ఎమ్బీయస్‌ : నూరు రోజుల పాలన – నూరేళ్లకు సరిపడా వాగ్దానాలు

మన ముఖ్యమంత్రుల నూరు రోజుల పాలన గురించి చాలా కథనాలు పత్రికల్లో, టీవీల్లో వచ్చాయి. కెసియార్‌కు, బాబుకు యీ నూరు రోజుల లెక్క నప్పదు. కెసియార్‌ అడిగినట్లు -యిదేమైనా సినిమానా!? పాలించాలంటే అధికారగణం వుండాలి.…

మన ముఖ్యమంత్రుల నూరు రోజుల పాలన గురించి చాలా కథనాలు పత్రికల్లో, టీవీల్లో వచ్చాయి. కెసియార్‌కు, బాబుకు యీ నూరు రోజుల లెక్క నప్పదు. కెసియార్‌ అడిగినట్లు -యిదేమైనా సినిమానా!? పాలించాలంటే అధికారగణం వుండాలి. ఉందా? పనిచేస్తోందా? ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల్లో ఐయేయస్‌ అధికారులే కుదురుకోలేదు. 'ఇన్‌ ద పాండ్‌? ఆన్‌ ద బ్యాంక్‌?' అన్నట్టు ఎవరు ఎక్కడ వున్నారో, మన దగ్గర వున్నవారు తమవారో, పెఱవారో, ఎవరు ఇన్‌సైడరో, ఎవరు ఔట్‌సైడరో తెలియకుండా, గందరగోళంగా నడిచింది. ప్రత్యూష సిన్హాగారు చాలా ఆలస్యంగా పొద్దు పొడిచారు. ఆ తర్వాత రోస్టరంటూ మార్పులు చేర్పులు జరిగాయి.  ఆ వేపుడులో కొన్ని ముక్కలు అటు ఎగిరాయి, కొన్ని యిటు ఎగిరాయి, 'అది మా ముక్క' అంటే 'తీసుకుపోండి' అంటూ యివతలివాళ్లు విసిరేశారు. ఫైనల్‌గా తేలిందంటున్నారు. 

ఉద్యోగుల సంగతే తేలలేదు, యిక పనులెలా సాగుతాయి?

ఐయేయస్‌ స్థాయి వారికే యిలాటి అవస్థలుంటే తక్కుంగల వుద్యోగుల పరిస్థితేమిటి? కమలనాథన్‌ కమిటీ తాత్కాలిక నియామకాలే అంది. కమిటీ సిఫార్సులపై యిరు ప్రభుత్వాల సంతకాలకే 60, 70 రోజులు పట్టాయి. దానిపై అభ్యంతరాలు. తప్పుడు సర్టిఫికెట్లు యిచ్చి హైదరాబాదులో వుంటున్నారని తెలంగాణ ఉద్యోగి సంఘాల ఆరోపణలు. కావాలంటే చెక్‌ చేసుకోండి అని అవతలివాళ్ల ఛాలెంజులు. దేన్ని ఆధారంగా చేసుకోవాలి అన్నదానిపై ఓ పట్టాన స్పష్టత రాలేదు. రిటైర్‌మెంట్‌ వయసులో వ్యత్యాసం వలన, ఏ రాష్ట్రాన్ని ఎంచుకోవాలో తెలియక ఉద్యోగులు చాలాకాలం గందరగోళ పడ్డారు. 58 ఏళ్లు నిండిన కొందరు తెలంగాణలో రిలీవై, వెంటనే ఆంధ్ర క్యాడర్‌లో చేరిపోయారట! రాష్ట్రస్థాయి ఉద్యోగుల విషయంలోనే కుంపటి యింత ఆలస్యంగా వెలిగితే జిల్లా స్థాయిలో ఎప్పుడు వెలగాలి? తెలంగాణ మొత్తంలో ఒక్క ఆంధ్ర వుద్యోగి వుండడానికి వీల్లేదని తెరాస పార్టీలో వున్న ఉద్యోగి సంఘాల నాయకులు పట్టుబడుతున్నారు. విభజన చట్టంలో ఆ ప్రస్తావన లేదు కాబట్టి మాకేం పని అని కమలనాథన్‌ అన్నారు. ఇరురాష్ట్రాధినేతలు కూర్చుని తేల్చుకోవాలనే సంపాదకీయాల మార్కు ఉచిత సలహాలు పట్టించుకునే దెవరు? 

ఉంటామో, వూడతామో తెలియని పరిస్థితిలో జిల్లాల్లో పనిచేసే ఆంధ్ర వుద్యోగులు మనసు పెట్టి పనిచేస్తున్నారని నమ్మగలమా? వాళ్లు వెళ్లిపోతే దక్కే ప్రమోషన్‌ వచ్చాకనే పని చేయవచ్చని తెలంగాణ ఉద్యోగులు అనుకోవడంలో ఆశ్చర్యం వుంటుందా? తెలంగాణలో కార్యాలయాల తీరు యిలా వున్నా కెసియార్‌ పథకాలకు, గొప్పలకూ ఏ మాత్రం లోటు చేయడం లేదు. రోజుకో స్టేటుమెంటు విసురుతున్నారు. కొరత అధిగమించడానికి ఎంత ఖరీదైనా పెట్టి మెరుపుల నుండైనా విద్యుత్‌ కొంటాం అని చెపుతున్నారు (అలా అంటూనే మూడేళ్ల పాటు కొరత కష్టాలు అనుభవించక తప్పదంటున్నారు) సింగరేణిలో వాటా కొనేసి మొత్తం సొంతం చేసుకుంటాం అంటున్నారు (అసలు అమ్మడానికి కేంద్రం రెడీయా అనేది తెలియదు) ఇప్పుడు ఎల్‌ అండ్‌ టి నుండి మెట్రో కొనేస్తారట (దానికేముంది, ప్రపంచంలో వున్న 190 కంపెనీల్లో ఏదో ఒక దాని దగ్గర అడ్వాన్సు తీసుకుని వీళ్ల మొహాన కొడతాం అనవచ్చు). ఇంతింత భారీ ప్రణాళికలకు కొబ్బరికాయ కూడా కొట్టలేదు కదా స్వామీ అని అడిగితే 'ఇప్పటిదాకా ప్లాన్లు వేశాం, అమలుకై దసరా ముహూర్తం పెట్టాం. ఏ పని చేయాలన్నా హుషారు రావాలి కదా. అందుకే అవేళే కల్లు కాంపౌండ్లు తెరిచి, ఆచమించి ఉపక్రమిస్తాం' అంటున్నారు. 

చెప్పుకోవడానికి హీరో దొరికింది

బాబుకి యిలాటి దసరా ముహూర్తాల శషభిషలు లేవు. ఇప్పటికే చాలా సాధించినట్లు చెప్పేసుకుంటున్నారు. కొబ్బరికాయలా 'హీరో' ఒకటి దొరికింది. డైరక్టుగా వచ్చే ఆనందం వేరు, తెలంగాణను పరిగణనలోకి తీసుకుని దాన్ని కాదని తమకు రావడంతో ఆనందం రెట్టింపైంది. సినిమా హీరోలందరూ ఆంధ్రావాళ్లే అనుకంటూ వుంటే ఆటోమొబైల్‌ హీరో కూడా ఆంధ్రాకేనా అని తెలంగాణ పళ్లు నూరుకోవాల్సి వచ్చింది. ఇంతకీ హీరో ఆంధ్రకు మొగ్గు చూపడానికి కారణం తెరాస పాలన కంటె టిడిపి పాలన మెరుగ్గా వుందన్న అంచనా కాదట. 'ఈ యూనిట్‌ ఎగుమతులకు ఉద్దేశించినది, సముద్రతీరం దగ్గరగా వుంటే లాభదాయకం అనుకున్నాం' అని చెప్పారట. ఇలాటి ప్రమాదాలు ముందే వూహించిన నాబోటివాళ్లు విభజన అంటూ జరిగితే ప్రాంతాల వారీగా కాకుండా రాష్ట్రాన్ని హారిజాంటల్‌గా (అడ్డంగా) చీల్చాలని, అలా అయితే యిరు రాష్ట్రాలకూ సముద్రతీర సౌకర్యం వుంటుందనీ వాదించాం. నాయకులకు యిలాటి సందేహాలు రాలేదు. 

బాబు గారికి సముద్రతీరం దక్కింది, దాన్ని వినియోగించుకునే ఆర్థికవనరులు మాత్రం దక్కలేదు. ప్రత్యేక హోదా గురించి రోజురోజుకీ అనుమానాలు పెరుగుతున్నాయి. ప్లానింగ్‌ కమిషన్‌ ఆమోదముద్ర వేయడమే తరువాయి అనుకుంటూ వుంటే అసలు కమిషన్‌నే మోదీ ఉప్ఫున ఊదేశారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల సమాఖ్య కూర్చుని తేల్చాలి. మరి మా సంగతేమిటి అంటున్నాయి యితర రాష్ట్రాలు. అందరి కంటె పెద్ద వాయిస్‌ తెలంగాణది. అభ్యంతరాల్లో అగ్రతాంబూలం తమిళనాడుది. ఆ హోదా యిస్తే ఆంధ్రకు కొత్తగా పరిశ్రమలు రావు, మద్రాసు నుండి చిత్తూరు జిల్లాకు తరలుతాయంతే అని ఆమె వాదన. దక్షిణాదిన బలపడాలంటే ఏనాటికైనా ఆమెను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం బిజెపిది. ప్రత్యేక హోదా అన్నా, పన్నుల మినహాయింపు అన్నా ఏదైనా పని జరగాలంటే అధికారయంత్రాంగం కావాలి. ఆంధ్రకు యిప్పటిదాకా అది అమరనేలేదు. అసెంబ్లీ హాలే దిక్కుమాలిన స్థితిలో వుంది. సెక్రటేరియట్‌లో ఫైళ్లు కారిడార్లలో కెమెరాలకు చిక్కుతున్నాయి. కొన్ని విభాగాలు తమ నుండి జీతాలు తీసుకుని తెలంగాణకు పని చేస్తున్నాయని గ్రహించి, జీతాలు ఆపేసిన ఉదంతాలూ వున్నాయి. 

తాత్కాలిక రాజధానికి తరలింపుకు ఉద్యోగులు సుముఖులా?

ఈ అయోమయం వదలాలంటే విజయవాడలో తాత్కాలిక రాజధాని పెట్టి అక్కడకు తరలించాలి అంటున్నారు. అదంత సులభమా? విభజన జరిగినా పదేళ్లపాటు హైదరాబాదులోనే ఉమ్మడి రాజధాని వుంటుంది, మనం యిక్కడే లాగించేయవచ్చు, మహా అయితే చివర్లో వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకోవచ్చు అని హైదరాబాదులోని 45 ఏళ్ల వయసు పై బడిన ఆంధ్ర ఉద్యోగుల్లో చాలామంది అనుకుని వుంటారు. వాళ్లందరికీ యిప్పుడే తరలిపోవడం రుచించదు. తరలించే ప్రతిపాదన వచ్చినప్పుడల్లా వాళ్లు ఏదో కారణం చూపి దాన్ని వాయిదా వేయించవచ్చు. కేంద్రం అధికారంలోకి వస్తుందనో, పర్యావరణానికి అడ్డు వస్తుందనో, రూల్సు అనుమతించవనో ఏదో ఒక సాకు చెప్పడంలో వాళ్లు ఘనులు. తెగించి ఎవరినైనా బదిలీ చేస్తే ఎకడమిక్‌ యియర్‌ పూర్తయ్యేవరకైనా వుంచండి లేదా నా ముసలి తలిదండ్రులు అనారోగ్యంగా వున్నారు, వారిని ఓ రెండేళ్లు సేవించి రానీయండి అంటూ అర్జీలు పెడతారు. ఫిషింగ్‌ కార్పోరేషన్‌ లేదా ఒఎన్‌జిసి కార్యకలాపాలన్నీ సముద్రతీరంలో వుండగా ఆఫీసు హైదరాబాదులో పెట్టారేమిటి? అంటూ ప్రశ్నిస్తూ వుంటారు కొందరు అమాయకులు. అదంతా ఉన్నతాధికారుల మాయాజాలం. సముద్రం వుంది కదాని చిన్నచిన్న వూళ్లల్లో వుండడం వాళ్లకు కుదరదు. హైదరాబాదు వంటి మహానగరంలోనే వుండడానికి కుటుంబం యిష్టపడుతుంది. పిల్లల చదువులు, వినోదవిహారాలకు అవకాశాలు, బంధుమిత్రులతో సంపర్కం, నాణ్యమైన జీవనశైలి – యివన్నీ సమకూరాలంటే నగరవాసం తప్పదు.

మానవ వనరుల ఆలోచనా సరళి ఎలా వుంటుంది?

ఈ మధ్యే గుజరాత్‌, రాజస్తాన్‌ తిరిగి వచ్చాను. గుజరాత్‌లో ఐటీ పరిశ్రమ ఎందుకు రాలేదు? అని అహ్మదాబాద్‌లో పనిచేసే గుజరాతీ ఐటీ నిపుణున్ని అడిగాను. 'ఇక్కడ మద్యనిషేధం వుంది, నైట్‌ లైఫ్‌ లేదు. ఏ ఐటీ ఉద్యోగికి రావాలని వుంటుంది? వాళ్లలో చాలామంది సౌత్‌ ఇండియా వాళ్లే. అక్కడక్కడే బెంగుళూరు, పుణె, చెన్నయ్‌, హైదరాబాద్‌ లలో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఉద్యోగం మారాలన్నా మరో కంపెనీ అదే వూళ్లోనో, పక్కూళ్లోనో యింకోటి దొరుకుతోంది. ఇక్కడైతే ఒకటీ, అరా కంపెనీలు! మారడానికి వీల్లేక కొట్టుమిట్టులాడాలి.'' అన్నాడు. ముద్రా కమ్యూనికేషన్స్‌ను అహ్మదాబాద్‌లో స్థాపించేటప్పుడు పడిన కష్టాల గురించి ఎజి కృష్ణమూర్తి రాశారు. ఏడ్‌ ఏజన్సీలన్నీ బొంబాయిలోనే గూడు కట్టుకుని వున్నాయి. అక్కడ లైఫ్‌లో హుషారే వేరు. అహ్మదాబాద్‌లో, మందు పార్టీలు కూడా చేసుకోవడానికి వీల్లేదంటే ఒక్క యాడ్‌ నిపుణుడూ రాలేదట. వీళ్లే తయారుచేసుకున్నారు. ఎంత శ్రమ, ఎంత సమయం ఖర్చుపెట్టాలో వూహించుకోండి. 

''ఉదయ్‌పూర్‌కూడా వెళ్లి వచ్చాను. అక్కడ ప్రొహిబిషన్‌ లేదు. ఐటీ అన్న పదమే వినబడలేదు.'' అన్నాను. ''అక్కడ చదువుల మీద శ్రద్ధే లేదు. మనుష్యుల్లో సోఫిష్టికేషన్‌ లేదు. మీకు తెలుసా? ఉదయపూర్‌ మొత్తానికి రెండే రెండు సినిమాహాళ్లు వున్నాయి. అవీ డొక్కువి. ఐటీ వాళ్లు పోతారా?'' అన్నాడతను. పరిశ్రమలు అక్కడ పెడతాం, యిక్కడ పెడతాం అని ఎడాపెడా ప్రకటనలు యిచ్చేసేముందు యిలాటి హ్యూమన్‌ ఫ్యాక్టర్‌ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.  'బాసరలో ఐఐటి పెట్టండి, సరస్వతీకృపతో ఆటోమెటిక్‌గా చదువు వచ్చేస్తుంది' (అదే నిజమైతే అక్షరాస్యతలో ఆదిలాబాద్‌ అగ్రస్థానంలో వుండాలి) అని ఎందరు చెప్పినా వినకుండా 'అక్కడ పెడితే ఫ్యాకల్టీ దొరకడం కష్టం' అంటూ వైయస్‌ హైదరాబాదులో ఐఐటీ పెట్టడానికి యిలాటి కన్సిడరేషన్లే కారణం. వాతావరణం కూడా ఒక బలమైన ఫ్యాక్టర్‌. గనులున్న చోట వేడి భరించడం కష్టం కాబట్టి మైనింగ్‌ యింజనియర్‌ను పెళ్లాడడానికి ముందుకు వచ్చేవాళ్లు తక్కువ. 'నెలకో ఓ పదివేలు తక్కువ యిచ్చినా బెంగుళూరులోనే పనిచేస్తా. చెన్నయ్‌లో చెమట భరించలేను బాబూ' అనేవాళ్లు చాలామంది కనబడ్డారు. వాతావరణం విషయంలో హైదరాబాదుకి అలవాటు పడినవాడు తెలుగు రాష్ట్రాలలో వేరెక్కడికీ వెళ్లడానికి యిష్టపడడు. అందునా బ్లేజ్‌ వాడగా పిలవబడే బెజవాడ వెళ్లాలంటే చాలా గుండె ధైర్యం కావాలి.

హైదరాబాదు వదలడానికి బాబు మాత్రం యిష్టపడతారా?

ఆ మాటకొస్తే హైదరాబాదును కెసియార్‌కు ధారాదత్తం చేసి వెళ్లడం బాబుకీ యిష్టం లేదు. ఏదో పేరుతో యిక్కడే మసలుతూ, తన పార్టీ నాయకులకు సూచనలు చేస్తూ, వార్తల్లో నలుగుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తన పార్టీని సిద్ధం చేయాలని ఆయన ప్లాను. తను విజయవాడలో కాపురం పెట్టి తెలంగాణ టిడిపి యూనిట్‌కు హైదరాబాదు వదిలేస్తే యిక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదగవచ్చు. ఢిల్లీ పాలకులకు దక్కన్‌ ఎప్పుడూ తలకాయనొప్పిగానే వుండేది – ఎప్పుడు తిరగబడతారో అని. అందుకని చక్రవర్తి  తన కొడుకుల్లో ఒకణ్ని ఎప్పుడూ యిక్కడ రాజప్రతినిథిగా వుంచేవారు. అలా లోకేశ్‌ను తెలంగాణలో పెట్టినా, ఏ మేరకు అదుపు చేయగలరో తెలియదు. విజయవాడలో యింకా ఏదీ అమరలేదు. గన్నవరం విమానాశ్రయం బొమ్మరిల్లులా వుందని వెంకయ్యనాయుడు అన్నారు. మాటిమాటికి ఢిల్లీ వెళ్లాలన్నా, యిక్కడకు వచ్చిన జాతీయనాయకులను ఆహ్వానించాలన్నా హైదరాబాదు అడ్డా వదులుకోకూడదు. ఇంకో విషయం కూడా వుంది. మీడియా యింకా విజయవాడకు షిఫ్ట్‌ కాలేదు. పత్రికలు, టీవీల హెడ్‌ ఆఫీసులన్నీ యిక్కడే వున్నాయి. హైదరాబాదు వాళ్లకే స్టూడియో చర్చల్లో అవకాశం దక్కుతోంది. ఆంధ్రలో వుండే నాయకులు చెవులకు యియర్‌ ఫోన్స్‌ తగిలించుకుని 'నాకూ ఛాన్సివ్వండి' అంటూ చెయ్యెత్తుతూ స్క్రీన్‌పై కనబడుతున్నారు. బాబుకు, ఆయన పార్టీకి వూపిరి పోసినది, పోస్తున్నది మీడియానే. హైదరాబాదు నుంచి మీడియా చీలి అటు వచ్చేదాకా బాబు అటు వెళ్లడానికి యిచ్చగించరని నా అంచనా. 

ఇలా ఆలోచిస్తే ఆఫీసులు ఎప్పుడు తరలుతాయో, సిబ్బంది ఎప్పుడు లేస్తారో, ఫైళ్లు ఎప్పుడు కదులుతాయో ఎవరూ చెప్పలేరు. అధికారగణం లేకుండా నిర్ణయాలు ఎలా తీసుకోగలరు? ఎలా అమలు చేయగలరు? తాత్కాలిక రాజధాని వ్యవహారమే యిలా వుంటే శాశ్వత రాజధాని సంగతి చెప్పేదేముంది? విజయవాడ పరిసరాల్లో అని చెప్పేసి ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. అంతవరకు బాగానే వుంది, కానీ అక్కడ భూములు ఎలా సేకరించగలరో, ఎలా కట్టగలరో, ఎన్ని థాబ్దాలు పడుతుందో ఎవరూ చెప్పలేరు. రాజధాని నిర్ణయం తప్ప బాబు తీసుకున్న మేజర్‌ నిర్ణయం ఏదీ లేదు. లక్షన్నర దాకా ఋణమాఫీ చేస్తాం అనే నిర్ణయం తీసుకున్నారు కానీ ఎలా చేయాలన్నది నిర్ణయించలేదు. పరిశ్రమలు ఆహ్వానిస్తున్నాం, వారెవరో వచ్చేస్తున్నారు.. వంటి ప్రకటనలు గత టిడిపి పాలన నుండి, కాంగ్రెసు పాలనదాకా వింటూనే వచ్చాం. ఎవరో వచ్చారు, డాలర్లు కురిపిస్తారు అంటారు, చుట్టుపట్ల స్థలాలు అమ్మేస్తారు, భూమి ఎలాట్‌ చేయించుకున్నవాడు ఇండస్ట్రీ మాత్రం పెట్టడు. అయిదారేళ్లు చూసి ప్రభుత్వం వెనక్కి యిచ్చేయమంటుంది. ఈ లోగా ఆ పారిశ్రామిక వేత్త ఏ జైలుకి వెళతాడో, ఎంత పతనం చెందుతాడో తెలియదు. ఈ తంతు చూసి, చూసి విసిగి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాలు జరిగినప్పుడే నమ్మాలి అని నిశ్చయించుకున్నాను. శంకుస్థాపనలు కూడా నమ్మడం మానేశాను. 

ప్రస్తుతానికి చూస్తే తెలంగాణలో అనువైన పరిస్థితులున్నాయి కానీ పాలన ఎలా వుంటుందో, భూమిపుత్రుల వాదంతో చిక్కులు సృష్టిస్తారేమోనన్న భయం వుంది. ఆంధ్రలో చూస్తే భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. జిల్లాల వారీగా రాబోయే యూనిట్ల లిస్టు చూపించి రియల్టర్లు ఆశలు చూపిస్తున్నారు, కలలు అమ్ముతున్నారు. రేట్ల విషయంలో భూమి సొంతదారులు కొమ్మెక్కి కూర్చున్నారు. స్థలానికే అంత పెడితే, పరిశ్రమ నడపడం కిట్టుబాటు కాదని పారిశ్రామికవేత్తలు దడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రాల్లో ఎక్కడ ఏ పరిశ్రమ వస్తుందో, వచ్చినా నిలుస్తుందో లేదో వంద రోజుల్లో కాదు కదా, వెయ్యి రోజుల్లో కూడా చెప్పడం సాధ్యం కాదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2014

[email protected]