ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భువనేశ్వరి కేంద్రంగా కొత్త రాజకీయానికి తెరలేస్తోంది. ఇప్పుడామె జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించారు. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. బాబు బయటికి ఎప్పుడొస్తారో ఎవరూ చెప్పలేని నిస్సహాయ స్థితి. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి, ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో లోకేశ్ యాత్రలు చేపట్టనున్నారు.
ఈ ఏడాది జనవరి నెలాఖరులో కుప్పంలో లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. త్వరలో పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీడీపీ వర్గాలు గత నెలలో చెప్పాయి. అయితే పాదయాత్రకు బదులు భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో బస్సుయాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.
ఇక భువనేశ్వరి విషయానికి వస్తే… నిజం గెలవాలని ఆమె కోరుకుంటున్నారు. ఇంతకాలం అబద్ధం గెలుస్తూ వస్తుండడం వల్లే చంద్రబాబు పలు కేసుల్లో తప్పించుకు తిరుగుతున్నారనే అభిప్రాయం బలంగా వుంది. ఎప్పటికైనా నిజం, న్యాయం గెలుస్తాయనేందుకు ఇప్పుడు చంద్రబాబు జైలు జీవితాన్ని లోకం ఉదహరిస్తోంది. వ్యవస్థల్లో బలమైన పట్టున్న చంద్రబాబు ఎప్పుడైనా జైల్లో గడుపుతారని అసలు కలలో అయినా ఊహించామా? ఇప్పుడు చూడండి ఆయనకు ఏ గతి పట్టిందో అని సర్వత్రా మాట్లాడుకుంటున్నారు.
ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి, వైశ్రాయ్ హోటల్ ఎదుట చెప్పులు, రాళ్లతో కొట్టించి, చివరికి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు పాపాలు ఎట్టకేలకు పండాయని ఏ నోట విన్నా ఇదే మాట. ఇంత వరకూ ఏ పాలకుడికి చేతకానిది, యువకుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి కేసులో బాబును బొక్కలో వేసి శభాష్ అనిపించుకున్నాడనే ప్రశంసల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్‌సభ సభ్యుల్ని టీడీపీలో చేర్చుకున్నారని, కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టి వ్యవస్థల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నేరాలకు ఇంత కాలానికి తగిన శిక్ష పడిందనే చర్చ జరుగుతోంది. అలాగే రెండెకరాల నుంచి లక్షల కోట్ల ఆస్తులకు యజమాని అయిన చంద్రబాబు, ఇంత వరకూ అక్రమాస్తుల కేసుల్లో కనీసం విచారణ కూడా ఎదుర్కోకుండా తప్పించుకున్నారని పౌర సమాజం గుర్తు చేస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు ఓటుకు నోటు ఇవ్వచూపి, ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా బాబు శిష్యుడైన నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌ను పౌర సమాజం గుర్తు చేసుకుంటోంది. ఓటుకు నోటు కేసులో తనను ఇరికిస్తారనే భయంతో హైదరాబాద్ రాజధానిపై పదేళ్ల హక్కును కాదనుకుని రాత్రికి రాత్రే చంద్రబాబు అమరావతికి పారిపోయిన వైనం ఇప్పుడు అందరి కళ్ల ముందు కదలాడుతోంది.
ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ప్రత్యర్థులపై బురద చల్లుతూ, తాను మాత్రమే సచ్ఛీలుడినని, నిప్పు అని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ఎట్టకేలకు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి, జైల్లో ఊచలు లెక్కిస్తున్నారనే చర్చ జరుగుతోంది. నిజాలు, వాస్తవాలు ఇలా వుంటే, భువనేశ్వరి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించడం ఆశ్చర్యం కలిగిస్తోందనే వాదన తెరపైకి వచ్చింది. చంద్రబాబు గెలవాలి అనే నినాదానికి బదులు ‘నిజం గెలవాలి’ అంటూ భువనేశ్వరి జనం ముందుకు వెళ్లడానికి సిద్ధమైంది.
భువనేశ్వరి కోరిక నెరవేరితో బాబు భవిష్యత్ ఇక అంతే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్తగా చంద్రబాబుపై భువనేశ్వరి ప్రేమాభిమానాలను ఎవరూ కాదనలేరు. భర్తను ప్రేమించొచ్చు కానీ, ఆయన నేరాలు, అవినీతిని కూడా అభిమానం పెంచుకోవడంపైనే సమాజ అభ్యంతరం. నిజం గెలిస్తే మాత్రం… ఇక చంద్రబాబును రాజకీయంగా శాశ్వతంగా మరిచిపోవాల్సిందే అని భువనేశ్వరి, ఆమెతో యాత్ర చేయించతలపెట్టిన టీడీపీ నేతలు గుర్తించాలి.