Advertisement

Advertisement


Home > Movies - Reviews

Bhagavanth Kesari Review: మూవీ రివ్యూ: భగవంత్ కేసరి

Bhagavanth Kesari Review: మూవీ రివ్యూ: భగవంత్ కేసరి

చిత్రం: భగవంత్ కేసరి
రేటింగ్: 2.25/5
తారాగణం:
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్, ఆర్ శరత్ కుమార్, రఘుబాబు తదితరులు
కెమెరా: రాం ప్రసాద్
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: తమన్
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల: 19 అక్టోబర్ 2023

అనీల్ రావిపూడి సినిమా అనగానే కామెడీ గుర్తొస్తుంది. బాలకృష్ణ సినిమా అనగానే హీరోయిన్స్, పాటలు, అంతులేనంత అతిశయోక్తి కళ్లముందు కనిపిస్తాయి. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే కాస్త అది, కాస్త ఇది ఊహించడం సహజం. 

ఎంతో కొంత కొత్తదనం, కూసింత ఒరిజినాలిటీ కూడ ఆశించడం జరుగుతుంది. ట్రైలర్ ను బట్టి ఇందులో కామెడీ కంటే యాక్షన్ డామినేట్ చేసినట్టు అర్ధమవుతుంది. పాటలు పెద్దగా బయటికి రాలేదు. 

ఆ విధంగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ కటౌట్ సగటు బాలకృష్ణ సినిమా టైపులో కనిపించకపోయినా కంటెంట్ ఎలా ఉందో చెప్పుకుందాం.

నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) గతంలో ఒక పోలీస్ ఆఫీసర్. ప్రత్యర్ధులతో (అర్జున్ రాంపాల్ వర్గం) పోరాటంలో భాగంగా అతను పెద్ద హింసాకాండ చేసి జైల్లో పడతాడు. ఆ జైలర్ (శరత్ కుమార్) కి ఈ కేసరి అంటే అభిమానం. ఆగష్ట్ 15 న సత్ప్రవర్తన కేటగరీలో కేసరిని విడుదల చేస్తాడు. అనుకోకుండా ఆ జైలర్ యాక్సిడెంటులో పోతే అతని కూతురు విజ్జి (శ్రీలీల) ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. ఆమెని ఆర్మీ ఆఫీసర్ చెయ్యాలన్నది తండ్రి కోరిక. ఆ కోరిక నెరవేర్చేందుకు కేసరి కంకణం కట్టుకుంటాడు. ఇంతకీ విజ్జి ఆర్మీ ఆఫీసర్ అవుతుందా? ఆమెకు ఎదురయ్యే చాలెంజులేంటి? ఈ లోగా విలన్ ఏం చేస్తాడు అనేది కథ. 

ఈ సినిమా చూస్తుంటే మొదట కలిగే ఫీలింగ్ ఇంకా అనీల్ రావిపూడి "సరిలేరు నీకెవ్వరు" నాటి ఆర్మీ హ్యాంగోవర్ నుంచి బయటికి రాలేదేమో అని. ఆ వెంటనే కలిగే ఫీలింగ్ "దంగల్" ని చూసాక వచ్చిన ఇన్స్పిరేషన్ ని ఇక్కడ దింపుకున్నాడా అని! 

అయినా ఓకే. 

ఆడియన్స్ రెండు రకాలుంటారు...

- ఎంత కమెర్షియల్ సినిమాలోనైనా కొద్దో గొప్పో సెన్స్ ఉండాలని కోరుకునే వారు 

- సెన్స్, లాజిక్ లేకపోయినా ఎమోషనల్ మేజిక్ వర్కౌట్ అయితే చాలు అనుకునే వారు.

ముఖ్యంగా రెండో రకం ఆడియన్స్ వల్లే స్టార్ హీరోల సినిమాలు ఆడతాయి. హీరోల ఫ్యాన్స్ కూడా ఈ బ్రాకెట్ లోనే ఉంటారు.

వీరిలో మొదటి రకం ఆడియన్స్ కి కావాల్సిన సెన్స్ అస్సలు లేదు. జైల్లో బకెట్ ఫైటింగ్ కానీ, వందలమందిని కచాపచా పొడిచి చంపేయడం కానీ, విలన్ల అతి, హీరో మహా అతి.. అన్నీ కలగలిపి ఇదొక రొట్ట సినిమాలా అనిపిస్తుంది సెన్సిబుల్ ఆడియన్స్ కి. 

అలాగని ఫ్యాన్స్ కి నచ్చుతుందా అంటే.. మొదట్లో "జై బాలయ్యా" అని అరిచిన వాళ్లు ఇంటర్వెల్లో లైట్లేసాక ఒకసారి అరిచారు. మిగిలిన టైమంతా సైలెన్స్, లేదా చిన్నపాటి నిట్టూర్పపు నవ్వు.. అంతే. 

దీనిని బట్టి ఫ్యాన్స్ కి కావాల్సిన పూనకాలు తెప్పించలేకపోయాడు దర్శకుడు అనిపించింది.

ఫ్యాన్స్ కి కావాల్సిన పాటలు లేవు, బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ ఉన్నా ఆమెతో ఎటువంటి ఎమోషనల్ కనెక్షనూ లేని పాత్ర బాలకృష్ణది. శ్రీలీలని ఇందులో హీరోయిన్ అనలేం. ఆమెది హీరో కూతురి వరస పాత్ర అంతే. ఆమెకి కూడా హీరో లేడు. దీనివల్ల ఆడదిక్కు లేని సినిమాలా కనిపిస్తుంది ఫ్యాన్స్ కి. దాంతో వాళ్లు నీరసపడ్డారనిపించింది.

ఇక బాలకృష్ణకి రియల్ లైఫులో ఉన్న పాట పాడే బలహీనతని ఇందులో బలంగా చూపించే ప్రయత్నం జరిగింది. నిజ జీవితంలో బాలకృష్ణ మంచి పాటల్ని పాడి ఖూనీ చేస్తాడని ట్రోలింగ్స్ వస్తుంటాయి. దానికి సమాధానంగా ఇందులో అలాంటి పాటని ఖూనీ చేసిన సీనేపెట్టి "ఎలాగైనా పాడతా. మంది ఏమనుకుంటే నాకేంటి" అనే డైలాగ్ చెప్పించారు.

ఒక యాక్షన్ సీన్లో కేజీఎఫ్ గన్స్ చూపించి పక్కనున్న ఆఫీసర్ అంటాడు- "మార్కెట్లో ఇలాంటి గన్స్ వాడి చాలా మంది పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు వీటిని వాడితే ఈ గన్స్ కి పేరొస్తుంది" అంటాడు. 

అప్పుడు బాలయ్య తన రేంజ్ కి ఇంకా పెద్ద సౌండ్ వచ్చేవి పేల్చాలని సిలెండర్లు పేలుస్తాడు. నిజానికి ఈ సీన్ కి థియేటర్ అదిరిపోవాలి. కానీ ఫ్యాన్స్ సైలెంటుగా కూర్చున్నారంటే వాళ్లల్లో కరెంట్ ప్రసరించేలా కంటెంట్ నడవట్లేదని అర్ధం చేసుకోవాలి.

ఇందులో మెచ్చుకోదగ్గ అంశమేదైనా ఉందా అంటే బాలకృష్ణ సటిల్ యాక్టింగ్. తెలంగాణా డైలాగ్స్ కూడా కన్విన్సింగ్ గా ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ కి అది సరిపోకపోవడమే మైనస్. యాక్షన్ కి ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ కి తక్కువ అన్నట్టున్నాడు బాలకృష్ణ.

కాజల్ అయితే హీరోయిన్ కి తక్కువ, ప్యాడింగ్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అన్నట్టుంది. ఆమెతో ఉన్న ఒకటి రెండు సీన్స్ ఫోర్స్డ్ గా, డ్రామాలో అతక్కుండా ఉన్నాయి.

శ్రీలీల నుంచి డ్యాన్స్ మూవ్స్, గ్లామర్ షో ఆశించి ఫ్యాన్స్ వస్తారు. వాళ్లని పూర్తిగా నిరాశపరిచే పాత్ర ఆమెది. బాలనటికి ఎక్కువ, మెయిన్ హీరోయిన్ కి తక్కువ అన్నట్టుంది.

అర్జున్ రాంపాల్ విలనీ బానే ఉంది. ఇతర పాత్రలు ఓకే.

పాటలు రెండున్నా వాటి ఇంపాక్ట్ అస్సలు లేదు. నేపథ్య సంగీతం కూడా రొటీన్ గా ఉంది తప్ప కొత్త అనుభూతి కలిగించేలా లేనే లేదు. ఇతర టెక్నికల్ వేల్యూస్ బానే ఉన్నాయి. 

డైలాగ్స్ లో "బిడ్డ ముందు నిలబడ్డ తండ్రి దైవంతో సమానం" అని... అలాగే స్కూల్ ఆడిటోరియంలో చెప్పిన సందేశాత్మక వాక్యాలు బాగున్నాయి. వాటిని మినహాయిస్తే బాలకృష్ణ సినిమాకి కావాల్సిన మాస్ పంచులు లేవు.

ఇక్కడ ఇంకొకటుంది. ఈ హీరో సినిమాలో ఎంతో కొంత పొలిటికల్ స్టఫ్ కూడా ఆశిస్తారు జనం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక పొలిటికల్ విలన్ ఉంటాడు. అతని పార్టీ జెండా "నీలం" రంగు.

మరో సీన్లో విలన్ పొలిటీషియన్ ని జైల్లో పెట్టి బెయిల్ కూడా రానీయకుండా చేస్తాడు హీరో.

మధ్యలో ఒకతను జైల్లో ఆ విలన్ ని పరామర్శిస్తూ "మీ అబ్బాయి పై ఆఫీసర్స్ తో మాట్లాడుతున్నాడు, బెయిల్ వస్తుంది కంగారుపడకండి" అని చెప్తాడు.

ఇదంతా చూస్తే సగటు ప్రేక్షకుడికి నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయం మైండులో మెదులుతుంది.

ఇక వెతుక్కుంటే కనిపించే ఒక చిన్నపాటి వినోదం బస్సులో ఫైటింగ్. "కళ్లల్లో కళ్లు పెట్టి చూడు.." పాట బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఆ సీన్ కాస్తంత నవ్విస్తుంది.

బాలకృష్ణ సినిమాకి ఏమీ ఆశించకుండా వెళ్ళడంకష్టం. అలా వెళ్లిన వాళ్లు సైతం నిరాశ పడొచ్చు ఈ చిత్రం చూసి. ఆల్రెడీ చూసేసిన సినిమాలు కలగలిపి కొట్టినట్టు ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. బలవంతంగా ఓపిక చేసుకుని చూడాలంతే.

బాటం లైన్: "బలవంత్" కేసరి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?