చంద్రబాబు సత్యవాక్కు: సంపదసృష్టి నిజమే!

చంద్రబాబునాయుడు ఒక సత్యం పలికారు. అమరావతిని సంపద సృష్టించే ఒక వ్యవస్థగా ఆయన ఒప్పుకున్నారు. ఇన్నాళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది కూడా అదే. అదే సత్యాన్ని ఇవాళ చంద్రబాబునాయుడు కూడా ఒప్పుకున్నారు. …

చంద్రబాబునాయుడు ఒక సత్యం పలికారు. అమరావతిని సంపద సృష్టించే ఒక వ్యవస్థగా ఆయన ఒప్పుకున్నారు. ఇన్నాళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది కూడా అదే. అదే సత్యాన్ని ఇవాళ చంద్రబాబునాయుడు కూడా ఒప్పుకున్నారు. 

అమరావతి అనేది.. తన దోపిడీకి మార్గంగా చంద్రబాబునాయుడు మార్చుకున్నాడనే విషయాన్నే జగన్ చెప్పారు. ఒక సామాజికవర్గం బాగుపడడం కోసం, చంద్రబాబు ఆయన అనుయాయులు పెద్ద ఎత్తున భూబాగోతాలకు పాల్పడి.. పేదల కడుపుకొట్టి అడ్డదారిలో కుబేరులు అయిపోవడానికి మార్గంగా అమరావతిని మార్చుకున్నారనే సంగతినే జగన్ కూడా చెప్పారు. ఆ సంగతిని ఒప్పుకోవడానికి చంద్రబాబు చాలా కాలం మొండికేశారు గానీ.. ఎట్టకేలకు ఒప్పుకున్నారు.

చంద్రబాబునాయుడు.. రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తానని, పేదల బతుకులు మార్చేస్తానని ఏదో మెజీషియన్ కబుర్లు చెబుతున్నారు. పీ4 అనే పద్ధతిలో పేదలందరినీ పూర్ టూ రిచ్ గా మార్చేస్తానని ఆయన సెలవిస్తున్నారు. పబ్లిక్ ప్రెవేటు పీపుల్ భాగస్వామ్యం అంటూ ఏదో తారకమంత్రాన్ని చెబుతున్నారు గానీ.. అది నరమానవులకు అర్థమయ్యే ఫార్మాట్ కాదు. పాపం చంద్రబాబునాయుడు ఆ సత్యాన్ని కూడా ఒప్పుకుంటున్నారు. ఈ ఫార్ములా ఎవ్వరికీ అర్థం కాదు అని ఆయనే అంటున్నారు. తద్వారా.. ఎవ్వరికీ బోధపడని మాయను తాను చేయబోతున్నట్టుగా చెబుతున్నారు.

అయితే ఈ పీ4 విధానం గురించి ప్రజలకు కలుగుతున్న సందేహం ఒక్కటే. ప్రస్తుతం పేదలకు కేవలం రోజుకు రూ.150 మాత్రమే దక్కుతోందని అంటున్న చంద్రబాబునాయుడు.. దాన్ని కాస్తా 200 దాకా పెంచేసి.. అక్కడితో వారంతా రిచ్ అయిపోయినట్టుగా ప్రకటించేస్తారా? అనేది ఒకటో సందేహం. అలాగే.. అందరూ రిచ్ అయిపోయారనే ప్రకటన తర్వాత.. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ అందకుండా కోత పెడతారా? అనేది రెండో సందేహం.

చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని అనే ప్రకటననే తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, రియల్ దోపిడీకి ఒక అడ్వర్టయిజ్మెంట్ లాగా వాడుకున్నారనే ఆరోపణలు తొలినుంచి ఉన్నాయి. ఇప్పుడు ఆయనే అమరావతి అనేది సంపదను సృష్టించే వ్యవహారం అని దానిని జగన్ నాశనం చేసేశారని వాపోతున్నారు. 

అమరావతి ముసుగులో తాను వేల కోట్లు సంపద వెనకేసుకోవాలని అనుకుంటే.. జగన్ ఆ కోరికలను భగ్నం చేసినందుకు చంద్రబాబు ఓర్వలేకపోతున్నట్టుగా ఉంది. మూడు రాజధానుల రూపేణా రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరగాలని జగన్ అనుకుంటుండగా.. చంద్రబాబు దానిని కేవలం అమరావతి ద్వారా సంపద వెనుకేసుకోవడం కోసం వ్యతిరేకిస్తున్నట్టుగా.. తాజా ప్రకటనలను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.