మాటెత్తితే భారతీయ విలువలు, నైతికత, హిందుత్వం, సనాతన సంప్రదాయాల గురించి భారతీయ జనతాపార్టీ వాళ్లు లెక్చర్లు ఇస్తూ ఉంటారు! అయితే అధికారంలో ఉన్నప్పుడు వీరు పాటించే విలువలు కాంగ్రెస్ పార్టీ నే వీళ్ల కన్నా కొంత బెటర్ అనిపించేలా ఉన్నాయి.
నైతిక విలువలూ గట్రా సంగతెలా ఉన్నా.. కనీసం ప్రజాస్వామ్య విలువలను భారతీయ జనతా పార్టీ పాటించకపోవడం గమనార్హం. ఇప్పటికే తమకు కనీసం మెజారిటీ రాని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పరంపరలో ఇప్పుడు మహారాష్ట్ర కూడా చేరింది.
కామెడీ ఏమిటంటే.. బీజేపీ ఇక్కడ తుంగలో తొక్కింది తమకు పెద్దగా నమ్మకం లేని ప్రజాస్వామ్య విలువలనే కాదు, తాము ప్రవచించే నైతిక విలువలను కూడా కమలం పార్టీ వాళ్లు తుంగలోకి తొక్కి వదిలారు. అది ఎన్సీపీ తో జత కట్టే విషయంలో.
ఎన్సీపీని భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలుగా విమర్శించిందో వేరే చెప్పనక్కర్లేదు. న్యాచురల్ కరప్టెడ్ పార్టీ అంటూ ఎన్సీపీకి బిరుదును ఇచ్చింది శ్రీమాన్ మోడీ మహాశయుడే. అలాంటి ఎన్సీపీతో కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలం పార్టీ. ఎన్సీపీ- కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ పార్టీ మద్దతుతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
ఇప్పుడు ఇంతకీ వెర్రివాళ్లు ఎవరు? అంటే..భారతీయ జనతా పార్టీని సమర్థిస్తూ విలువల గురించి మాట్లాడేవాళ్లు! కమలం పార్టీ వాళ్లు అధికారం కోసం ఎప్పుడు ఎవరితో కలవడానికి అయినా సిద్ధపడతారని స్పష్టం అయ్యింది. ఎన్సీపీతో జత కట్టి..భారతీయ జనతా పార్టీ తన నిజరూపాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ వీరాభిమానులు మాత్రం నగ్నంగా ఊరిగే రాజును వెంట నిలిచిన వారిని తలపింపజేస్తూ ఉన్నారు. అయితే సగటు ప్రజలు మాత్రం కమలం పార్టీ రాజకీయాలను ఇప్పుడు బాగానే గమనిస్తున్నట్టుగా ఉన్నారు.