వైసిపిని ఎదుర్కోవాలంటే టిడిపి-జనసేన పొత్తు కుదరాలని, దాని కోసం చంద్రబాబు పవన్‌ను ఒక టెర్మ్ ముఖ్యమంత్రిగానో, కనీసం ఉపముఖ్యమంత్రిగానో ప్రకటించాలని, అప్పుడే కాపు కులస్తులు పెద్ద సంఖ్యలో ఆ కూటమికి ఓటేసే అవకాశం వుందని వాదించిన వారిలో నేనూ ఒకణ్ని. బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే లోకేశ్ అధికారికంగానో, అనధికారికంగానో నెంబరు టూ పొజిషన్లో ఉంటారని, పవన్ ఉపముఖ్యమంత్రిగా ఉంటే అతనికి యిబ్బంది అని భావించి చంద్రబాబు అలాటి ప్రకటన చేయడానికి వెనకాడుతున్నారని, దాని వలన కూటమి ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చునని నా ఉద్దేశం. తనను తాను ముఖ్యమంత్రిగా చూసుకోవడానికి పవన్‌కి పెద్ద ఆసక్తి లేకపోయినా అతని అభిమానులకు, అతని కులస్తులకు ఉన్న ఉబలాటాన్ని బాబు గమనించటం లేదనీ నేను వ్యాఖ్యానించాను.
కానీ పవన్ వారాహి యాత్ర ప్రారంభమైన దగ్గర్నుంచి చూస్తూంటే యితని కంటె లోకేశ్ ఉపముఖ్యమంత్రి అయితేనే మంచిదనిపిస్తోంది. లోకేశ్ గతంలో కూడా నానా రకాలుగా మాట్లాడినా, పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర్నుంచి దుర్భాషలు పెంచాడు. ఆంధ్రలో రాజకీయాల స్థాయి పతనమై చాలాకాలమైంది. అప్పుడే అసభ్యాంధ్రరాజకీయాలు అని వ్యాసం రాసేశాను. ఇప్పుడు అంతకంటె దిగజారింది. దీనికి అన్ని పార్టీల నాయకులన్నీ తప్పు పట్టాల్సిందే. వీళ్లు ఏ బూతులైనా మర్చిపోతే అందించడానికి యూట్యూబర్లున్నారు. చెప్ప వచ్చేదేమిటంటే ఉదయం, సాయంత్రం మాత్రమే నడిచినా లోకేశ్ 4 వేల కి.మీ.ల లక్ష్యంలో 2 వేలు నడిచేశాడు. దీనివలన పార్టీకి, రాష్ట్రానికి మేలు కలిగినా కలగకపోయినా అతనికి వ్యక్తిగతంగా మేలు కలిగే ఉంటుంది.
రాజు కాబోయేవాడు ముందుగా ప్రజల్లో తిరిగి, ప్రజల కష్టనష్టాలను, స్థితిగతులను, స్థానిక అవసరాలను స్వయంగా కళ్లతో చూసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాత రోజుల్లో యువరాజులను సింహాసనం ఎక్కించే ముందు దేశాటనకు పంపించేవారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక అంతా అద్భుతంగా ఉందంటూ అధికారులు మాయ రిపోర్టులు చూపించి, కళ్లకు గంతలు కట్టేస్తారు. ప్రజల్లో రగులుతున్న అసంతృప్తిని గమనించ లేక పాలకులు అధికారాన్ని పోగొట్టుకుంటారు. టిడిపి పార్టీకి లోకేశే కాబోయే నాయకుడనేది తేటతెల్లం. చంద్రబాబు పెద్దపెద్ద కలలు కని, నేల విడిచి సాము చేసి, పార్టీని సామాన్యులకు దూరం చేసి నష్టపోయారు. ఈ పాదయాత్రతో లోకేశ్ సామాన్యుల అవసరాలను గమనించి, వారికి మేలు చేసే పథకాలు రూపొందిస్తే పార్టీ ఆయుర్దాయం పెరుగుతుంది.
అధికారంలోకి ఏడాదిలో వస్తుందా, దశాబ్దం తర్వాత వస్తుందా అనేది ప్రశ్న కాదు. విధానపరంగా మార్పు రావాలి. ఎన్టీయార్ తరహాలో సామాన్యుడు కేంద్రంగా విధానాలు ఏర్పరిస్తే ప్రజల గుండెల్లో పార్టీ నిలబడుతుంది. ధనికులను, ఎగువ మధ్యతరగతిని మెప్పించే ఆకాశహర్మ్యాలు కట్టడమే అభివృద్ధి అనుకుంటే పరిధి సంకుచితమై పోతుంది. పాదయాత్ర వలన లోకేశ్‌కు లోకజ్ఞానం అబ్బి, పేదల అవసరాల పట్ల ఎంతో కొంత అవగాహన ఏర్పడి ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను. దాన్ని అమలులో పెట్టే అవకాశం అతనికి ఎప్పటికి వస్తుందో నాకు తెలియదు కానీ, 2024 మానిఫెస్టో తయారు చేసే సమయంలో తండ్రికి తగిన సూచనలు యివ్వగలడని ఆశిద్దాం.
కూటమి ఏర్పడితే నెంబరు టూ స్థానానికి అతనికి ప్రత్యర్థిగా నిలవబోయేది పవన్ కళ్యాణ్ అనుకుంటే, పవన్‌ను లోకేశ్‌తో పోల్చి చూడాల్సి వస్తోంది. వారాహి యాత్రకు ముందు, తర్వాత అని పవన్‌ను బేరీజు వేసి చూస్తే అతని పాప్యులారిటీ తగ్గిందనే నాకనిపిస్తోంది. దీన్ని కొలవడానికి కొలబద్ద ఏదీ మన దగ్గర లేదు. సర్వేలు నిర్వహించలేదు కదా! పైగా వారాహి యింకా సాగుతూనే ఉంది. మొత్తమంతా పూర్తయేసరికి పవన్ ఎక్కడ తేలతారో ఊహించడానికి భయంగా ఉంది. పవన్ గందరగోళంగా మాట్లాడతారనే అభిప్రాయం మొదటి నుంచీ ఉంది. ఇటీవలే నాకు సిఎం అయ్యేటంత సీను లేదు, నేను బాబు స్థానంలో ఉండి ఉంటే నా బోటి వాడికి సిఎం ఛాన్సు యిచ్చేవాణ్ని కాను అని నిజాయితీగా చెప్పి, తన సైనికులకు స్పష్టమైన సందేశం యిచ్చి, కూటమిలో తన స్థానమేమిటో వారికి తెలియచెప్పారు.
అక్కడితో ఆగి ఉంటే సరిపోయేది. వైసిపిని గద్దె దింపాలన్న పట్టుదల ఉన్న వారు పవన్ సిఎం అవుతాడా లేడా అనేది పట్టించుకోకుండా ఓటేసేవారు. కానీ అలాటి వారి సంఖ్య తగినంతగా ఉండదని పవన్‌కు తోచినట్లుంది. తనను సిఎంగా చూద్దామనుకునేవారు కూటమికి ఓటేయరేమో అని భయం కలిగి, సిఎం పదవి యిస్తే తీసుకుంటాను అని స్టేటుమెంటు మార్చారు. ఈ పదవులు ఎవరైనా యిస్తారా? వాటి కోసం ఎంత పోరాటం చేయాలి? ఎన్ని ఎత్తులు వేయాలి? ఎన్ని కుయుక్తులు పన్నాలి? ఎన్ని బేరాలాడాలి? చంద్రబాబు ఆషామాషీగా సిఎం అయ్యారా? మామకు విధేయత నటిస్తూనే ఆయన వీపు వెనక కుటుంబసభ్యులందర్నీ చేరదీసి, కుట్ర పన్ని, ఎన్నో సంస్థల తోడ్పాటు తీసుకుంటే తప్ప, రాజకీయాల్లోకి వచ్చిన 20 ఏళ్లకు కానీ సిఎం కాలేకపోయారు. తండ్రి మరణం తర్వాత జగన్ కూడా పవన్ లాగానే పిలిచి సిఎం పదవి యిచ్చేస్తారని భ్రమపడి, భంగపడి, చెరసాలలో పడి, వీధిన పడి, యాత్రలు చేసి పదేళ్ల తర్వాత సిఎం అయ్యాడు.
ఈ చరిత్రంతా తెలిసి కూడా ఎవరైనా యిస్తే తీసుకుంటా, చేస్తే అవుతా అంటే నవ్వు రాదా? ఇస్తే పుచ్చుకోవడానికి పవన్ ఒక్కడే నేమిటి, కోటిమంది క్యూలో నించుంటారు. నాయకుడన్నవాడు నేను సిఎం అవుతా అని ప్రకటించాలి. 1982లో ఎన్టీయార్ అలాగే ప్రకటించారు. జోకులేస్తున్నాడు అని నవ్వుకున్నవారు, 1983 వచ్చేసరికి నోరు వెళ్లబెట్టారు. ఆత్మవిశ్వాసం ప్రకటించిన నాయకుణ్నే ఓటర్లు ఆరాధిస్తారు. ఇస్తే తీసుకుంటా, యివ్వకపోతే ఊరుకుంటా అంటే మరి నువ్వు మాకిచ్చే హామీల మాటేమిటి అనుకోరా? నేను సిఎం కాకపోయినా కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో అవి పెట్టి తీరాలని సిఎం అయ్యే వ్యక్తిని డిమాండ్ చేస్తా అని పవన్ స్పష్టంగా చెప్పవద్దా?
కొన్ని రోజులు పోయాక పవన్ ‘నన్ను సిఎం చేయకపోతె మానె, కనీసం అసెంబ్లీకి పంపితే అదే భాగ్యం’ అన్నట్లు మాట్లాడారు. మామూలువాళ్లకి ఎమ్మెల్యే కావడం అంత పెద్ద ఘనకార్యమేమీ కాదు. ఆంధ్రలో 175 మంది అయ్యారు. మెజారిటీలో హెచ్చుతగ్గులుండవచ్చు కానీ అంతమంది దాన్ని సాధించారు కదా. అదేమిటో 2019లో లోకేశుకి, పవనుకి మాత్రమే అది గగనకుసుమం అయిపోయింది. ఈసారి లోకేశ్ ధీమాగానే ఉన్నారు. మంగళగిరి గెలిచి చూపిస్తా అంటున్నారు. పవన్ మాత్రం నేను అసెంబ్లీకి వెళతా అనటం లేదు. నన్ను పంపండి అని ప్రజలను అడుగుతున్నారు. బేలతనాన్ని సూచించే యీ మాటలు నాయకుడికి శోభ నివ్వవు.
ఎమ్మెల్యే చేస్తే చాలంటారేమో అనుకుంటే మళ్లీ సిఎం మాట ఎత్తారు. సిఎం అవుతానంటారు, చేస్తే కాదనను అంటారు. మళ్లీ మొదటికి వచ్చారన్నమాట. గతంలో ఒంటరి పోరాటం ఆత్మహత్యాసదృశం అన్నారు. అయితే పొత్తులు ఖాయమన్నమాట అనుకున్నాం. ఈ ట్రిప్పులో పొత్తుల గురించి ఆలోచించటం లేదంటారు. గౌరవప్రదమైన పొత్తు ఉండాలంటారు. ‘‘ఆది’’ సినిమాలో ప్రిన్సిపాల్ వేషంలో ఎల్బీ శ్రీరామ్ హీరో గురించి ‘వాడేమంటున్నాడో నాకేమీ తెలియటం లేదు, కాస్సేపు ప్రేమిస్తున్నానంటాడు, కాస్సేపు లేదంటాడు, నాకేమీ అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమైతే నాకు చెప్పు, అప్పుడు నేను వాడిపై ఏక్షనో, యాక్షనో ఏదో ఒకటి తీసుకుంటాను.’’ అని హీరోయిన్‌తో అంటాడు. ఇప్పుడు పవన్ గురించి మనమూ అలాగే అనుకోవాలి. ఆయనేమంటున్నాడో అర్థమైతే అప్పుడు వ్యాఖ్యానించవచ్చు. మొదలే కన్ఫ్యూజన్, యిప్పుడు ‘కన్ఫ్యూజన్ వర్స్ కన్ఫౌండెడ్’ అన్నట్లు తయారైంది సంగతి. ఒకే ఒక్క విషయంలో క్లారిటీ వచ్చింది. ఈయన జగన్‌ని మళ్లీ సిఎం కాకూడదని గట్టిగా కోరుకుంటున్నాడు. దాని కోసం ఏం చేయాలో తనకు తెలియక, మనకు చెప్పలేక సతమత మవుతున్నాడు!
2014లో జగన్‌ను ఓడించేసి పవన్ వెళ్లి సినిమాలు చేసుకున్నారు. ఈసారి లక్ష్యం అది కాదు. అతని ఓటమితో పాటు, తన పార్టీ వాళ్లు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కావాలి. వారిలో కొందరు మంత్రులు కావాలి. వాచ్‌డాగ్‌లా తను ప్రభుత్వాన్ని గమనిస్తున్నాననే బిల్డప్ యివ్వాలి. తను అసెంబ్లీలో ఒక్క రోజైనా అడుగుపెట్టి, 2019లో తనను ఓడించిన ఓటర్లపై మీసం మెలేయాలి. ఇది జరగాలంటే పొత్తు కుదరాలి. ఆ పొత్తు గౌరవప్రదంగా.. అంటే పవన్ కోరినన్ని సీట్లు కేటాయించేట్లా.. ఉండాలి. మంచిదే! కానీ అది మనకు చెప్తే ఏం లాభం? తనతో బేరాలాడుతున్న కూటమి నాయకుడికి చెప్పాలి. మన ద్వారా చెపుతున్నారని అనుకోవాలా?
ప్రస్తుతానికి టిడిపిని ఏమీ అనటం లేదు. గౌరవప్రదమైన సీట్లు దక్కకపోతే పొత్తు కుదరకపోతే అప్పుడు అంటారేమో తెలియదు. బిజెపి కేంద్ర నాయకులందరితో చనువుందంటారు. అధికారికంగా వారితో పొత్తు ఉంది కానీ యీయన యాత్రల్లో వాళ్లు పాలు పంచుకోరు. వారి ర్యాలీలకు జనసైనికులు వెళ్లరు. పది నెలల్లో ఎన్నికలున్నా ఆయన పార్టీ సోలోగా వెళుతుందో, పొత్తులో వెళుతుందో, పొత్తు ఎవరితో ఉంటుందో ఏ స్పష్టతా లేదు. పోనీ యీలోగా తన పార్టీ విధానమేమిటో, ఏ వర్గ ప్రజలకు ఏది ఎలా చేద్దామనుకుంటున్నారో ప్రజలకు క్లియర్‌గా చెపితే వారికి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈయన ఎవరితో కలిసినా, యీ ఆశయాల సాధన కోసం భాగస్వాములపై ఒత్తిడి తెస్తాడన్నమాట అనుకుంటారు. కానీ పవన్ మాటల్లో జగన్ దూషణ తప్ప వేరేదీ వినబడటం లేదు.
ఆయన ఫీల్డు వేరేది కాబట్టి రాజకీయ చరిత్ర, గణాంకాలు పెద్దగా తెలియాలని మనం ఆశించం. ఏం చేయాలో ఆయన గట్టిగా అనుకుంటే, ఎలా చేయాలో చెప్పేందుకు నిపుణులు సాయపడతారు. ఎన్టీయార్ చైతన్యరథంపై బయలుదేరినప్పుడు ఆ నియోజకవర్గంలోని సమస్య గురించి మాట్లాడేవారు. దానితో ప్రజలకు కనక్ట్ అయ్యేవారు. పవన్ కూడా అదే పని చేస్తే చాలు. నాలుగేళ్లగా వైసిపి పాలన సాగుతున్నా, ఫలానా సమస్య యింకా తీరలేదు. మేం వస్తే దాన్ని ఫలానా విధంగా సరి చేస్తాం అనాలి. అది కొన్ని చోట్లే అవుతోంది, అదీ చాలా తక్కువ స్థాయిలో. ఎక్కువ భాగం ఆత్మస్తుతి, పరనిందతో గడిచిపోతోంది. పవన్ గొప్పతనాన్ని పక్కనున్న వక్త ఎవరైనా చెప్పిన తర్వాత, పవన్ మైకు తీసుకుని, తనేం చేయబోతున్నాడో చెపితే సరిపోతుంది.
ఇక పరనింద అంటారా? ఎన్టీయార్ కాంగ్రెసు పార్టీని తిట్టేవారు తప్ప, కాంగ్రెసు మంత్రులను పేరుపేరునా ప్రస్తావించి, వారి కులాలు ప్రస్తావించి తిట్టేవారు కాదు. వారికి ఏ రకమైన పబ్లిసిటీ యిచ్చేవారు కాదు. గుడ్డలూడదీస్తా అనే ఎక్స్ప్రెషన్ను పవన్ మరీ ఎక్కువగా రిపీటు చేసి, యీయనకు దానిపై అబ్సెషనేమో సందేహం కలిగిస్తోంది. 2009లో ప్రజారాజ్యం నాయకుడిగా కాంగ్రెసు వారి పంచెలూడగొడతా అన్నారు. ఓటర్లు వీళ్ల పంచెలే ఊడదీయడంతో వీళ్లు కాంగ్రెసు పంచన చేరారు. 2019లో తాట తీస్తా అన్నారు. తన తాటే ఒలిపించుకున్నారు, రెండు చోట్ల! ఇప్పుడు చెప్పుల చూపడం మీద పడ్డారు. ఓటర్లేం చూపిస్తారో తెలియదు. ఏదైనా చేసి చూపించాలి తప్ప, చేసే ముందే చెపితే గప్పాలు కొట్టుకున్నట్లు ఉంటుందని పవన్ గ్రహించాలి.
గతంలో పవన్ చుట్టపుచూపుగా ఆంధ్ర వచ్చి లెక్చర్లు దంచి వెళ్లిపోయేవారు. వారాహి యాత్ర పేరుతో తనకు బాగా బలముందని అనుకుంటున్న (2019లో గెల్చిన ఏకైక సీటు తూగో జిల్లాలోనే ఉంది) గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. టిడిపితో పొత్తు కుదిరితే ఎక్కువ సీట్లు అడగబోయేది యీ ప్రాంతంలోనే. అలాటప్పుడు స్థానికంగా బలంగా ఉన్న తన అనుచరుడెవరో ఐడెంటిఫై చేసుకుని, ఓటర్లకు ‘నా తరఫున యికపై యిక్కడ పని చేసేది యితనే’ అని పరిచయం చేస్తే జనసేన పక్షాన అభ్యర్థి యితనే అని సూచించినట్లు ఉంటుంది. ఇక అతను సొంత డబ్బు ఖర్చు పెట్టి తన పాప్యులారిటీ పెంచుకుంటాడు. పొత్తు ఫైనలైజ్ అయ్యే సమయానికి ‘మా అభ్యర్థికి ప్రజాదరణ బాగా ఉంది కాబట్టి ఆ సీటు మాకు వదలాలి’ అని గట్టిగా బేరాలాడవచ్చు. ఇంత సమయం వెచ్చించి, శ్రమకు ఓర్చి యాత్ర సాగిస్తున్నప్పుడు దాని వలన ఫలితం కలగాలి. పవనం సుడిగాలిలా మారాలి. కానీ వారాహి తర్వాత ఆయన తేలికై పోయి, మందపవనం అయిపోతున్నా డనిపిస్తోంది.
రాజకీయాల్లో ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం సహజం. ప్రజలు వాటికి అలవాటు పడిపోయారు. లక్ష కోట్లు, సింగపూరులో ఆస్తులు.. యిలాటివన్నీ ఏళ్ల తరబడి అనడమే తప్ప నిరూపించడం ఉండదు. సామాన్య ప్రజలకు వీటిని వెరిఫై చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి కామమ్మ మొగుడంటే కాబోసు అనుకుంటారు. కానీ వాళ్లకు నిత్యం ఎదురయ్యే విషయాల్లో అబద్ధాలు ఆడితే తెలిసిపోతుంది. శ్రీవాణి ట్రస్టు డొనేషన్ల విషయంలో పవన్ ‘‘పదివేలు తీసుకుని ఏ 200కో, 300కో (అదైనా కరక్టుగా చెప్పాలి కదా) రిసీట్ యిస్తారు..’’ అని ఆరోపిండం విస్మయం కలిగించింది. పదివేల రూపాయలకు రసీదు యివ్వరని ఆయనకెవరు చెప్పారు? మా కుటుంబ సభ్యులు యిచ్చినపుడు ట్రాన్సాక్షన్ ఐడీని కోట్ చేస్తూ ఎక్నాలెజ్మెంట్ రిసీట్ అని ఈ మెయిల్ పంపారు. మాలాగ యిచ్చినవాళ్లందరి దృష్టిలో పవన్ అజ్ఞానిగా, అబద్ధాల కోరుగా నిలుస్తారు కదా!
కావాలంటే ‘శ్రీవాణి నిధులు సరిగ్గా వాడటం లేదని అనుమానం ఉంది. ఎన్ని గుళ్లు కట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని అడిగి ఉండాల్సింది. ఆ నిధుల వాడకం గురించి సామాన్యుడికి తెలియదు కాబట్టి, ఏదో కుంభకోణం ఉందేమో అని సందేహించే స్కోపు ఉంది. కానీ తన చేతిలో రసీదు ఉండగా, రసీదు యివ్వటం లేదని పవన్ అంటే ‘ఇతను తలాతోకా లేకుండా ఆరోపిస్తున్నాడు’ అనుకోడూ? టిటిడి స్పందించింది. ఎంత వచ్చిందో, ఏమౌతోందో చెప్పింది. దానితో పవన్ క్షమాపణ చెప్పాల్సింది. కానీ చెప్పలేదు. హీరోయిజం కాదనుకున్నారేమో! ‘ఫుట్ ఇన్ ద మౌత్ సిండ్రోమ్’ అని ఇంగ్లీషులో అంటారు. అవకతవకగా మాట్లాడి తన అనుచరులను, సహచరులను యిరకాటంలో పెట్టే లక్షణాన్ని అలా పిలుస్తారు. పవన్‌కు ఆ లక్షణం ఉందని వారాహి యాత్రలో పూర్తిగా నిరూపితమైంది.
కొల్లేరు గురించి ఈనాడు ఏదో రాయడం, అది పుచ్చుకుని యీయనేదో మాట్లాడడం చూసి పేర్ని నాని ఉతికి ఆరేశారు. అప్పులు ఎక్కువై పోయాయన్న ఆరోపణ గురించి కూడా పేర్ని నాని మాట్లాడుతూ డైరక్టు లయబిలిటీస్ విషయంలో బాబు హయాంలో 20 శాతం పెరిగితే (అంటే వాళ్లు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పులు 100 అయితే వాళ్లు దిగిపోయేనాటికి 120 అయ్యాయన్నమాట) జగన్ హయాంలో గత నాలుగేళ్లలో 16శాతం పెరిగాయి అన్నారు. మొత్తం అప్పులన్నీ కలిపి బాబు హయాంలో 22శాతం పెరిగితే, జగన్ హయాంలో 13శాతం పెరిగాయన్నారు. వివరాలేమిటో ఆయనే చెప్పాలి. ఇలాటి ఆరోపణలన్నీ ఫర్వాలేదు, లోకేశ్ కూడా యిలాటివి చేస్తాడని అనుకోవచ్చు కానీ వాలంటీర్ల విషయంలో పవన్ చేసినది మాత్రం రాజకీయంగా పెద్ద పొరపాటు. ఎందుకంటే పవన్ యీసారి వ్యక్తుల మీద కాకుండా వ్యవస్థపై దాడి చేశాడు.
దాని గురించి యిప్పటికే చాలా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి, వివరంగా రాయటం లేదు. వాలంటీరు వ్యవస్థపై యిప్పటిదాకా పెద్దగా ఆరోపణలు లేవు. రెండున్నర లక్షల మంది ఉన్న వ్యవస్థలో అందరూ గొప్పగా పని చేస్తారని అనలేము. కనీసం 5 శాతం మంది అపసవ్యంగా ప్రవర్తించినా యీపాటికి చాలా ఆరోపణలు వచ్చి ఉండాలి. ఎంతో కొంత అసమర్థత అనేది తప్పకుండా ఉంటుంది. కానీ దాన్ని ఎత్తి చూపేటంత స్థాయిలో లేదేమో! బాబు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలైతే యీ పాటికే చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే వాటి అవినీతి గురించి రాశారు. అవి అధికారాన్ని చలాయిస్తూ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాయి. వాటికి భిన్నంగా వాలంటీర్లు సేవలందించారు. అనేక పనులు చేసి పెడుతూ ప్రజల సానుభూతి చూరగొన్నారు. పిల్లలు వేరే ఊళ్లో ఉన్న వృద్ధులకే కాదు, యింటి పనులకు సమయం చిక్కని మధ్య వయస్కులకు కూడా వీళ్లు అంది వచ్చారు. ఆఫీసుల చుట్టూ తిరిగి, డాక్యుమెంట్లు తెచ్చిపెట్టడం వంటి పనులు చేసి బక్షీసులుగా పై సంపాదన కూడా ఆర్జిస్తున్నారని విన్నాను.
ఆ వ్యవస్థతో ఎలా డీల్ చేయాలో ప్రతిపక్షాలకు తెలియటం లేదు. మొదట్లో వాళ్లు చేస్తున్నదేమిటి, దండగ అన్నారు. ఇప్పుడు 5వేలే జీతమేమిటి అంటున్నారు. పవన్ వాళ్ల చేత ఊడిగం చేయిస్తున్నారు అంటున్నారు. వాళ్ల చేత గ్రూపు పరీక్షలకు కట్టించి అధికారులను చేయవచ్చు కదా అంటున్నారు. వాళ్లది వెట్టి చాకిరీ కాదు. తమంతట తాము వచ్చి చేరారు. పరీక్షలకు కడదామంటే ఎవరూ వచ్చి అడ్డుపడరు. ఉన్న ఊళ్లోనే ఉంటూ, పై పనులు చేసి పెడుతూ జీతంతో పాటు పైన కొంత సంపాదిస్తూ తృప్తిగానే ఉండకపోతే రాజీనామా చేసేవారుగా! హైదరాబాదులో అలాటి వాళ్లుంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది నాకు. ఆన్లైన్లో ఎన్ని చేసినా, ఆఫీసులకు, బ్యాంకులకు వెళ్లి చేసుకురావలసిన పనులుంటాయి. వెళ్లాలంటే పార్కింగు దగ్గర్నుంచి అన్నీ సమస్యలే. వాలంటీర్లు ఉంటే శ్రమ, సమయం ఆదా అవుతాయి. దానికి గాను వాళ్ల చేతిలో ఎంతోకొంత పెట్టడానికి వెనకాడం.
50 యిళ్లతో తమకు ఏర్పడిన పరిచయాలను యీ వాలంటీర్లు ఏ విధంగా ఉపయోగించు కోవచ్చు అని ఆలోచించాను. చిట్‌ఫండ్ ఏజంట్లగానో, ఎల్ఐసి ఏజంట్లగానో, రియల్ ఎస్టేటు బ్రోకర్లగానో వీళ్లు వ్యవహరిస్తూ ఉండవచ్చు. ఇరువురికీ సమ్మతమైతేనే యిలాటివి నడుస్తాయి. ఇక ప్రభుత్వం వైపు నుంచి చూస్తే వీళ్లను ఎంతో బాగా ఉపయోగించు కోవచ్చు. ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించుకోవచ్చు. పథకాల గురించి, ప్రభుత్వం చేపట్టిన పనులు నాణ్యత గురించి ఫీడ్‌బ్యాక్ తెప్పించుకోవచ్చు. వేరే సర్వే సంస్థలకు ఆ పని అప్పచెప్పనక్కరలేదు. ప్రభుత్వాధికారులకు ప్రత్యేకంగా ఆ డ్యూటీ వేసినా సవ్యంగా చేస్తారన్న నమ్మకం లేదు. రిపోర్టులు కిట్టించేయవచ్చు. వైసిపి ప్రారంభించిన యీ వ్యవస్థను రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చినా కొనసాగించ వచ్చు. అంతేకాదు, వైసిపి మళ్లీ నెగ్గితే, యితర రాష్ట్రాలలో కూడా యీ వ్యవస్థ మొదలెట్టవచ్చు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. దీన్ని రాజకీయాలకు వాడితేనే అభ్యంతరం వస్తుంది. వాడుతున్నారా లేదా అనేది యిప్పుడు తెలియదు. ఎన్నికల వేళ తెలుస్తుంది. వాడాలనే టెంప్టేషన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ కార్యకర్తలను యింటింటికి వెళ్లి తిరగమంటే తిరగరు. పార్టీ ఆఫీసు చుట్టూ కాస్త హడావుడి చేసి వదిలేస్తారు. బిర్యానీ, మందు అడుగుతారు. డబ్బు పంపిణీ చేయమంటే కొంత నొక్కేస్తారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎవరికీ అనుమానం రాకుండా డబ్బు పంపిణీ చేయడం సులభం. కత్తంటూ ఉన్నాక కూరలూ కోయవచ్చు, పీకలూ కోయవచ్చు. ఎన్నికల వేళ వాలంటీరు కత్తితో వైసిపి తమ పీక కోస్తుందనే భయం ప్రతిపక్షాలకు ఉంది. అందుకే ఒకసారి యీ వ్యవస్థను కండెమ్ చేస్తారు, మర్నాడే మేం వస్తే కొనసాగిస్తాం అంటారు.
ప్రభుత్వోద్యోగుల పట్ల కూడా ప్రతిపక్షాల వ్యవహారం యిలాగే ఉంటుంది. ఈ ప్రభుత్వంలో అధికారులందరూ లంచగొండులై పోయారు, మేం అధికారంలోకి వచ్చి వాళ్ల భరతం పడతాం అంటారు. ఎన్నికలు దగ్గర పడేసరికి వాళ్లను మంచి చేసుకోవాలని ఆకాశానికి ఎత్తివేస్తారు. జీతాలు పెంచుతామంటూ హామీలు గుప్పిస్తారు. పోలింగు టైములో వాళ్ల సహకారం లేకపోతే కష్టమనే భయం అలాటిది. ఇప్పుడు వాలంటీర్ల విషయమూ అలాటిదే. వాళ్లతో చెడగొట్టుకుంటే వాళ్లు ఓటర్లను ప్రభావితం చేయగలరన్న భీతి ఉంది. 2.50 లక్షల మంది వాలంటీర్లలో 1.80 లక్షల మంది మహిళలేట. వాళ్లకి యింట్లో లోపలకి వెళ్లే చొరవ ఉంటుంది. మహిళా ఓటర్లతో అవీయివీ ముచ్చటించే చనువు ఉంటుంది. ఏ పార్టీ కైనా అంతమంది చురుకైన మహిళా కార్యకర్తలుండడం అరుదు. ఇవన్నీ ఆలోచించే చంద్రబాబు వాళ్లపై మరీ అంత విరుచుకు పడటం లేదు. రాజకీయంగా ఉపయోగించు కోకపోతే ఆ వ్యవస్థ మంచిదే అంటున్నారీవేళ.
పవన్‌కు యీ యింగితం లోపించింది. 18 వేల మంది అమ్మాయిలు మిస్సయిపోవడానికి వారే కారణం అనేశారు. ఆ అంకెకు ఆధారం లేదు, ఏడాదికి సగటున 3-4 వేల మంది మిస్సవుతున్నారు, 500 మంది తప్ప తక్కినవారందరూ దొరుకుతున్నారని క్రైమ్ రిపోర్టు బ్యూరో చెపుతోంది. కానీ వాళ్లే నాకు స్వయంగా యీ అంకెలు చెప్పి ఆంధ్రులను హెచ్చరించమన్నారు అని పవన్ చెప్పారు. ఎవరైనా ఆర్టీఐ కిందో, పిల్ వేసో ఎన్సిఆర్బిని నిలదీస్తే మేం అనలేదంటే యీయన పరువేం కాను? బలమైన వాలంటీరు వ్యవస్థను, అందునా 70శాతం మహిళలున్న వ్యవస్థపై యిలాటి దారుణమైన అభాండం వేసి మహిళల ఆగ్రహాన్ని మూటగట్టుకోవడం తెలివైన పనా? ఎవరేం చెప్పినా వాలంటీర్లలో అన్ని పార్టీల వాళ్లూ, అన్ని కులాల వాళ్లూ ఉంటారు. ఎవరూ ఒక్క పార్టీకి అంకితమై పోరు, మారిపోతూ ఉంటారు. వాళ్లంతా ఏకమై తాము సేవలందించే కుటుంబాల వాళ్లకు ‘ఎవరికైనా ఓటేయండి తప్ప జనసేనకు వేయవద్దు’ అని కాన్వాస్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి?
ఈ ప్రకటన చేశాక వచ్చిన ప్రతిస్పందన వలననో, హితైషుల సలహా చేతనో పవన్ దీనికి సవరణలు చేయబోయారు. అది కూడా సిఎం అవుతా, చేస్తే అవుతా, అబ్బే కాలేను అనే గందరగోళపు స్టేటుమెంట్ల లాగానే వాలంటీర్లలో కొందర్నే అన్నాను, మీరు తప్పు చేశారు కాబట్టే నిరసన తెలుపుతున్నారు అంటూ పలు రకాలుగా మాట్లాడి పరిస్థితిని విషమంగా చేసుకుంటున్నారు. వాలంటీరు వ్యవస్థపై బురద చల్లదల్చుకుంటే తన సినిమాలో ఓ పాత్ర పెట్టి, అమ్మాయిలను అక్రమరవాణా చేస్తున్నట్లు చూపించి, అక్కసు తీర్చుకోవాల్సింది. ఆ విధంగా వాలంటీరు వ్యవస్థ పట్ల ఆంధ్ర ప్రజల్లో అనుమానాలు నాటాల్సింది. ఇలా బహిరంగంగా ప్రకటించి తన పుస్తకంపై తనే నల్ల యింకు పూసుకోవడం దేనికి? ఇది చూసే నాకు అనుమానం వస్తోంది, యీయన ఎప్పటికైనా రాజకీయ నాయకుడు కాగలడా అని. కూటమి అధికారంలోకి వస్తే యీయన ఉప ముఖ్యమంత్రి కావడం కంటె లోకేశ్ కావడమే బెటరనిపిస్తోంది. మంత్రిగా ఉన్నపుడు అతని రికార్డు మరీ అంత చేటుగా ఏమీ లేదు. అమరావతి డీలింగ్స్ మాట వదిలేయండి. మంత్రిత్వశాఖల నిర్వహణ గురించి మాట్లాడండి.
బాబే పవన్‌కు రోడ్ మ్యాప్ యిస్తున్నారని అనుకునే వాళ్లలో నేనొకణ్ని. మరి యీ మ్యాప్ ఎందుకిచ్చారు అని ఆలోచిస్తే కావాలనే యిచ్చారా అనే సందేహం వస్తోంది. పవన్‌కు గ్రాఫ్ పెరిగిపోతోంది కాబట్టి అతను 30,40 సీట్లు అడిగినా యివ్వాల్సిందే అని టిడిపిలో కొందరు నాయకులు వాదిస్తున్నారని, మన గ్రాఫ్ యింకా యింకా పెరిగిపోతోంది కాబట్టి 15, 20 కంటె ఎక్కువ యివ్వక్కరలేదని, అసలు పొత్తు పెట్టుకోనక్కర లేదని టిడిపిలో మరో వర్గం వాదిస్తోందని వార్తలు వచ్చాయి. మొదటి వర్గం వారి వాదనను బలహీన పరచడానికి బాబు పవన్ మానాన పవన్‌ని వదిలేశారేమో అనిపిస్తోంది. ఆయన యిలా సెల్ఫ్‌గోల్స్ వేసుకుంటూ, వారాహి పూర్తయ్యేనాటికి నానాటికి తీసికట్టు నాగంభొట్లు అయితే మొదటి వర్గం వాళ్లు నోరు మూసుకుంటారు.
ఇవాళ పొత్తు గురించి బాబును అడిగితే యిప్పుడేమీ చెప్పలేం అన్నారు. మేం ప్రేమలేఖ రాస్తే జనసేన బదులివ్వలేదు అంటూ గతంలో వాపోయిన పెద్దమనిషికి యింత ధైర్యం వచ్చింది గమనించండి. వాలంటీరు వ్యవస్థపై టిడిపి, బిజెపిలు అధికారికంగా పవన్‌ను సమర్థించక పోవడం గమనార్హం. ఇలా తనను తాను తగ్గించుకుంటూ పోతున్నానని పవన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.