గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మన్నించలేదు. గవర్నర్ స్నేహహస్తం అందించినా కేసీఆర్ మాత్రం దూరం పాటిస్తుండడం గమనార్హం. రాజ్‌భవన్‌లో ఈ నెల 1న సాయంత్రం నిర్వహించ తలపెట్టిన తెలుగు సంవత్సరాది ‘శుభకృత్’ వేడుకకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు గవర్నర్ ఆహ్వానం పంపారు.
ఉగాది వేడుకల్లో పాల్గొని విభేదాలకు ముగింపు పలుకుతారని అందరూ ఆశించారు. అయితే కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో రాజ్‌భవన్‌తో ఘర్షణకే అధికార పార్టీ మొగ్గు చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ ముఖ్యులు మినహాయించి, కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డి, రఘునందన్ రావు, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఇతర ప్రముఖులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ మధ్య మరింత గ్యాప్ పెరిగిందని చెప్పొచ్చు. మరోవైపు గవర్నర్ తన ప్రసంగంలో తాను గవర్నర్ మాత్రమే కాదని, తెలంగాణ సోదరినని చెప్పుకొచ్చారు. రాజ్‌భవన్‌లో చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉందన్నారు. త్వరలో రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్‌గా తన పరిధులు తెలుసని ఆమె అన్నారు.