కల్వకుంట్ల థర్డ్ జెనరేషన్.. పబ్లిక్ లైఫ్ లోకి ఎంట్రీ!

ఇదేమీ రాజకీయ రంగ ప్రవేశం కాదు! అసలు రాజకీయాల ఊసే లేదు!! అలాగని పూర్తిగా రాజకీయ ఆసక్తికి కూడా దూరమైన వ్యవహారం అని కూడా చెప్పడానికి  వీల్లేదు. ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల వారి ఇంట్లో…

ఇదేమీ రాజకీయ రంగ ప్రవేశం కాదు! అసలు రాజకీయాల ఊసే లేదు!! అలాగని పూర్తిగా రాజకీయ ఆసక్తికి కూడా దూరమైన వ్యవహారం అని కూడా చెప్పడానికి  వీల్లేదు. ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల వారి ఇంట్లో మూడో తరం ప్రతినిధి కూడా ప్రజా జీవితంలోకి చాలా ఘనంగా ప్రవేశించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఒక ఉన్నత పాఠశాల నిర్మాణ మరమ్మతులు తదితర పనులను తాను సేకరించిన విధులతో స్వయంగా పూర్తి చేయించి వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

‘‘ఎంతైనా కేసీఆర్ మనవడిని కదా ఏం చేయాలని అనుకున్నా సరే ఏదో ఒక రీతిగా చేసి ముగిద్దాం అనేది ఉండదు. చాలా పట్టుదలతో గొప్పగా చేయాలని అనిపిస్తుంది అందుకే ఈ పనిని కూడా ఇంత గ్రాండ్ గా చేశాను’’ అని కల్వకుంట్ల హిమాన్షు రావు స్వయంగా చెప్పుకున్నారు.

పూర్తిగా దీనస్థితిలో ఉన్న గౌలిదొడ్డిలోని కేశవనగర్  పాఠశాలలో అమ్మాయిలకు మరుగుదొడ్లు సహా అనేక నిర్మాణ కార్యక్రమాలను హిమాన్షు తాను నిర్వహించిన రెండు ఈవెంట్ల ద్వారా సంపాదించిన సొమ్ముతో నిర్మింపజేశారు.

ఇక్కడ అమ్మాయిలకు బాత్ రూములు కూడా లేకపోవడం చూసి, మొదటిసారి ఈ బడికి వచ్చినప్పుడు నా కళ్లమ్మట నీళ్లు వచ్చాయి.. అని హిమాన్షు తన లోని మానవీయ కోణాన్ని నలుగురికీ పరిచయం చేసుకున్నారు. రెండు ఈవెంట్స్ ద్వారా తాము 40 లక్షలు సేకరించామని, సీఎస్ఆర్ ఫండ్స్ కింద మధుసూదన్ సహకరించారని చెప్పారు. స్కూలుకు మంచి చేయాలని అనుకోవడం వెనుక తనకు తాత కేసీఆర్ స్ఫూర్తి ఉన్నదని చెప్పారు. 

భారాస రూపంలో దేశవ్యాప్తంగా పెద్దఅడుగులు వేస్తూ విస్తరించాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర రాజకీయం మొత్తానికి కల్వకుంట్ల తారకరామారావు ఒక్కరే కేంద్రబిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. మూడో తరం ప్రతినిధిగా కల్వకుంట్ల హిమాన్షురావు ప్రజాజీవితంలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా ఉంది.

అప్పుడే రాజకీయ అడుగులు వేయడానికి ఇది సమయం కాదనే ఉద్దేశంతోనే.. సేవాప్రస్థానం మొదలెట్టినట్టు కనిపిస్తోంది. మరి ముందు ముందు హిమాన్షురావు ఇలా భారాస రాజకీయాల్లోకి అడుగుపెడతారో, విస్తరిస్తారో చూడాలి.