ఎమ్బీయస్‌ : 12 యాంగ్రీ మెన్‌

సత్యార్థి గురించి నేను రాసిన వ్యాసంపై చర్చ సందర్భంగా ఒక పాఠకుడు చాలా సమయోచితంగా ''12 యాంగ్రీ మెన్‌'' సినిమాను ప్రస్తావించి ప్రశ్నించడం వలన కలిగే లాభాలను ఎత్తి చూపారు. 1957 నాటి ఆ…

సత్యార్థి గురించి నేను రాసిన వ్యాసంపై చర్చ సందర్భంగా ఒక పాఠకుడు చాలా సమయోచితంగా ''12 యాంగ్రీ మెన్‌'' సినిమాను ప్రస్తావించి ప్రశ్నించడం వలన కలిగే లాభాలను ఎత్తి చూపారు. 1957 నాటి ఆ సినిమా గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అందుకే యీ వ్యాసం. ఏ ప్రతిపాదన నయినా గుడ్డిగా నమ్మకూడదని, మనసులో సందేహం మెదిలితే ఎంతమంది అదిలించినా, వెక్కిరించినా, అణిచివేయాలని చూసినా దాన్ని వ్యక్తపరచి తీరాలని చెప్పే యీ సినిమా నాకెంతో యిష్టమైన సినిమా. దీనిపై ఆధారపడి తీసిన హిందీ సినిమా ''ఏక్‌ రుకా హువా ఫైస్‌లా'' (1986) ను 1986లో దూర్‌దర్శన్‌లో చూశాను. బాసు చటర్జీ దర్శకనిర్మాతగా పారలల్‌ సినిమాల్లో కూడా నటించే స్టేజి నటులతో టీవీ కోసమే తీశారనుకుంటాను. స్త్రీ పాత్రే లేదు. అత్యంత ఉత్కంఠభరితంగా సినిమా సాగింది. పత్రికల్లో దాని గురించి చదివినప్పుడు దానికి మూలం ఫలానా అని తెలిసింది. కానీ ఆ ఇంగ్లీషు సినిమా చూడలేదు. అప్పట్లో ఇంగ్లీషు సినిమాలు యిప్పటిలా విరివిగా లభించేవి కావు. ఆ తర్వాత ఏడెనిమిదేళ్లకు ముళ్లపూడి రమణగారి రచనలకై ఆంధ్రపత్రిక పాత సంచికలు తిరగవేస్తూ వుంటే 1958లో రమణగారు దీని సినిమా కథ రాసినట్లు గమనించాను. తర్వాత గొల్లపూడి మారుతీరావుగారు ''ఏడు నాటకాలు'' పేర ఆంధ్రప్రభ వీక్లీలో సీరియల్‌ రాసినప్పుడు యీ నాటకాన్ని యిప్పటికీ ఇంగ్లండులో ప్రదర్శిస్తూంటారని తెలిసి ఆశ్చర్యపడ్డాను. 2004లో రమణ సాహితీసర్వస్వంలో ఆరవ సంపుటంగా 'సినీరమణీయం – 1' వెలువరించినపుడు యీ సినిమా కథను దానిలో చేర్చాను. నా కిష్టమైన యీ సినిమాను, దానిలో కథాంశాన్ని ఆ పాఠకుడు ప్రస్తావించడం నాకెంతో ఆనందం కలిగించింది. ఈ ఇంగ్లీషు సినిమా ఇంటర్నెట్‌లో దొరుకుతోంది. హిందీ సినిమా డివిడి రూపంలో దొరుకుతోంది. వీలున్నవారందరూ చూడండి. లేనివారి కోసం కథాంశాన్ని క్లుప్తంగా చెప్తాను. 

ఈ 12 మంది జ్యూరీ సభ్యులు. 18 ఏళ్ల కుర్రాడు తన తండ్రిని కత్తి పెట్టి చంపాడని కేసు. సాక్ష్యాలూ, వాదనలూ అన్నీ పూర్తయ్యాయి. ముద్దాయి దోషా, నిర్దోషా చర్చించుకుని ఏకాభిప్రాయం చెప్పమని, అదే తుది నిర్ణయం అవుతుందని జ్యూరీ సభ్యులను జడ్జి కోరాడు. ఒక గదిలో అందర్నీ పెట్టి ఏదో ఒక తీర్పు చెప్పిన తర్వాతే వదులుతామని చెప్పారు. కేసు చూస్తే ఓపెన్‌ అండ్‌ షట్‌ కేసులా వుంది. ఆ కుర్రాడు అలగా (లంపెన్‌) కుర్రాడు. తండ్రీ అదే రకం. బీదాబిక్కీ వుంటే ప్రాంతంలో వుంటారు. తండ్రితో కుర్రాడు ఓ రాత్రి పోట్లాట పెట్టుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు 'నిన్ను చంపుతా' అని అతను తండ్రిని తిట్టినట్లు కింది వాటాలో వున్న సొట్టకాలు ముసలాయన సాక్ష్యం. ఇంకో క్షణం తర్వాత ఒక మనిషి దభీమని నేలమీద పడిన చప్పుడు విన్నాడట. విని, లేచి గది తలుపు తీసుకుని పరుగెత్తి మేడమెట్ల దగ్గరకి వచ్చి ఆ కుర్రాడు మేడమెట్లు దిగి పరిగెట్టడం చూశాడుట. రెండో ప్రత్యక్షసాక్షి ఎవరంటే ఆ ఫ్లాట్‌కు ఎదురుగా అరవై అడుగుల దూరాన వున్న ఫ్లాట్‌ లో వుండే ముసలమ్మ. ఈ రెండిళ్లకీ మధ్య ఎలక్ట్రిక్‌ రైలు రివ్వున పోతూ వుంటే ఆ రైలు తాలూకు చిట్టచివరి రెండు పెట్టెల కిటికీలలోనించి యీ యింట్లో జరిగిన హత్యను చూసింది. కుర్రాణ్ని అడిగితే తను ఆ సమయంలో సినిమాకు వెళ్లినట్లు చెప్పుకున్నాడు. మూడు గంటలకు యింటికి తిరిగి వచ్చేసరికి పోలీసులు అరెస్టు చేశారు. వాడు తండ్రిని పొడిచి కత్తికోసం యింటికి తిరిగి వచ్చాడని, సినిమాకు వెళ్లనేలేదనీ ప్రాసిక్యూషన్‌ వాదం. తనపై అభియోగం విని కొయ్యబారిపోయిన కుర్రాడు పోలీసులు అడిగినపుడు తను చూసిన సినిమా పేరు చెప్పలేకపోయాడు. 

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జ్యూరీలో 11 మంది ఆ అబ్బాయి దోషే అని ఓట్లేసి తమ అభిప్రాయం చెప్పాడు. ఒక్కతను మాత్రం అతను దోషి కాడేమో, సాక్ష్యాలు సరికావేమో అని అనుమానం వ్యక్తం చేశాడు. అబ్బాయి నిర్దోషి అని కూడా అననన్నాడు. ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెది మరో దారైతే, ఉలిపికట్టెపై అందరికీ కోపం రాదా? వచ్చింది. నవ్వారు, హేళన చేశారు. అలా అని వాళ్లందరికీ ఏమైనా తెలుసా? అబ్బే, వాళ్లంతా న్యాయశాస్త్ర కోవిదులు కారు. వారిలో పుట్టుకతో గొప్పవాళ్లు, కింది జాతిలో పుట్టినా కష్టపడి పైకి వచ్చినవాళ్లు, అహంభావులు, ఆలోచించే ఓపిక లేని వృద్ధులు, ఎందుకొచ్చిన గొడవరా యిది చప్పున తెమిలితే సినిమాకు పోవచ్చు కదా అనుకునేవాళ్లు, మెజారిటీ ఎటుంటే అటే వుంటే పోతుంది కదా అనుకునే గాలికోడి లాటి వాళ్లు, తమ తీర్పుపై ఒకడి ప్రాణం ఆధారపడి వుందని తెలిసినా వాదనలు వినకుండా క్రాస్‌వర్డ్‌ పజిల్‌ చేస్తూ కూర్చునేవాళ్లు, ముద్దాయి లాటి అలగాజనం ఎంతమంది ఛస్తే అంత మంచిది అని ఫీలయ్యేవాళ్లు – అందరూ వున్నారు. వారిలో ఒకరికొకరికి పరిచయం లేదు. అయినా కూడబలుక్కుని యీ సందేహజీవిపై విరుచుకు పడ్డారు – నీ పాయింటు ఏమైనా వుంటే చెప్పు, ఊరికే నస పెట్టక అన్నారు. పాయింటు తెలిస్తే చెపుదును కదా, తెలియదు, కానీ సాక్ష్యాలు సరిగ్గా లేవేమోనన్న అనుమానం పీడిస్తోంది అంటాడతను. అది నివృత్తి అయ్యేదాకా నేను దోషి అనను అంటాడు.

ఇతని ఘోష చూసి క్రమేపీ అవతలివాళ్లలో ఆలోచనలు మెదులుతాయి. వాళ్లు స్వతహాగా తెలివైన వారే. కొన్ని విషయాల్లో గతానుభవాలు వున్నవారే. అయితే దీని గురించి మైండ్‌ అప్లయ్‌ చేయలేదు. అదిగో పులి అంటే యిదిగో తోక అన్న చందంగా గుడ్డిగా పోయారు. ఇప్పుడు యీ పన్నెండో వాడి ఓటు కూడా పడకపోతే మనల్ని గదిలోంచి వదిలిపెట్టర్రా బాబూ అనుకునే సరికి కాస్త బుర్రపెట్టి ఆలోచించసాగారు. అప్పుడు వాళ్లకే సందేహాలు కలగసాగాయి. సాకక్షుల మాటలు ఎంతవరకు నమ్మాలి? కిటికీ పక్కన ఎలక్ట్రిక్‌ రైలు ఘోషిస్తూ వుంటే గదిలో పడుకున్న ముసలాడికి పై ఫ్లాట్‌లో ముద్దాయి పెట్టిన కేకలు వినబడతాయా? మనిషి నేలకూలడం వినిపిస్తుందా? కుంటివాడు కదా, 15 సెకండ్లలో 55 అడుగులు నడవగలడా? అని మొదటి సాక్షిపై అనుమానం వస్తుంది. ఇక రెండో సాక్షి చత్వారం వున్నావిడ కదా అరవై అడుగుల దూరంలో అర్ధరాత్రి కళ్లజోడు లేకుండా ఎలక్ట్రిక్‌ రైలు చివరి రెండు పెట్టెల తాలూకు  కిటికీ అద్దాల గుండా చూసినప్పుడు హంతకుడిని కచ్చితంగా గుర్తించగలదా? తెలిసీ తెలియకుండానే వీరిద్దరూ అబద్ధాలు చెప్పారా? ఏ ప్రయోజనం ఆశించి..? వాళ్లకు ముద్దాయి ఏ ద్రోహం చేయలేదు కదా! పేపర్లో పేరు పడుతుందన్న మోజుతో అబద్ధం చెప్పేస్తారా? కాకపోవచ్చు. విన్నది, కన్నది కలగాపులగమై పోయి వాళ్లు తమంతట తామే భ్రమలో పడవచ్చుకదా! అదే నిజమని నమ్మి చెప్పి వుండవచ్చు కదా! కుర్రవాడు సినిమా పేరు చెప్పలేకపోవడమేం? అనే ప్రశ్నకు – సమాధానంగా 'కంగారు పడితే మీరూ మర్చిపోతారు. గతవారం చూసిన సినిమాలో నటీనటుల పేరు చెప్పండి, నిన్న రాత్రి మీ ఆవిడ ఏం వండిందో చెప్పండి' యిలా ఒకరి నొకరు అడుగుతారు. చివరకు సాక్ష్యంగా ప్రవేశపెట్టిన కత్తి మీద కూడా సందేహం వస్తుంది. హత్య జరిగిన తీరు చూస్తే ఆ కత్తిని వాడి వుండరని ఒకతనికి లేటుగా తడుతుంది. నీకెలా తెలుసు అంటే నేను పెరిగినది మురికివాడల్లోనే, అలాటి కత్తుల గాట్లు నా శరీరంపై వున్నాయి అంటాడు. 

ఇలా సందేహాలు పెరుగుతున్న కొద్దీ అతను నిర్దోషి అనుకునేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది. అతడు దోషి, శిక్షించి తీరాలి అని గట్టిగా పట్టుబట్టే ఉన్నతవర్గీయులు యిలా అభిప్రాయాలు మార్చుకునే వారిని తిడుతూంటారు. దాంతో వాళ్లకు తిక్కరేగుతూ వుంటుంది. నీ జులుం యిక్కడ చెల్లదు అంటూ తిరగబడతారు. హిందీ సినిమాలో ఈ పాత్రలను మన భారతీయ వాతావరణంలోకి చక్కగా యిమిడ్చారు. వారి కులాలను, నేపథ్యాలను మనం సులభంగా వూహించవచ్చు. మన ఆలోచనాసరళిపై మన కుటుంబం, మన పెంపకం, మనం పెరిగిన వాతావరణం, మన చదువు తప్పక ప్రభావం చూపుతాయి. మనకు జరిగిన అనుభవాల నీడలు మనను వెంటాడతాయి. మనను గతంలో మోసం చేసినవారిని క్లాసిఫై చేసి, దాన్నుండి జనరలైజ్‌ చేసి, చేతిలో వున్న అంశాన్ని దానిలో యిరికించి, ఒక అభిప్రాయం ఏర్పరచేసుకుంటాం. ఫ్రెష్‌గా ఆలోచించడానికి మనసు ఒప్పుకోదు. ఇలాటి గతుకుల్లోంచి బయటపడి నిష్పక్షపాతంగా ఆలోచించడానికి కొంత శ్రమ పడాలి. ఆ దిశగా ఆలోచించడానికి ఒక ప్రేరకం కావాలి. ఈ సినిమాలో ఆ సందేహజీవి అలాటి ప్రేరకంగా కనబడతాడు. ఇలా ఆలోచనలు రేకెత్తడం, అభిప్రాయాలు మారడం ముందే ఒక నిర్ణయానికి వచ్చేసిన అహంభావులకు అస్సలు నచ్చదు. 'మీకు స్థిరాభిప్రాయం లేదు, మీ పుటకే అంత, ఇంగ్లీషే సరిగ్గా రానివాడివి, నువ్వు చెప్పేది నేను వినడమేమిటి? ఇలాటి సందర్భాలు బొచ్చెడు చూశాను, నువ్వు నిన్నగాక మొన్న పుట్టినవాడివి, మీకు తెలియదు యీ అలగా జాతంతా అంతే, వాళ్ల బుద్ధులు మారవు, యిలాటి వాళ్లు ఎంత మందిని ఉరికంబమెక్కిస్తే దేశం అంత బాగుపడుతుంది' యిలా వుంటాయి వారి వాదనలు. ఈ పన్నెండు మంది ఒకరితో ఒకరు తలపడతారు. తిట్టుకుంటారు, హెచ్చరించుకుంటారు.

క్రమంగా ఒక్కోరూ మెత్తబడతారు. దోషి కాదేమోనన్న అభిప్రాయానికి వస్తారు. కానీ ఒక ముసలాయన మాత్రం గట్టిగా నిలబడతాడు. సినిమా చివరిలో కారణం తెలుస్తుంది. ముద్దాయి యీడువాడే అతని కొడుకూనూ. రెండేళ్ల క్రితం తండ్రితో పోట్లాడి లెంపకాయ కొట్టి యింట్లోంచి పారిపోయాడు. అతని కడుపు చిచ్చు తిక్కగా మారి యీ కేసులో తండ్రిని చంపాడన్న నింద భరిస్తున్న కుర్రాడిపై కసిగా మారింది. తన కొడుకుపై తీర్చుకోలేకపోయిన పగ యీ కుర్రాడికి మరణశిక్ష విధించి తీర్చుకుందామని చూస్తున్నాడు. ఇది కూడా అతను కావాలని చేస్తున్నది కాదు. ఈ భావం అతని మనసు పొరల్లో దాగి వుంది. అలా వుందని అతనికే తెలియదు. ధర్మం కోసమే పోరాడుతున్నానని అతను అనుకుంటాడు, ధర్మపాలనకు అవసరమైన సత్యం బయల్పడడానికి అడ్డుపడుతున్నానని తెలుసుకోడు. చివరకు అతను కూడా మారతాడు. ఈ కథను రాస్తూ రమణగారు అంటారు – 'ఈసడింపులూ, చిరాకులూ, పరాకులూ తట్టుకు నిలబడి, ఒక సామాన్య మానవుడు, ముద్దాయి నిర్దోషి కావచ్చునేమో అన్న అనుమానాన్ని ప్రవేశపెట్టి, నిలబెట్టి, మెల్లిమెల్లిగా మనుషుల మనసుల చుట్టూ వున్న తిక్క, అవేశం, స్వార్థం, పట్టుదల, సొంత బాధల పొరలన్నీ చీల్చి వాళ్ల హృదయాలను స్పృశిస్తాడు. ఒక్కొక్కరినే ధర్మపథానికి మళ్లిస్తాడు. ఒక్కొక్క హృదయాన్నే జయిస్తాడు. మనమందరం తెల్లారి లేచింది లగాయితూ, ధర్మం సత్యం అని వాపోయి ధర్మదేవతకు ఫాన్‌ లెటర్స్‌ రాసేవాళ్లం కాకపోయినా, ఇందులో ప్రధాన పాత్రధారి హెన్రీ ఫోండా, వినమ్రత ఉట్టిపడే, భయం తొలగి చూపే పట్టుదల పట్టుకు వేళ్లాడే చిరునవ్వు నవ్వుతూ ఒక్కొక్క ఓటూ గెలుస్తున్నపుడు, మనం కూడా ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని జయిస్తున్నామన్న మహదానుభూతి కలుగుతుంది.' అని.

హెన్రీ ఫోండాయే సిడ్నీ లుమెట్‌ అనే దర్శకుడి చేత యీ టీవీ నాటకాన్ని తెరకెక్కించాడు. అక్కణ్నుంచి సిడ్నీ అనేక మంచి సినిమాలు తీశాడు. ''మర్డర్‌ ఆన్‌ ద ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌'', ''డాగ్‌ డే ఆఫ్టర్‌నూన్‌'', ''ద విజ్‌'' వంటి పలురకాల సినిమాల తీసి పేరు గడించాడు. ''12 యాంగ్రీ మెన్‌'' చూడవలసిన సినిమా. చూసి మర్చిపోకూడని సినిమా. అది నాటకం కాబట్టి 3 గంటల్లోనే అసలు విషయంపై ఒక స్పష్టత వచ్చేస్తుంది. నిజజీవితంలో కొన్ని థాబ్దాలు గడిచినా సందేహాలు సందేహాల్లాగే మిగిలిపోతాయి. లేవనెత్తిన వాడి జీవితకాలంలో సత్యం బయట పడకపోవచ్చు. అలా అని వ్యక్తి సందేహించడం మానకూడదు, ప్రశ్నించడానికి జంకకూడదు. సోక్రటీసు నుండి గెలీలియో వరకు అలా చేసిన వారే. మన వద్ద సత్యకామ జాబాలి, చార్వాకుడు అలాటి వారే. అప్పటిదాకా సమాజం నమ్ముతున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రాజా రామమోహన్‌ రాయ్‌, వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలందరూ యిక్కట్లు పడినవారే. ఇలా గొంతెత్తినపుడు తత్సమయానికి నిందలు పడవచ్చు, ఎద్దేవాకు, ఒక్కోప్పుడు శిక్షకు గురి కావచ్చు, కానీ ఎప్పటికో అప్పటికి సత్యం జ్యోతిలా వెలిగి యీ చీకట్లను దూరం చేస్తుంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]