మాజీ మంత్రి అఖిలప్రియ నంద్యాలలో తన అన్న భూమా బ్రహ్మానందరెడ్డికి పక్కలో బల్లెం తీసుకొచ్చారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి వ్యక్తిగతంగా సౌమ్యుడు. ఎప్పుడూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు తప్ప, ఏనాడూ ఆయన వ్యక్తిగత విమర్శలు చేయరు. నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి కూడా హుందాగా వ్యవహరిస్తారు.
నంద్యాలలో పాగా వేసేందుకు మాజీ మంత్రి అఖిలప్రియ గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. నంద్యాలలో తనకంటూ ప్రత్యేక కార్యాలయాన్ని తెరిచి రాజకీయానికి తెరలేపారు. అఖిలప్రియ వైఖరి బ్రహ్మానందరెడ్డికి కోపం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అఖిలప్రియ వ్యవహారశైలి నంద్యాల టీడీపీ నేతలకు ఆగ్రహానికి గురవుతోంది. నంద్యాలలో భవిష్యత్ గ్యారెంటీ చైతన్య రథయాత్ర బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు అఖిలప్రియ ప్రయత్నించారనేది బ్రహ్మానందరెడ్డి వర్గీయులు వాదన. సరిగ్గా ఇదే రోజు నంద్యాలకు చెందిన లాయర్ తాతిరెడ్డి తులసిరెడ్డిని లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేర్పించేందుకు అఖిలప్రియ నిర్ణయించారు. ఇదంతా నంద్యాల టీడీపీ ఇన్‌చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డితో సంబంధం లేకుండా చేయడం గమనార్హం.
ఒకవైపు నంద్యాలలో చైతన్య రథ యాత్ర చేపడుతుంటే, మరోవైపు తాము వద్దనుకున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడం ఏంటంటూ నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జ్ మాండ్ర శివనాందరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ పెద్దలకు ఫోన్ చేసి నిలదీసినట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో తమకు సంబంధం లేకుండా ఎవరెవరినో పార్టీలో చేర్చుకుంటే, ఇక తామెందుకని ప్రశ్నించినట్టు తెలిసింది.
కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని పార్లపల్లిలో లోకేశ్ సమక్షంలో తులసిరెడ్డికి పసుపు కండువా కప్పారు. దీంతో నంద్యాలలో బ్రహ్మానందరెడ్డికి పక్కల బల్లెం తీసుకురావడంలో అఖిలప్రియ సక్సెస్ అయ్యారు. నంద్యాలలో తులసిరెడ్డిని టీడీపీ అభ్యర్థిగా పోకస్ చేయడానికి ఇదంతా అఖిలప్రియ చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. అన్నపై అక్కసుతోనే అఖిలప్రియ తనది కాని నంద్యాల పరిధిలోకి వెళ్లి ఓవర్‌యాక్షన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఏమవుతుందో చూడాలి.