నీ డప్పు మోత ఎలా నమ్మాలి పవన్!

‘‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్రా’’ అంటారు పవన్ కల్యాణ్ ఓ సినిమాలో. ఈ విషయంలో ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది. తన డప్పు తానే కొట్టుకోవడంలో ఆయన సదా ముందుంటారు. ఆ విషయంలో ఇవాళ…

‘‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్రా’’ అంటారు పవన్ కల్యాణ్ ఓ సినిమాలో. ఈ విషయంలో ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది. తన డప్పు తానే కొట్టుకోవడంలో ఆయన సదా ముందుంటారు. ఆ విషయంలో ఇవాళ తన ప్రసంగాల్లో ఇంకో మెట్టు పైకి ఎక్కారు. సినిమా రంగం ద్వారా తన సంపాదన గురించి చాలా డాంబికాలు చెప్పుకున్నారు. అయితే అవి నమ్మదగినవా లేదా అనేది తేల్చిచెప్పడం కష్టం. వెనకటికి ఎవడో ఒకడు.. ‘బొంకరా బొంకరా పోలిగా అంటే.. టంగుటూరి మిరాయలు తాటికాయలంత’ అన్నాడట.. పవన్ కల్యాణ్ చెబుతున్న సొంతడబ్బా లెక్కలు కూడా అలాగే ఉన్నాయి.

పవన్ తన తాజా సభలో మాట్లాడుతూ ‘‘దేశంలోని ప్రముఖ నటుల్లో నేను కూడా ఒకడిని. రాజకీయాల్లోకి వచ్చే అవసరం నాకు ఉందా? ప్రజలకు ఉపాధి భద్రత కోసమే రాజకీయాల్లోకి వచ్చా..’’ అంటూ తాను త్యాగమూర్తి ధధీచి అనే లెవెల్లో పోజుగా డైలాగులు కొట్టారు. 

‘రాజకీయాల్లోకి వచ్చే అవసరం నాకుఉందా?’ అని ఆయన అంత ఘాటుగా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ‘‘పవన్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం మాకూలేదని’’ ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో చాలా స్పష్టంగా తేల్చిచెప్పారు. కానీ ప్రజలు తనని ఛీకొట్టారనే సంగతిని ఆమోదించాలంటే పవన్ కు ఈగో అడ్డు వస్తోంది. ఆ ఈగోతోనే ఈ ఎన్నికలకు తగుదునమ్మా అంటూ మళ్లీ సిద్ధమవుతున్నారు.

ప్రజల కోసం తాను చాలా చాలా త్యాగాలు చేసేస్తున్నట్టు జనం నమ్మాలని పవన్ కోరిక. అందుకే తన సినిమా ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను గనుక.. మీరు నన్ను ముఖ్యమంత్రిని చేసేసి.. ఆ ఆదాయాన్ని భర్తీ చేసేయండి.. అని విన్నవించుకుంటున్నట్టుగా ఆయన మాటలు కనిపిస్తాయి. తాజా సభలో.. సినిమాల్లో నేను పూర్తిస్థాయిలో  పనిచేస్తే ఏడాదికి వెయ్యికోట్లు వస్తాయి అని పవన్ కల్యాణ్ సెలవిస్తున్నారు. ఎలా వస్తాయి?

పవన్ స్వయంగా తాను రోజుకు రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానని అనేక సందర్భాల్లో పవన్ స్వయంగా వెల్లడించారు. మరి ఆయన ఏడాదికి 500 రోజులు ఉంటాయని అనుకుంటున్నారో ఏమో మరి? ఏడాదికి ఉండే 365 రోజుల్లో 52 ఆదివారాలు ఖచ్చితంగా తీసేయాలి. 

ఎందుకంటే.. ఆదివారాల్లో సినిమా పరిశ్రమ పనిచేయదు. నాకు రెండు కోట్లు కావాలి మొర్రో అని పవన్ అన్నంత మాత్రాన ఇండస్ట్రీ వినిపించుకోందు. తతిమ్మా రోజులన్నీ పనిచేసినా సరే.. మహా అయితే 620 కోట్లు వస్తాయి. దానికి వెయ్యికోట్లకు తేడా చాలా ఉంది కదా? మరి పవన్ ఏ ఉద్దేశంతో అన్నారో  తెలియదు. 

వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతున్నా.. అనే మాటలతో జనాన్ని మాయచేసి.. వారిలో జాలి పుట్టించి ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నారేమో తెలియదు. అబద్ధాలతో జనాన్ని మోసం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. 

జనానికి చెబుతున్నది అబద్ధం కాదనుకుంటే.. రోజుకు రెండు కోట్లు కాకుండా ఇంకా చాలా ఎక్కువ తీసుకుంటూ.. అటు ఇన్ కమ్ టాక్స్ వాళ్లకి అబద్ధాలు చెబుతూ వారిని బురిడీ కొట్టిస్తూ మోసం చేస్తూ ఉండాలి. ఏదో ఒక తప్పు అయితే పవన్ చేస్తూనే నీతులు వల్లిస్తున్నారని పలువురు అంటున్నారు.