2020 ఏప్రిల్‌లో ‘‘బ్రెజిల్లో ట్రంప్ తమ్ముడు’’ అనే వ్యాసం రాశాను. కరోనాతో వ్యవహరించే తీరులో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ట్రంప్‌కు తమ్ముడిలా ఉన్నారనే భావంలో అది రాశాను. అతనికి ‘ట్రంప్ ఆఫ్ ట్రాపిక్స్’ అనే బిరుదు నిచ్చింది స్థానిక మీడియా. అతను మరో విధంగా కూడా ట్రంప్‌ను అనుకరించాడని జనవరి రెండోవారంలో రుజువైంది. బైడెన్ చేతిలో పరాజితుడైనా ట్రంప్ ఓటమిని ఒప్పుకోలేదు. ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఆరోపించాడు. అతని స్టాఫ్ అధికారాన్ని అప్పగించడానికి ఒప్పుకోలేదు. వైట్ హౌస్ ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తే తన అనుచరులచేత పార్లమెంటుపై 2021 జనవరి 6న దాడి చేయించాడు. బొల్సొనారో అతన్ని ఆదర్శంగా తీసుకున్నాడు. అక్టోబరులో రెండు విడతలుగా ఎన్నికలు జరిగి, నెలాఖరుకి మాజీ అధ్యక్షుడు లూలా 50.9% ఓట్లతో నెగ్గినట్లు చేసిన ప్రకటనను బొల్సొనారో తిరస్కరించాడు. తన అనుయాయుల చేత హైవేలను ట్రక్కులతో బ్లాక్ చేయించాడు. జనవరి 1న అధికారం అప్పగించేవేళకి దేశం విడిచి అమెరికాకు వెళ్లిపోయాడు.
అంతేకాదు, ట్రంప్ తరహాలో తన అనుయాయులను రెచ్చగొట్టి వాషింగ్టన్ ఘటన జరిగిన సరిగ్గా రెండేళ్లకు జనవరి 8న బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో అధ్యక్షభవనం, పార్లమెంటు భవనం, సుప్రీం కోర్టులపై దాడి, విధ్వంసం చేయించాడు. సైన్యం కలగజేసుకుని ప్రజాస్వామికంగా ఎన్నికైన లూలాను గద్దె దింపి, బొల్సొనారోకు మళ్లీ అధికారం అప్పగించాలని దుండగుల డిమాండ్. ఒక వ్యూహం ప్రకారం బ్రెజిల్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో వేలాది మంది వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ఆందోళనకారులను తీసుకుని వచ్చిన బస్సుల ఖర్చు ఎవరు భరించారా అని చూస్తే బొల్సొనారో హయాంలో అమెజాన్ అడవులను నరికివేతతో బాగుపడిన వ్యాపారవర్గాలని తేలింది. 100 బస్సుల్లో విధ్వంసకారులు వచ్చిపడినా ఏమీ చేయకుండా పోలీసులు వేడుక చూడడం కూడా బొల్సొనారోకు వ్యవస్థపై ఉన్న పట్టు సూచిస్తోంది.
21.5 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్ పరిణామాలు మనకు ముఖ్యమైనవే. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) కూటమిలో మనమూ, ఆ దేశమూ భాగస్వాములమే. అనేక వ్యాపార లావాదేవీలున్నాయి. బ్రెజిల్ గురించి, కొత్త అధ్యక్షుడైన లూలా గురించి, బొల్సొనారో పాలన గురించి కాస్త తెలుసుకోవడం అవసరమే. దక్షిణమెరికాలో జనాభా రీత్యా ప్రథమస్థానంలో ఉన్న బ్రెజిల్ ఆ ఖండంలోని ప్రజాస్వామ్య రాజ్యాల్లో ముఖ్యమైనది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అక్కడ 1946లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడి 18 ఏళ్ల పాటు నడిచింది. 1964లో దాన్ని కూలదోయడానికి అమెరికా ప్రభుత్వం సిఐఏ ద్వారా బ్రెజిల్ సైన్యం చేత కుట్ర చేయించింది. సైన్యాధికారులు అధికారంలోకి వచ్చి కమ్యూనిజం వ్యతిరేకత, ఆర్థిక పరిపుష్టి, జాతీయవాదం తమకు మార్గదర్శక సూత్రాలని ప్రకటిస్తూ, మూడేళ్ల తర్వాత రెండు పార్టీల విధానాన్ని తెచ్చారు. తమను వ్యతిరేకించే పార్టీల నాయకులందరినీ జైళ్లల్లో కుక్కారు.
చివరకు 1985లో సైనిక పాలన అంతమై బహుళ రాజకీయపక్షాల ప్రజాస్వామ్యం అమలులోకి వచ్చింది. ప్రజాస్వామ్యం అనగానే కుడికి, ఎడమకు లాగే పార్టీలు, విభిన్న అభిప్రాయాలున్న వర్గాలు అన్నీ చురుగ్గా పని చేస్తాయి. అప్పుడప్పుడు రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. అదను చూసి సైన్యం కుట్ర చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. పాకిస్తాన్లో చూస్తున్నాం కదా, బ్రెజిల్‌లోనూ సైన్యం తమతో సత్సంబంధాలున్నవారికి అండగా నిలుస్తూ ఉంటుంది. సైన్యానికి యిష్టుడైన బొల్సొనారో ఒకప్పుడు సైన్యంలో పని చేశాడు. మధ్యస్థాయి సైనికాధికారులకు జీతాలు పెంచాలని ఆందోళన చేసి సైనికులకు ఆత్మీయుడయ్యాడు. రాజకీయాల్లోకి వచ్చాక సైన్యం, ఇతరులను క్రైస్తవంలోకి మార్చాలని కంకణం కట్టుకునే ఎవాంజలిస్టులనే క్రైస్తవ ఛాందసవర్గాలు (ఓటర్లలో 31% మంది వీళ్లే, అమెరికాలో యీ వర్గం వాళ్లు ట్రంప్‌కు మద్దతిస్తారు), అతివాద రైటిస్టులు, వ్యాపారవర్గాలు అతనికి అండగా నిలవడంతో 2018 ఎన్నికలలో అధ్యక్షుడిగా గెలిచాడు. ‘‘బ్రెజిల్లో మతరాజకీయాలు’’ పేర నేను రాసిన వ్యాసం మరిన్ని వివరాలిస్తుంది.
కానీ అతని విధానాల కారణంగా కరోనాతో 7 లక్షల మంది మరణించడం, 35 లక్షల కేసులు రావడం, ఆర్థికవ్యవస్థ కునారిల్లి 11% ద్రవ్యోల్బణానికి చేరడం, నిరుద్యోగిత 14.4% కు చేరడం, సైన్సు, పర్యావరణ సంస్థలకు నిధుల కోత విధించడం, స్థానిక తెగల హక్కులు హరించడం వంటి కారణాల వలన ప్రజలు విముఖులయ్యారని గ్రహించి, తన ఓటమిని పసిగట్టి, బొల్సొనారో ‘నన్ను నా స్థానం నుంచి దేవుడో, మరణమో, మోసపూరితమైన ఎన్నికలో తప్పిస్తాయి తప్ప అన్యథా వీలుపడదు’ అనే పల్లవిని ముందుగానే ఎత్తుకున్నాడు.
కితం ఏడాదే ఒక సమావేశం ఏర్పరచి ట్రంప్ తాలూకు రిపబ్లికన్ పార్టీ వాళ్లను ఆహ్వానించాడు. వచ్చినవారిలో ట్రంప్ కొడుకు ఉన్నాడు. అతను రాబోయే బ్రెజిల్ ఎన్నికలను చైనా హ్యేక్ చేస్తుందని జోస్యం చెప్పాడు. ట్రంప్ రాజకీయ సలహాదారు స్టీవ్ ‘యంత్రాల సహాయంతో విజయాన్ని అపహరిస్తే తప్ప బొల్సొనారోదే గెలుపు’ అని ప్రకటించాడు. ఎన్నికలు వచ్చేసరికి ఓట్లను లెక్కించే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా, మిలిటరీ కూడా సమాంతరంగా ఓట్లు లెక్కించాలని బొల్సొనారో డిఫెన్స్ మినిస్టర్ చేత ప్రకటింప చేశాడు. తొలి విడత పోలింగులో తన కంటె లూలాకు మెజారిటీ రావడంతో ‘మిలటరీ వాళ్లు ధృవీకరించే దాకా దీన్ని నేను నమ్మను.’ అన్నాడు. మిలటరీ అధికారికమైన ప్రకటన ఏదీ చేయలేదు. ఓటమి తర్వాత పరాజితులైన అందరిలాగానే బొల్సొనారో ఇవిఎంల్లో దగా జరిగిందని ఆరోపించాడు.
ఎన్నికలలో నెగ్గిన లూలా సాధారణ కుటుంబం నుంచి వచ్చి కార్మిక నాయకుడిగా ఎదిగి, ఖ్యాతి గడించాడు. 1980లో వర్కర్స్ పార్టీని స్థాపించడంలో పాలు పంచుకున్నాడు. 2003లో దేశాధ్యక్షుడై, 2010 వరకు కొనసాగాడు. తన హయాంలో దేశానికి ఆర్థిక ప్రగతి సాధించాడు. అంతర్జాతీయ విపణిలో ఉన్న పెట్రోలుకి పెరిగిన డిమాండును ఉపయోగించుకుని ఎగుమతుల ద్వారా వచ్చిన డబ్బుతో సంక్షేమపథకాలకు నిధులు సమకూర్చాడు. షరతులతో కూడిన నగదు బదిలీ పథకం ద్వారా 2 కోట్ల మందికి దుర్భరదారిద్ర్యం నుంచి విముక్తి కల్పించాడు. 2007లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తక్కిన దక్షిణమెరికా దేశాల్లో వామపక్షవాదులు అధికారంలోకి వచ్చినపుడు సంపన్నవర్గాలను అణచడానికి చూశారు. కానీ లూలా సంప్రదింపులు జరుపుతూ వారితో సహజీవనం సాగించాడు. ఈ రాజీ ధోరణి వలన వ్యవస్థపై పెద్ద కార్పోరేట్ల ప్రభావం కొనసాగింది.
2010లో లూలా పదవి నుంచి దిగిపోతూ తన శిష్యురాలైన దిల్మాకు పార్టీ అప్పగించాడు. ఆమె ఘర్షణ ధోరణి అవలంబిస్తూనే ఆర్థికసంస్కరణలు అమలు చేసింది. వాటి వలన మరింత ధనవంతులైన ఆగ్రో ఎకానమీ రంగానికి చెందిన వారు అన్ని పార్టీల రాజకీయనాయకులకు అవినీతి మప్పారు. దిల్మా కాబినెట్లో కూడా అనేక మంది అవినీతికి పాల్పడ్డారు. తమను రక్షించనందుకు వాళ్లు ఆమెపై కత్తి కట్టారు. వాళ్లకు రైటిస్టులు, వారి అధీనంలో ఉన్న మీడియా తోడయ్యాయి. పెట్రోబ్రాస్ (పెట్రోలియం కార్పోరేషన్) కుంభకోణం, కార్ వాష్ కుంభకోణం వెలుగులోకి వచ్చాయి. దిల్మా స్వయంగా లంచాలేమీ తీసుకోకపోయినా 2003 నుండి 2010 వరకు పెట్రోబ్రాస్ బోర్డు ఆఫ్ డైరక్టర్లలో ఒకరిగా వుంది కాబట్టి ప్రజలు ఆమెనూ దోషిగా చూశారు. ఆమెకు వ్యతిరేకంగా 2015లో బ్రెజిల్లో లక్షలాది మందితో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆమెను అభిశంసించి పదవీచ్యుతురాలిని చేశారు. ఈ పరిణామాలు వివరంగా తెలుసుకోవాలంటే ఎమ్బీయస్: బ్రెజిల్ రాజకీయ సంక్షోభం చదవండి.
ఆమె వారసులు సరిగ్గా పాలించలేక పోవడంతో, రైటిస్టు వర్గాల మద్దతుతో 2018లో అతివాద రైటిస్టు ఐన బొల్సొనారో అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల రంగంలో లూలా ఉంటే అతని గెలుపు సాధ్యపడదనే భయంతో రైటిస్టులు కార్ వాష్ స్కాండల్‌లో లూలా పేరు యిరికించి, 22 ఏళ్ల శిక్ష వేసి జైలుకి పంపించి 2018 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధింప చేశారు. అయితే ఈ తీర్పు యిచ్చిన న్యాయమూర్తి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడని నిరూపిస్తూ 2019లో ఒక జర్నలిస్టు డాక్యుమెంట్లు బయటపెట్టడంతో సుప్రీం కోర్టు 2021 మార్చిలో లూలాపై కేసు కొట్టేసి, అధ్యక్షపదవికి పోటీ చేయవచ్చంది. లూలాను జైలుకి పంపి తనకు సహకరించిన జజ్‌ను బొల్సొనారో తన ప్రభుత్వంలో న్యాయశాఖా మంత్రిగా నియమించి ఋణం తీర్చుకున్నాడు.
మాజీ సైనికాధికారి ఐన బొల్సొనారోకు సైనిక నియంతృత్వం మీదే మక్కువ. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నా, పర్యావరణ రక్షణ అన్నా ఏహ్యత. నిరంకుశ పాలకులకు, సైనికనియంతృత్వానికి దక్షిణమెరికా పేరుబడింది. తన నేతృత్వంలో సైనికపాలన తిరిగి తేవాలని అతని ప్రయత్నం. దానికి గాను కమ్యూనిస్టు బూచి చూపించి కార్పోరేట్ వర్గాల, మతాధికారుల మద్దతు కూడగట్టుకున్నాడు. అయితే కరోనాను ఎదుర్కోవడంలో ఘోరవైఫల్యం చెందడం, అధికధరలను నియంత్రించలేక పోవడంతో జనాభాలో సగం మందికి తిండి లేకుండా పోయింది. 33% మంది దారిద్ర్యరేఖ దిగువకు వెళ్లిపోయారు. అతని పట్ల ప్రజలు విముఖులయ్యారు. దాన్ని తట్టుకోవడానికి అతను నగదు బదిలీ పథకాన్ని పునరుద్ధరించాడు. కానీ దానివలన గ్రాస్ డెట్, జిడిపిల నిష్పత్తి 90% అయిపోయింది.
బొల్సొనారోకు కోర్టులంటే మంట. తన మీద, తన బంధువుల మీద అవినీతి ఆరోపణలను విచారిస్తున్న సుప్రీం కోర్టుతో పేచీ పెట్టుకున్నాడు. కోర్టు కూడా తగ్గలేదు. ప్రజాస్వామ్యం పరిరక్షించడం తమ బాధ్యత అని ప్రకటించింది. బొల్సొనారోకు సన్నిహితంగా ఉన్న కొందరు వ్యాపారస్తులను అరెస్టు చేయించింది. ఇలా అయితే మిలటరీ చేత కుట్ర చేయించాల్సిందే అని వారిలో కొందరు జరిపిన వాట్సప్ సంభాషణ బయటకు వచ్చేసింది. బొల్సొనారో అనుయాయి అయిన ఒక ప్రజాప్రతినిథికి కోర్టు 9ఏళ్ల శిక్ష విధిస్తే బొల్సొనారో తన అధికారాన్ని వినియోగించి మర్నాడే అతనికి క్షమాభిక్ష పెట్టేశాడు. కోర్టును తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఒక ఇవాంజలిస్టు పాస్టర్‌ను జజ్‌గా నియమించాడు. తను తిరిగి ఎన్నికైతే కోర్టును తన మనుషులతో నింపేస్తానని బహిరంగంగా చెప్పాడు.
ఇక సైన్యాన్నయితే అక్కున చేర్చుకున్నాడు. సైన్యంలో పని చేస్తున్న లేదా రిటైరైన వారితో కాబినెట్, ప్రభుత్వపదవులు నింపేశాడు. అతని కాబినెట్లో 23 మంది అలాటివారే. అతని ఉపాధ్యక్షుడు హేమిల్టన్ మాజీ జనరల్. గతంలో లూలా అధ్యక్షుడిగా ఉండగా అతను సైన్యంతో లౌక్యంగా వ్యవహరిస్తూ నెగ్గుకొచ్చాడు. అతని తర్వాత వచ్చిన దిల్మా 1964-85 సైనికపాలనలో జరిగిన అత్యాచారాల గురించి ట్రూత్ కమిషన్ వేయడంతో సైన్యం ఆమె అంటే మండిపడి, ఆమె పదవీచ్యుతికి దోహదపడింది. బొల్సొనారో సైనికపాలనను మాటిమాటికీ కీర్తిస్తూ వాళ్లను ఖుషామత్ చేశాడు. అయితే 2021లో అతను డిఫెన్స్ మినిస్టర్‌గా ఉన్న సైనికాధికారిని తీసేసి, అతని స్థానంలో ఒక జూనియర్ సైనికాధికారిని నియమించడంతో సైన్యానికి కోపం వచ్చింది. సర్వీస్ చీఫ్‌లు ముగ్గురూ రాజీనామా చేశారు. కరోనా సంక్షోభసమయంలో బొల్సొనారో సరిగ్గా వ్యవహరించలేదంటూ బహిరంగంగా విమర్శించారు.
ఇదంతా చూసి అధ్యక్ష ఎన్నికలలో అతనికి 36-38% ఓట్ల కంటె రావని నిపుణులు అనుకున్నారు. కానీ బొల్సొనారో వలన విపరీతంగా లాభపడి అతనికి అండగా నిలబడిన వాళ్లలో వ్యవసాయోత్పత్తులతో వ్యాపారం చేసే కార్పోరేట్లు కూడా ఉన్నాయి. వాళ్లు అతని తరఫున గట్టిగా నిలబడడంతో మొదటి విడతలో పోలైన ఓట్లలో అతనికి 43% వచ్చాయి. మొత్తం ఓటర్లలో 21% మంది ఓటింగులో పాల్గొనలేదు. బొల్సొనారో అనుయాయులు చాలామంది గవర్నర్లగా ఎన్నికయ్యారు. అతని కాబినెట్లో ఏడుగురు మంత్రులు ఎన్నికయ్యారు. వారిలో కరోనాను దారుణంగా డీల్ చేసిన ఆరోగ్యమంత్రి, అమెజాన్ అడవులను ధ్వంసం చేసిన పర్యావరణ మంత్రి కూడా ఉన్నారు. 533 మంది లెజిస్లేటర్లుంటే వారిలో 300కు మించి అతివాద రైటిస్టు పార్టీలకు చెందినవారే.
ఇంత జరిగినా మొదటి రౌండు ఎన్నికలలో లూలాకు 5% పైన లీడ్ రావడంతో వీళ్లు ఉలిక్కిపడి బొల్సొనారో తరఫున సర్వశక్తులూ వినియోగించారు. అది చూసి మూడు, నాలుగు స్థానాల్లో వచ్చినవారు లూలాకు మద్దతిచ్చారు. అయినా రెండో రౌండుకి వచ్చేసరికి లూలాకు 1.8% లీడ్ మాత్రమే వచ్చిందంటే బొల్సొనారో శక్తి ఏమిటో, వ్యవస్థలో అతని మనుష్యులు ఎంతలా పాతుకుపోయారో అర్థమౌతుంది. ఈ దాడి తర్వాత అది మరింత స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు లూలా వీరితో పోరాడి గెలవాలంటే చాలా కష్టం. పదవిలోకి వస్తూనే లూలా రెండు ముఖ్యమైన పనులు చేపట్టాడు. ట్రంప్ విధానాలను అనుకరించే బొల్సొనారో తను పదవిలోకి వచ్చాక తుపాకుల నియంత్రణ చట్టాలను సులభం చేశాడు. గన్ లైసెన్స్ పరిమితిని ఐదేళ్ల నుంచి పదేళ్లు చేశాడు. తన విధానాన్ని సమర్థించుకుంటూ బొల్సొనారో ‘ప్రతి మనిషి తుపాకీ కలిగి ఉండాలని బైబిల్లో రాశారు’ అని చెప్పాడొకసారి.
జనాలు విచ్చలవిడిగా తుపాకులు కొనేయడంతో గన్స్ ఉన్న ప్రయివేటు వ్యక్తుల సంఖ్య 20 లక్షలకు చేరింది. ఒకరినొకరు కాల్చేసుకోవడంతో ఏడాదికి 40 వేల మంది చనిపోతున్నారు. తుపాకీ మరణాల్లో బ్రెజిల్‌ది ప్రపంచంలో మొదటి స్థానమైంది. లూలా పదవిలోకి వస్తూనే తుపాకులు కొనడం నియంత్రించాడు. దీనితో పాటు అమెజాన్ అడవులను సంరక్షించే చర్యలు కూడా చేపట్టాడు. భూమాతకు ఊపిరితిత్తులుగా చెప్పుకునే అమెజాన్ అడవుల్లో 60% బ్రెజిల్లో ఉన్నాయి. ప్రపంచంలోని బంగారంలో 20% అమెజాన్ అడవుల్లో ఉన్న బంగారపు గనుల నుంచి వస్తుంది. మైనింగ్ పరిశ్రమ 2 లక్షల మంది స్థానికులకు ఉపాధి కల్గిస్తుంది.
మైనింగు అనగానే అక్రమ మైనింగు కూడా దాన్ని వెన్నంటే ఉంటుంది. అక్రమంగా తవ్వుకునే వాళ్లు చెట్లు కొట్టేయడమే కాక, మైనింగులో వాడే పాదరసంతో అమెజాన్ నదులను కలుషితం చేసి, గిరిజనుల హక్కులకు, ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బొల్సొనారో కుటుంబం చాలాకాలంగా అక్రమ స్మగ్లింగులో ఉందనే ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్టు యితను తన హయాంలో వాళ్లను విచ్చలవిడిగా ప్రోత్సహించాడు. దాంతో అటవీ విస్తీర్ణం 20% తగ్గిపోయింది. కరోనా సమయంలో బంగారం ధరలు 40% పెరిగిపోవడంతో ఈ అక్రమ మైనింగు మరింత పెరిగింది. వీళ్లంతా బొల్సొనారోకు అండగా నిలబడ్డారు. ఎన్నికలలో అమెజాన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో బొల్సొనారోకు మెజారిటీ వచ్చింది. ఇప్పుడు లూలా వస్తూనే మైనింగు నియమాలను కఠినం చేస్తూ ఆదేశాలిచ్చాడు.
వారంతా యిప్పుడు లూలాకు ఆటంకాలు కలిగించడం ఖాయం. అయితే లూలా తన ప్రత్యర్థులతో దురుసుగా వ్యవహరించే వ్యక్తి కాదు. సంప్రదింపుల ద్వారా తను అనుకున్నది సాధించే గుణం కలవాడు. కాంగ్రెసులో ఏ పార్టీకి చెందనివారిని ఒప్పించి తననుకున్నది సాధిస్తాడేమో చూడాలి. తనతో 2007లో పోటీ పడి ఓడిపోయిన సెంటర్-రైట్ పార్టీకి చెందిన జెరాల్డోను ఉపాధ్యక్షుడిగా నియమించుకుని పేదల ఆకలి తీర్చే కార్యక్రమాలను రూపొందించే పని అప్పగించాడు. బొల్సొనారోకు మహిళల పట్ల, యితర జాతీయుల పట్ల చిన్నచూపు. లూలా దానికి విరుద్ధంగా తన కాబినెట్లో నలుగురు మహిళలకు ముఖ్యపదవులిచ్చాడు. స్థానిక తెగల సంక్షేమానికై ఓ మంత్రిత్వశాఖను సృష్టించి దానికి మంత్రిణిగా సోనియాను, జాతి సమానత మంత్రిణిగా ఏనిలాను, పర్యావరణ మంత్రిణిగా మారీనాను, సాంస్కృతిక శాఖ మంత్రిణిగా గాయని మార్గరెత్ను నియమించాడు.
అధ్యక్ష భవనంపై దాడి జరిగిన తర్వాత లూలా ఇది అతివాద రైటిస్టులు చేసిన పనే అని ప్రకటించాడు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కాంగ్రెసులోని రెండు సభల నాయకులు అతనితో గళం కలిపారు. బొల్సొనారో కాబినెట్లో మంత్రిగా చేసినతను దీన్ని ప్లాను చేశాడని పోలీసులు ఆరోపించారు. 1500 మంది అరెస్టయ్యారు. రాజధానిలో ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఎదురుగా 3 వేల మంది క్యాంపులు ఏర్పాటు చేసుకుని అక్కణ్నుంచి అల్లర్లు చేస్తూ ఉంటే వాటిని ఖాళీ చేయిస్తున్నారు. తనను యిరికించే కుట్ర యిది అని బొల్సొనారో ఆరోపించాడు. పొత్తికడుపు నొప్పితో తను ఫ్లారిడాలో ఆసుపత్రిలో చేరానని, దాడితో తనకే సంబంధం లేదని అతను చెప్పుకున్నాడు.
అమెరికాలో ట్రంప్‌కు మద్దతిచ్చే వర్గాలు, బొల్సొనారో పక్షాన నిలిచే వర్గాలు ఒకలాటివే కావడం చేత, ట్రంప్ వర్గీయులు అతనికి అండగా నిలిచి బ్రెజిల్ రాజకీయాలను ప్రభావితం చేయడానికి చూస్తారనుకోవచ్చు. ‘మాననవీయత లేకుండా ప్రవర్తించినందుకు బొల్సొనారోపై కేసు పెట్టాల’ని బ్రెజిల్ కాంగ్రెస్ ప్యానెల్ తీర్మానిస్తే వెంటనే ట్రంప్ ‘బొల్సొనారో వంటి వాడు అధినేతగా ఉండడం బ్రెజిల్ చేసుకున్న అదృష్టం’ అంటూ స్టేటుమెంటు యిచ్చాడు. లూలా పాలనలో బ్రెజిల్ నాశనమై పోతోందని ట్రంప్ వర్గీయులు గొడవ చేయడం తథ్యం. చుట్టూ ఉన్న వైరివర్గాలతో పోరాడుతూనే అధ్వాన్నంగా ఉన్న ఆర్థికవ్యవస్థను 77 ఏళ్ల లూలా ఎలా గాడిలో పెడతాడో వేచి చూడాలి. (ఫోటో – దాడి దృశ్యం, ఇన్సెట్ ఎడమ లూలా, కుడి బొల్సొనారో)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)