తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గవర్నర్ తమిళిసై రెచ్చగొడుతున్నారా? అంటే…. ఔనని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఇందుకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు కొన్ని ఉదాహరణలు చూపుతున్నారు. రాజ్‌భవన్‌లో శుక్రవారం ఉగాది ముందస్తు వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాలేదు. దీంతో గవర్నర్, సీఎం మధ్య విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి.
ఉగాది ముందస్తు వేడుకలో గవర్నర్ ప్రసంగం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను శక్తిమంతురాలినని, ఎవ్వరి ముందూ తలవంచేది లేదని తేల్చి చెప్పారు. అలాగే తననెవరూ నియంత్రించ లేరని గవర్నర్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
వేడుకలో ఈ హెచ్చరికలు చేయాల్సిన పనేంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వేడుకకు కేసీఆర్, అధికార పార్టీ నేతలెవరూ రాకపోవడాన్ని జీర్ణించుకోలేక గవర్నర్ అసహనానికి గురైనట్టు… ఆమె మాటలు ప్రతిబింబిస్తున్నాయని వారు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా మే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నడుస్తుందని గవర్నర్ ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏంటని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే పేరుతో పాలనలో జోక్యం చేసుకోవాలని భావించడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
యాదాద్రికి తనను ఆహ్వానించకపోవడాన్ని ఇప్పుడు గుర్తు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. అలాగే మేడారానికి ఆహ్వానించకపోయినా వెళ్లినట్టు తమిళిసై గుర్తు చేయడమంటే… మనసులో ఏదో పెట్టుకుని రాజకీయం చేయడమే అని అధికార పార్టీ నేతలు గవర్నర్‌పై గుర్రుగా ఉన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్, గవర్నర్ మధ్య విభేదాలు ఎలాంటి రాజకీయ ఘర్షణకు దారి తీస్తాయోనన్న చర్చకు తెరలేచింది.