ఎమ్బీయస్‌ : (అ)క్రమబద్ధీకరణ

ప్రభుత్వభూములను ఆక్రమించిన వాళ్లందరికీ తెలంగాణ ప్రభుత్వం వరాలు కురిపించింది. మాకు డబ్బు కట్టేస్తే చాలు, ఆ స్థలాలు మీవే అనేస్తోంది. పేదలైతే ఆ డబ్బూ కట్టనక్కరలేదంటోంది. తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం ఒకటే ఘోష –…

ప్రభుత్వభూములను ఆక్రమించిన వాళ్లందరికీ తెలంగాణ ప్రభుత్వం వరాలు కురిపించింది. మాకు డబ్బు కట్టేస్తే చాలు, ఆ స్థలాలు మీవే అనేస్తోంది. పేదలైతే ఆ డబ్బూ కట్టనక్కరలేదంటోంది. తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం ఒకటే ఘోష – మా తెలంగాణ భూములను ఆంధ్రులు వచ్చి కబ్జా చేశారు, రాయలసీమ నుండి తెల్లలుంగీలు కట్టుకుని, బాంబులు చేతపట్టి, సుమోల్లో వచ్చి మా భూములు లాక్కున్నారు అని. వైయస్‌ హయాంలోనే యివన్నీ జరిగాయి కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చిందని పవన్‌ కళ్యాణ్‌ కనిపెట్టారు కూడా. ఆయన పుస్తకాలు బాగా చదివారని, సమాజంలో సమస్యల పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నారని, సామాజిక సైంటిస్టని చెప్తూంటారు. వైయస్‌ కంటె ముందే తెలంగాణ ఉద్యమం వుందని ఆయన చదివిన పుస్తకాల్లో లేదో ఏమో. సరే, ఆయన మాట ఎలా వున్నా కబ్జాల గురించి గొంతు చించుకోని తెలంగాణ మేధావి, తెలంగాణ నాయకుడు లేడు. ఇప్పుడు ఆ 'రాక్షసజాతి' ఆంధ్ర ఆక్రమణదారులకు అప్పనంగా, అతి చవుకగా భూములు అప్పచెప్పేస్తూంటే, వారి అక్రమాలను క్రమబద్ధీకరిస్తూ వుంటే తిరగబడవద్దా? తెలంగాణ ప్రయోజనాలను యిన్నాళ్లూ సమైక్యపాలకులు తాకట్టు పెట్టారని వాపోయారే, యీ రోజు పెడుతున్నదెవరు? 

ఆక్రమణలు, వాటిని క్రమబద్ధీకరించడాలు మన తెలుగునాట యీనాటి క్రీడ కాదు. వింటే బాధగా వుంటుందేమోకానీ మనంత అడ్డగోలు పరిపాలన యింకోచోట కనం, వినం. కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలు కట్టిన కాలనీలు అనేక నగరాల్లో చూస్తాం. ఆ సొసైటీకి రూల్సు వుంటాయి, సభ్యులుంటారు, ఇళ్లన్నీ ఒకేలా వుంటాయి, ఎవరికైనా అమ్మాలన్నా, కొనాలన్నా సొసైటీ అనుమతి తీసుకోవాలి. కాలనీలో కార్యకలాపాలపై సొసైటీ నిఘా వేసి వుంచుతుంది. మేన్‌టెనెన్స్‌ కట్టకుండా ఖాళీ చేయబోయినా, పరిసరాలు శుభ్రంగా వుంచకపోయినా, అసాంఘిక చర్యలు చేస్తున్నట్లు సందేహం వచ్చినా తోలు తీస్తుంది. మన రాష్ట్రాలలో యిలాటి రూల్సు ఎప్పుడైనా విన్నామా? ఇళ్లు పూర్తవడంతో సొసైటీ పని పూర్తయిపోతుంది. ఎవడూ ఎవడి మాటా వినడు. పన్ను రాయితీలు, చవకగా స్థలాలు పొందడానికి మాత్రమే మనం సహకార సంఘాలుగా ఏర్పడతాం. ఫలానా సంస్థ ఉద్యోగులకు మాత్రమే అని బైలాస్‌లో రాసి వుంటుంది. పదవుల్లో వున్నవారికి తెలిసున్నవారందరికీ ఆ సంస్థతో ఏ సంబంధం లేకపోయినా ఎలాట్‌ చేసేస్తారు. జూబిలీ హిల్స్‌ సొసైటీ వంటి ఉన్నతస్థాయి సంఘంలోనే అవకతవకలు జరిగాయి, అవన్నీ బయటకు లాగుతాం, వాళ్లందరినీ దండిస్తాం అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నెలలోపునే యిదిగో యీ క్రమబద్ధీకరణ వచ్చేసింది. చాలా రాష్ట్రాలలో హౌసింగ్‌ బోర్డు వుంది. ప్రభుత్వమే స్థలం సేకరించి, యిళ్లు కట్టి, వాయిదాల్లో అమ్ముతుంది. ఒకే లే ఔట్‌, ఒకటే డిజైన్‌. మార్చుకుంటానంటే ఒప్పుకోదు. మరి మన దగ్గర? ఎల్‌ఐజిలో యిళ్లు ఎలాట్‌ చేయించుకుని, దానిపై మూడంతస్తుల మేడ కట్టేసి పక్కనున్న వాళ్లకు గాలి, వెలుతురు లేకుండా చేస్తారు. మొదట కేటాయించుకున్నవాడు అమ్మేయగలుగుతాడు. అందుకని డబ్బున్నవాళ్లు తమ పనివాళ్ల పేర ఎల్‌ఐజి యిళ్లు ఎలాట్‌ చేయించుకుంటారు. తర్వాత తమ పేర రాయించేసుకుని అక్కడ మేడలు వేసేసి, కమ్మర్షియల్‌ కాంప్లెక్సు కట్టేసి, నానా బీభత్సం చేసేస్తారు. 

ఓ సారి మా బ్యాంకు క్వార్టర్స్‌లో బాల్కనీ గ్రిల్‌లో పూలకుండీలు పెట్టుకుందుకు బయటకు పొడుచుకు వచ్చేట్లా గ్రిల్‌ పెట్టించమని ఆఫీసర్లు మా చీఫ్‌ మేనేజరును అడిగారు. ఆయన మహారాష్ట్రవాడు. 'అబ్బే అది రూల్సుకి వ్యతిరేకం. మునిసిపల్‌ కార్పోరేషన్‌ వాళ్లు వచ్చి పీకేస్తారు.' అని వాదించాడు. 'మీరు నియమాలకు కట్టుబడుతున్నారు సంతోషం. కానీ ఫర్‌ యువర్‌ ఇన్ఫర్మేషన్‌, మీరు చెప్పేవన్నీ మహారాష్ట్రలో జరుగుతాయి. ఎపార్టుమెంటులో తగినంత గ్రీనరీ వుండకపోయినా దండన విధిస్తారు. ఇక్కడ ఏమీ చేయరు. అంతా చల్తా హై. ఇన్ని పెంట్‌హౌస్‌లు ఏ నగరంలోనైనా చూశారా? ఫ్లాట్‌ ఓనర్లకు సంబంధించిన స్థలంలో బిల్డర్లు అక్రమంగా కడుతున్నారు, అమ్మేస్తున్నారు. మా ఆస్తి అమ్మడానికి నువ్వెవరు అనైనా ఫ్లాట్‌ ఓనర్లు బిల్డర్‌ను అడగరు. ఇక ప్రభుత్వం పథకాలు చూస్తే యింకా అన్యాయం. ఇంకుడు గుంతలని హడావుడి చేస్తున్నారు కదా, అవి పెట్టకపోతే అనుమతి యివ్వనని అంటున్నారు కదా, వచ్చే ఏడాది చూడండి ఏమవుతుందో' అన్నాను. ఇంకుడు గుంతలపై అప్పటి ప్రభుత్వం పెట్టిన ఖర్చు కంటె 'నీరు-మీరు' పేర దానికోసం చంద్రబాబు బొమ్మతో చేసిన హోర్డింగులకు, ప్రచారానికి ఎక్కువ ఖర్చయిందని పిఎసి తేల్చింది. ఇప్పుడు వాటి మాటే మర్చిపోయారు. ఇప్పుడు వాటర్‌ గ్రిడ్‌ అంటున్నారు. చెఱువుల పునరుద్ధరణ అంటున్నారు. డిసెంబరు నాటికి చెఱువులన్నీ ఖాళీ చేయాలి. ఒక్కటంటే ఒక్కటైనా చేశారా? సర్వే పూర్తి కాలేదు. టెండర్లే పిలవలేదు. ఎవరికైనా టెండర్‌ యిస్తానంటే ఆర్థికశాఖ కొరీలు వేస్తోందట. ఎందుకొచ్చిన అడ్డంకులని చెఱువులకు సంబంధించిన విషయాల్లో ఆర్థికశాఖ రిఫరెన్సు అక్కరలేదని రూలు పాస్‌ చేసేశారట. ఇక అడ్డగోలుగా నిధుల పంపిణీ అయిపోతుందన్నమాట. చెఱువులు, పర్యావరణం మరోటీ ఏమవుతాయో ఊహించుకోవాల్సిందే.

ఇవన్నీ గతంలోనూ జరిగాయి. ఆ పాపాలన్నీ సమైక్యపాలన నెత్తిమీద రుద్దారు. తెలంగాణ ఏర్పడితే అన్ని విధాలా ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని లెక్చర్లు దంచారు. ఎవరు అధికారంలోకి వచ్చినా మేం నిలదీస్తాం, కాపలాకుక్కల్లా విరుచుకుపడతాం అంటూ మావోయిస్టుల దగ్గర్నుంచి రైటిస్టుల దాకా అందరూ గర్జించారు. కెసియార్‌ వస్తూనే అయ్యప్ప సొసైటీ బిల్డింగులు కూలగొట్టగానే హర్షధ్వానాలు చెలరేగాయి. ఆంధ్రావాళ్లకు బుద్ధి చెప్పాడని కేరింతలు కొట్టారు. తక్కిన ప్రాంతాల్లో కూడా అలా చేస్తే ప్రభుత్వానికి రుణమాఫీ చేయడానికి కావలసినంత ఆదాయం వస్తుందని కెసియార్‌ చెప్పుకున్నారు. కానీ అంతలోనే అది చప్పబడిపోయింది. 'ఊరికే, ఉత్తినే.. ఝలక్‌ యివ్వడానికి' అంటున్నారు కెసియార్‌ యిప్పుడు. ఝలక్‌ కోసం యిళ్లు కూలుస్తారా? ఓ రెండు రోజులు నీళ్లు, కరంటు బంద్‌ చేస్తారా? రెగ్యులరైజ్‌ చేస్తానంటే వాళ్లు మాత్రం డబ్బులు కట్టనన్నారా? 'ఆంధ్రోళ్లను' హడలగొట్టి తమకు కావలసిన సాధించుకోవడానికి రాజకీయ నాయకులకు సాధనంగా పనికి రావడం తప్ప ఆ కూల్చివేతల వలన సామాన్యుడికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూరలేదు. ఇప్పుడు క్రమబద్ధీకరించే వాళ్లలో ఉద్యమకారులు లెక్క ప్రకారం అందరూ ఆంధ్రులే వుండాలి. ఎందుకంటే తెలంగాణవారు అమాయకులు, నోట్లో వేలు పెడితే కొరకలేనివారు, అమాయకపు వధువు వంటి వారు అని టీవీ చర్చల్లో అనేక మంది తెలంగాణ ఎమ్మేల్యేలు, ఎంపీలు చెప్పుకుని వచ్చారు. 

అలాటి పరిస్థితుల్లో ఆక్రమణదారులను తరిమేసి ఆ స్థలాలు స్వాధీనం చేసుకుంటే మంచిది కదా. ఆంధ్రోళ్లకు బుద్ధి వస్తుంది, మనకు డబ్బు వస్తుంది. క్రమబద్ధీకరిస్తే వచ్చేదెంత? అంతకంటె సర్కారే స్వాధీనం చేసుకుని దళితులకు యివ్వాల్సిన యిళ్ల స్థలాలు యివ్వవచ్చు కదా. అలా అయితే వాటికి ప్రజాధనం వెచ్చించి కొనవలసిన పని లేదు. దళితులకు గ్రామాల్లో యిస్తాం యిక్కడెందుకు అంటే ఆ స్థలాలు చూపించి కొత్త పరిశ్రమలను ఆకర్షించవచ్చు. లేదా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యానికి వచ్చేవారి కోసం సత్రాలు కట్టి అపర నిజాం అనే కీర్తి తెచ్చుకోవచ్చు. జలయజ్ఞం కోసం వైయస్సార్‌ తెలంగాణ భూములను అమ్మేశారని ఆక్రోశించారు కదా. మిగిలిన భూములనైనా కాపాడుకోవద్దా? అవీ ధారాదత్తం చేసేస్తారా? 

పేదలు ఆక్రమిస్తే ఆ స్థలాల్లో ప్రభుత్వం ఫ్లాట్లు కట్టి యిస్తుందట. ఎంత తమాషాగా వుంది! పేదలైనా, పెద్దలైనా ఆక్రమణదారుడు ఆక్రమణదారుడే. వాళ్లకు రివార్డా? మళ్లీ యిలా చేయమని ప్రోత్సాహమా? న్యాయంగా వుండి ఏ స్థలమూ ఆక్రమించనివాడికి గుణపాఠమన్నమాట. పేదల సంగతి సరే, రామోజీ ఫిల్మ్‌ సిటీ కూడా దురాక్రమణే అని కదా కెసియార్‌ చెప్తూ వచ్చారు. ఈనాడు దాని మాట ఎత్తకపోగా వెళ్లి ఆతిథ్యం స్వీకరించి వచ్చారు. నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ చెఱువు భూమి ఆక్రమించారని గగ్గోలు పెట్టారు. మళ్లీ అక్కినేని ఎవార్డు ఫంక్షన్‌కు వెళ్లి సుహృద్భావం ప్రకటించారు. ముఖ్యమంత్రిగా యిది తప్పదు అని వాదించవచ్చు. కానీ దురాక్రమణ విషయంలో ఆయన స్టాండ్‌ ఏమిటన్నది సామాన్యప్రజలకు అర్థం కాకుండా పోయింది. రేపు చెరువులు ఆక్రమణ విషయంలో యిలాగే చేయరని నమ్మకం ఏమిటి? మిషన్‌ కాకతీయ గురించి ప్రచారం ఎక్కువగా వుంది కానీ ఆచరణలో చెరువుల సర్వే ముందుకు సాగడం లేదు. సర్వే మొదలుపెట్టగానే దురాక్రమణలు బయటపడ్డాయేమో. అందుకే సాగదీస్తున్నారేమో. వాటినీ క్రమబద్ధీకరించేస్తారేమో. చేస్తే చేయండి కానీ ఆక్రమణదారుల మూలాలు ఏమిటో ప్రకటించి, మరీ క్రమబద్ధీకరించండి. అప్పుడే దానిలో ఆంధ్రుల వాటా తెలుస్తుంది. ఉద్యమంలో చెప్పిన అసత్యాలూ బయటపడతాయి. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతీయువకులు, మేధావులు ఆశించిన విధంగా మాత్రం ప్రస్తుత ప్రభుత్వం నడవటం లేదు. పాత అక్రమాలను క్రమబద్ధీకరించడం చూస్తే పాలకులు మారారు కానీ పాలన మారలేదనేది స్పష్టమవుతోంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2015) 

[email protected]