కమల్‌కు ఏపీలో స్టుడియో స్థలం కావాలంట!

''నేను చీకటి రాజ్యం సినిమా ప్రీమియర్‌ చూడడానికి ఆహ్వానించేందుకు చంద్రబాబును కలిశాను తప్ప ఈ భేటీలో విశేషం ఏమీ లేదు'' అని కమల్‌హాసన్‌ ప్రకటించి ఉండవచ్చు గాక..! కానీ ఆయన కలయిక గురించి అనేక…

''నేను చీకటి రాజ్యం సినిమా ప్రీమియర్‌ చూడడానికి ఆహ్వానించేందుకు చంద్రబాబును కలిశాను తప్ప ఈ భేటీలో విశేషం ఏమీ లేదు'' అని కమల్‌హాసన్‌ ప్రకటించి ఉండవచ్చు గాక..! కానీ ఆయన కలయిక గురించి అనేక పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో అచ్చంగా రాజధానిలోనే కాకపోయినప్పటికీ.. ఏదైనా సినీ పరిశ్రమకు కేంద్రం కాగల కీలక ప్రదేశంలో తాను కూడా ఒక స్టుడియో నిర్మించుకునేందుకు స్థలం కావాలని అడిగేందుకు కమల్‌ భేటీ అయినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. 

కేవలం సినిమా ప్రీమియర్‌కు ఆహ్వానించడానికే అయితే ఇంత హడావుడి అనవసరం.. అని ఏపీలో సినిమా ఇండస్ట్రీ విస్తరణకు అక్కడి సర్కారు కూడా దృష్టిపెడుతున్న నేపథ్యంలో.. కమల్‌ భారీ ప్రాజెక్టు మీదే కన్నేశారని పలువురు అనుకుంటున్నారు. 

ప్రధానంగా కమల్‌హాసన్‌ తమిళ పరిశ్రమకు చెందిన హీరో. అయితే భారీ చిత్రాలను అలాగే చిన్నచిత్రాలను కూడా సమానంగా చేస్తూ.. నిత్య ప్రయోగశీలిగా ప్రజల్లో పేరుతెచ్చుకున్నాడు. ఏపీలో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కొత్తగా విస్తరించే అవకాశం ఉండడంతో.. ఎటూ తమిళ పరిశ్రమకు కూడా కూతవేటు దూరంలోనే ఉంటుంది గనుక.. కమల్‌ హాసన్‌ ఆసక్తిచూపుతున్నట్లు సమాచారం. షూటింగ్‌కు పోస్ట్‌ప్రొడక్షన్‌కు అనువైన స్టుడియోల నిర్మాణానికి తనకు స్థలం కావాలని ఆయన చంద్రబాబునాయుడును అడిగినట్లు చెప్పుకుంటున్నారు. 

హైదరాబాదులో ఒకవైపు సినిపరిశ్రమకు మేం చాలా చేస్తాం అని కేసీఆర్‌ సర్కారు చెబుతూనే ఉన్నా.. అటువైపు కమల్‌ దృష్టి పెట్టలేదు. ఎందుకంటే.. ఆయనకు బేసిగ్గా తమిళ పరిశ్రమకు కూడా దగ్గరగా ఉండడం అవసరం. అందుకే ఉభయతారకంగా ఏపీ సీఎంను అడిగారని అంతా అనుకుంటున్నారు. 

పైకి మాత్రం చీకటిరాజ్యం ప్రీమియర్‌ను విజయవాడలో వేస్తున్నామని, ప్రేక్షకులతో కలిసి చూడడానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించానని కమల్‌ అంటున్నారు. హైదరాబాదు, విజయవాడల్లో ఒకేరోజు 6 గంటల గ్యాప్‌తో వేస్తారుట. తాను రెండుచోట్లకు హాజరవుతాడట. కమల్‌ ప్లానింగ్‌ బాగానే ఉంది కానీ.. కేసీఆర్‌ను కూడా కలిసి హైద్రబాద్‌ ప్రీమియర్‌కు పిలుస్తాడా లేదా అనేదాన్ని బట్టి.. ఈ స్టుడియకు స్థలం పుకార్లు మరింత వ్యాపించే అవకాశం ఉంది.