లవ్‌లెటర్‌2నారాయణ : కొన్ని సత్యాలు ఎర్రనివి!

డియర్‌ నారాయణా! Advertisement సత్యం- అసత్యం అనే బ్రహ్మ పదార్థాలకు రంగు రుచి వాసన ఉంటాయా? అనే ప్రశ్న ఎదురైతే… ఈ రెండింటిలో మంచి అనునది సత్యం గనుక అయితే దాని రంగు ఎరుపుగా…

డియర్‌ నారాయణా!

సత్యం- అసత్యం అనే బ్రహ్మ పదార్థాలకు రంగు రుచి వాసన ఉంటాయా? అనే ప్రశ్న ఎదురైతే… ఈ రెండింటిలో మంచి అనునది సత్యం గనుక అయితే దాని రంగు ఎరుపుగా ఉండును. రెండవదాని సంగతి నాకు తెలియదు.. అని సెలవివ్వగల సమర్థనాయకుడివి నువ్వు. తిమ్మిని బమ్మిని చేయగల నీ మెలికల దురంధరత విజ్ఞత ప్రపంచానికి తెలియనది కాదు! అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో నక్సలిజం పెరిగే అవకాశం ఉన్నదంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి జీవోఎంకు నివేదిక సమర్పిస్తే.. విభజనకు తీవ్రవాదానికి ముడి ఏమిటంటూ.. తమరు ప్రశ్నించిన తీరు మాత్రం.. విస్తు గొలుపుతోంది. చిన్న రాష్ట్రం ఏర్పడితే.. అది నక్సలిజం పుట్టడానికి లేదా వర్ధిల్లడానికి ఎలా కారణం అవుతుందనేది తమ ప్రశ్న మరియు సందేహం. అయితే ఇలాంటి సందేహాలను విధిగా నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే తమకు తెలియజెప్పగల పాటి అజ్ఞత నాకు లేదు గానీ.. ఒక ప్రయత్నం చేస్తున్నా…!!

రివర్స్‌ స్క్రీన్‌ప్లే అని సినిమా వాళ్ల దగ్గర ఓ మహత్తు ఉంటుంది. అంటే సినిమాలో చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగాచెప్పరన్నమాట. ఎక్కడో ప్రారంభించి రకరకాల మలుపులు తిప్పి చివరికి పోన్లే అని చెబుతారన్నమాట. మన మాటల్లో చెప్పాలంటే వెనకనుంచి ప్రారంభించడం లాంటిది. సదరు రివర్స్‌ స్క్రీన్‌ప్లే విధానంలో ఈ విషయాన్ని ఆలోచిద్దాం. 

చిన్న రాష్ట్రాల వలన నక్సలిజం ఎలా పుడుతుంది? ఎలా వర్ధిల్లుతుంది? అనే ప్రశ్నలను పక్కన పెడదాం! అసలు ముందు నక్సలిజం అయిపోయిందని, అంతరించి పోయిందని ఇప్పుడు అంతా సేఫ్‌ అని.. అందరూ అంటున్నారు కదా! ఎలా అయిపోయిందో నువు చెప్పావంటే.. అక్కడినుంచి మన సమాధానాలు వెతుకుదాం! సాధారణంగా నక్సలిజం వంటిది అంతమైపోవడానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో దేనివలన ఇక్కడ అంతరించిందో తమరు సెలవిస్తే.. మనంముందుకు వెళ్లచ్చు. 

1) నక్సలిజం సిద్ధాంతాలకు కాలం చెల్లడం. వారు కాపాడగలరనే విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లడం. కనీసం అడవుల్లోని నక్సలైట్లకు పల్లెల్లో అన్నం పెట్టే వారు కూడా కరవవడం. అన్నలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం. ఆ రకంగా ఆదరణ తగ్గి అంతరించిపోవడం. 

2) ఏ ప్రజలను ఎలాటి కష్టాలనుంచి అయితే విముక్తి చెందించడానికి నక్సలైట్లు అనే అన్నలు పోరాడుతూ ఉంటారో.. అసలు ప్రజలకు అలాంటి కష్టాలే లేని సమాజం ఉండడం. ప్రజలను తాము కాపాడవలసిన, పోరాడాల్సిన పరిస్థితులే లేవు గనుక.. అన్నలు అంతరించిపోవడం. 

3) అన్నలకు తమ మీద తమకే నమ్మకం సన్నగిల్లిపోవడం. నక్సలిజాన్ని వదిలేసి పౌరజీవనం లోకి వస్తే.. ప్రభుత్వం చూపించేతాయిలాల పట్ల ఆశ పుట్టడం. అందువలన వారు ఆ బాట వీడి ప్రజల్లోకి వచ్చేస్తుండడం. మామూలు బతుకు బతుకుతూ ఉండడం.

4) పోలీసుల అణచివేత. పోలీసు బలగాలు దుడుకుగా.. నక్సలైట్లు  అనే ముద్రతో కనిపించిన వారినంతా ఏరిపారేస్తూ ఉండడం. పోలీసు చర్యలు, అణచివేత విధానాలతోనే నక్సలైట్లు రూపుమాసిపోవడం. 

… వీటికి మించి ఇతర కారణాలు నక్సలిజం అంతానికి ఉంటాయని అనుకోవడం భ్రమ. 

నారాయణ అన్నయ్యా. నువ్వు ముందుగా.. ఈ నాలుగు కారణాల్లో ఏ కారణాల చేత ఇక్కడ నక్సలిజం అంతమైనదో కాస్త సెలవివ్వాలి. 1 నుంచి 3 వరకు ఏ జవాబును ఒప్పుకున్నా.. అది మీ పార్టీ మనుగడకు మూలమైన సిద్ధాంతాలనే ధిక్కరించినట్లు అవుతుంది గనుక.. మీ మనుగడకే అది ప్రశ్నార్థకం అవుతుంది గనుక.. 4వ జవాబు ఒప్పుకోవాల్సిందే. పైగా నాలుగో జవాబు అయితే మాత్రమే.. ఎర్రపార్టీగా.. సర్కారు మీద బురద చల్లడానికి కూడా తమకు అవకాశం ఉంటుంది. కనుక మీరు 4 జవాబుకు ఓటువేస్తారు. నాకు తెలుసు.

ఇప్పుడు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే నక్సలిజం ఎలా పుడుతుందో ఆలోచిద్దాం. నక్సలిజాన్ని అంతంచేసే ఇలాంటి పోలీసు చర్యలు చిన్న రాష్ట్రాల్లో పరిమితం అయిపోతాయి. పోలీసు బలగం తగ్గిపోతుంది. పోలీసు చర్యలో తీవ్రత కూడా తగ్గిపోతుంది. నక్సలిజాన్ని అణచగలిగింది పోలీసు చర్య మాత్రమే అయినప్పుడు.. వారి సంఖ్య, బలగం తగ్గడం అనేది కచ్చితంగా.. నక్సలిజం శృతిమించడానికి కారణం అవుతుంది కదా! 

ఇప్పుడు- రాష్ట్ర విభజనకు నక్సలిజానికి ఉన్న లింకు ఏమిటో తమరికి విపులంగా అర్థమైందని అనుకుంటాను. రాజకీయంగా ప్రజాప్రతినిధి కాగల పాటి సత్తా లేకపోయినా.. దశబ్దాలుగా ఎంతో సీనియర్‌ అయిన తమరు ఇలా చవకబారు విమర్శలు కాకుండా.. నిర్మాణాత్మకంగా మాట్లాడితే.. ప్రభుత్వాలు మరింత బాగా పనిచేయడానికి అది ఉపయోగపడుతుందని తెలుసుకో ప్లీజ్‌. 

-ప్రేమతో

కపిలముని

[email protected]