భారతదేశంలోని రాష్ట్రాల పునర్విభజన విషయంలో కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న పార్టీ తమ ఇష్టానుసారం వ్యవహరించడానికి సకల అధికారాలను కట్టబెట్టే- రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించడం గురించి ఇప్పుడు వైఎస్ జగన్ పోరాటం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవడం అనే ప్రక్రియలో భాగంగా.. అట్నుంచి నరుక్కు రావాలని ఆయన సంకల్పిస్తున్నారు. ఇప్పుడేదో జగన్ ఈ వ్యవహారాన్ని భుజానికెత్తుకున్నారు గనుక.. ఇది ఆయనకు సొంత ప్రయోజనాలు చేకూర్చే ఏర్పాటు అని, దీనిని తాము వ్యతిరేకించాలని వైరిపక్షాలు తలపోస్తే గనుక వారు దేశానికి ద్రోహం చేస్తున్నట్లే లెక్క. డిమాండ్ జగన్‌దే అయినా.. ప్రజాస్వామ్య వాదులు అందరూ మద్దతివ్వవలసిన విషయం ఇది. చివరికి తెరాసలాంటి పార్టీలు, మమతా మాత్రమే కాదు , ఆమెకు వ్యతిరేకంగా గూర్ఖాల్యాండ్ కోరుతున్న పార్టీలు కూడా మద్దతివ్వాల్సిన అంశం ఇది. కావలిస్తే వారు జగన్ డిమాండులో కొంత సవరణ కోరవచ్చు.
రాష్ట్రాలను విభజించే విషయంలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతో నిమిత్తం లేకుండా, లోక్‌సభలో సింపుల్ మెజారిటీ.. అంటే ఓటింగుకు హాజరైన వారిలో సగానికంటె ఒక్కఓటు ఎక్కువ వస్తే చాలు.. రాష్ట్రాన్ని చీల్చేయవచ్చునని ఈ అధికరణం అధికారం ఇస్తుంది..
అయితే ఏ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారో.. దాని మాతృ రాష్ట్ర అసెంబ్లీతో పాటు, లోక్‌సభలో కూడా మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే మాత్రమే విభజన జరిగేలా సవరించాలనేది జగన్ డిమాండ్. గతంలో భాజపా హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు ఈ రాజ్యాంగ సాంప్రదాయం ప్రకారం ఏర్పడిన నేపథ్యంలో ఆర్టికల్ 3 విశృంఖలతకు కత్తెర వేసి దీన్ని సవరించాలని ఆయన అంటున్నారు.
అయితే ఇక్కడ తె-వాదులు వంటి వారు వ్యతిరేకించడానికి ఒక అంశం ఉంది. ఏదైనా ఒక రాష్ట్రంలో మైనారిటీగా ఉండే ప్రాంతానికి చెందిన వారు విభజనను కోరుకుంటే.. ఈ నిబంధన ప్రకారం అది ఎప్పటికీ కార్యరూపం దాల్చే అవకాశం ఉండదు. అలాంటప్పుడు రెండు రకాల ప్రత్యామ్నాయాలను ఆలోచించవచ్చు. 1) మాతృరాష్ట్ర శాసనసభ సింపుల్ మెజారిటీతో తీర్మానం ఆమోదించాలని అనవచ్చు. 2) లోక్‌సభలో మాత్రం 2/3 మెజారిటీతో ఏర్పాటు చేయవచ్చునని అనవచ్చు.
లేదా, ఈ మొత్తం మైనారిటీల రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లు అణగదొక్కబడకుండా.. మరో ఏర్పాటు కూడా చేయవచ్చు. ‘రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి’ అనే జగన్ కోరికను మినహాయించి, ‘లోక్‌సభలో మాత్రం మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి’ అనినిర్దేశిస్తే సరిపోతుంది. దీనివలన కేంద్రంలో బొటాబొటీ మెజారిటీ ఉండే ప్రభుత్వం కూడా తమ ప్రత్యర్థులు బలంగా ఉండే రాష్ట్రాలను తమ ఇచ్చమొచ్చినట్లు ముక్కలు చేస్తూ.. విచ్చలవిడిగా చెలరేగడానికి అవకాశం లేకుండా ఉంటుంది. లోక్‌సభలో విధిగా మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాల్సిందే అని అంటే.. సింపుల్ మెజారిటీ ఉండే ప్రభుత్వాలు.. ఇతర పక్షాలు కూడా కచ్చితంగా ఆమోదించేలాగానే తమ రాష్ట్రవిభజనల బిల్లులను రూపొందించాల్సి వస్తుంది. దీనివలన అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రత్యేకించి అన్యాయం వంచన జరగకుండా ఉంటుంది.
ప్రాక్టికల్‌గా ఆలోచించి, దేశంలోని ప్రతి పార్టీ కూడా ఈ ఆర్టికల్ 3 సవరణ అనే అంశానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశాన్ని జగన్ జాతీయస్థాయికి తీసుకువెళుతుండవచ్చు గాక, కానీ ఇది జగన్ కోరిక అన్న దృష్టితో చూడకుండా.. ఇది భారతజాతి సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి విధిగా అందరూ మద్దతివ్వాల్సిన విషయం అని తెలుసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు కూడా ఎవ్వరూ నిందించలేని విధంగా సాగుతుంది. దేశంలోని పార్టీలు వాస్తవాన్ని గుర్తించి వ్యవహరించాల్సి ఉంది.
– కపిలముని