ఇప్పుడు సైకలాజికల్ కథలు ఓ రెండు మచ్చుకు చెబుతాను.
'ఆరేసిన చీర' అనే కథలో రచయిత కొత్తగా పెళ్లయిన చాకలి జంట లచ్చి, సాంబడు గురించి చెబుతారు. వాళ్ల కెప్పుడూ పడదు. పెద్దలు పట్టుబట్టి పెళ్లి జరిపారు కానీ వీళ్లకు యిష్టం లేదు. సాంబడికి బొద్దుగా వున్న ఆడపిల్లలంటే యిష్టం. లచ్చి సన్నగా వుంటుంది. లచ్చికి నాజూగ్గా వున్న మగాళ్లంటే యిష్టం. సాంబడు మోటుగా వుంటాడు. ఇద్దరూ పోట్లాడుకుని మౌనంగా బట్టలుతుకు తున్నారు. సాంబడు చేతికి సీతాలు నెమలికంఠం రంగు చీర వచ్చింది. సీతాలు నవ్వు, మాట, నడక.. గుర్తొచ్చి సాంబడికి హుషారొచ్చింది. దబదబా ఉతుకుతున్నాడు ఆ చీరను. అలాగే లచ్చి అత్తకోడలంచు పంచ సంబరంగా ఉతుకుతోంది. అది కోటేశు పంచె. కోటేశంటే లచ్చికి ఆరాధన. 'మొగాడంటే ఆడు' అనుకుంది.
మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి, మాట్లాడకుండా ఎదురెదురుగా అన్నం తిని, బట్టలు ఆరేశారు. సీతాలు చీర ఆరేసేటప్పుడు సాంబడి వొంట్లో నెత్తురు జిల్మని పొంగింది. కోటేశు పంచె ఎగిరిపోకుండా రాళ్లు పెడ్తుంటే లచ్చికి పాలిండ్లు పొంగాయి. సాయంత్రం యింటికి వచ్చే వేళకి యిద్దరూ బట్టల్లోంచి తమ కిష్టమైన బట్టలు తీసి కట్టుకున్నారు. ఆశ్చర్యం! సీతాలు నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి. కోటేశు అత్తకోడలంచు పంచెలో సాంబడివైపు ఆశగా చూసింది లచ్చి. 'మూటెత్తు' అంది. సాంబడు మూటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు. లచ్చి తోసెయ్యలేదు. పెదవులందించి తృప్తిగా నవ్వింది.
అలాగే ఇంకో సైకలాజికల్ కథ 'ఎంగిలా?' అని. రామశాస్త్రి అని వేదపండితుడు. కుర్రవాడే అయినా పెళ్లంటే విముఖత. తండ్రి మాట తీసేయలేక పెళ్లాడాడు. అతని భార్యకు కూడా పూజలే! ఈయనకు రోజుకి ఆరుగంటలు ఈశ్వరధాన్యం. ఆవిడకు రోజుకి పదిగంటలు కామాక్షి స్తవం. కానీ ఈశ్వరుడూ కామాక్షీ ఆదిదంపతులని వాళ్ల కెన్నడూ తట్టలేదు. ఇలా నెలలు గడిచిపోతున్నాయి. ఓ రోజు రామశాస్త్రి మధ్యాహ్నం కృష్ణలో స్నానం చేయవలసి వచ్చింది. కాస్త దూరంలో బండమీద మంచి పొంకంగా వున్న ఓ ఉప్పరిపిల్ల ఓ చిన్న గుడ్డ మొలకు చుట్టుకుని హాయిగా, స్వేచ్ఛగా స్నానం చేసి విశ్రమించడం కనబడింది. నవ్వుకుంటోంది, నదిలోకి దూకి ఈతలు కొడుతోంది. రామశాస్త్రి మనసులో కలుక్కుమంది. ఫెళ్లుమనే ఆమె వయసు, కృష్ణ సుళ్లులా ఆమె వొంటి సొంపులు యితని పూజ సాగనిచ్చాయి కాదు.
కకావికలైన మనసుతో ఇంటికి వచ్చేశాడు. భార్య అన్నం వడ్డిస్తూంటే ఆమెను తదేకంగా చూశాడు. 'నల్లపిల్లే కాదు శ్రీదేవి కూడా అందంగానే వుంటుంది' అనిపించి అన్నం కలిపి ఓ ముద్ద భార్య నోటికి అందించాడు. ఆమె అబ్బురపడి 'ఎంగిలి కాదో!?' అంది. 'ప్రసాదమనుకోరాదో!' అన్నాడు రామశాస్త్రి. 'అయితే అనుగ్రహించండి' అంటూ ఆమె నోరందించడానికి బదులు దోసెడు పట్టింది. ఎలా? ఈవిణ్ని మార్చడం?
అవాళ రామశాస్త్రి గుడినుండి వస్తూ అప్పయ దీక్షితులవారిని అడిగాడు – 'తాతా! సంసారం విషవృక్షం కాదా?' అని. 'విషవృక్షమే కానీ అమృతఫలాలు కాస్తాయి' అని జవాబిస్తాడు పెద్దాయన. 'తెలిసి తెలిసి చేదు తింటామా?' అని మళ్లీ యితని సందేహం. 'చేదు తెలిసిన నోటికే తీపి రుచి బాగా తెలుస్తుందిరా' ఆయన సందేహనివృత్తి.
ఆ రాత్రి భార్య కాళ్లొత్తి వెళ్లిపోతూంటే అన్నాడు – 'పార్వతీదేవి భర్త సేవ చేసి వేరే వెళ్లిపోయేదా?' అని. 'ఆ సంగతి కామాక్షీదేవి నడగాలి' అంది భార్య. 'అడగనక్కరలేదు. నాకు ఈశ్వరుడు చెప్పాడులే' అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు. అంతే, ముగింపులో ఒక్క వాక్యం – 'ఆ నాటినుండీ శ్రీదేవమ్మకు వేరే చాపతో పనిలేకపోయింది. మరి రెండు సంవత్సరాల్లో ఆ యింట అమరేశ్వరుడు, బాలచాముండేశ్వరీ పుట్టారు'.
సామాన్యులుగా కనబడే అసామాన్య భక్తుల గురించి కొన్ని కథలు రాశారు సత్యంగారు. గుడ్డి గంగన్న అనే అతనికి గుడి పక్కగా స్థలం వుంటుంది. తంబూరా మీటుకుంటూ తత్వాలు పాడుతూ దేవుడి ప్రసాదం తింటూ తిరుగుతూంటాడు. గుడి ఆదాయం పెంచడానికి చుట్టూ షాపింగు కాంప్లెక్సు కడదామని, అధికారులు ప్లాను వేస్తారు. గంగన్న స్థలం కూడా కలుపుకుంటే తప్ప అది సాధ్యపడదు. కానీ ఇతను స్థలం అమ్మనంటాడు. 'పండగొచ్చినా, పబ్బమొచ్చినా బిచ్చగాళ్లందరూ అక్కడే వండుకు తింటున్నారు. మీకు స్థలం అమ్మితే మీరు వాళ్లను గెంటేస్తారు.' అంటాడు. దాంతో అధికారికి కోపం వచ్చి 'దేవుడి ప్రసాదం తప్ప తక్కినది తిననని నీ నియమం కదూ. ఇదిగో, రేపణ్నుంచి యితనికి ప్రసాదం పెట్టకండి' అని హుకుం జారీ చేస్తాడు. అంతే, నాలుగు రోజులపాటు అతనికి పెట్టరు. ఇతను మరేదీ తినకుండా చచ్చిపోయే దశకు వస్తాడు. నాల్గోరోజు అర్చకుల్లో పెద్దవాడైన మహదేవయ్య వచ్చి స్వయంగా ప్రసాదం తినిపిస్తాడు. 'నాల్గురోజులుగా శివుడు నవ్వటం లేదయ్యా. నాలాటి భక్తులు యింకా వున్నారని చెప్పి నా కళ్లు తెరిపించాడయ్యా' అంటాడు. కథ పేరు 'శివుడు నవ్వాడు'.
అలాగే 'ముక్కోటి కైలాసం' అనే కథలో వైకుంఠ ఏకాదశి నాడు ఓ ముసలమ్మ ఎక్కణ్నుంచో వచ్చి ముష్టాళ్ల మధ్య కూచుని అడుక్కోబోతుంది. ఎవరూ దగ్గరకు రానివ్వరు. చివరకు ఓ మూల కూచుని అలాగే ఒరిగిపోతుంది. స్నానం చేయని ముసలమ్మ, దేవుణ్ని చూడని ముసలమ్మ 'సాంబశివా' అనని ముసలమ్మ ముక్కోటినాడు చచ్చిపోతుంది. ఇలాటి సెంటిమెంటల్ కథ చాలా మంది రాస్తారు. కానీ ఇక్కడ సత్యంగారి స్ట్రోక్ కనబడుతుంది. 'ముసల్దానికి తమ పక్కన చోటు యివ్వని ముష్టాళ్లందరూ మర్నాడు ఆమె శవాన్ని చూపించి ఐకమత్యంగా మళ్లీ అడుక్కున్నారు' అని ఫినిషింగ్ టచ్ యిస్తారు!
'రాగిచెంబులో చేపపిల్ల' అనే కథలో ఓ చాదస్తురాలు వుంటుంది. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుపడితే బిందెడు నీళ్లూ ఒంపేసేది. అలాటావిడ ఓ రోజు బిందెలో నీళ్లు రాగిచెంబుతో ముంచుకు తాగాక చూస్తే అడుగున ఓ చేపపిల్ల కనబడింది. ఇంకేముంది? కొంపమునిగింది అనుకుని మొగుణ్ని లేపి 'ఆ చేపపిల్ల వున్న నీళ్లతోనే అన్నం వండాను. వాటితోనే దేవుడికి నైవేద్యం పెట్టాను. అవే తాగాను. నా మడి మండిపోయింది..' అని కుళ్లి కుళ్లి ఏడ్చింది. మొగుడు చివాట్లేస్తాడు – 'కృష్ణలో చేపలు లేవా? తినే అన్నం కాలికి తగిలితే మైలా?' అని. అప్పుడు ఆమెకు జ్ఞానోదయం అవుతుంది. 'ఎవర్నీ అంటకుండా మడిగా ముత్యపు చిప్పలో ముత్యంలా బతకాలనుకున్నా. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు.' అనుకుంటుంది. అక్కడ సత్యం గారు ఓ మాట రాస్తారు – 'అందుకే కాబోలు రామయ్యగారి కర్రి ఆవు తనను చూస్తే పొడవటానికి వస్తుంది' అని అనుకుంటుందామె. ఆ యాసిడ్ టెస్ట్తోనే ఆ అజ్ఞానురాలు తన పొరబాటు గుర్తించింది. కథ ఆ ఆవుతోనే ప్రారంభమవుతుంది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్