ఒక అండర్‌వరల్డ్ డాన్. అసలు మంచివాడే కానీ పరిస్థితులు అతన్ని అలా మార్చాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా తన శరణు కోరిన వాళ్లకు ఆశ్రయం ఇచ్చి, న్యాయం జరిగేట్లు చూస్తాడు. అతని కొడుకు అతని మార్గాన్ని గర్హించి పెద్దమనిషిగా మారబోతాడు. కానీ డాన్ మీద కక్ష తీర్చుకునే క్రమంలో అతని కొడుకుని రెచ్చగొడతారు ప్రత్యర్థులు. దాంతో కొడుకు డాన్ కి వారసుడిగా మారి..' – ఈ కథ ఎక్కడో విన్నట్టుగా వుంది కదా. ఒకసారి కాదు, పదేపదే విన్నట్టుగా అనిపిస్తోంది కదూ. ఈ తరహా సినిమాలు ఎన్ని వచ్చినా వాటికి మాతృక 'గాడ్‌ఫాదర్' అనే ఆంగ్ల చిత్రం. రకరకాల పాత్రలు అనేకం సృష్టించి కథలకు కరువు లేకుండా చేసిన మహాభారత రచయిత వ్యాసుడిలా ఈ గాడ్‌ఫాదర్ పాత్రను అతి ఆకర్షణీయంగా మలిచిన మాఫియా వ్యాసుడు 'మారియో ప్యూజో'!
నిజానికి ప్యూజో పేరు “గాడ్‌ఫాదర్'ను తలుచుకోనిదే గుర్తుకు రాదు. అది అతని మూడవ నవల. 1955 లో అతడు రాసిన 'ది డార్క్ ఎరీనా', 1965 లో రాసిన 'ది ఫార్చునేట్ పిలిగ్రిమ్' విమర్శకుల ప్రశంసలు సంపాదించి పెట్టినా, కాసులు మాత్రం రాల్చలేదు. రెండూ కలిపి అతనికి 6,500 డాలర్లు సంపాదించి పెట్టగా, 1968లో రాసిన ' గాడ్‌ఫాదర్' ఒక్కటీ కోట్లాది కాపీలు అమ్ముడుపోయింది. ఇరవై భాషల్లో అనువదింపబడి అతనికి కుప్పలుతిప్పలుగా డబ్బు, కీర్తి సంపాదించి పెట్టింది. అంతేకాక అతన్ని సినిమా ప్రపంచానికి పరిచయం చేసింది. 'సిసిలియన్', 'ఫూల్స్ డై' (1978), 'ది ఫోర్త్ కె' (1992); 'ది లాస్ట్ డాన్' (1996) వంటి ఎన్ని నవలలు రాసినా 'గాడ్‌ఫాదర్' తోనే ప్యూజో మమేకం అయ్యాడు. నిజానికి 1999 జులైలో తన 78వ ఏట చనిపోవడానికి వారం ముందు కూడా ' గాడ్‌ఫాదర్ 4 వ భాగం గురించి ప్యూజో చర్చలు జరిపాడు. మూడో భాగం అంతగా సక్సెస్ కాకపోవడంతో, కొపోలా ప్యూజో చేత కొత్తగా రాయిద్దామనుకున్నాడు. అతని మరణంతో ఆ ప్రాజెక్టు రద్దయింది. ఇంత చరిత్ర సృష్టించిన 'గాడ్‌ఫాదర్' ఆవిర్భావం చిత్రంగా జరిగింది.
అది రాసేనాటికి ప్యూజోకి 49 ఏళ్లు. అతను పుట్టినది అమెరికన్- ఇటాలియన్ కుటుంబంలో, తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాసులు. భార్య, ఏడుగురు పిల్లలను పోషించడానికి తండ్రి న్యూయార్క్ సెంట్రల్ రైల్ రోడ్ ట్రాక్ లేబరర్గా పని చేసేవాడు. నిరుపేద ఇటాలియన్లు నివసించే న్యూయార్కు నియోపాలిటన్ పెట్టోలో (దాన్ని 'హెల్స్ కిచెన్' అనేవారు) ప్యూజో పెరిగాడు. పెద్దలందరూ కీచులాడుకుంటూ ఉంటే పిల్లలందరూ రైల్వే బోగీల నుండి వస్తువులు దొంగిలిస్తూ బతికే వాతావరణం అది. ఆ వాతావరణంలోనే ప్యూజో ఎదిగి, చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. పత్రికల్లో కాలమ్స్ రాసేవాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేవాడు.
గాడ్‌ఫాదర్ రాయడానికి ఉపక్రమించేనాటికి అతనికి 20000 డాలర్ల అప్పు వుంది. అతని రెండవ నవలలో ఒక చిన్న పాత్ర మాఫియాకు సంబంధించినది. ఆ పాత్ర గురించి కాస్త ఎక్కువగా రాసి వుంటే పుస్తకం వ్యాపారపరంగా విజయవంతం అయి వుండేది కదా అని వాపోయాడు పబ్లిషరు. “సరే, కొత్త నవల అలాగే రాస్తాను. కాస్త డబ్బు అడ్వాన్సుగా ఇవ్వండి' అన్నాడు ప్యూజో. 'పంద పేజీలు రాసి చూపించు, అప్పుడిస్తాం' అన్నాడతను. పది పేజీల అవుట్‌లైన్ చూపిస్తే 'వెళ్లిరా' అన్నాడు. అలా కొన్ని నెలలు గడిచాక ఒక పాత్రికేయ మిత్రుడికి కొన్ని మాఫియా కథలు చెప్పి, ఆ అవుట్‌లైన్ చూపిస్తే అతనికి బాగా నచ్చింది. జిపి పుట్నమ్స్ సన్స్ వారికి పరిచయం చేశాడు. వాళ్లు 5000 డాలర్లు అడ్వాన్సు ఇచ్చి నవల రాయమన్నారు. అది పూర్తయ్యేందుకు మూడు సంవత్సరాలు పట్టింది. ఈలోగా ప్యూజో వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఎడ్వెంచరు స్టోరీలు లాంటివి చాలా రాసి పొట్ట పోసుకున్నాడు.
నవల చిత్తుప్రతి పూర్తికాగానే దాన్ని పబ్లిషరుకి పంపి ప్యూజో తన కుటుంబాన్ని తీసుకొని యూరప్ యాత్రకు వెళ్లాడు. కాసినోలలో జూదమాడి డబ్బు పోగొట్టుకొని క్రెడిట్ కార్డు కంపెనీలకు 8000 డాలర్లకు అప్పు పడి న్యూయార్కుకి తిరిగి వచ్చాడు. 'పబ్లిషరు ఇచ్చినా ఎంత ఇస్తాడు కనక. ఈ అప్పు తీర్చలేక జైలుకి వెళ్లాల్సిందే' అనుకుంటూ ఏజంటుకి ఫోన్ చేశాడు. 'మీ పబ్లిషరు ఇప్పుడే చెప్పాడు, నీ నవల పేపరుబ్యాక్ ఎడిషన్ హక్కులకు 3,75,000 డాలర్లకు ఆఫర్ వస్తే కాదు పొమ్మన్నాడు' అందామె. 'అది చిత్తుప్రతి కాబట్టి ఇంకా ఎవరికీ చూపించకండి అని నేను చెప్పినా పబ్లిషరు తక్కినవాళ్లకి చూపించేశాడన్న మాట' అని కోపం తెచ్చుకోబోయిన ప్యూజో ఆ అంకె విని దిమ్మ తిరిగి నోరెత్తలేక పోయాడు. చివరకి ఫాసెట్ కంపెనీ వారు పేపరుబ్యాక్ హక్కులను 4,10,000 డాలర్లకు కొని రికార్డు సృష్టించారు. దాంట్లో సగం పబ్లిషరుది. సగం ప్యూజోది.
అంత డబ్బు వస్తోందని తెలియగానే ప్యూజో చేసిన మొదటి పని తన అన్నగారికి ఫోన్ చేసి తన కొచ్చిన వాటాలో 10 శాతం ఇస్తాననడం. ఎందుకంటే కష్టకాలంలో ప్యూజోని తరచుగా ఆదుకున్నది ఆయనే. అన్నగారింట్లోనే తల్లి వుంది. ఆమెకు తన పుస్తకం 4,10,000 డాలర్లకు అమ్ముడు పోయిందని చెప్పగానే ఆమె 'పదివేల డాలర్లే కదా' అని అడిగింది. ఆవిడ ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడలేదు కానీ బాగానే అర్ధం చేసుకుంటుంది. 'పది వేలు కాదు, ముందు నాలుగు లక్షలు ఉంది.' అని మూడు సార్లు ప్యూజో చేత చెప్పించుకొని ‘సర్లే. ఎవరికీ చెప్పకు' అంది చివరకి. ఇంటికి చేరాక ప్యూజో తన అక్కకు ఫోన్ చేశాడు, 'చూశావా నన్ను ఇన్నాళ్లూ తక్కువగా అంచనా వేశారు. నేనంత ఘనుణ్ణో చూడు' అని చెప్పడానికి. 'కబురు విన్నావా?' అన్నాడు. 'ఆ విన్నాను. అమ్మ చెప్పిందిలే.. నువ్వేదో పుస్తకం రాస్తే నలభై వేలు ఇచ్చారటగా' అందావిడ కూల్‌గా. ప్యూజోకి ఒళ్లు మండిపోయింది. ఇన్నిసార్లు చెప్పినా తల్లికి బుర్రకెక్కలేదేమిటని, ఇదెంత గొప్ప విషయమో అర్థం చేసుకోలేదేమిటని. తల్లికి ఫోన్ చేసి తిట్టబోతూంటే ఆవిడ గుసగుసలాడింది- 'అబ్బ, నువ్వు చెప్పింది నాకు అర్ధమయ్యిందిలేరా. దానికి చెపితే ఏడ్చిపోతుందని కావాలనే నలభయ్యని చెప్పా’!
అంత ఘటికురాలు ప్యూజో తల్లి. గొప్ప పట్టుదల గల మనిషి. ఇటలీలోని నేపుల్స్లో పుట్టింది. అక్కడే తొలి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన దుస్తులు కూడా పుట్టింటివారు ఇవ్వలేకపోయారు, దారిద్ర్యం కారణంగా. అప్పుడే ఆమె నిశ్చయించుకుంది, అమెరికాకు వలస వెళ్లి నాలుగురాళ్లు సంపాదించాలని. భర్తను పోరిపోరి అమెరికాకు వచ్చి పడింది. నలుగురు పిల్లలు పుట్టాక భర్త చనిపోయాడు. రెండవ వివాహం ద్వారా పుట్టినవాడే మారియో ప్యూజో. అతణ్ణి రైల్ రోడ్ కంపెనీలో గుమాస్తాగా చేయాలన్నదే ఆమె జీవితాశయం. నేను రచయితనవుతానని ప్యూజో అంటే ఆమె ఆశ్చర్యపోయింది. జమీందార్ల బిడ్డలు మాత్రమే రచయితలు కాగలరని ఆమె దృఢవిశ్వాసం. 'గాడ్‌ఫాదర్' పుస్తకం వెలువడి లోకమంతా ప్యూజో ప్రతిభను కొనియాడిన తర్వాతనే ఆమె అతన్ని 'కవి'గా గుర్తించింది.
గాడ్‌ఫాదర్ నేపథ్యం ఎంత అథెంటిక్‌గా ఉందంటే అది రాయడానికి ముందు ప్యూజోకి అండర్ వరల్డ్ మనుష్యులెవరితోనూ పరిచయం లేదంటే ఎవరూ నమ్మలేదు. అసలు అండర్‌వరల్డ్ పెద్దలే తమ గురించి మంచిగా రాయడానికిగాను పది లక్షల డాలర్లు ప్యూజోకి ఇచ్చి రాయించారని ఒక పుకారు కూడా పుట్టింది. అమెరికాలోని మాఫియా సభ్యులలో చాలా మంది ఇటలీలోని సిసిలీ ప్రాంతానికి చెందిన వారు. ప్యూజో కూడా ఆ సంతతి వాడే. పుస్తకం వెలువడ్డాక మాఫియా డాన్ ప్యూజోను కలిసి దాన్ని మెచ్చుకోవడం జరిగింది. గాడ్‌ఫాదర్ నవల సినిమాగా వెలువడినప్పుడు కూడా చరిత్ర సృష్టించింది.
గాడ్‌ఫాదర్ పుస్తకం వెలువడక ముందే ప్యూజో దాని సినిమా హక్కులు పారమౌంట్ పిక్చర్స్ వారికి అతి చవగ్గా అమ్మాడు. డబ్బు అవసరం తీవ్రంగా వున్న ఆ రోజున ఆ 12,500 డాలర్లు అతని తక్షణావసరాలను తీర్చాయి. పుస్తకం వెలువడిన తర్వాత గాడ్‌ఫాదర్ పాత్రకు డేనీ థామస్‌ను పారమౌంట్ వారు ఎంచుకున్నారని పేపర్లో వార్త వచ్చింది. ప్యూజో దృష్టిలో మేర్లిన్ బ్రాండోయే ఆ పాత్రకు తగినవాడు. ఆ విషయం బ్రాండోకు ఉత్తరం రాశాడు. బ్రాండో ఫోన్ చేసి తానా పుస్తకం చదవలేదని, మంచి డైరెక్టరెవరైనా సిఫార్సు చేస్తే తప్ప పారమౌంట్ వారు తనను పిలవరని చెప్పాడు. నిజానికి బ్రాండో ఇబ్బంది పెడతాడని, బాక్స్ఆఫీస్ దగ్గర వీక్ అనీ పారమౌంట్ వాళ్లు అనుకున్నారు. చివరకి కొపోలా డైరెక్టరుగా నియమించ బడ్డాక అతను పోట్లాడి బ్రాండోను తీసుకోవడం జరిగింది.
దీనికి ముందే పారమౌంట్ వాళ్లు 'ది బ్రదర్హుడ్' అనే చిత్రం మాఫియా ఇతివృత్తంతో తీయడం, అది ఫెయిలవ్వడం జరిగింది. ఇక మాఫియా చిత్రాలకు ఆదరణ లేదనుకుని స్టూడియో వాళ్లు ఊరుకున్న తరుణంలో గాడ్ ఫాదర్ నవల హిట్ కావడంతో వాళ్లు వచ్చి ప్యూజోను స్క్రిప్టు రాయమని అడిగారు. గాడ్ ఫాదర్ డైరెక్టు చేయడానికి ఎంతో మంది డైరెక్టర్లని అడిగారు. అయితే దీనిలో మాఫియాను గ్లోరిఫై చేశారు కాబట్టి మేము చేయమని వాళ్లు చెప్పారు. చివరకు 30 ఏళ్ల ఇటాలియన్ ఫ్రాన్సిస్ కొపోలాను ఎంచుకున్నారు. అతనప్పటికి రెండు ఫ్లాపులు తీసి వున్నాడు. గాడ్‌ఫాదర్‌ను తక్కువ బజెట్‌లో తీద్దామనుకున్నారు కాబట్టి అతన్నే తీసుకున్నారు. అతను స్క్రిప్టులో ప్యూజోకు సహకరించాడు.
గాడ్‌ఫాదర్ చిత్రంలోని 'మైకేల్' పాత్రతో స్టార్ అయిన 'అల్ పచినో” విషయంలో కూడా తమాషా జరిగింది. పచినో అప్పటికి న్యూయార్కు నాటకాలలో పేరు తెచ్చుకున్నాడు కానీ సినిమాలలో ఎలా నటిస్తాడో ఎవరికీ తెలియదు. ఒక ఇటాలియన్ చిత్రం కోసం అతను చేసిన స్క్రీన్ టెస్టును కొపోలా, ప్యూజో చూశారు. ప్యూజోకు అది చాలా నచ్చి పచినోకు మైకేల్ పాత్ర ఇచ్చి తీరాలని సిఫార్సు చేశాడు. కానీ అతను బాగా పొట్టి అని, బొత్తిగా ఇటాలియన్లా వున్నాడనీ అభ్యంతరాలు వచ్చాయి. అయినా కొపోలా పట్టుబట్టి టెస్టుకి పిలిస్తే దాంట్లో పచినో తన డైలాగులు మర్చిపోయాడు. దాంతో ప్యూజో నిరాశ చెందాడు. కానీ కొపోలా ఆగమని చెప్పి బాగా రిహార్సల్ చేయించి పచినోలోని నటనను బహిరంగపరిచి అందరిచేతా ఒప్పించి మెప్పించాడు.
మీ మాఫియా పుస్తకాలు ఎందుకు విజయవంతం అవుతున్నాయని ప్యూజోను అడిగినప్పుడు అతనిచ్చిన సమాధానం ఇది- 'ప్రజలకు న్యాయం జరగాలని ఆశగా వుంటుంది. అందునా కోర్టులు, లాయర్ల చుట్టూ తిరక్కుండా ఎవడో గాడ్‌ఫాదర్ లాంటి వాడు తక్షణన్యాయం ప్రసాదించాలని కోరికగా వుంటుంది. అందుకే వాటికంత గిరాకీ'! ప్యూజో రాసిన చివరి పుస్తకం ' ఒమ్రెతా' కూడా అండర్ వరల్డ్ గురించే. అది అతని మరణానంతరం విడుదలైంది. దానిలో అతని స్థాయి కనబడలేదని విమర్శలు వచ్చాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)