తన వైవాహిక జీవితం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే విమర్శించడం పవన్‌కల్యాణ్‌ను తీవ్రంగా ఇరిటేట్ చేస్తోంది. జనసేన శ్రేణులు అవునన్నా, కాదన్నా… పవన్ వ్యక్తిత్వం మహిళలకు జనసేనను దూరం చేస్తోంది. జనసేన అంటే అమ్మాయిల జీవితాలతో ఆడుకునే సమూహమనే బలమైన ముద్ర పడింది. ఇది చేదు నిజం. జనసేనాని పవన్‌కల్యాణ్ వైవాహిక జీవితం చివరికి జనసేన పార్టీపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనే ఆవేదన ఆ పార్టీలో వుంది. ఆ పార్టీ ఆవేదనలో న్యాయం వుంది. కానీ రాజకీయాల్లో ప్రజల్ని మెప్పించగలిగే వాళ్లే విజేతలు.
ఈ నేపథ్యంలో పవన్ ఎప్పుడు మాట్లాడినా, తన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తన పెళ్లిళ్ల గురించి మాట్లాడొద్దని ఆయన వేడుకుంటున్నారు. తానెప్పుడూ సీఎం వైఎస్ జగన్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడని విషయాన్ని పవన్ గుర్తు చేస్తుండడం గమనార్హం. ఈ పరంపరలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తూ… సీఎం సతీమణి వైఎస్ భారతికి తన గోడు వినిపించారు.
ఎంత దయనీయంగా అంటే… చివరికి మీ కాళ్లు మొక్కుతా అని పవన్ వేడుకోవాల్సి వచ్చింది. వైఎస్ భారతికి పవన్ విన్నపాన్ని ఆయన మాటల్లోనే…
“మీ సతీమణి భారతి గారు నాకు సోదరి సమానురాలు. నేనెప్పుడూ ఆమె ప్రస్తావన తీసుకురాలేదు. జగన్ మాత్రం నా భార్యను పెళ్లాం అని సంబోధిస్తారు. భారతి గారూ…మీ కాళ్లు మొక్కుతా. మీ వారిని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. మేం మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం. మీ వారినీ అలాగే మాట్లాడాలని చెప్పండి” అని రెండు చేతులు జోడించి మరీ వేడుకోవడం విశేషం. అంతేకాదు, తన భార్యల్ని పెళ్లాలని జగన్ అనడంపై కూడా పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయలసీమలో భార్యని పెళ్లాం అని అనడం వాడుక భాష. అంతే తప్ప, పవన్ భావిస్తున్నట్టు పెళ్లాం అనడం బూతు పదం కాదు.
వారాహి యాత్రలో పవన్ ప్రస్ట్రేషన్ బయట పడుతోంది. వైఎస్ జగన్ భార్యల గురించి విమర్శించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్టు అర్థమవుతోంది. బహుశా పవన్ పర్సనల్ లైఫ్‌ను టచ్ చేయకపోతే పవన్ మౌనవ్రతాన్ని ఆశ్రయిస్తారా? అనే చర్చకు తెరలేచింది. కానీ వైసీపీ చెబుతున్న సమాధానం వేరే. తమ నాయకుడిని అకారణంగా పవన్ ద్వేషించడం వల్లే …జగన్ కూడా విమర్శల దాడి చేయాల్సి వస్తోందంటున్నారు. అయినా జగన్ కల్పించి చెబుతున్నదేదీ లేదని గుర్తు చేస్తున్నారు.
పవన్ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకోగా లేని తప్పు, సీఎం వైఎస్ జగన్ ఆ నిజాన్ని చెబితే మాత్రం ఎందుకు కోపం వస్తోందని వైసీపీ ప్రశ్నిస్తోంది. వైఎస్ జగన్ ఎప్పుడూ పవన్ భార్యల్ని విమర్శించలేదని, ఆయన ప్రశ్నిస్తున్నదల్లా పోకిరీ ఎదవల్లా నాలుగేళ్లకు ఒక మహిళను పెళ్లి చేసుకుంటూ, వారి జీవితాలతో ఆడుకోవడాన్ని మాత్రమే అని అంటున్నారు.
పవన్‌కల్యాణ్ జనంలోకి వెళ్లి ప్రజాసమస్యల గురించి మాట్లాడకుండా, తన పెళ్లాం, తల్లి, పిల్లల గురించి ఏడుస్తూ చెబుతూ, సానుభూతి పొందాలని కోరుకోవడం ఏంటని వైసీపీ నిలదీస్తోంది. ఇకనైనా సొంత రాజకీయాలు చేసుకుంటే అభ్యంతరం లేదని, దత్త తండ్రి కళ్లలో ఆనందం కోసం వైఎస్ జగన్‌పై అవాకులు చెవాకులు పేలితే ఆయనకే నష్టమని వైసీపీ హెచ్చరిస్తోంది.