అమేఠీ అనగానే రాహుల్ గాంధీయే గుర్తుకు రావచ్చు. అతనికి ఆ నియోజకవర్గం ఎలా వచ్చిందో తెలుసుకుంటే యీ కథలో ప్రధానపాత్రధారి అర్థమవుతాడు. అమేఠీ సంస్థానాధిపతి రాజా రణంజయ్ సింగ్ ఇందిరా గాంధీకి సన్నిహితుడు. అమేఠీ పార్లమెంటరీ నియోజకవర్గం ఆయన వద్దనే వుండేది. తన కొడుకు సంజయ్ గాంధీని ఎన్నికలలో పోటీ చేయించాలని 1980లో ఇందిర అనుకున్నపుడు తన నియోజకవర్గమైన రాయబరేలీకి పక్కన వున్న అమేఠీ అయితే మంచిదని ఆమె అనుకుంది. అడగ్గానే రణంజయ్ పువ్వుల్లో పెట్టి అప్పగించాడు. అంతేకాదు కొడుకు సంజయ్ సింగ్ ఎన్నికలలో ప్రచారం చేసి సంజయ్ గాంధీని గెలిపించే బాధ్యత తీసుకుంటాడన్నాడు. అదే జరిగింది. ఇద్దరు సంజయ్‌లు ఆత్మీయులయ్యారు. సంజయ్ గాంధీ దుర్మరణం తర్వాత సంజయ్ సింగ్ రాజీవ్‌కు చేరువయ్యాడు. 1981 నుండి అతన్నీ అమేఠీ నుండి గెలిపించాడు. సోనియా రాజకీయాల్లోకి వద్దామనుకున్నపుడు 1999లో అమేఠీనే ఎంచుకుంది. ఈ మధ్యలో వారి కుటుంబస్నేహితుడు సతీశ్ శర్మ అక్కణ్నుంచి గెలిచేవాడు. ఎందుకంటే అయితే సంజయ్ సింగ్ 1988లో రాజీవ్‌తో విభేదించి కాంగ్రెసు వదిలిపెట్టి రాజీవ్ అవినీతిపై ధ్వజమెత్తిన విపి సింగ్ ఏర్పరచిన కొత్త పార్టీ జనతాదళ్‌లో చేరాడు. 1999లో అమేఠీలో సోనియాతో తలపడితే, సానుభూతి అంశంతో సోనియా నెగ్గింది. 2004కు రాయబరేలీకి మారి, అమేఠీని కొడుకు రాహుల్‌కి అప్పగించింది. అప్పణ్నుంచి అతనే గెలుస్తున్నాడు. ఇలా ఇందిర కుటుంబానికి అమేఠీని ధారపోసిన సంజయ్‌కు మళ్లీ అమెఠీ దక్కలేదు. 2003లో కాంగ్రెసులో చేరినా పొరుగున వున్న సుల్తాన్పూర్నుండి పోటీ చేయమన్నారు.
ఇప్పుడీ సంజయ్ సింగ్ అతని యిద్దరు భార్యలు ఆస్తుల కోసం పోరాటానికి దిగడంతో వార్తల్లోకి ఎక్కాడు. ఇద్దరు భార్యలూ విశేషమైన వారే. మొదటి భార్య గరిమా సింగ్ రాజకుటుంబానికి చెందినది. విపి సింగ్‌కు బంధువు. సంజయ్ వలన ఆమెకు ఒక కొడుకు, యిద్దరు కూతుళ్లు కలిగారు. – మహిమా, అనంత్ విక్రమ్, శైవ్య. ఆమె తనను పట్టించుకోలేదని, 1989లో తనకు బుల్లెట్ గాయం తగిలి చికిత్స తీసుకుంటున్నపుడు పక్కన వుండి సపర్యలు చేయలేదని, 1994లో తనకు విడాకులు యిచ్చిందని సంజయ్ సింగ్ అంటాడు. అలా యిచ్చింది తను కాదని, తన పేరు చెప్పుకుని సంజయ్ తీసుకుని వెళ్లిన మరో మహిళ అని గరిమా అంటుంది. ఇప్పటికీ తనే అసలైన భార్యనని, తనకూ, తన పిల్లలకూ ఆస్తిలో వాటా వుందనీ, అబద్ధాలతో చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదని వాదిస్తోంది. ఈ విడాకుల వివాదం సంగతి తెలియాలంటే సంజయ్ ప్రణయగాథ, సయ్యద్ మోదీ హత్యోదంతం చెప్పాల్సి వుంటుంది.
సయ్యద్ మెహదీ అనే బాడ్మింటన్ ఛాంపియన్ ఆటల పోటీలకై 1978లో బీజింగ్ వెళ్లాడు. అక్కడ అమితా కులకర్ణి అనే మహారాష్ట్ర నుండి వచ్చిన బాడ్మింటన్ ఛాంపియన్ పరిచయమైంది. అప్పటికి అతనికి 16 ఏళ్లు. ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి, బాడ్మింటన్‌లో అసమాన ప్రతిభ కనబరిచాడు. ఓసారి మహారాష్ట్రలో జూనియర్ ఛాంపియన్ పోటీల్లో ఆడుతూండగా ఓ జర్నలిస్టు మెహదీ అనే అతని యింటి పేరును మోదీ అని తప్పుగా ప్రచురించాడు. ఇతను అదే బాగుందని అలా కంటిన్యూ అయిపోయాడు. అమితా, సయ్యద్ ప్రేమలో పడ్డారు. కుటుంబాలు ఒప్పుకోలేదు. ఆరేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. సయ్యద్ 8 సార్లు నేషనల్ బాడ్మింటన్ ఛాంపియన్‌గా గెలిచాడు. అంతర్జాతీయ స్థాయికి వెళ్లి ప్రకాష్ పడుకొనేకు వారసుడవుతాడని అందరూ అనుకునే సమయంలో సంజయ్ సింగ్ పరిచయమయ్యాడు. సంజయ్‌కు క్రీడలంటే ఆసక్తి. ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడు. స్టేడియాలు కట్టడానికి విరాళాలు యిస్తాడు, స్కాలర్షిప్పులు యిస్తాడు. సయ్యద్, అమితా యిద్దరికి అతను సన్నిహితుడయ్యాడు. వాళ్లకు గాడ్‌ఫాదర్‌గా మెలిగాడు. అయితే అమితాతో అక్రమసంబంధం ఏర్పడడంతో యిబ్బంది వచ్చిపడింది. అమితాకు ఏం చేయాలో తెలియలేదు. 'ఎస్1 (సయ్యద్), ఎస్2 (సంజయ్) యిద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో తెలియక అవస్థ పడుతున్నాను' అంటూ డైరీలో రాసుకుంది కూడా.
ఆ అవస్థను తప్పించడానికి సంజయ్ సింగ్ నిర్ణయించుకున్నాడు. సయ్యద్‌ను చంపించమని తన అనుచరులకు చెప్పాడు. అంతే, కూతురు పుట్టిన రెండు నెలలకు, 1988 జులైలో లఖ్‌నవ్‌లో స్టేడియంలో ప్రాక్టీసు చేసి బయటకు వస్తున్న సయ్యద్‌ను వాళ్లు తుపాకీతో కాల్చి చంపేశారు. సంజయ్-అమితా అక్రమ సంబంధం బహిరంగరహస్యం కాబట్టి అప్పటికి సంజయ్ యుపిలో మంత్రిగా వున్నాడు అందరూ వాళ్లిద్దర్నే అనుమానించారు. సిబిఐకు కేసు అప్పగించారు. కొన్ని రోజులపాటు జైలుకి పంపారు. తనపై తిరుగుబాటు చేసిన విపి సింగ్ పార్టీలో చేరినందుకు సంజయ్‌ను యీ కేసులో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ యిరికించారన్న సందేహంతో అరుణ్ శౌరీ వంటి పాత్రికేయులు సంజయ్ నిరపరాధి అంటూ వ్యాసాలు రాశారు. కేసు నత్తనడక నడిచి 1990లో విచారణకు వచ్చింది. సిబిఐ సరిగ్గా సాక్ష్యాలు సమర్పించలేదు అంటూ కోర్టు సంజయ్, అమితాలపై కేసు కొట్టేసింది. అప్పుడు విపి సింగ్ ప్రధాని! హత్యకు పురమాయించిన అఖిలేష్ సింగ్‌ను కూడా 1996లో కోర్టు నిర్దోషిగా వదిలేసింది. కోర్టు మాట ఎలా వున్నా ప్రజలు సంజయ్‌ను దోషిగానే భావించారు. 1989 ఎన్నికలలో ఓడించారు. అతను బిజెపిలోకి మారాడు. భర్త హత్య తర్వాత అమితా సంజయ్‌తోనే వుండిపోయింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
అయితే సంజయ్ అప్పటికే వివాహితుడు. విడాకులు యివ్వడానికి భార్య గరిమా ఒప్పుకోవటం లేదు. అందువలన 1995 మార్చిలో సీతాపూర్ కోర్టులో ఎవరినో తీసుకుని వచ్చి గరిమాగా కోర్టుకి పరిచయం చేశాడు. 'ఆమె విడాకులకు ఒప్పుకుంటున్నాను' అని చెప్పడంతో జడ్జి విడాకులు మంజూరు చేశాడు. అవి చూపించి వెంటనే అమితాను పెళ్లి చేసేసుకున్నాడు. ఇక అప్పణ్నుంచి అమితా తనను తాను 'రాణీ అమితా సింగ్'గా చెప్పుకోసాగింది. అందరూ తనను అలాగే పిలవాలని శాసిస్తోంది. ఈ విడాకులు బోగస్ అని గరిమా గగ్గోలు పెట్టి హై కోర్టుకి వెళ్లింది. అక్కడా, తర్వాత సుప్రీం కోర్టులోనూ యీ విడాకులు చెల్లవు అని తీర్పు యిచ్చారు. కావాలంటే సీతాపూర్ కోర్టుకి వెళ్లి ఛాలెంజ్ చేయి అని గరిమాకు సుప్రీం కోర్టు సలహా యిచ్చింది కూడా. అయితే గరిమా తలిదండ్రులు ఆమెను రచ్చకెక్కవద్దని సలహా యిచ్చారు. దాంతో సంజయ్‌కు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చింది. ఈ లోగా సంజయ్-అమితా గరిమా పిల్లల్ని చేరదీసి, సౌఖ్యాలిచ్చి ఆకట్టుకున్నారు. అమితాతో పెళ్లయిన తర్వాత సంజయ్ గరిమాను పూర్తిగా వదిలేశాడు. అమితాను తనతో పాటు బిజెపిలో చేర్పించి 2002 నుండి అమేఠీ అసెంబ్లీ స్థానాన్ని అప్పగించాడు. ఆమె అక్కణ్నుంచి గెలుస్తూ వస్తోంది. అయితే అమితా అంతటితో ఆగలేదు. ఇప్పటికే తన ఆస్తి రూ. 2000 కోట్లు వున్నా, ఒక ట్రస్టు పెట్టి అమెఠీ రాజవంశానికి గల ఆస్తులన్నీ ఆ ట్రస్టు పేర బదిలీ చేయసాగింది.
ఇలా అయితే తనకు ఏమీ దక్కకుండా పోతుందని గరిమా భయపడి, యిప్పుడు బహిరంగంగా గొడవ పడనారంభించింది. అమితాతో చెడిన ఆమె పిల్లలు తల్లికి బాసటగా నిలిచారు. పిల్లల క్షేమం కోసమే యిదంతా అని ప్రకటించి పూర్వీకుల ఆస్తి అయిన భూపతి ప్యాలస్ అనే బ్రహ్మాండమైన రాజమహల్‌ను తిరిగి ఆక్రమించా లనుకున్నారు. జులై 25 న అందరూ కలిసి వెళ్లారు. అమితా మనుష్యులు అడ్డుకున్నారు. గ్రామీణులు కలగజేసుకున్నారు. చివరకు మొదటి అంతస్తులో రెండు గదుల్లో గరిమా కుటుంబం సర్దుకుంది. ఇప్పుడు మీడియాను పిలిచి తమ గోడు వినిపించసాగారు. ముఖ్యంగా సంజయ్ కొడుకు ''మేం మహల్లో కాపురం పెట్టడంతో మా నాన్నా, సవతి తల్లీ యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వద్దకు వెళ్లి తాము వాళ్ల పార్టీలో చేరతామని, దానికి బదులుగా మమ్మల్ని గెంటేయించమనీ అడిగారు. అందుకే మర్నాటి కల్లా ఖాళీ చేయమని అఖిలేష్ నుండి జిల్లా మేజిస్ట్రేటు ద్వారా మాకు ఆదేశాలు వచ్చాయి. ఇది తాతల నాటి ఆస్తి కాబట్టి మా నాన్నకే కాదు, మాకూ హక్కులున్నాయని మేజిస్ట్రేటుకి నచ్చచెప్పాను.'' అన్నాడు.
సంజయ్ సింగ్‌కు యిదేమీ రుచించటం లేదు. ''మా వాడికి మర్చంట్ నేవీలో ఉద్యోగం యిప్పిస్తే దాన్ని వదిలిపెట్టి ఖాళీగా కూర్చున్నాడు. అందుకే యిలాటి ఆలోచనలు వస్తున్నాయి. గుడ్‌గాంవ్‌లో పెద్ద అపార్టుమెంట్ కొనిచ్చాను. పాకెట్ మనీగా నెలకు లక్ష యిస్తున్నాను. ఇప్పుడు అమేఠీ వారసత్వం కూడా కావాలంటున్నాడు. ఏదైనా వుంటే నాతో ముఖాముఖీ మాట్లాడాలి కానీ యిలా రచ్చకెక్కడమేమిటి?'' అని మండిపడ్డాడు. గమనించవలసిన విషయమేమిటంటే ఆయన గౌరవ రాజ్యసభ సభ్యుడు!
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)