ప్రతిపక్షంలో వున్నపుడు మమతా బెనర్జీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి గురించి చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించారు. సింగూరు నుండి టాటా మోటర్సును తరిమివేసే దాకా నిద్రపోలేదు. కాస్తో కూస్తో నిజాయితీ వున్న టాటా వంటి సంస్థకే ఆ గతి పట్టడంతో తక్కిన పారిశ్రామికవేత్తలందరూ అడలిపోయారు. మమత అధికారంలోకి వచ్చాక అటు కన్నెత్తి చూడడం మానేశారు. సహజవనరులు, చౌక కార్మికులు, రవాణా సౌకర్యాలు పుష్కలంగా బెంగాల్ పరిశ్రమల విషయంలో ఒకప్పుడు దేశంలోనే అగ్రగామిగా వుండేది. కమ్యూనిస్టుల నేతృత్వంలో కార్మికోద్యమం మొదలై, లెఫ్ట్ ప్రభుత్వం వుండగా యూనియన్లు చెలరేగిపోవడంతో చాలా పరిశ్రమలు పారిపోయాయి. పారిపోగా మిగిలినవాళ్లు ఆ తర్వాత మమతా బెనర్జీ మొండి వైఖరి చూసి పారిపోయారు. దానివలన ఆర్థిక పరిస్థితి కుంటుపడి, నిరుద్యోగం పెరగడంతో 'రండి రండి' అని ఆహ్వానించినా కొత్తవాళ్లు తొంగిచూడడానికి భయపడుతున్నారు. దేశంలోని చిన్న పట్టణాల్లో కూడా ఐటీ సెక్టార్ పెరుగుతోంది కానీ మహానగరమైన కలకత్తాలో పెరగడం లేదు. ఇన్ఫోసిస్, విప్రో విస్తరణ కార్యక్రమాలు రూపొందించి కూడా విరమించుకున్నాయి.
బెంగాల్‌లో పరిపాలనా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా వుందో తెలుసుకోవడానికి కెర్న్‌స్ ఉదాహరణ చాలు. 4 సంవత్సరాల క్రితం అంతర్జాతీయంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పేర్గాంచిన కెర్న్‌స్ బెంగాల్‌లో స్టీల్, మైన్స్ పరిశ్రమలు పెట్టడానికి అనువైన వాతావరణం వుంటే 120 కోట్ల రూ.లతో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు పెడదామనుకుంది. దానికి ఎన్ని యిబ్బందులు వచ్చిపడ్డాయంటే, అక్కడ బిచాణా ఎత్తివేసి విశాఖపట్టణం వద్ద 20 ఎకరాలు కొనుక్కుని అక్కడ పెడుతోంది. లెఫ్ట్ పరిపాలనలో పారిశ్రామిక అభివృద్ధి సరాసరిన ఏడాదికి 9% అయితే మమత వచ్చాక అది 2.5%కి పడిపోయింది. రాష్ట్ర జిడిపి పెరుగుదల సరాసరి లెఫ్ట్ పరిపాలనలో ఏడాదికి 8.25% అయితే, మమత పాలనలో 7.5%. మూతపడబోయే సంస్థల్లో – రైల్వే శాఖ కింద పనిచేసే పబ్లిక్ సెక్టార్ యూనిట్ బర్న్ స్టాండర్డ్ కంపెనీ, జెస్సప్ అండ్ కంపెనీ, హిందూస్తాన్ మోటర్స్, హల్దియా పెట్రోకెమికల్స్ వున్నాయి. 3 లక్షల కోట్ల రూ.ల అప్పుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా వుంది. కేంద్రం నుండి స్పెషల్ ప్యాకేజీ అడుగుదామంటే యుపిఏ-2తో పేచీ నడుస్తోంది.
ఈ పరిస్థితి గమనించి మమత కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తూనే వుంది. ఈవిడ మొహం చూసి సరే అన్నా తర్వాత వెనక్కి తగ్గుతున్నారు. 2011 నుండి 800 కోట్ల రూ.ల పెట్టుబడి పెడతామని అన్నారు కానీ చివరకు 120 కోట్ల రూ.లే పెట్టారు. పరిస్థితి చక్కదిద్దడానికి 2012లో మమత కలకత్తాలో, హల్దియాలో రెండు పెద్ద బిజినెస్ సదస్సులు ఏర్పాటు చేసింది. చాలామంది ఎగ్గొట్టారు. వచ్చినవాళ్లు కూడా హామీ ఏమీ యివ్వలేదు. ఇలా కాదని మమతా బెనర్జీ స్వయంగా పారిశ్రామికవేత్తలను కలిసి 'నా ప్రభుత్వం మీకు వ్యతిరేకం కాదు' అని చెప్పింది. అయినా వాళ్లు చలించలేదు. చివరకు బొంబాయిలో సదస్సు పెట్టి, బెంగాల్‌లో పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానించింది. పేరున్న యిండస్ట్రియలిస్టులు ఎవరూ రాలేదు. పరువుపోతుందని తన ఫైనాన్సు మినిస్టర్ అమిత్ మిత్రాను పంపి ముకేశ్ అంబానీని రప్పించింది. ఫిక్కీకి సెక్రటరీ జనరల్‌గా చేసిన మిత్రా మాట కొట్టేయలేక ముకేశ్ వచ్చాడు కానీ పెట్టుబడి పెడతానని అనలేదు.
మమతకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇక్కడ వున్న చిక్కల్లా ఏమిటంటే ప్రతీ పరిశ్రమా నామమాత్రపు ధరకు భూమి, మౌలిక సౌకర్యాలు కావాలంటున్నాయి. అందుకనే లెఫ్ట్ ప్రభుత్వం టాటా మోటర్స్‌కు భూమి యిచ్చింది. అప్పుడు యీమె అల్లరి పెట్టింది. ఇప్పుడు యీమె భూమి యిస్తే పరువేం కాను? మా సిద్ధాంతరీత్యా భూమి యివ్వం అంటుంది. అయితే మేం పరిశ్రమ పెట్టం అంటారు వాళ్లు. ఆమె పరిశ్రమల మంత్రిగా ఎంచుకున్న కుడిభుజం పార్థ చటర్జీకి పెట్టుబడిదారులంటే మంట. భూమి యిచ్చే ప్రశ్నే లేదని పదేపదే చెప్పాడు. నష్టాలతో మూతపడబోతున్న హల్దియా పెట్రో కెమికల్స్‌లో పెట్టుబడి పెడతానంటూ రిలయన్సు ముందుకు వస్తే ఠఠ్ కుదరదన్నాడు పార్థ! అమిత్ మిత్రా కలగచేసుకోబోయినా వినలేదు. ఇప్పుడు మమత చూపు పార్థపై పడింది. ఇతనే అన్ని అనర్థాలకు మూలకారణం అనుకుంది. డిసెంబరు 26 న అతనితో కూడా చెప్పకుండా పరిశ్రమల శాఖను అతని నుండి లాక్కుని అమిత్ మిత్రకు యిచ్చేసింది. దీనివలన ఏం ఒరుగుతుందో వేచి చూడాలి!
-ఎమ్బీయస్ ప్రసాద్ – న్యూస్, వ్యూస్, రివ్యూస్ – (జనవరి 2014)