత్ర  బంధాన్ని బిజెపి ఏ పద్ధతిలో సాగిస్తున్నదో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.

ప్రజా సమస్యలపై పాలక పార్టీలతో పోరాడుతున్నది, కేసులు పెట్టించుకుంటున్నది, ఇబ్బందులు పడుతున్నది… ఎవరో తిరుపతి ప్రజలకు తెలియంది కాదు. టీటీడీ చట్టానికి వ్యతిరేకంగా తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని  అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.. చట్టానికి లోబడే ఈ నిధులు కేటాయించిన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. తిరుపతికి టీటీడీ కేటాయించే నిధులు శాశ్వతం కావాలి. అది చట్ట రూపంలో రావాల‌నేది సీపీఎంగా మా డిమాండ్‌.

వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి