వాలంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేయసి అంటే ఇష్టమున్నవారు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని ఆరాటపడుతుంటారు. లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్, లవ్ లో మోసపోయిన బ్యాచ్, బ్రేకప్ బ్యాచ్.. వీరిలో కొందరు లవర్ పై పగ తీర్చుకోడానికి ఎదురు చూస్తుంటారు. ఇలా లవర్స్ పై కోపంతో ఏదైనా చేసేయాలని బుర్ర బద్దలు కొట్టుకునేవారి కోసం కెనడాలోని ఓ జూ వింత ప్రపోజల్ తో ముందుకొచ్చింది.
“మీ లవర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అయితే మా జూ లోని ఓ బొద్దింకకు ఆమె పేరు పెట్టేయండి” అంటూ ఆఫర్ ఇచ్చింది. అలా బొద్దింకకు మనం ద్వేషించేవారి పేరు పెట్టాలంటే ఆ జూ యాజమాన్యానికి 25 డాలర్లు.. అంటే మన లెక్కలో 1500 రూపాయలు చదివించుకోవాలి. ఆన్ లైన్ లో విరాళం ఇచ్చేస్తే.. ఆ బొద్దింకకు మనం చెప్పిన పేరు పెట్టి, డిస్ ప్లే లో ఉంచుతారు. ఆ ఫొటో కూడా మనకు పంపిస్తారు. మనకు నచ్చనివారిపై అలా పగ సాధించుకోవచ్చనమాట.
సహజంగా జూలో జంతువులను దత్తత తీసుకోవాలంటూ నిర్వాహకులు సందర్శకులను కోరుతుంటారు. ఏడాదిపాటు ఫలానా జంతువుని దత్తత తీసుకుంటే దానికయ్యే ఆహారం ఖర్చు భరించాలని చెబుతుంటారు. అలా చేస్తే.. ఆ జంతువు లేదా పక్షి ఉన్న ఎన్ క్లోజర్ వద్ద మన పేరు పెడతారు, లేదా మనం చెప్పినవారి పేరు ఉంచి.. ఫలానా వారి దాతృత్వం అని రాస్తుంటారు. ఇలానే ఇది కూడా.
అది ప్రేమతో, దయతో చేసే పని.. ఇది ద్వేషంతో చేసే పని. అంతే తేడా. అందరూ అసహ్యించుకునే బొద్దింకలకు గిట్టని వారి పేరు పెట్టే ఆఫర్ ఇచ్చింది ఆ జూ.
బ్రేకప్ చెప్పిన ప్రేయసి పేరే కాదు, మనల్ని మోసం చేసినవారి పేరు, లేదా మనకి ఇష్టం లేని బాస్ పేరు.. ఇలా ఏ పేరైనా బొద్దింకలకు పెట్టేయొచ్చు. అంతమాత్రాన బొద్దింకలను తాము ద్వేషిస్తున్నట్టు కాదని టొరంటో జూ యాజమాన్యం ప్రకటించింది. బొద్దింకలు అసహ్యకరంగా ఉన్నా కూడా వాటి వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని జూ కన్జర్వేటర్లు తెలిపారు.
బొద్దింకకు గిట్టనివారి పేరు పెట్టి పగ తీర్చుకోవాలనుకునేవారు ముందుగా వెబ్ సైట్ లో డబ్బులు చెల్లించాలి. ఎవరి పేరు పెట్టాలో మెన్షన్ చేయాలి, దానితోపాటు వారి పగ తీరేలా ఓ మెసేజ్ కూడా ఉంచాలి. ఆ తర్వాత వారికి కాక్రోచ్ పేరుతో డిజిటల్ సర్టిఫికెట్ ఇస్తారు. బొద్దింకకు పేరు పెట్టి, దాని పక్కన మెసేజ్ ఉంచిన డిజిటల్ గ్రాఫిక్ పిక్చర్ కూడా పంపిస్తారు. స్వచ్ఛంద పన్ను రసీదు కూడా జతచేస్తారు.