విశాఖలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని, క్షమించమంటూ వేడుకున్నారు.
కాగా కొంతకాలంగా పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల మధ్య సీట్ వార్ నడుస్తోంది. ఇటీవల పెందుర్తిలో జరిగిన పరిమాణాలతో రమేష్‌బాబు అసంతృప్తితో ఉన్నారు. ఈ నెల 8న పెందుర్తిలో జరిగిన వైయస్ఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అదీప్ రాజ్‌ను పెందుర్తిలో మళ్లీ అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.. దీంతో పంచకర్ల తనకు సీటు రాదని భావించి పార్టీ వీడినట్లు తెలుస్తోంది.
రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటుగా పంచకర్ల రమేష్ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో రమేష్‌బాబు ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడారు. 2020లో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన వచ్చే ఎన్నికల లోపే పార్టీ వీడారు.