పూరి జగన్నాధ్ కు ఒక్కసారిగా టాలీవుడ్ కు కొత్త రక్తం ఎక్కించాలని కోరిక కలిగింది. నిజానికి ఆయన తలుచుకుంటే, చాలా సింపుల్ గా కూడా చేసేయచ్చు. ఇప్పటికే వేలాది షార్ట్ ఫిలిమ్ లు నెట్ లో వున్నాయి. నాలుగు రోజులు కాసిన్ని వీక్షిస్తే చాలు, బోలెడు కొత్త రక్తం కనిపిస్తుంది. కానీ అలా చేయకుండా సాక్షి మీడియా ద్వారా భారీ ప్రణాళిక రచించారు. పది రోజులు, పది కథలు, షార్ట్ ఫిలిమ్ లు, రకరకాల షరతులు వగైరా. పోనీ బాగానే వుంది..ఆయన పది రోజులు పది అద్భుతమైన అయిడియాలు ఏం చెబుతారో అని యువ సృజన శీలురు ఆశగా ఎదురు చూసారు. కానీ ఆశ అడియాస అవుతోంది.
తొలి రోజు షార్ట్ ఫిలిమ్ కు అంతగా సూట్ కాని, అర్థం అనిపించుకోని అయిడియా ఒకటి చెప్పారు..సరేలే అనుకున్నారు.
రెండో రోజు చెప్పిన అనాధను పెంచడం, వాడు తండ్రిని అనాధ చేయడం అనే అరిగిపోయిన కాన్సెప్ట్ ఇచ్చారు. స్వాతి, భూమి లాంటి పత్రికలు చదివేవారికి ఇలాంటి కథలు సవాలక్ష గుర్తుకు వస్తాయి.
మూడో రోజు కాన్సెప్ట్ సగం చెప్పి, ముగింపు మీ ఇష్టం అని వదిలేసారు.
నాలుగో రోజు వచ్చేసరికి, కథ లేదు…2040నాటికి కుటుంబ సంబంధాలు, ఆలోచనలు ఎలా వుంటాయో మీరే అల్లుకుని తీసేయండి అంటున్నారు. యండమూరి ఆనందో బ్రహ్మ నవల తొలి పేజీలు చదివితే చాలు, తెలిసిపోతుంది.
నాలుగు రోజులకే కథలు కాస్త, అయిడియా దాకా జారిపోతే, ఇక పది రోజులకు పరిస్థితి ఏమిటో?
అయినా ఇక్కడ సింపుల్ లాజికల్ పాయింట్ ఏమిటంటే, అంత అద్భతుమైన కథలే పూరి దగ్గర వుంటే, వాటిని ఎందుకు బజార్లో పెడతారు..తానే సినిమాలు చేసుకుంటారు కానీ? అలాగే అంత మంచి అయిడియాలు వుంటే ఆయన ఫ్లాపులు ఎందుకు తీస్తారు?