విశాఖలో మళ్లీ రియల్ జోరు

సామాన్యుడు బేజారు స్మార్ట్ సిటీ సాకుతో పెరిగిన భూముల రేటు పుష్కలంగా సర్కార్ పెద్దల అండదండలు Advertisement విశాఖ నగరం మళ్లీ ఖరీదుగా మారిపోయింది, గత కొన్నాళ్లుగా పడేకసిన రియల్ దందా జూలు విదిల్చింది.…

సామాన్యుడు బేజారు
స్మార్ట్ సిటీ సాకుతో పెరిగిన భూముల రేటు
పుష్కలంగా సర్కార్ పెద్దల అండదండలు

విశాఖ నగరం మళ్లీ ఖరీదుగా మారిపోయింది, గత కొన్నాళ్లుగా పడేకసిన రియల్ దందా జూలు విదిల్చింది. ఫలితంగా భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మధ్యతరగతి, పేదలకు మహా విశాఖలో నిలువ నీడ లేకుండా చేసే ప్రయత్నాలు మొదయ్యాయి. అభివృద్ధి సాకుతో రేట్లు పెంచేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బడా బాబులకు సర్కార్ పెద్దలు సైతం సై అనడంతో పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. ఆశకు హద్దు లేదన్నట్లుగా రియల్ వ్యాపారుల తీరు ఉండడంతో నగర శివార్లలో సైతం భూముల ధరలు విపరీతమవుతున్నాయి. మెట్రో రైలు, స్మార్ట్ సిటీలను చూపించి స్ధలాలను అమ్ముకోవడం మొదలైంది. రానున్న రోజులలో ఈ జోరు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, విశాఖలో ఇక పేదలకు చోటుండదన్న సంగతి తేటతెల్లమవుతోంది

విశాఖ నగరం చాలా ప్రశాంత నగరం, అందరినీ కలుపుకుపోయే నగరం, చిన్న మత్స్యకార పల్లెగా మొదలై ఇపుడు ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా నిలిచింది. విభజన తరువాత అందరి కన్నూ ఈ నగరంపైనే పడిందంటే విశాఖ ప్రాముఖ్యత ఏమిటో అర్ధమవుతుంది. భూ, ఆకాశ, సాగర రవాణా మార్గాలు కలిగి ఉన్న అతి కొద్ది నగరాలలో విశాఖ ఒకటి కావడం కూడా ఖ్యాతిని పెంచింది. ఓ విధంగా రాజధానికి కూడా విశాఖ చాలా అనుకూలం. కానీ, రాజకీయాలే అది పడనీయకుండా చేశాయన్నది నిష్టుర సత్యం. విశాఖపైన చంద్రబాబు సర్కార్‌కు కూడా ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఈ నగరాన్ని ముంబై, బెంగుళూరు మాదిరిగానూ, ఐటీలో సిలికాన్ తరహాలోనూ, ప్రగతి విషయంలో సింగపూర్‌తోనూ బాబు ఎపుడూ పోల్చుతూ ఉంటారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా ఆయన హామీలు ఇచ్చారు. అయితే, ఆయన హామీలు ఎలా ఉన్నా కేంద్రంలో ఏర్పడిన  మోడీ సర్కార్ మాత్రం మంచికో, చెడ్డకో విశాఖను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసింది. 

దేశంలోని మూడు ప్రధాన నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేస్తే అందులో విశాఖపట్నం కూడా ఒకటి, అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానంతో విశాఖ ప్రగతి పరుగులు తీస్తుందన్నమాట. దీనికి కేంద్రం నిధులను సాయం చేస్తే అమెరికా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేస్తుంది. దానితో పాటుగా, విశాఖకు మెట్రో రైలు కూడా రానుందన్న ప్రచారమూ ఉంది. గత నెలలో మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ విశాఖలో పర్యటించారు కూడా. దీనిపై ప్రాధమిక నివేదికను కూడా సీఎంకు త్వరలో అందచేయనున్నారు. 201 నాటికి తొలి దశ మెట్రో రైలును విశాఖలో పూర్తి చేయించాలన్నది బాబు సర్కార్ ఆలోచనగా ఉంది. ఇక, ఐటీ పరంగా కూడా హబ్‌గా చేస్తామని, సినీ రాజధాని చేస్తామని కూడా బాబు ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఉన్నత విద్యా కేంద్రాలు, జాతీయ విద్యా సంస్ధలు కూడా విశాఖలో నెలకొల్పడం వంటివి కూడా హామీలలో ఉన్నాయి. విభజన హామీని కేంద్రం నిలబెట్టుకుంటే వెనుకబడిన జిల్లాల జాబితాలో నగరం చేరి భారీ నిధులను కూడా సమకూర్చుకునే అవకాశం ఉంది. దానికి తోడు పలు రాయితీలు కూడా అందే వీలుండడంతో పారిశ్రామికంగా కూడా నగరం విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఎదిగేందుకు వీలున్న విశాఖపట్నాన్ని, దాని అభివృద్ధిని మొదటి నుంచి ఇక్కడ ఉన్న వారు అనుభవించే వీలు లేకుండా చేసేందుకు రియల్ దందా సన్నాహాలు చేస్తోంది,

చదరపు గజం లక్ష

మహా నగరం నడిబొడ్డున ఇపుడు వినిపిస్తున్న మాట ఇది,. విశాఖ స్మార్ట్ సిటీ కాబోతోందని, అదే కనుక జరిగితే నగరంలో తమకూ ఓ ప్లాట్, ఇల్లు ఉంటే బాగుంటుందన్న ఆశ చాలా మందిలో ఉంటుంది. సరిగ్గా దానిని సొమ్ము చేసుకోవడానికి ఇపుడు రియల్ పెద్దలు రంగంలోకి దిగిపోయారు. నగరంలో అతి పెద్ద కాలనీగా ఉన్న ఎంవీపీ కాలనీలో స్ధలాలు, ప్లాట్లకు యమ గిరాకీ ఉంది. ఆ మధ్యకాలం వరకూ యాభై, అరవై వేల మధ్యలో చదరపు గజం ధర ఉండేది. ఇపుడది ఏకంగా లక్షకు పెంచేశారు దళారీలు. అలాగే, నగరంలోని ద్వారకానగర్, జగదాంబ సెంటర్, మద్దిలపాలెం, వంటి ప్రాంతాలలోనూ ఇదే రకమైన ధరను చెబుతున్నారు. ఇక, అరిలోవ, మధురవాడ వంటి శివారు ప్రాంతాలలోనూ ధరలు రెక్కలు విప్పుతున్నాయి. చదరపు గజం అరవై నుంచి ఎనభై వేలకు పాకుతున్నాయి. బోయపాలెం, కాపులుప్పాడ, వంటి చోట్ల చదరపు గజం ముప్పయి నుంచి నలభై వేలకు పెంచేశారు. ఇక, ప్లాట్ల రేట్లు కూడా రెట్టింపు అయ్యాయి. ఎక్కడ చూసినా ధరాఘాతంతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవతున్నాడు. ఇల్లు కట్టాలంటే కచ్చితంగా కోటి రూపాయలు ఉండాల్సిందే. అంటే కోటీశ్వరులేక స్మార్ట్ సిటీ అన్నమాట. ఇలా రియల్ దందా చేసే వారి వెనుక పెద్దలు చాలామందే ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. విశాఖకు ఎంతగా ఎక్స్‌ప్రోజర్ ఇస్తే అంతగా లాభాల పంట పండించుకోవచ్చున్న  దురాశతో చాలామంది ఈ విధంగా తెగిస్తున్నారు. 

హుధ్‌హుధ్ తరువాత హైప్…

విశాఖ నగరం హుధ్‌హుధ్ తుపానుతో సతమతమైంది. ఓ విధంగా చెప్పాలంటే మౌలికంగా కూడా దెబ్బతింది. ఈ నగరం ఇక మళ్లీ గాడిన పడాలంటే కనీసంగా పదేళ్లు పైనే పడుతుందని అంతా అంచనా వేశారు. అయితే, దానికి విరుగుడు అన్నట్లుగా చంద్రబాబు సర్కార్ ప్రతీ దానికీ అతి చేస్తూ పోయింది. విశాఖను చూసి హుధ్‌హుధ్ తుపానే భయపడిందని ముఖ్యమంత్రే చాలా చెప్పారు. ఇక, మంత్రి గంటా శ్రీనివాసరావు వంటి వారైతే విశాఖ చెక్కుచెదరలేదంటూ నిబ్బరంగా చెప్పారు.  ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, తరచూ సీఎం రావడం వంటి వాటితో విశాఖ పూర్వ స్థితిలోనే ఉందన్న టముకు వేశారు. అయితే, వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పటికీ విశాఖ కోలుకోలేదు. శివారు ప్రాంతాలకు వెళ్తే ఇంకా నష్టం ప్రభావం నుంచి బయటపడని స్థితి ఉంది. కానీ, టీడీపీ సర్కార్ మాత్రం వేరే విధంగా చిత్రీకరిస్తోంది. దీనిపై రాజకీయ లబ్దిని పొందేందుకే ఈ తరహా ప్రచారం చేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి యద్దనపూడి అయ్యన్నపంతులు కూడా హుధ్‌హుధ్‌తో నగరం కోలుకోలేదని ఘాటు విమర్శ చేశారు కూడా. అయినా కూడా టీడీపీలో చేరిన, ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన రియల్ దందాకు సహకరించే ఉద్దేశ్యంతోనే సర్కార్ ఈ తీరున వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు రాజధాని పేరుతో అక్కడ దందా చేసిన గ్యాంగే ఇపుడు విశాఖలోనూ రంగంలోకి దిగుతోంది. ఉన్న దానిని పది రెట్లు చేసి చూపించడం, హైప్ చేయడం ద్వారా కోట్లు కొల్లగొట్టే ఈ వ్యూహంలో సామాన్యున్ని బలి పశువును చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

ప్రశాంత నగరంలో అశాంతి

ఉన్న భూమి ధరను పెంచడంలో సిద్ధహస్తులైన వారు ఇపుడు నగరంలో తిరుగుతున్నారు. వారికి రేట్ ఎలా పెంచాలో తెలుసు. లేని దానిని ఉన్నట్లుగా ఎలా చూపించాలో కూడా తెలుసు. రాజధాని అవకాశం కోల్పోక ముందు కూడా విశాఖ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి ఇలాంటి ప్రచారం వల్లనే. మళ్లీ తగ్గిందనుకున్న వేళ హఠాత్తుగా రియల్ పెద్దలు రావడం, రెక్కలు తగిలించడం షరా మామూలుగా సాగుతోంది. ఇటీవల కాలంలో రియల్ దందాల పోటీతో నగరంలో ప్రశాంత వాతావరణం కూడా చెడిపోతోంది. భూ తగాదాలలో పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఇబ్బడి ముబ్బడిగా నమోదు అవుతున్నాయి. అదే విధంగా, నగరంలోని రౌడీ ముఠాలకు కూడా చేతినిండా పని కల్పిస్తున్నారు. ఇతర జిల్లాల  దౌర్జన్య లక్షణాలు కూడా విశాఖలో కనిపిస్తున్నాయి. ఇటువంటి పోకడలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం, ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వారంతా రియల్ వ్యాపారంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను కలిగి ఉండడం వల్ల కూడా రియల్ దాదా గిరీ చెల్లుబాటు అవుతోంది

పోటీ పడుతున్న వుడా

విశాఖ నగరాభివృద్ధి సంస్ధ పేరును, వ్యవస్ధను కూడా ఇపుడు మార్చేస్తున్నారు. మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో కొత్త వ్యవస్ధను తీసుకువస్తున్నారు. దీనికి ఏకంగా ముఖ్యమంత్రే చైర్మన్‌గా ఉంటారు. అయిదుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులు సభ్యులుగా ఉండే ఈ వ్యవస్ధ కూడా రియల్ దందాకు వత్తాసుగానే పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వుడా సైతం ఎపుడూ పేదలు, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన దాఖలాలు లేవు. అదే వరుసలో ఇపుడు మెట్రో డెవలప్‌మెంట్ అధారిటీ కూడా రెవిన్యూ కోసం ఉన్న భూముల ధరలను రెట్టింపునకు అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. దీనికి స్మార్ట్ సిటీ, ఐటి హబ్ వంటి సోకులు అవసరమవుతున్నాయి. ఇదే ప్రైవేటు దందాలకూ అక్కరకొస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఈ స్మార్ట్ సిటీ మాట ఏమిటో కానీ, విశాఖలో సమీప భవిష్యత్తులో బడా బాబులు, కోటీశ్వరులే ఇంటి యజమానులుగా ఉంటారన్నది మాత్రం వాస్తవం.

పివిఎస్‌ఎస్ ప్రసాద్
విశాఖపట్నం.