ఆంధ్ర బయ్యర్లకు ‘సంక్రాంతే’

సరైన సినిమా పడి ఇరవై శాతం కమిషన్ వస్తే అంతకన్నా బయ్యర్ కు ఏం కావాలి. నాలుగు కోట్ల మీద ఇరవై శాతం కమిషన్ అంటే ఎంత ఆనందం. అసలే సినిమా థియేటర్ లోకి…

సరైన సినిమా పడి ఇరవై శాతం కమిషన్ వస్తే అంతకన్నా బయ్యర్ కు ఏం కావాలి. నాలుగు కోట్ల మీద ఇరవై శాతం కమిషన్ అంటే ఎంత ఆనందం. అసలే సినిమా థియేటర్ లోకి వచ్చే వరకు హిట్ లేదా ఫట్ అన్నది తెలియదు. హిట్ టాక్ వచ్చినా జ‌నం థియేటర్ కు రావడం లేదు. బ్రేక్ ఈవెన్ కష్టంగా వున్న రోజులు. జిఎస్టీ కోసం నిర్మాతలకు ఫోన్ చేసుకోవాల్సిన కాలం. ఇలాంటి టైమ్ లో రెండు భారీ సినిమాలు. భారీ రేట్లు. బ్రేక్ ఈవెన్..కమిషన్ అంటే ఎంత ఆనందం. ప్రస్తుతం ఆంధ్రలోని చాలా ఏరియాల బయ్యర్లకు ఇదే ఆనందం.

పండగ సీజ‌న్ లో రిస్క్ చేసి, రెండు భారీ సినిమాలను 75 కోట్ల రేషియోలో కొనేసారు. కేవలం మైత్రీ సంస్థ మీద వున్న నమ్మకం. పుష్ప లాంటి సినిమాలకు జిస్టీటీలు, నష్టాలు పూడ్చే పని చేసి ఈ సంస్థను నమ్ముకోవచ్చు అని పేరు తెచ్చుకున్నారు. అందుకే ధైర్యంగా 75 కోట్ల రేషియోలో డబ్బు పంపించండి అంటే బయ్యర్లు అంతా పంపేసారు. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నారు. వీర నరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య రెండు సినిమాలు కలిపి అమ్మడం నిర్మాతలకు కలిసి వచ్చింది. ఓ సినిమా కొంత తగ్గినా రెండో సినిమా ఆదుకుంటోంది.

వైజాగ్ ఏరియాకు 18 కోట్లు కట్టారు. ఇప్పటికే జిఎస్టీ కాకుండా 16 కోట్ల మేరకు వసూళ్లు చేరుకున్నాయి. మరో రెండు కోట్లు వస్తే చాలు. ఇంకా వాల్తేర్ వీరయ్య ఫుల్ స్ట్రాంగ్ గా వుంది. ఈ రోజు కూడా ఫుల్స్ పడుతున్నాయి. ఫుల్ రన్ లో బయ్యర్ కు కనీసం నాలుగు కోట్లు లాభం వుంటుందని అంచనా. ఈస్ట్ 11 కోట్లు కట్టారు. ఇప్పటికే రెండు సినిమాలు కలిపి 13 కోట్లు వసూలు చేసాయి. అంటే కమిషన్లు హ్యాపీగా వచ్చేసినట్లే. వెస్ట్ లో 10 కోట్ల వరకు చేసాయి రెండు సినిమాలు కలిసి. అక్కడ కట్టింది తొమ్మిది కోట్లు. 

ఇటీవలి కాలంలో ఇలాంటి పరిస్థితి చాలా అరుదు. బయ్యర్లు ఇంత భారీ మొత్తాల్లో కమిషన్లు అందుకుని చాలా కాలం అయింది. పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. హిట్ అనిపించుకున్నాయి. కలెక్షన్ల రికార్డులు చూపించుకున్నాయి. కానీ తెరవెనుక జిఎస్టీలు కట్టుకుని, వెనక్కు కొంత మొత్తాలు అడ్జ‌స్ట్ చేసిన వైనాలు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయాయి.

వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య విడివిడిగా వచ్చి వుంటే పరిస్థితి ఎలా వుండేదో కానీ,రెండూ కలిసి పోటా పోటీగా అది కూడా సంక్రాంతికి రావడం అన్నది ఇంకా బాగా కలిసి వచ్చింది. మైత్రీ బయ్యర్లకు సంక్రాంతి కళ కనిపించింది.