చివరకు ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొనాల్సి వచ్చింది. ఎవరికి నష్టం? మన తెలంగాణ ప్రజలకే కదా. ఆ డబ్బుతో యింకెన్ని చెఱువుల నీళ్లు తోడేవారమో! రోడ్డు మీద గుంత చూపిస్తే వెయ్యి యిచ్చే పథకంలో ఎంతమందికి యివ్వగలిగే వాళ్లమో! భవిష్యత్తులో ఎంత రేటు పెట్టయినా విద్యుత్ కొని రైతులకు, పరిశ్రమలకు, గృహావసరాలకు అందిస్తాం అని చెప్తున్నారు. కానీ టెండర్లు పిలిస్తే ఎవరూ పలకటం లేదట. కొందామన్నా అమ్మేవారు అగుపించటం లేదని వార్తలు వచ్చాయి. దక్షిణాదిన యిప్పటికే డిమాండ్‌ట. ఉత్తరాదిన మిగులు వుంది కానీ మనకు పంపడానికి లైన్లు లేవట. నిజమా? ఈ మాటలు గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి చెపితే తెలంగాణ మేధావులు అతన్ని తిట్టిపోశారు. కెసియారయితే యీసడించి పారేశారు. గోదారికి అవతల రెండు గుంజలు పాతి వైర్లు గుంజుకుంటే వచ్చేస్తది అన్నారు. అది అయ్యే పని కాదని అప్పుడు యీ మేధావులు ఎవరూ చెప్పలేదు. కెసియార్ మాటలు నమ్మకండి అని హెచ్చరించలేదు. ఇప్పుడు కెసియారే చెప్తున్నారు అలా రాదని. లైన్లు వేయడానికి టైము పడుతుందంటున్నారు. ఎంతో చెప్పడం లేదు. రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు రకరకాల గడువులు వినబడుతున్నాయి. అసలు మనకు అమ్మేటంత కరంటు ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం వుందా? వాళ్లు కట్టబోయే ప్రాజెక్టులో పుట్టించబోయే కరంటులో వాటా యిస్తానంటున్నారా? టైముకి ప్రాజెక్టులు పూర్తి చేసే సత్తా వారికి వుందా? రాష్ట్రం ఏర్పడి పుష్కరమైనా వాళ్ల రాజధాని నయా రాయపూర్ నిర్మాణమే నిధుల కొరత వలన యింకా పూర్తి చేయలేదంటున్నారే! మరి అవన్నీ పక్కన పడేసి వున్న నిధులతో మనకు కావలసినవి ప్రాజెక్టులు గబగబా కట్టేస్తారంటారా? ఇలాటి సందేహాలతో నేను కొట్టుమిట్టులాడుతున్నాను. అది సహేతుకమో కాదో చెప్పాల్సింది తెలంగాణ మేధావులే!
అదేమిటో కాని టి-మేధావులు పూర్తిగా మౌనముద్ర పాటిస్తున్నారు. వారసత్వ కట్టడాల పరిరక్షణ పేరుతో మెట్రో ఎలైన్‌మెంట్ మార్పిస్తున్నారు కెసియార్. దానికి గాను వెయ్యి కోట్ల రూ.ల ప్రజాధనం వెచ్చిస్తున్నారు. వారసత్వ కట్టడం నిర్వచనం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సుల్తాన్ బజార్‌లో దుకాణాలు చారిత్రక కట్టడాలా? ఇంకో పదేళ్లలో కుకట్‌పల్లిలో షాపులు కూడా యిలాటి స్థాయినే పొందుతాయా? పాతబస్తీలో 28 మసీదులకు ,7 గుళ్లకు యిబ్బంది కలగకుండా రూటు మారుస్తారట. ఏమిటి!? అక్కడ 35 చారిత్రక ప్రాధాన్యత గల ప్రార్థనాస్థలాలున్నాయా? ఆర్కియాలిజీ వాళ్లు గుర్తించారా? టూరిజం వాళ్లు గుర్తించారా? అసలు ఎన్నేళ్ల వయసుంటే వాటికి యిలాటి గుర్తింపు వస్తుంది స్వామీ? హైదరాబాదును సింగపూరులా చేస్తామని కెసియారూ అంటున్నారు. సింగపూరులో యిలాగే వుంటుందా వ్యవహారం? రోడ్డుకి మధ్యగా గుళ్లూ, దర్గాలూ కడతారా? అంతర్జాతీయ నగరం చేస్తామని ఓ పక్క కబుర్లు చెప్తారు. మరో పక్క పురాతన భావాలతో కునారిల్లుతారు.
అసెంబ్లీ భవనం అందమైన భవనం. నిజాంగారి అనేకానేక భవనాల్లో ఒకటి. ఉమ్మడి రాష్ట్రపు అసెంబ్లీ అక్కడ నడిచింది. ఆ కాలపు జ్ఞాపకాలను తుడిచి పెట్టేయడానికి శతథా ప్రయత్నిస్తూ దాని సంరక్షణ పేరుతో యింత వ్యయం దేనికి? అయినా మెట్రోవాళ్లు దాన్ని కూలగొడతామన లేదు. అసెంబ్లీ ముందు నుంచీ తీసుకెళతామన్నారు, యిప్పుడు వెనక్కాల నుంచి అంటున్నారు. అండర్‌గ్రౌండ్ మాత్రమే అని తాను గతంలో హుంకరించిన మాట కెసియార్ మరచినట్లున్నారు. 'మీరు కాకపోతే ఛప్పన్న దేశాల్లో సవాలక్ష కంపెనీలున్నాయి' అని ఎల్ అండ్ టితో అన్న మాటలూ మరచినట్లున్నారు, హుస్సేన్ సాగర్ చుట్టూ కట్టబోయే భవంతుల పనిలో ఒకటి యిమ్మని వాళ్లు అడగడం, వీళ్లు చూస్తామని అనడం జరిగాయట. మెట్రో రూటు మార్పు వల్ల ఖర్చులో తేడాపాడాలు వస్తే దాంట్లో ఎడ్జస్ట్ చేద్దాం అని మాట్లాడుకున్నారో ఏమో! మెట్రో స్టేషన్ అసెంబ్లీ ఎదుట వస్తే ప్రయాణీకులకు ఎంతో సౌకర్యం, ట్రాఫిక్కంతా అక్కడే వుంది. అసెంబ్లీ వెనక్కాల రెడ్‌హిల్స్‌లో వస్తే ఏం లాభం? స్టేషన్‌లో పెట్టే కమ్మర్షియల్ కాంప్లెక్సు గిరాకీ పడిపోతుంది.
ఇక అమరవీరుల స్తూపం అంటారా? దానికి సెంటిమెంటు ముడిపెట్టారు. వెల్లోడి ప్రభుత్వ కాలం నుండి తెలంగాణ ఆవిర్భావానికై పోరాడిన వీరులందరి స్మృత్యర్థం బేబెల్ టవరంత టవరు కట్టబోతున్నాం అంటున్నారుగా అది కట్టిన తర్వాత దీని ప్రాభవం ఏముంటుంది? ఇలాటి విషయాల్లో మేధావులు కలగచేసుకుని హేతుబద్ధంగా మాట్లాడలేరా? అమరవీరులంటే గుర్తుకు వచ్చింది. పుష్కరంగా నడిచిన తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆత్మార్పణ చేసుకున్నారన్న దానిపై ప్రభుత్వాధినేతలు గందరగోళంలో పడ్డారు. ఉద్యమం నడిచినంతకాలం వెయ్యి, 1100, 1200 అంటూ చూస్తూండగా 1500 చేసేశారు. రెండు వేలు అనేసిన ఉద్రేకులూ వున్నారు. సుష్మా స్వరాజ్ చేత పార్లమెంటులో 1200 చెప్పించేశారు. ఇప్పుడు నష్టపరిహారం వద్దకు వచ్చేసరికి 400 చిల్లర దగ్గర ఆగిపోయారు. ఈ మేధావులు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి అమరవీరులెందరు, అసత్యవీరులెందరు తేల్చవచ్చు కదా. విఫలప్రేమ వలన చనిపోయిన వాళ్లు, పాత కక్షలవలన చంపబడినవారు అందర్నీ యిదే లెక్కలో వేసేశారని ఆరోపణలు వచ్చాయి. వాటిని సర్కారు వాళ్లు కూడా నమ్మినట్టుగా వున్నారు. 'ఏం చేసినా దరిమిలా విమర్శలు రాకూడదనే భావంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం' అంటున్నారు. నిజనిర్ధారణ కమిటీ ఏర్పడితే వారికి సహాయపడినట్లుగా వుంటుంది. ఎలాగూ వూళ్లు తిరుగుతున్నాం, రైతుల ఆత్మహత్యల లెక్కలు తీస్తే మాత్రం కొంప మునుగుతుంది. చంద్రబాబు ఏజంట్లుగా ముద్రపడుతుంది.
కృష్ణా, గోదావరి మన దగ్గర్నుంచే పారుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని కుళాయి కట్టినట్లు కట్టేయగలం, ఆ జలాలను అన్ని విధాలా పూర్తిగా వినియోగించుకుంటాం అంటూ వచ్చారు కెసియార్. కృష్ణా నదిపై ప్రస్తుతం వున్న 5 జల విద్యుత్ కేంద్రాలు తప్ప కొత్త జలవిద్యుత్ కేంద్రాలిక అసాధ్యమని తెలంగాణ జెన్‌కో నివేదిక యిచ్చినట్లు వార్తలు వచ్చాయి. పైనున్న జలవిద్యుత్ కేంద్రం వద్ద నీళ్లు విడిచిపెట్టినచోట వుండే నీటిమట్టం, దిగువన వున్న జలవిద్యుత్ కేంద్రం వద్ద నీళ్లు గ్రహించే చోట వుండే నీటిమట్టం కంటె బాగా ఎక్కువగా వుండాలట. అప్పుడే మధ్యలో మరో కేంద్రం కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమట. రెండూ యించుమించు ఒకే నీటిమట్టంలో వుంటే జలం పై నుంచి పడదు, విద్యుత్ ఉత్పత్తి కాదు. ప్రస్తుతం కృష్ణపై వున్న కేంద్రాల మధ్య నీటిమట్టాలు దాదాపు సమానంగా వున్నాయట. అందువలన కొత్తవి రావు. ఇలాటి సాంకేతిక విషయాలు యీ మేధావులు మనకు ముందుగానే చెప్పవద్దా? కిరణ్ కుమార్ చెప్పాడంటే ఆయన కాంగ్రెసు ముఖ్యమంత్రి, ఆంధ్రా రాజకీయనాయకుడు, సమైక్యవాది అని కొట్టి పారేస్తారు. వీళ్లు చెపితే నమ్ముతారు. తెలంగాణ రావడమే తరవాయి, యిక వెలుగులే వెలుగులు అని చెప్పేముందు యీ జాగ్రత్తలు కూడా చెపితే సామాన్య ప్రజలు ఎంత ఆశ పెట్టుకోవాలో అంతే పెట్టుకునేవాళ్లు కదా! కృష్ణా ట్రైబ్యునల్‌లో కూడా తెలంగాణ వాదనలు ఒప్పుకోవటం లేదు. 'మనవాళ్లతో లాభం లేదు, నేనే స్వయంగా వెళ్లి వాదిస్తాను' అంటున్నారు కెసియార్. పుస్తకాల అనువాదమూ ఆయనే చేయాలి, చెఱువులపై పాటా ఆయనే రావాలి, యిప్పుడీ వాదనలూ ఆయనే వినిపించాలి. అంటే యీ మేధావుల, నిపుణుల సామర్థ్యానికి ఆయన యిచ్చే విలువ ఏమిటో తెలుస్తోంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)