ఆర్టికల్ 371 డి మీద గత రెండు రోజులుగా ఒకటే చర్చలు. అన్నీ విన్నా, చదివినా ఎటార్నీ జనరల్‌గారు ఏం చెప్పారో ఎవరికైనా బోధపడిందో లేదో నాకు అనుమానమే. 371 డి కారణంగా విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం అని ఆయన చెప్పాడని చాలా తెలుగు పత్రికలు, కొన్ని ఇంగ్లీషు పత్రికలు రాశాయి. అబ్బే అవసరం లేదు, విభజించిన తర్వాత ఇక ఆ ఆర్టికల్‌తో పనేముంది అన్నాడని కొన్ని తెలుగు, ఇంగ్లీషు పత్రికలు రాశాయి. ఏది నమ్మాలి?
ఈ 371 డి మీద సమైక్యవాదులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందిరా గాంధీ విభజన దారికి అడ్డంగా యీ పేరుతో పెద్ద బండరాయి పెట్టి వెళ్లిందని, దీన్ని తీయనిదే విభజన బండి ముందుకు సాగదనీ, తీయడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ప్లస్ మెజారిటీ రాష్ట్రాల ఒప్పుకోలు కావాలి కాబట్టి, అవి యుపిఏ సాధించలేదు కాబట్టి విభజన ఆగిపోతుందని అంటూ వచ్చారు. ‘అబ్బెబ్బే, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం వున్నంత వరకే 371డి, ఒకసారి రాష్ట్రం విడగొట్టాక, అసలు రాష్ట్రమే లేనపుడు యిక 371 డితో పనేముంది‘ అని విభజనవాదుల వాదన. ‘అసలు విడగొట్టాలంటే 371 డి తీయాలి కదా’ అంటారు సమైక్యవాదులు. ‘అనుమతి లేనిదే లోనికి పోరాదు, లోనికి పోతే తప్ప అనుమతి పత్రం యివ్వరు’ అన్నట్టుంది యీ పరిస్థితి. ఇరువైపులా రాజ్యాంగ నిపుణులు వున్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్లకి చెప్తున్నారు. న్యాయశాఖ కూడా రాజ్యాంగసవరణ అవసరమే అందని లీకు వచ్చింది. దీనిపై మంత్రుల ముఠా వారు ఎటార్నీ జనరల్ వాహనవతిని సంప్రదించారని తెలిసింది. అయితే వాహనవతి ఏమన్నారన్నాదానిపై వివిధ రకాల లీకులు వచ్చాయి. ‘తెలంగాణ ఆవిర్భావ చరిత్ర’ అని రేపు రాయబోయే పుస్తకంలో పుస్తకంలో ఏ పేజీలో చూసినా లీకులు, పుకారులే కనబడతాయి. ఫలానావారు యీ పరిష్కారాన్ని సూచించారు, కానీ ఫలానావారు దాన్ని వ్యతిరేకించారు, అప్పుడు మధ్యేమార్గంగా ఫలానావారు ఒప్పించారు – అని కాదు, సూచించారని లీకు వచ్చింది, వ్యతిరేకించారని పుకార్లు వచ్చాయి, ఒప్పించారని స్క్రోలింగ్‌లు కాస్సేపు వచ్చాయి… యిలాగే రాయాలి. ఈ ఆవిర్భావచరిత్రంతా అయోమయచరిత్రే. ఏది సూటిగా నడవటం లేదు. అంతా దాపరికమే.
వాహనవతిని ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారు అన్నదానిపై నేను ‘‘ఈనాడు’’ కథనాన్ని నమ్ముతున్నాను. దాని ప్రకారం మంత్రుల ముఠావారు ‘ఈ 371 డి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఆటోమెటిక్‌గా వర్తిస్తుందా?’ అని అడిగారు. ‘అబ్బే, వర్తించదు, అది మొత్తం రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి, సగం ముక్కకు దాన్ని వర్తింపచేయాలంటే మళ్లీ రాజ్యాంగసవరణ చేయాల్సిందే’ అని చెప్పారు. కొన్ని పేపర్లలో ‘విభజన చేయాలంటే అడ్డు వస్తుందా?’ అని అడిగినట్టు వచ్చింది. మన ముఠాకు అలాటి అనుమానాలే రావని నాకు గట్టి నమ్మకం. సోనియా తలచుకున్నాక విభజన జరిగితీరుతుంది. ఆవిడ సునామీలు సృష్టించగలదు, భూకంపాలు ఆపగలదు, వెధవది తెలుగువాళ్లను చీల్చడం ఓ లెక్కా? విభజన ఎలాగూ తథ్యం. తర్వాత ఏమవుతుంది అనేదో వాళ్లు తెలుసుకోదలచారు. వాహనవతిగారు చెప్పారు. దీన్నే నమ్మవచ్చు. ఈ సందేహం వాళ్లకు ఎందుకు వచ్చింది? ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మిగల్చడం వలన వచ్చింది. 371 డి, ఆంధ్రప్రదేశ్ అనేవి రెండూ పెనవేసుకుని పోయాయి కాబట్టి, అవశేష రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ కాబట్టి 371 డి ఆటోమెటిక్‌గా అమలవుతుందా? అని ఉత్తినే, సరదాకి అడిగారు.
అసలు తెలంగాణ చీల్చగా మిగిలిన దానికి అవశేష ఆంధ్రప్రదేశ్ అనే యీ పేరెందుకు? ఆంధ్ర అంటే పోయే కదా! 1953-56 మధ్య ఆంధ్ర రాష్ట్రం అనే పేరే వుండేది. ఇప్పుడు అదే తయారవుతోంది. డీ-మెర్జర్ అయినపుడు మళ్లీ అదే పేరు పెట్టవచ్చుగా. 1956లో రాష్ట్రం ఏర్పడినపుడు పేరేం పెట్టాలి అన్న సందేహం వచ్చింది. విశాలాంధ్ర పేరుతోనే అప్పటిదాకా ఉద్యమాలు జరిగాయి. కమ్యూనిస్టులు కాస్త ముందుకు వెళ్లి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే నినాదం ఎత్తుకున్నారు. విశాలాంధ్ర పేరుతో పేపరు పెట్టారు. రాష్ట్రానికి ఆ పేరు పెడితే కమ్యూనిస్టులు గుర్తు వస్తారన్న భయంతో బెజవాడ గోపాలరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ పేరు సూచించారు. ఇది హిందీ పేరులా వుంది అని తెలుగు నాయకులు అభ్యంతర పెట్టినా, ఉత్తరాది నాయకులకు యిది నచ్చింది – మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తరహాలోనే యిది కూడా వుంది కదాని. ఉమ్మడి రాష్ట్రానికి పేరు పెట్టడానికి డ్రాఫ్టు బిల్లులో ‘ఆంధ్ర-తెలంగాణ’ అనే పేరు వుందని, సీమాంధ్ర నాయకులు తెలంగాణ పేరును ఎగ్గొట్టించేశారని అన్న ఆరోపణలు యీ మధ్యే వచ్చాయి. గతంలో ఎన్నడూ వినలేదు. దీనిలో వాస్తవాలు నాకు తెలియవు. అదే ఒరవడి అయితే మరాట్వాడా బొంబాయిలో కలిసింది కాబట్టి దానికి ‘బొంబాయి-మరాట్వాడా’ రాష్ట్రం అని పేరు పెట్టాలనే సూచన కూడా వచ్చిందా? ఉద్యమసమయంలో అనేక అవాస్తవాలు పుట్టించారు. వాటిల్లో యిది కూడా ఒకటేమో నాకు తెలియదు. ఎవరో ఒకాయన పుస్తకంలో రాశారు అంటారు. పుస్తకంలో రాసినంత మాత్రాన గాస్పెల్ ట్రూత్ అయిపోదు. దాని గురించి ఎక్కడో అక్కడ చర్చ జరగాలి. హైదరాబాదు అసెంబ్లీలో కాని, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాక అసెంబ్లీలో కాని ‘పేరులో తెలంగాణ చేర్చాలని’ ఎవరో ఒకరు అడిగి వుండాలి. ‘ఆంధ్ర’ పదం తెలుగువారందరికీ వర్తిస్తుందనే అభిప్రాయంలో వున్నారు కాబట్టి, తెలంగాణలో విముక్తి పోరాటం ఆంధ్ర మహాసభ పేరుతో జరిగింది కాబట్టి ‘ఆంధ్రప్రదేశ్’ అనే పదం మనది కాదు అని తెలంగాణ వారెవరూ అనుకోలేదు. ఇవన్నీ యిటీవలి అపోహలే, కల్పనలే.
సరే యింతకీ యిప్పుడు రాష్ట్రాన్ని చీల్చాక తెలంగాణ అన్నారు. సబబే, యిక మిగిలినదానికి అవశేష లేదా సశేష ఆంధ్రప్రదేశ్ అనే పేరెందుకు? అలా పేరు పెట్టడం వలనే కదా, యీ ఆర్టికల్ 371 డి గురించి యిలాటి సందేహం వచ్చింది! రాష్ట్రం చీల్చి అవతల పారేస్తే తర్వాత వాళ్లు జోనల్ సిస్టమ్ పెట్టుకుంటారో, పెట్టుకోరో కేంద్రానికి ఎందుకు? విడిపోయాక ఏం తింటామా, ఎలా బతుకుతామా అని సీమాంధ్రులు ఏడుస్తూ వుంటే వాళ్ల ఉద్యోగులకు 371 డి వుంటుందా లేదా అన్న చింత మంత్రుల ముఠాకు ఎందుకో నాకర్థం కాదు. తీర్చవలసిన సమస్యలు అనేకం వున్నాయి. చూపవలసిన పరిష్కార మార్గాలు అనేకం వున్నాయి. వేటిమీదా వాళ్ల దగ్గర పరిష్కారం లేదు, అసలు సమాచారమే లేదు. బుర్రలు ఖాళీగా పెట్టుకున్నాం, మీకు తోచినది మీరు పోసి పోవచ్చు అని యితర పార్టీల వాళ్లను పిలిచారు. వాళ్లు వెళ్లి యింత గడ్డి పెట్టి వచ్చారు. ముఠావాళ్లు చేతులెత్తేసి, మా వంతుగా మేం చీల్చేస్తాం, దానివలన వచ్చే సమస్యలపై నిర్ణయం తర్వాతి రోజుల్లో కేంద్రమే చూసుకుంటుంది అని తప్పుకోబోతున్నారు. అలాటప్పుడు విడిపోయాక ఆంధ్ర రాష్ట్రం ఉద్యోగులకు రిజర్వేషన్లు వుంటాయా లేదా అని వాళ్లు వర్రీ అవుతున్నారని, దానికోసం ఎటార్నీ జనరల్‌ను సంప్రదించారని అంటే నాకేమిటో నమ్మకంగా లేదు. తిరుక్షౌరం చేసి వదిలిపెట్టిన తర్వాత అవతలివాడు గుండుకు చందనం రాసుకుంటాడా, కొబ్బరినూనె రాసుకుంటాడా అన్నదాని గురించి మంగలి వర్రీ అవుతాడా!? అబ్బే. ఏదో ఎటార్నీ జనరల్‌ను 371 డి గురించి అడిగినట్టు నాటకం ఆడి ఒకదాని బదులు మరొకటి అడిగి పంపించేసి వుంటారు. విభజనకు అడ్డు వస్తుందా అని అడిగితే సోనియమ్మకు కోపం వస్తుందని లోలోపల ముఠావారికి గుబులుగానే వుండి వుంటుంది.
371 డి సంగతి తేల్చాలి. ఏజిని అడక్కూడదు. ఎలా? నా దగ్గర ఒక ఉపాయం వుంది. ఆర్టికల్ 3లో ఏదైనా రాష్ట్రం పేరు మార్చే హక్కు కూడా కేంద్రానికి వుంది కదా. ఎంచక్కా ఆంధ్రప్రదేశ్ పేరు ‘లిటిల్ ఇటలీ’ అనో మరేదో మార్చేయాలి. అప్పుడు విభజించడానికి సమకట్టాలి. ఎవరైనా వచ్చి ‘ఆంధ్రప్రదేశ్‌కోసమే తయారుచేసిన 371డి ని రాజ్యాంగసవరణ ద్వారా మార్చకుండా రాష్ట్రాన్ని ఎలా చీలుస్తారు?’ అని అడిగితే ‘అసలు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి పోయిందో మాకు తెలియటం లేదు సార్, వుంటే దాన్ని ఏదో ఒకటి చేద్దుం. ఇదిగో యీ లిటిలిటలీ ఒక్కటే వుంది. దాన్ని సరదాగా చీల్చేద్దాం’ అనవచ్చు. ఆంధ్రప్రదేశ్ అనే పేరే లేనపుడు 371 డిలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ కానీ, అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ సోదిలోకే రావు. ఇక అడ్డేముంది, అడ్డగోలుగా నరకడానికి!
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2013)