ముఖ్యమంత్రి తన పవర్ ని ఏం వాడుతున్నట్టు?

పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంలో తనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను సంపూర్ణంగా వాడుకుంటున్నాడు. తన మాటలకు తనపై దాడి జరగాలనే కోరుకుంటున్నట్టున్నాడు. అప్పుడే కదా తనకి జాతీయస్థాయి గుర్తింపు లభించేది. లేకపోతే ఆటలో అరటిపడు అనుకునే ప్రమాదముంది.  …

పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంలో తనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను సంపూర్ణంగా వాడుకుంటున్నాడు. తన మాటలకు తనపై దాడి జరగాలనే కోరుకుంటున్నట్టున్నాడు. అప్పుడే కదా తనకి జాతీయస్థాయి గుర్తింపు లభించేది. లేకపోతే ఆటలో అరటిపడు అనుకునే ప్రమాదముంది.  

వాలంటీర్ల మీద హ్యూమన్ ట్రాఫికింగ్ నెపం వెస్తే వాలంటీర్లు స్పందించారు. పవన్ దిష్టిబొమ్మలు తగలపెట్టారు, “దమ్ముంటే మాతో పోటీ చేసి గెలిచి చూపించు పవన్!” లాంటి ఛాలెంజులు విసిరారు. 

ఎప్పటి మాదిరిగానే కాపు వర్సెస్ కాపు ఫార్ములాగా పేర్ని నాని, అంబటి రాంబాబులు మాట్లాడారు.

మహిళా వాలంటీర్ల తరపున రోజా మాట్లాడింది.

ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కి విరోధిగా గుర్తింపున్న పోసాని మాట్లాడాడు.

సోషల్ మీడియాలో వైకాపా అభిమానులు పోష్టులు పెట్టారు.  

వీళ్లంతా సరే..అసలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఇది ఏకంగా తాను ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ మీద వేసిన భయంకరమైన నింద. 

కచ్చితంగా పవన్ వాలంటీర్స్ పై వేసిన అభియోగాలకి సమాధానం చెప్పడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదురుదాడి చేయడం..ఈ రెండూ పార్టీ ఓటర్స్ కానీ ఆశిస్తారు. అది ఆయన బాధ్యత.

ఎప్పుడో వారానికొకసారి ఎక్కడో జనం ముందు ప్రసంగిస్తూ పవన్ ని “దత్తపుత్రుడు” అని పిలవడమే పెద్ద కౌంటర్ అనుకుంటూ పిలిచి, మళ్లీ కనపడకుండా పోతే సరిపోదు. పవన్ ప్రతిరోజూ అభియోగాలు వేస్తున్నాడు. 

నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తలచుకుంటే పవన్ మీద ప్రతిదాడిని పద్ధతిగానే చేయొచ్చు. 

చంద్రబాబునాయుడికి సింగపూరులో హోటల్ బిజినెస్ ఉందని ఎప్పటినుంచో ఓపెన్ సీక్రెట్ గా వినిపిస్తున్న విషయం. మహా అయితే బినామీ పేరుతో ఉండొచ్చేమో తప్ప ఫలానా ఆ హోటల్ కి ఓనర్ ఆయనే అని తెలిసినవాళ్లు చెబుతుంటారు. 

అదలా ఉంటే గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాన్ సతీమణి అన్నా లెనోవా సింగపూర్ లో నివశిస్తున్నారని వినికిడి. ప్రపంచంలో అన్ని దేశాలుండగా, ఆమె సొంత దేశం రష్యా ఉండగా ఒక్క సింగపూరులోనే ఎందుకు? చంద్రబాబు- పవన్ ల మధ్య లావాదేవీలు ఇండియా లెక్కల్లోకి రాకుండా సింగపూరులోనే సెటిలైపోతున్నాయా అన్న కోణంలో ఒక చిన్న నిఘా వేస్తే డొంకంతా కదులుతుంది కదా. ఈ పరిశోధన సామాన్యులు చెయలేకపోవచ్చు కానీ, భారత ప్రధానమంత్రి, హోం మంత్రి అండదండలున్న ఒక ముఖ్యమంత్రి తలచుకుంటే ఎంత సేపు పని? పైగా పవన్ కళ్యాణ్ కి తన భార్యాపిల్లల పోషణకి తప్ప వేరే దేనికీ పెద్దగా ఖర్చు పెట్టరని కొందరు చెబుతుంటారు. కనుక ఒకవేళ ప్యాకేజీ అన్నదే నిజమైతే ఆ సొమ్ములో కొంత భాగం నేరుగా తన భార్యకు అందేలా సింగపూరులోనే ఏర్పాట్లు జరిగుండొచ్చు కదా? ఈ దిశగా పరిశోధించి అందులో ఏవైనా ఆధారాలు దొరికితే ప్రజల ముందు పెట్టొచ్చు కదా! 

ముఖ్యమంత్రికోసం ఈ మాత్రం సలహా ఇచ్చి పనిలోకి దిగే నాయకులు ఆయన చుట్టూ లేరా? ప్రతివాళ్లు మనకెందుకులే…ఆ గోలేదో ఆయనే చూసుకుంటాడు..అంతగా అడిగితే ఆలోచిద్దాంలే అని అనుకుంటున్నారా ఆ నాయకులు, సలహాదారులు? ఏమో! 

ఇదంతా ఒకెత్తైతే అసలు ముఖ్యమంత్రే పవన్ ని సీరియస్ గా తీసుకోవట్లేదేమో అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్లు ఇస్తున్న సర్వే రిపోర్ట్స్ తో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 140-150 ఎమ్మెల్యే సీట్లు కచ్చితంగా వైకాపా గెలవబోతోందని ఊదరగొడుతున్నట్టున్నారు ఆయన ముందు. అంటే ఘనవిజయం ఖాయం అని బలంగా నమ్ముతున్నారు కనుక పవన్ ముఖ్యమంత్రికి టైం పాస్ బటానీలా కనిపిస్తున్నాడేమో?! ఇలాంటి లగడపాటి సర్వేలని నమ్మే చంద్రబాబు దారుణంగా ఓటమి పాలయ్యాడు. సర్వేలని నమ్ముకుంటూ జనం మధ్యలో తిరగాల్సిన అవసరం లేదనుకుంటూ కోటలో కూర్చుంటే రేపు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం తధ్యం. 

చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలని అంటుంటారు. తాను నెలకొల్పిన వ్యవస్థ మీద వ్యభిచార ముద్ర వేసిన తరవాత కూడా జగన్ మోహన్ రెడ్డి ఉపేక్షించడం ఆశ్చర్యకరం. 

అన్నిసార్లూ పాతమందే సరిపోదు. పవన్ కళ్యాణ్ చరిత్రేమీ కడిగిన ముత్యం కాదు. అన్నీ వివాదాలే.

సింగపూరు దాకా ఎందుకు కానీ, అతని బాధితురాలైన ఒక పంజాబి కుటుంబానికి చెందిన తెలుగు హీరోయిన్ ని సంప్రదించి మీడియాలో మాట్లాడించగలిగినా సరిపోతుంది. ఈ మాత్రం కూడా ఎందుకు చేయడంలేదో! 

అంతే కాదు “హరిహర వీర మల్లు” నిర్మాత ఎప్పుడెప్పుడు పవన్ తన సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడా అని పడిగాపులు కాస్తున్నాడు. అతన్ని కదిపితే ఆఫ్ ద రికార్డులో పవన్ టార్చర్ చిట్టా తెరవచ్చు. 

మైత్రీ బ్యానర్ దగ్గర భారీ అడ్వాన్సులు పుచ్చుకుని అదిగో ఇదిగో అంటూ సినిమా చేయకుండా కాలయాపన చేస్తున్నాడు. వాళ్లని అడిగితే చెవిలోనైనా తమ బాధలు పంచుకోవచ్చు. 

గత కొన్నేళ్లుగా పవన్ ని నమ్ముకుని బాగుపడ్డ నిర్మాతే లేడు. వకీల్ సాబ్, భీంలా నాయక్ లు కూడా ఆర్ధికంగా లాసులే. ఈ విషయం దిల్ రాజే స్వయంగా మీడియాకి చెప్పాడు. 

ఈ లాసులకి కారణం పవన్ పిండి వసూలు చేసే భారీ పారితోషకమే. 

సినిమా తేడా కొడితే, తనని నమ్మి సినిమా తీసిన నిర్మాతకి కొంతైనా నష్టాన్ని భర్తీ చేయడం అసలైన హీరోయిజం. అబ్బే! అది పవన్ నిఘంటువులో లేదని చెబుతుంటారు. “కాటమరాయుడు” పంపిణీదారుడు ఒకసారి రోడ్డునపడి మీడియాకెక్కినా పవన్ పట్టించుకోలేదు. తన రంగానికి చెందిన నిర్మాతల్ని, పంపిణీదారుల్ని ఆదుకోలేనివాడు ప్రజల్ని ఆదుకుంటాడా అని ఎక్స్పోజ్ చేయొచ్చు కదా!  

తన చుట్టూ ఉన్న 151 ఎమ్మెల్యేలని జగన్ నిద్రలేపరా? మాట్లాడుతున్న నలుగురైనా కేవలం స్టేట్మెంట్స్ తో కాకుండా కంటెంట్ తో కొట్టరా?

ఎవరిని మీడియాలో ఎటాక్ చేయడానికైనా కంటెంట్ వెతుక్కోవాలేమో కానీ పవన్ గురించి మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. అలాంటి వాడిని కూడా ఎక్స్పోజ్ చేయకుండా మిన్నకుండడం జగన్ మోహన్ రెడ్డి చేతకానితనమే అనిపించుకుంటుంది. 

– హరగోపాల్ సూరపనేని