Advertisement

Advertisement


Home > Politics - Gossip

నిజంగా ఎన్టీఆర్ వస్తే సీన్ మారిపోతుందా..?

నిజంగా ఎన్టీఆర్ వస్తే సీన్ మారిపోతుందా..?

2009 ఎన్నికల్లో టీడీపీ పరాభవం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రమంగా పార్టీకి దూరమయ్యారు. దూరం అయ్యారని అనడం కంటే.. చంద్రబాబే కావాలని జూనియర్ ని దూరం చేశారని చెప్పాలి. అప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్లీ పార్టీతో టచ్ లోకి రాలేదు ఎన్టీఆర్. ఆమధ్య తెలంగాణ ఎన్నికల్లో తన సొంత సోదరి తరపున కూడా ప్రచారానికి రాలేదంటే ఎన్టీఆర్ కి ఏ లెవల్లో జ్ఞానోదయం అయిందో అర్థం చేసుకోవచ్చు.

మళ్లీ ఇన్నాళ్లకు ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రస్తావన వస్తోంది. ఎప్పుడైతే ఎన్నికలు ముగిసి, జగన్ అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారో, అప్పట్నుంచి టీడీపీలో ఈ ఎన్టీఆర్ నామస్మరణ ఎక్కువైంది. టీడీపీ మిగులు నేతలతో పాటు కొంతమంది వైసీపీ ముఖ్య నేతలు కూడా ఎన్టీఆర్ రాకపై స్పందిస్తున్నారు. లోకేష్ తో టీడీపీకి భవిష్యత్ లేదని చెబుతున్నారు.

ఇంతకీ ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుంది?  టీడీపీ తలరాత మారిపోతుందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ 23 నుంచి సడన్ గా 150 క్రాస్ చేస్తుందా..? అసలు ఎన్టీఆర్ వస్తే జరిగే మార్పులేంటి? సినిమావాళ్లను ప్రజలు నమ్మే అవకాశం ఉందా? అసలు ఎన్టీఆర్ కి ఇంట్రస్ట్ ఉందా?

ఎన్టీఆర్ ఆసక్తిని పక్కనపెడితే, ఆయన పార్టీ పగ్గాలు చేపట్టినా ఇప్పటికిప్పుడు జరిగే మార్పులేవీ లేవని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం వైసీపీ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది. ఐదేళ్ల తర్వాత కూడా జగన్ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని అర్థమవుతోంది. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ వచ్చినా చేసేదేమీ లేదు. రాజకీయ శూన్యత ఉన్నప్పుడు ఎవరికైనా అవకాశం ఉంటుంది కానీ, ప్రత్యర్థులకు ఆ అవకాశం ఇవ్వకుండా దూసుకుపోతున్నారు జగన్.

ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టినా.. ఆ పార్టీ జవసత్వాలు ఎప్పుడో ఉడిగిపోయాయి. చంద్రబాబు పార్టీని నిర్వీర్యం చేశారు. చుట్టూ భజనపరులు, తమ సామాజిక వర్గానికే పార్టీ పదవులు, లోకేష్ కి జై కొట్టేవారికే ప్రాధాన్యం.. ఇలా ఉంది ఇప్పుడు టీడీపీ పరిస్థితి. నిజమైన నాయకులు మాట్లాడటం మానేశారు, అటు బాలకృష్ణ కూడా సొంత అల్లుడిని వదిలిపెట్టి ఎన్టీఆర్ కి మద్దతిస్తారని అనుకోలేం. ఇలాంటి సమయంలో, ఇలాంటి నేతల మధ్య.. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టడం అసంభవం. చేపట్టినా ప్రయోజనం శూన్యం.

సో.. ఎలా చూసుకున్నా, టీడీపీ ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చినా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఇక ఎన్టీఆర్ కి మరో పెద్ద మైనస్ సినిమారంగం. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత.. ఏ సినిమా నటుడ్నీ రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజలు ఆదరించలేదు. చిరంజీవి, పవన్ కల్యాణ్.. వంటివాళ్లు సినీరంగంలో విజయం సాధించినా, రాజకీయ రంగంలో తేలిపోయారు. వీళ్లందర్నీ అవకాశవాదులుగా గుర్తిస్తున్నారే తప్ప, రాజకీయ నాయకులుగా చూడడం లేదు ప్రజలు. 

ఇప్పుడు అదే పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే... ఇప్పుడు పవన్ కల్యాణ్ ను ప్రజలు ఎలా చూస్తున్నారో, ఎన్టీఆర్ ను కూడా అలానే చూస్తారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎన్టీఆర్ సమర్థుడే కావొచ్చు, బాబు లాంటి వెన్నుపోటు మనస్తత్వం లేకపోవచ్చు, ప్రజల సమస్యలపై అవగాహన ఉండొచ్చు, ఇచ్చిన మాటకు కట్టుబడేవాడే అనుకుందాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ముందు ఎన్టీఆర్ తేలిపోతాడనేది పచ్చి నిజం.

ఎన్టీఆర్ అంత అమాయకుడు కాడు, అన్నీ నిశితంగా గమనిస్తూనే ఉన్నాడు. ఉన్నఫలంగా రాజకీయాల్లోకి వస్తే నెగ్గుకురాలేదమనే విషయం తారక్ కు కూడా తెలుసు. అందుకే ఎంతమంది ఎన్ని ప్రకటనలు చేసినా, తను మౌనంగానే ఉన్నాడు. ప్రస్తుతానికి సినిమాలపైనే పూర్తిగా దృష్టిపెట్టాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?