మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు రోజుకో రీతిగా మారుతూ వచ్చి నిన్న తేటపడుతున్నట్లు అనిపించి ఇవాళ పొద్దున్న హఠాత్తుగా యాంటీ క్లయిమాక్స్‌కి చేరాయి. మహారాష్ట్రలో తమాషా చాలా ప్రజాదరణ పొందిన నాట్యకళారూపం. కానీ మనం దాన్ని మరో అర్థంలో వాడతాం. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది మన అర్థంలోనే! ప్రతి పార్టీ నాటకాలు ఆడి, చివరకు యీ దశకు తీసుకుని వచ్చాయి. బిజెపి- ఎన్సీపీ (చీలిక వర్గం), మరి కొందరు కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. దీని వెనకాల జరిగిన తతంగం గురించి పూర్తి కథనాలు ఎన్నాళ్లలో వస్తాయో, అసలు ఎప్పటికైనా వస్తాయో రావో తెలియదు. ఒకప్పటి దేవెగౌడలా అజిత్ పవార్ వెనుక శరద్ పవార్ ఉన్నాడా? లేకపోతే అజిత్ వెనుక ఎందరు ఎమ్మెల్యేలున్నారు, అతను నాదెండ్ల స్టయిల్లో ఏమైనా నాటకం ఆడాడా, శివసేన నుంచి బిజెపికి ఎవరైనా గెంతుతారా, గెంతితే ఎంతమంది – అనేవి క్రమేపీ తెలుస్తాయి. ఈలోగా ఎవరి ఊహాగానాలు వారివి.
నిన్న రాత్రి దాకా తెలిసిన దేమిటంటే – శివసేన, ఎన్సీపీ, కాంగ్రెసుల ప్రభుత్వం ఏర్పడుతుందని, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అని. ఎన్సీపీ, కాంగ్రెసులకు యిద్దరికీ ఉపముఖ్యమంత్రి పదవులు యిస్తారని ఓ మాటా, అబ్బే ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి, కాంగ్రెసుకు స్పీకరు పదవి యిస్తారని ఓ మాటా వినబడ్డాయి. హోం, ఆర్థికం వంటివి ఎన్సీపీకే యివ్వాలని పట్టుబట్టినట్లు తెలియవచ్చింది. ఉద్ధవ్ భార్య రశ్మీ తన కొడుకు ఆదిత్యని ముఖ్యమంత్రి చేయాలని పట్టుబట్టిందని, కానీ శరద్ మాత్రం ఉద్ధవ్‌యే ముఖ్యమంత్రి కావాలని మరీమరీ చెప్పడంతో ఉద్ధవ్ సరేనన్నాడనీ కూడా బయటకు వచ్చింది. కాంగ్రెసు వంటి పార్టీతో కలిస్తే తమ హిందూత్వ ఎజెండా ఏమవుతుందని సేన, సేనతో కలిస్తే తమ 'సెక్యులర్' యిమేజి ఏమవుతుందని కాంగ్రెసు బెంగపెట్టుకున్నాయి. ఈ కూటమికి 'మహా శివ ఆఘాడీ' అని పేరు పెట్టాలని సేన అడగగా 'శివ వదిలేయండి, వికాస్ పెట్టండి' అని కాంగ్రెసు పట్టుబట్టిందట. చివరకు శరద్ పౌరోహిత్యం వహించి, యిద్దరకూ పెళ్లి ఫిక్స్ చేశాడు.
ఈ చర్చలన్నిటిలో శరద్ సోదరుడి కొడుకు అజిత్ భాగస్వామియే. అతనే బయటకు వచ్చి ప్రెస్‌తో మాట్లాడుతూన్నాడు. నిన్న రాత్రి 9 గం.లకు కూడా చర్చలు అయ్యాక 'మా లాయర్ని కలవాలి' అంటూ బయటకు వెళ్లాడు. రాత్రికి రాత్రి దేవేంద్రతో మంతనాలు జరిగాయి. దిల్లీలో గవర్నర్ల సమావేశానికి వెళ్లవలసిన గవర్నరు ఆ పర్యటన రద్దు చేసుకుని రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని రాత్రే సిఫార్సు చేయడం, రాష్ట్రపతి వెంటనే స్పందించడం జరిగి, ఇవాళ పొద్దున్న సూర్యోదయానికి ముందే 5.45 కల్లా దాన్ని ఎత్తేశారు. మరో రెండు గంటల కల్లా దేవేంద్ర, అజిత్ చడీచప్పుడు లేకుండా రాజ్‌భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారాలు చేసేశారు. పొద్దెక్కితే అవతలి శిబిరంలో కదలిక వస్తుందేమోనని భయం.
'బిజెపి-శివసేన మహాయుతికే ప్రజామోదం లభించింది. దాన్ని కాలరాసి సేన వేరే వాళ్లతో ఊరేగుతోంది కాబట్టి మేం ప్రతిపక్షంలో కూర్చుంటాం' అని ప్రకటించిన దేవేంద్ర యివాళ పొద్దున్న 'ఇంతకు ముందే చెప్పానుగా, మళ్లీ నేనే అని! వచ్చేశా!' అని ట్వీట్ చేశాడు. అజిత్ పవార్ 'మూడు పార్టీల ప్రభుత్వం కిచిడీ లాటిది. అందుకే రెండు పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేశాం' అన్నాడు. ఈ యిద్దరితో పాటు యింకా కొందరు చేతులు కలిపితే కానీ వీళ్ల కిచిడీ తయారవ్వదు. వీళ్లంతా చెప్పేది ఒకటే – ప్రస్తుతం రాష్ట్ర రైతులు దురవస్థలో ఉన్నారు. మేము ఏం చేసినా రైతుల సంక్షేమం గురించే చేస్తున్నాం అని. గత ఐదేళ్ల పాలనలో తాము ఉద్ధరించేసి ఉంటే ఆ రైతులకు యీ దురవస్థ ఎందుకు వస్తుంది అని అడిగేవారుండరు.
ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ శివసేనను రకరకాల అగ్నిపరీక్షలకు గురి చేశాడు. తమతో ఓ పక్క బేరాలాడుతూనే మరో పక్క బిజెపితో కూడా ఆడుతున్నావని నిందించాడు. బిజెపి వాళ్లు కూడా అదే అభిప్రాయాన్ని జనాల్లో కలిగించారు. నితిన్ గడ్కరీ 'రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు' అని ప్రకటించాడు. మరో బిజెపి నేత 'శివసేనకు రెండున్నరేళ్ల ముఖ్యమంత్రి పదవి యివ్వలేం కానీ, రెండేళ్ల పదవి యిస్తాం' అని అన్నాడు. హిందూత్వ విషయంలో కాంగ్రెసు చేసే స్తనశల్య పరీక్ష తట్టుకోలేక, శివసేన ఎమ్మెల్యేలు 'ఎందుకు వచ్చిన గోల? మన మనసులు కలిసిన పార్టీ బిజెపి, ముఖ్యమంత్రి పదవిపై ఆశతో నువ్వు కాంగ్రెసుతో పొత్తు కలుపుతున్నావ్. అలా అయితే హిందూత్వ ఓటు బ్యాంకంతా మనల్ని వదిలేసి, బిజెపినే ఆశ్రయిస్తుంది. మనం ఎటూ కాకుండా పోతాం. మా మాట వినకపోతే మేం బిజెపిలో కలిసిపోతాం' అని ఉద్ధవ్‌ని బెదిరిస్తున్నారని వార్తలు మీడియాలో వచ్చేట్లా చేశారు.
దానాదీనా శివసేన నమ్మదగ్గ భాగస్వామి కాదన్నట్లుగా బిల్డప్ యిస్తూ వచ్చారు. చివరకు చూస్తే అర్థమైన దేమిటి? బిజెపివారు లోపాయికారీగా ఎన్సీపీతో బేరాలాడుకుంటూ, చివరి నిమిషంలో శివసేనకు జెల్లకాయ కొట్టి, గాడిదను చేశారు. తన క్యాడర్ ముందు ఉద్ధవ్ తలెత్తుకోలేకుండా చేశారు. సేన తటపటాయిస్తున్నప్పుడు బిజెపి ఎన్సీపీని చీల్చడానికి చూస్తోందని వార్తలు వచ్చాయి. బిజెపి నుంచి ఫిరాయించి, ఎన్సీపీలో చేరి, గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలకు బిజెపి గేలం వేస్తోందనే అన్నారు కానీ అజిత్‌నే గురి పెట్టిందని ఎవరూ అనుకోలేదు. శరద్‌కు కొడుకులు లేరు. కూతురు సుప్రియా మూలే ఒక్కరే. అందువలన సోదరుడి కొడుకు అజిత్‌కే పగ్గాలు అప్పగించాడు. అందువలన అజిత్ సొంతంగా ఫిరాయించాడంటే ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు.
కర్ణాటకలో బిజెపి గతంలో జెడిఎస్‌తో యిలాటి నాటకమే ఆడింది. దేవెగౌడ తను చాలా పెద్ద సెక్యులరిస్టునని చెప్పుకుంటూ బిజెపితో చేతులు కలిపితే పేరు పోతుందని భయపడి, కొడుకుతో కలిసి డ్రామా ఆడాడు. దాని ప్రకారం కుమారస్వామి తండ్రిపై 'తిరుగుబాటు' చేసి, బిజెపితో చేతులు కలిపి మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పరచి ముఖ్యమంత్రి అయిపోయాడు. కొడుకుని కుటుంబం నుంచి బహిష్కరించానని దేవెగౌడ ప్రకటించాడు. ఆర్నెల్లు పోయేసరికి అంతా కలిసిపోయారు. రెండున్నరేళ్లు పోయాక ఒప్పందం ప్రకారం గద్దె దిగి బిజెపికి అప్పగించాల్సిన కుమారస్వామి నమ్మకద్రోహం చేశాడు. ఆ రోజు దేవెగౌడ వేసిన వేషమే యీ రోజు శరద్ వేస్తున్నాడని చాలామంది నమ్మకం.
ఎందుకంటే శరద్ ఫక్తు రాజకీయనాయకుడు. నైతికతపై బొత్తిగా నమ్మకం లేదు. చేసేది చెప్పడు, చెప్పినది చేయడు. ఎవరితోనైనా చేతులు కలపగలడు. విడిపోగలడు. అతనిపై, అతని సన్నిహితు సహచరులైన అజిత్, ప్రఫుల్ పటేల్ వంటి వారిపై బోల్డు అవినీతి ఆరోపణలున్నాయి. అయినా మోదీ చేత ఏకంగా 'పద్మవిభూషణ్' బిరుదు నిప్పించుకున్న ఘనుడు. రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా కూటమి కడుతూ, మరో పక్క దిల్లీకి వెళ్లి మోదీతో సమావేశమైన చతురుడు. తక్కిన ప్రతిపక్షాలన్నీ 'ఎన్సీపీ, బిజెడిలను చూసి నేర్చుకోవాలి' అని మోదీ చేత ప్రశంస లందినవాడు. ఎన్సీపీకి మద్దతిచ్చే చక్కెర లాబీ నడ్డి విరవడానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోంది. అలాటి సమయంలో గత వారంలోనే చక్కెర మిల్లుల ఋణాల చెల్లింపుపై మారటోరియంను బిజెపి ఏడాది నుంచి ఏడాదిన్నరకు పెంచడంతో నాకు సందేహం వచ్చింది.
వీటన్నిటి కారణంగా శరదే కావాలని అజిత్‌ను యిటువైపు పంపాడని అందరూ అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే శరద్ దాన్ని ఖండిస్తున్నాడు. అజిత్ నమ్మకద్రోహం చేసి పార్టీని చీల్చాడంటున్నాడు. అజిత్‌పై చాలా అవినీతి ఆరోపణలున్నాయి. స్వయంగా దేవేంద్రే ఆరేళ్ల క్రితం వాటిని బయటపెట్టి నానా యాగీ చేశాడు. ఇటీవలే కేంద్ర సంస్థలు కేసులు పెట్టాయి కూడా. అతని మీదే కాదు అనేకమంది ఎన్సీపీ నాయకులపై, ఆఖరికి శరద్‌పై కూడా కేసులు పెట్టారు. ఆ కేసుల తుపాకీ కణతలకు గురి పెట్టి అజిత్ చేత యీ నమ్మకద్రోహం చేయించారని అంటున్నారు. ఎన్నికలకు ముందే అజిత్ బావమరిది బిజెపిలో చేరాడు. నిజానికి అజిత్ వద్ద ఎక్కువమంది ఎమ్మెల్యేలు లేరట. ఎంతమంది అనే విషయంపై గందరగోళం ఉంది.
గతంలో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీయార్‌పై కుట్ర చేసినపుడు 'ఎమ్మెల్యేలకు ఎక్కువ అధికారాలు యివ్వాలి' అనే లేఖ తయారుచేసి మెజారిటీ ఎమ్మెల్యేల చేత సంతకాలు సేకరించాడు. అది మూడు పేజీలు వచ్చింది. మొదటి పేజీలో తనకు బాగా సన్నిహితులైన ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించాడు. అందరి సంతకాలు అయ్యాక, మొదటి పేజీ మార్చేశాడు 'ఎన్టీయార్‌పై మాకు నమ్మకం పోయింది' అంటూ గవర్నరు ఉద్దేశించినట్లు లేఖ తిరగరాసి, దానిపై తన మనుషుల చేత సంతకం చేయించి, పాత లేఖలోని రెండు పేజీలు దీనికి ఎటాచ్ చేసి గవర్నరుకి యిచ్చాడు.
ఇప్పుడు ఎన్సీపీ ఎమ్మెల్యేల క్యాంప్ నిర్వహిస్తున్న అజిత్ ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్నట్లుగా గవర్నరు పేర ఉత్తరం రాస్తున్నాం అని చెప్పి అందరి సంతకాలు సేకరించాట్ట. అయితే ఆ లేఖలో ముఖ్యమంత్రి పేరు రాయలేదట. ఇవాళ ఉదయం అక్కడ దేవేంద్ర పేరు రాసేసి, గవర్నరు చేతికి యిచ్చేశాడు. అది చూసి, అజిత్ పార్టీ అధ్యక్షుడు కాడని తెలిసినా లేఖను నమ్మేసి, గవర్నరు ఏ విధంగానూ క్రాస్ చెక్ చేయకుండా, అడావుడిగా ప్రమాణస్వీకారాలు చేయించేసి, వారం టైమిస్తున్నాను, యీ లోగా అధికారాన్ని ఉపయోగించి, జనాల్ని పోగేసుకోండి అన్నాడు.
అజిత్ వెనుక ఎంతమంది ఉన్నారు? అతనితో కలిసి, 10కి లోపే అంటోంది శరద్ వర్గం. వారిలో ముఖ్యుడైన ధనుంజయ్ ముండే సాయంత్రానికి వెనక్కి వచ్చేసినట్లుంది. అలాటి ప్రమాదాలు జరగకుండా 7గుర్ని (మరో ఛానెల్ 9 అంటోంది) దిల్లీకి విమానంలో పంపించివేశారు. 'ఇండియా టుడే' అజిత్ వెనక్కాల 22 మంది ఉన్నారని పొద్దున్న చెప్పి, క్రమేపీ దాన్ని 35కి పెంచింది. అది అజిత్ చెప్పినదే! అది 36కి చేరితే 54 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీని చీల్చి పార్టీ ఫిరాయింపు చట్టం నుంచి కాపాడుకోవచ్చు.
ఎన్సీపీ తరఫున సేనాపతిగా వ్యవహరిస్తూ వస్తున్న అజిత్ యింతటి ద్రోహం చేస్తాడా అంటే కొద్దికాలంగా అతను కుములుతున్నాడని చెప్తున్నారు. అతని కొడుకు పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన దగ్గర్నుంచి, అతనిపై పార్టీలో విమర్శలు పెరుగుతూ వచ్చాయి. అతను అహంభావి కావడం చేత, పార్టీలో చాలామందికి అతనిపై కోపం ఉంది. కొడుకునే గెలిపించుకోలేనివాడు తనేం నాయకత్వం వహిస్తాడని అనసాగారు. 79 ఏళ్ల శరద్‌కు వారసుడిగా అజిత్ పనికి రాడని, కూతురు సుప్రియాను తీసుకురావాలని అనసాగారు. ఈ విషయం కుటుంబంలో కూడా చర్చకు రావడంతో కుటుంబం కూడా చీలింది.
ఇది మనసులో పెట్టుకున్న అజిత్ మనసులో దురూహ పెట్టుకుని ఎన్సీపీ-శివసేన-కాంగ్రెసు చర్చలు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డు తగులుతూనే ఉన్నాడట. ఎన్సీపీకి డిప్యూటీ సిఎం యిస్తానంటే కాదు, సిఎం పదవి కావాలని, మరోటని యిలా కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేస్తూ పొత్తు కుదరకుండా చూశాడు. చివరకు నిన్న రాత్రి పొత్తు కుదరడంతో హతాశుడయ్యాడు. శివసేన నాయకుడు, బిజెపితో పొత్తుకు వ్యతిరేకి అయిన సంజయ్ రవుత్ 'నిన్న రాత్రి అతను కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడటం లేదు. తప్పు చేసిన వాడిలా ఉంది అతని బాడీ లాంగ్వేజ్. శరద్ కూడా దాన్ని గమనించారు.' అన్నాడు.
చివరకు అజిత్ రాత్రికి రాత్రి వెళ్లి బిజెపి శిబిరంలో తేలాడు. అజిత్ వచ్చి చేరాడు కాబట్టి, చేతిలో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని బిజెపి యిప్పుడు శివసేనను కూడా చీలుస్తుందని అంటున్నారు. ఏం జరుగుతుందో గమనించాలి. ఈలోగా యీ పరిస్థితి రావడానికి శివసేన చేసిన పొరపాటు ఏమిటో, బిజెపి అనుకున్నన్ని సీట్లు ఎందుకు తెచ్చుకోలేక పోయిందో పరిశీలించాలి. అవి వచ్చే వ్యాసాల్లో..! ఈ వ్యాసం పూర్తి చేసే సమయానికి అజిత్‌తో వెళ్లిన ఎమ్మేల్యేలు 5 గురు వెనక్కి వచ్చేశారని, సాయంత్రం జరిగిన అధికార ఎన్సీపీ సమావేశానికి మొత్తం 36 మంది హాజరయ్యారని రిపోర్టులు వస్తున్నాయి. నాదెండ్ల కథ పునరావృతం అవుతోందా? చూడాలి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2019)
[email protected]