టాలీవుడ్ ను హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ అంటారు. ఇది ఓపెన్ సీక్రెట్. ఓ సినిమా ఫ్లాప్ అయితే హీరోకు అప్పటికప్పుడు వచ్చే నష్టం ఏం ఉండదు. కానీ ఆ ఒక్క ఫ్లాప్ తో దర్శకుడు మాత్రం తెరమరుగైపోతాడు. అలాంటిదే ఈ ఉదంతం కూడా.
ఈమధ్య తెలుగులో భారీ అంచనాల మధ్య ఓ సినిమా వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఆ సినిమా దేశవ్యాప్తంగా డిజాస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే, ఓ నిర్మాణ సంస్థ తిరిగి అదే కాంబినేషన్ లో మరో సినిమా సెట్ చేసింది.
ఎప్పుడైతే సినిమా డిజాస్టర్ అయిందో, సదరు నిర్మాణ సంస్థ వెనక్కి తగ్గింది. అయితే ఈ తగ్గడంలోనే చిన్న మార్పు చోటుచేసుకుంది. దర్శకుడి నుంచి అడ్వాన్స్ వెనక్కు తీసుకున్న ఆ ప్రొడక్షన్ కంపెనీ, హీరోను మాత్రం ముద్దుగా చూసుకుంది. అతడికిచ్చిన అడ్వాన్స్ కు మరింత మొత్తాన్ని చేర్చింది.
అలా ఆ హీరోకు ఇంకాస్త దగ్గరైన సదరు నిర్మాణ సంస్థ, మరో ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి అదే ఫ్లాప్ హీరోతో ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది.
సినిమా డిజాస్టర్ అవ్వడంతో సదరు హీరో మార్కెట్ పడిపోతుందని కొందరు అంచనాలు కట్టారు. కానీ దానికి భిన్నంగా కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ కే, అడ్వాన్స్ ఇచ్చిన బ్యానర్ కు కొత్త సినిమా సైన్ చేశాడు హీరో. కానీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు మాత్రం ఇప్పటివరకు మళ్లీ లైమ్ లైట్లోకి రాలేదు.
దర్శకుడికి ప్రతి సినిమా సవాల్. హిట్టయితే మరో ఛాన్స్ వస్తుంది, ఫ్లాప్ అయితే కెరీర్ లో గ్యాప్ వస్తుంది. అదే హీరోకు మాత్రం అలాంటి ఇబ్బందులేం ఉండవు. దటీజ్ టాలీవుడ్.