శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీయార్ పేరు పెట్టడం తాజా వివాదం. దీనిలో మూడు అంశాలున్నాయి. ఆంధ్రలో పుట్టిన ఎన్టీయార్ పేరు కావాలంటే ఆంధ్రలో బస్స్టాండులకు పెట్టుకోవచ్చు కానీ తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు పెట్టడమేమిటని కెసియార్, యితర నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా యిలా చేయవచ్చా? అనేది రెండో అంశం. ఇక మూడోది యీ మార్పు యిప్పుడే తలపెట్టడంలో టిడిపి ఆంతర్యం ఏమిటన్నది.
ఎయిర్‌పోర్టుకు తెలంగాణలో పుట్టినవారి పేర్లే పెట్టాలనే వాదనకే కట్టుబడితే రాజీవ్ గాంధీ పేరుకు కూడా అభ్యంతరం తెలపాలి. ఎందుకు తెలపటం లేదు? తెలంగాణలో ఎటు చూసినా రాజీవ్ పేర్లే, ఎయిర్‌పోర్టుకే కాదు, ఎయిర్‌పోర్టుకి వెళ్లే రింగ్ రోడ్డుకి కూడా రాజీవ్ పేరే. ఆంధ్రలో ఆరోగ్యశ్రీల్లాటి వాటికి రాజీవ్ పేరు వదుల్చుకుని ఎన్టీయార్ పేరు పెడుతున్నారు కానీ తెలంగాణలో ఆ ప్రక్రియ మొదలుపెట్టలేదు. రాజీవ్ తెలంగాణకు చేసిన ఉద్ధరింపు ఏమిటి? అంజయ్యగారిని బహిరంగంగా యీసడించడమా? రాజీవ్ రాజకీయాల్లోకి రాగానే చేసిన పనేమిటంటే ఫిరాయింపులు ప్రోత్సహించి కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కూలదోయడం, అదే ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి చేయబోవడం. రాష్ట్ర (తెలంగాణ ప్రాంతంతో సహా) ప్రజల అభీష్టాన్ని కాలరాసి నాదెండ్లను తెచ్చి కూర్చోబడితే ఆయన కెబియార్ పార్కును నవాబులకు కట్టబెట్టబోయారు. పర్యావరణం మరింత నాశనమయ్యేది.
ఈవారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి
ఇలాటి పనులు చేసిన రాజీవ్ పేరును సహిస్తాం కానీ ఎన్టీయార్ పేరును సహించం అంటున్నారు కొందరు తెలంగాణ నాయకులు. రాజీవ్ పేరు మార్చి ఎన్టీయార్ పేరు పెట్టడానికి ఒప్పుకోం అని తెరాస, కాంగ్రెసు జుగల్బందీ ఆలపిస్తున్నారు. రాజీవ్ పేరు బదులుగా కాదు, తోడుగా పెడుతున్నారు. దేశీయ టెర్మినల్‌కు ప్రాంతీయ నాయకుల పేర్లు పెట్టడం అనేక చోట్ల వుంది. అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీయార్. ఎయిర్‌పోర్టు బేగంపేటలో వుండగా అవలంబించిన పద్ధతి అదే. పివి, కొమురం భీమ్ పేర్లు పెట్టవచ్చు కదా అంటున్నారు. నాకు తెలియక అడుగుతాను – హైదరాబాదులో యింకో యింటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కట్టబోతున్నారు కదా, దానికే వీళ్లనుకునే పేర్లు పెట్టవచ్చు కదా.
ఎన్టీయార్ తెలంగాణకు చేసిన ద్రోహం ఏమిటట? ఆంధ్రలో పుట్టడమా? ఆంధ్రలో పుట్టినా ఆయనదంతా చెన్నపట్టణవాసమే కదా. 40 ఏళ్లు మద్రాసులో వుండి అక్కణ్నుంచి ఏ విజయవాడకో వెళ్లి కాపురం పెట్టలేదే! నాగేశ్వరరావు దారి తీయగా, ఆయనా తన నిర్మాతలను తెలంగాణలో భాగమైన హైదరాబాదుకే రమ్మన్నాడే! తెలంగాణలో పుట్టిన వేములవాడ భీమకవి పేర ఏ లాభమూ ఆశించకుండా సినిమా కూడా తీశాడే! రాష్ట్రంలో కల్లా ఏ-క్లాస్ థియేటర్ రామకృష్ణ 70 ఎమ్ఎమ్ హైదరాబాదులోనే కట్టాడే! తర్వాత స్టూడియో కట్టాడే! హైదరాబాదువాసిగానే వుంటూ, హైదరాబాదులో ఆస్తులు కూడబెట్టి, హైదరాబాదులోనే చచ్చిపోయాడే! ఆయన సమాధికూడా తెలంగాణలోనే వుందే! ఆయన పిల్లలూ, మనుమలూ యిక్కడే వున్నారే! అయినా యీ అభ్యంతరాలేమిటి?
ఈవారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి
తెలుగు ప్రముఖులందరినీ ఎక్కడ పుట్టారన్న కొలబద్దతో తిరస్కరించడం మొదలుపెడితే చాలా అనర్థాలు వస్తాయి. తెలంగాణలో సినీ యిండస్ట్రీకి భారీగా భూసంతర్పణ చేసి, పెంచి పోషిస్తామంటున్నారు. అవార్డులు యివ్వడం కూడా ఒక రకమైన ప్రోత్సాహకమే. ఎవరైనా గాయకులకు ఘంటసాల పేరో, సుశీలపేరో ఎవార్డు యివ్వాలంటే ఆంధ్రలో పుట్టారన్న కారణంగా పరిగణించరా? మరి ఎవరి పేర యిస్తారు? సంగీతదర్శకులకు ఎవరి పేర యిస్తారు? శాస్త్రీయ సంగీతంలో బాలమురళీకృష్ణ పేర యివ్వాలన్నా యిదే చిక్కు వస్తుంది. అంతెందుకు ఎవరైనా హీరోకు ఎయన్నార్ పేరో, ఎన్టీయార్ పేరో ఎవార్డు యిస్తామంటే సంతోషిస్తారు. 'పైడి జయరాజ్ నాయుడు' పేర యిస్తామంటే 'ఆయనెవరు సార్?' అంటాడు. 'మన తెలంగాణ బిడ్డయ్యా, బొంబాయిలో మూకీ సినిమాల్లో వేశాడు, దాదా సాహెబ్ ఫాల్కే ఎవార్డు అందుకున్నాడు' అంటే 'నాయుడు పేరు మన తెలంగాణలో ఎక్కడుంది సార్, ఆయన మూలాలు ఆంధ్రలోనే వుంటాయి చూసుకోండి' అంటాడు. (విభజన జరిగేదాకా కెకె గారు యీ జయరాజ్ గురించి తెగ వాపోయారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయన 105 వ జయంతి వచ్చింది. కెకెగారి సౌండు లేదు. ఆయనకీ జయరాజ్ నాయుడు మూలాల గురించి డౌటు వచ్చేసి వుంటుంది).
ఎన్టీయార్ గురించి కరక్టుగా చెప్పాలంటే ఆయన జాతీయ నాయకుడు. జాతీయస్థాయిలో పదవి అందుకోలేక పోవచ్చు కానీ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఆయన కింగ్‌మేకర్. ఇందిరా గాంధీ అంటే ప్రతిపక్ష నాయకులందరూ వణికి ఛస్తూన్న టైములో వారందరినీ ఒక వేదికపై సమైక్యపరచి, నేషనల్ ఫ్రంట్ స్థాపించి దానికి చైర్మన్ అయ్యాడు. కాంగ్రెసేతర పక్షాలు ఎక్కడ పోటీ చేసినా అసాం నుండి, హరియాణా వరకు తన ఖర్చులతో వెళ్లి ఎన్నికల ప్రచారం చేసి వచ్చాడు. రాజీవ్ బోఫోర్స్ వివాదంలో యిరుక్కున్నపుడు ఆర్నెల్ల ముందుగానే ప్రతిపక్ష ఎంపీ లందరిచేత రాజీనామా చేయించి, 1989 ఎన్నికలలో కాంగ్రెసు వ్యతిరేక కూటమి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చేట్లు చేశాడు. జాతీయ రాజకీయాలపై దృష్టి ఎక్కువై పోయి, ఆంధ్రలో టిడిపికి తక్కువ సీట్లు రావడంతో కేంద్ర కాబినెట్లో పదవి మిస్సయింది పాపం. జాతీయస్థాయిలో అంత వెలుగు వెలిగిన నాయకుడి పేరును, కేవలం ఆంధ్రలో పుట్టాడన్న కారణం చెప్పి యీ రోజు వ్యతిరేకించడం తప్పు. అలా అయితే రాజీవ్‌ను కూడా జాతీయ నాయకుడిగా కాకుండా ఢిల్లీ రాష్ట్రం వాడిగా లెక్కేసి, పేరు తీసేయాలి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)